Saturday, January 26, 2019

రోమా


గతించిపోయిన జీవితం తిరిగిరాదు... వదిలీ వెళ్లదు. మరీముఖ్యంగా బాల్యపు జ్ఞాపకాలు అంత తేలిగ్గా ఎరేజ్ కావు. ప్రపంచాన్ని, మనుషుల్ని, జీవితపు ప్రతి అనుభూతినీ ప్రేమించడం తెలిస్తే ఏ దశలోని జ్ఞాపకాలూ ఎరేజ్ కావేమో.! 

తన బాల్యపు జ్ఞాపకాల్ని, దానితో ముడిపడిన స్థలాన్ని సినిమాగా తీశాడు అల్ఫాన్సో క్వడాన్. ఈ ఆటోబయోగ్రఫీ లాంటి మూవీలో తల్లినో తండ్రినో ప్రధాన పాత్రధారిగా ఎంచుకోలేదు. ఇంటి పనిమనిషిని ప్రధాన పాత్రదారిని చేశాడు. ఆమెకే ఈ సినిమాని అంకితం ఇచ్చాడు. పనిమనిషి క్లియోతో పాటు, తనదైన కెమెరా పనితనంతో ఈ సినిమాని నడిపించాడు. ఓపెనింగ్ షాట్‌లో తన ఇంటి గచ్చుపై, ఆకాశంలో వెళ్లే విమానాన్ని అద్భుతంగా చూపిస్తాడు క్వడాన్. అదే విమానం ఎగిరిపోతున్న షాట్ తో సినిమా ముగిస్తాడు. మధ్యలో క్లియో జీవితం సాక్ష్యంగా స్త్రీల స్థితిని తెరపై ఆవిష్కరించాడు. క్లియో మృతశిశువుని ప్రసవించే సన్నివేశం నాకైతే కన్నీళ్లు తెప్పించింది. ఈ నాలుగు ముక్కలు రాసేలా చేసింది. ఓ సన్నివేశంలో తన భర్త ఇక తిరిగిరాడని స్పష్టంగా తెలిసిపోయిన ఇంటి యజమానురాలు సోఫియా చెప్పే డైలాగ్ "విమెన్ ఆర్ ఆల్వేస్ ఎలోన్" ఈ సినిమా ఆత్మగా అనిపిస్తుంది. క్లైమాక్స్ లో సముద్రంలోకి క్లియో వెళ్లేటప్పుడు పారలల్గా కెమెరా నడిపిస్తూ తీసిన విధానం సూపర్బ్.

(మ‌న‌కేమాత్రం సంబంధం లేని వాతావ‌ర‌ణం కాబ‌ట్టి మొద‌ట్లో కాస్త బోర్ కొడుతుంది. బ‌ట్ డోంట్ మిస్ దిస్ బ్లాక్ అండ్ వైట్ ఎపిక్. నెట్ ఫ్లిక్స్ దాత వినోద్‌కి థ్యాంక్యూ.)

