మూడు
రోజుల్లో ముగిస్తాం!
ఐదు
రోజుల్లో తేల్చేస్తాం!
మొదలు
పెట్టేటప్పుడు అందరూ ఇదే చెప్తారు. ఇప్పుడు
ముగిసిపోవడానికి, ఇప్పుడే మొదలైంది కాదు ఇది. 78 ఏళ్ల
కాష్టం. యుద్ధం మరో యుద్ధానికి పురుడు
పోస్తుందే తప్ప శాంతి రాదు.
పార్టీలు, వాటి రంగులు మారొచ్చు
కానీ వాళ్లు నడిపేది ప్రభుత్వాన్నే. దాని లక్షణం ఎప్పటికీ
మారదు. ఇలాంటి సమయాల్లో జనం జై కొట్టాల్సింది
ప్రభుత్వాలకి కాదు... జవాన్లకి! మద్దతివ్వాల్సింది ప్రభుత్వాలకి కాదు...
సైనికులకి, సరిహద్దుల్లో ఉన్న ప్రజలకు! వాళ్ల
జీవితాలు నిత్యాగ్నిగుండాలు. వాళ్ల ప్రాణాలతో పండుగ చేసుకోవద్దు. యుద్ధం ఏ సమస్యనీ ముగించలేదు.
ఇంకొందరి సిందూరాలు తుడవడం తప్ప!
సైనికుల
జీవితాల్ని చాలా దగ్గర నుంచి
చూశాను. మా నాన్న బరేలీలో
ఉన్నప్పుడు లీవ్ అడిగితే తిట్టాడని,
కమాండింగ్ ఆఫీసర్ని కుర్చితో కొడితే
ఆయన చనిపోయాడు. వెంటనే అరెస్ట్ చేశారు. రెండు మూడు నెలలు జీతం
లేదు. ఖర్చులకు ఇంటి దగ్గర నుంచే
మా అమ్మ డబ్బులు పంపింది.
ఇంక మా నాన్న రాడేమో
అని మమ్మల్ని పట్టుకుని ఏడ్చేది. మేమూ ఏడ్చేవాళ్లం తప్ప,
విషయం పూర్గిగా తెలియదు. నాకు అప్పుడు ఆరేళ్లు
ఉంటాయి. అందరి ముఖాల్లో ఏడుపు తప్ప ఇంకేమీ కనిపించేది
కాదు. మూడు నెలల తర్వాత
మిలట్రీ కోర్టు మా నాన్నని వదిలేసింది.
మా అమ్మ పడిన సంబరం
నాకిప్పటికీ గుర్తుంది. మామూలు కోర్టుల కంటే మిలట్రీ కోర్టులు
మనసున్నవి అని ఇప్పటికీ నేను
నమ్మేలా చేసిన ఘటన. ఆ కోర్టు,
జరిగిన ఘటనని మాత్రమే చూడలేదు. సైనికుడి గుండె చూసింది. ఎంత నలిగిపోయి ఉంటే
అంత కోపం వస్తుందో గుర్తించింది.
మళ్లీ
యూనిఫామ్ వేసుకోగానే మా నాన్నకి వేసిన
తొలి డ్యూటీ... చనిపోయిన కమాండింగ్ ఆఫీసర్ ఫ్యామిలీని ఇంటి దగ్గర దించి
రావడం. రెండు రోజుల ప్రయాణంలో వాళ్లు ఏం పెట్టినా తినలేదంట
మా నాన్న. ఏమైనా కలిపి ఇస్తారేమో అని భయం. ఇంటికి
వెళ్లాక సీవో భార్య, మా
నాన్నని పిలిచి ఫ్యామిలీ గురించి అడిగిందట. సర్వీస్ పొడిగించుకోకుండా సాధ్యమైనంత త్వరగా రిటైర్ అయి భార్యాపిల్లలతో కలిసి
మంచిగా బతుకు అని దీవించి పంపిందంట.
కోర్టు తండ్రి స్థానంలో ఉండి తీర్పు ఇస్తే,
ఆమె తల్లిలా దీవించి పంపింది. ఆమె మాట ప్రకారమే
సర్వీస్ కంటే నాలుగేళ్లు ముందుగానే
రిటైరయ్యాడు మా నాన్న. కానీ
ఆ బాధని మాత్రం ఆయన బతికున్నన్నాళ్లూ మోశాడు.
అది నేను స్పష్టంగా చూశాను.
ఎంతోమంది
సైన్యంలో నలిగిపోయి ఆత్మహత్యలు చేసుకున్నవాళ్లున్నారు. నిద్రలేచిన దగ్గర నుంచి వాళ్ల జీవితం యుద్ధం. ఆర్డర్ పాటించడం తప్ప, ప్రశ్నించడం తెలియదు సైనికుడికి. అలా శిక్షణ ఇస్తారు.
ట్రయినింగ్లో ఉన్న సిపాయితో
ఎప్పుడైనా మాట్లాడి చూడండి. షో చేయడానికి వాళ్లు
టెరిటోరియల్ 'పైలట్లు' కాదు. అసలైన సైనికులు. వాళ్ల పని డిఫెన్స్. ఎదురు
ప్రశ్నించడం తెలియకపోయినా సైనికుడు సైనికుడే. స్లేవ్ కాదు. అత్యవసర పరిస్థితిలోనే యుద్ధం. ఎమోషన్ కోసం కాదు. ఆపరేషన్
లక్ష్యం ముగిసింది. ఇంకా కొనసాగించడం జవాన్ల ప్రాణాలతో ఆడుకోవడమే.
ఎప్పుడూ వాళ్లే మనల్ని కాపాడటం కాదు. మనమూ వాళ్లని కాపాడుకోవాలి.
ఆ మరణాల ఉసురు తగిలేది మనకే.
సైన్యం
కంటే ముందే సరిహద్దుకు వెళ్తామన్న వాళ్లెవరూ ఇప్పుడు కనిపించడం లేదు. వీళ్లెవరూ అక్కడ చావడం లేదు. సైనికులు, అక్కడి ప్రజలే బలి అవుతున్నారు. పంజాబ్లో అయితే ఈ
గొడవ మొదలయ్యేసరికి సరిగ్గా కోతలకాలం సగంలో ఉంది. అయినా ఊళ్లకు ఊళ్లు ఎమర్జన్సీ స్థితిలోకి వెళ్లిపోయాయి. దూరం నుంచి దీపావళిలా
చూస్తున్నాం మనం. మనకు చేతనైతే
యుద్ధం ఆపాలని చెప్పాలి. త్వరగా దాన్ని ముగించే దారులు వెతకాలని కోరాలి. ఏకాకిని చేస్తేనే... చచ్చే ప్రత్యర్ధి అవతల ఉన్నది. మన
పతనం కోసం ఎదురుచూసే బలమైన
ప్రత్యర్ధులు ఇంకా వేరే ఉన్నారు.
మధ్యవర్తిత్వం పేరుతో వచ్చి వాలడానికి వాళ్లు రెడీగా ఉన్నారు. వాళ్లకి ఇది అవకాశం కాకూడదు.