Sunday, January 13, 2019

రక్తరత్న - రాబందు

ఏడో తరగతి ఫెయిలై బర్రెలు కాసుకుంటున్న రాయపాటి సుబ్బారావు మంచి మాటకారి. తను చెప్పే కట్టుకథల్ని వినడానికి అతగాడు కాచే బర్రెలన్నీ చెవులు కోసుకునేయి. మేత కూడా మేయకుండా కథలతోనే కడుపునింపుకునేయి. తన తోటి సావాసగాళ్లు కాసే గొర్రెలు కూడా సుబ్బారావు కథలంటే పడిచచ్చిపోయేవి. గొర్రెలు బర్రెల మౌత్ పబ్లిసిటీతో సుబ్బారావు ఖ్యాతి వాళ్ల కులమంతా పాకింది. దాంతో వాళ్ల కులపోడే అయిన ఓ ర‌చ‌యిత‌ ద‌గ్గ‌ర‌ సుబ్బారావుని అసిస్టెంటుగా పెట్టించారు కుల‌సంఘం త‌ర‌ఫున‌. చేరిన నాలుగు రోజులకే సినిమా శాస్త్రాన్ని ఆమూలాగ్రం చదివేశానని డిసైడయిన సుబ్బారావు గురువుకి శ‌ఠ‌గోపం పెట్టి సొంత కుంపటి పెట్టాడు. అదే వేగంతో దర్శకుడిగా సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. గోడమీద బొమ్మలు ఎగరడమే సినిమా అనుకునే తెలుగు ప్రేక్షకులకి రాయపాటి సుబ్బారావు తీసిన తొలిసినిమా పిచ్చపిచ్చగా నచ్చింది. కారణం ఆ సినిమాలో బొమ్మలు మాత్రమే ఎగరలేదు. వాటి తలకాయలు కూడా ఎగిరాయి. సినిమా పేర్లు పడినప్పటి నుంచి ఎండ్ కార్డ్స్ పడేదాకా ఏదో ఒక తలకాయ ఎగురుతూనే ఉంది. తెర మొత్తం ఎర్రగా నెత్తురు పులిమేశాడు సుబ్బారావు. హీరో చేత్తోనే తలకాయలు నరుకుతాడు ఈ సినిమాలో. వాళ్లింటో కూరగాయలకి బదులు తలకాయలే తరుగుతుంటారు. పాటల్లో కూడా హీరో హీరోయిన్లు ఒకర్నొకరు రక్కుకుంటూ రక్తాలు కారేలా డ్యాన్స్‌లు చేశారు. సినిమాలో హీరో నుంచి జూనియర్ ఆర్టిస్ట్ వరకూ అందరూ కత్తులు పట్టుకునే తిరుగుతుంటారు. సినిమా స్టార్టింగ్‌లో హీరో ఎగరకొట్టిన తల ఎండింగ్‌లో కింద పడుతుంది. అదే క్లైమాక్స్ ట్విస్ట్. సినిమా చూసినంతసేపూ థియేటర్లో జనాలు చప్పట్లు ఈలలకు బదులు తొడలు కొట్టుకుంటూ ఎంజాయ్ చేశారు. కొంత‌మంది త‌ల‌లు కూడా ప‌గ‌ల‌గొట్టుకుంటారు. దెబ్బకి సుబ్బారావుకి రక్తరత్న అని బిరుదిచ్చేశారు ప్రేక్షకరత్నాలు. నటన అంటే ఒళ్లంతా ఇరగదీసుకుంటూ ఎక్సర్‌సైజులు చేయడమే అని ఫిక్స్ అయిపోయిన హీరోలంతా రక్తరత్న దర్శకత్వంలో సినిమాలు చేయడానికి ఎగబడ్డారు. అయితే వాళ్ల కులపోళ్లకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడంతో కొంతమందికి రక్తరత్న దర్శకత్వంలో రక్తపిశాచాలు అయ్యే అవకాశం రాలేదు.

రక్తరత్న పేరుప్రఖ్యాతులు ఫిలిం నగర్లో వీధివీధికీ ఎగరడంతో... సినిమా పరిశ్రమని శాసిస్తున్న మరో కులపు ఎగిరేస్టార్ పుత్రరత్నం ఆలోచనలో పడ్డాడు. చేస్తే గీస్తే అతనితోనే తన తర్వాత ప్రాజెక్ట్ చేయాలని తండ్రికి చెప్పాడు. 
"రేయ్ ఒళ్లు ఇరగదీసుకోవడంలో మనమే కింగ్‌లం సినిమా పరిశ్రమలో. దాన్ని వదిలేసి ఇలా రక్తపిశాచిలా మారడం అవసరమా అన్నాడు" ఆ పెద్దాయన. 
"ఇరగదీసుకుని ఇరగదీసుకుని ఒళ్లంతా పులిసిపోతోంది డాడీ. ఈ రక్తకోలాతో దాన్ని కాస్త తగ్గించుకోవచ్చు. పైగా తెరంతా రక్తం కనిపించడం, తలకాయలు ఎగురుతూ ఉండడం ఇప్పటి ట్రెండ్ డాడీ" అంటూ ఎలాగోలా ఎగిరేస్టార్ ని ఒప్పించాడు. 
కథ చెప్పడానికి వచ్చిన రాయపాటి సుబ్బారావు గొంతుని కత్తితో సవరించుకుంటుంటే.. మధ్యలోనే ఆపేశాడు జూనియర్ ఎగిరేస్టార్. 
"కథంతా అక్కర్లేదు. తలకాయలు ఎగిరే సీన్లలో హైలెట్లు చెప్పండి చాలు అన్నాడు". 
దాంతో సినిమా మధ్యలో వచ్చే రక్తభరిత సన్నివేశాన్ని వివరించాడు రక్తరత్న. 
ఆ సీన్ లో "హీరో చేతుల్లో కత్తులు పెట్టి ఇనపగొలుసులతో కట్టేస్తారు విలన్లు. వాటిని నోటితో కొరికి తెంచుకున్న హీరో... ఇద్దరు విలన్ల తలల్ని కంటిచూపుతో నరికేస్తాడు. ఎగిరిన తలల్ని అక్కడే ఎగురుతున్న రాబందు ఎగరేసుకుని పోతుంది. ఆ తలల కోసం విలన్ల మొండేలు గాలిలోకి ఎగురుతాయి. వాళ్లకి తలలు దొరక్కుండా రాబందు పైకెక్కి సవారీ చేస్తాడు హీరో. రాబందుపై గాలిలో దూసుకెళ్తున్న హీరోని, మరో రాబందుపైకి ఎక్కి హీరోయిన్ ఫాలో అవుతుంది. ఇద్దరి మద్య మేఘాల్లో డ్యూయెట్. రెండు తలల్ని బంతుల్లా విసురుకుంటూ డ్యూయెట్ పాడుతారు హీరో హీరోయిన్లు. పాట అయిపోగానే హీరోయిన్ మాయం అయిపోతుంది. అదంతా కలని తెలుసుకుని కళ్లనిండా నిప్పులు కక్కుతాడు హీరో. ఆ నిప్పుల్లో విలన్ల తలలు రెండూ మాడి మసయిపోతాయి. ఇక్కడ ఇంటర్వెల్ బ్యాంగ్."
అప్పటిదాకా కథ అనే యుద్ధం చేస్తున్న రక్తరత్న కూడా విరామం తీసుకున్నాడు. అటు ఊహల్లో రాబందులపై సవారీ చేస్తున్న హీరో... తన్మయత్వంతో రాయపాటి సుబ్బారావు వైపు చూశాడు. త‌న క‌ళ్ల‌నించి ఆనంద‌భాష్పాలు. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకూ గుర్రాలపై సవారీ చూశారు. తొలిసారి రాబందుపై సవారీ ట్రెండ్ సెట్ చేస్తుందన్నాడు రక్తరత్న. సెకండాఫ్‌లో పూర్తిగా రాబందుపైనే తిరుగుతుంటాడు హీరో. క్లైమాక్స్ ఈ సీన్‌ని మించి ఉంటుంది. సినిమా మొదలయ్యాక దాన్ని ప్లాన్ చేస్తాం అన్నాడు రక్తరత్న. హీరోయిన్ పూర్తిగా పాటల్లో మాత్రమే వచ్చి వెళ్తుంటుంది. దాని వెనకే అసలైన ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ క్లైమాక్స్‌లో తెలుస్తుంది. హీరో ఎక్కి తిరుగుతున్న రాబందే హీరోయిన్ అని తెలుస్తుంది. చ‌నిపోయిన హీరోయిన్ ఆత్మ రాబందులో ఉంటుంది. అలా లాజిక్ కూడా కవర్ చేస్తాం. ఇంకా ఇందులో హీరో ట్వల్వ్ ప్యాక్స్ తో కనిపిస్తాడు. ర‌క్తర‌త్న మాట‌ల‌తో అర్ధంకాక అయోమయంగా చూశాడు జూనియర్ ఎగిరేస్టార్. ఆరు ముందు ఆరు వెనక అన్నాడు రక్త రత్న. వెనక ప్యాక్స్ గ్రాఫిక్స్‌తో మ్యానేజ్ చేస్తామన్నాడు. ఊహించుకోవడానికే అద్భుతంగా ఉంది హీరోకి. వెంటనే ఓకే చేశాడు సినిమాని. మరుసటి రోజు పేపర్లన్నింటిలో ఒకటే హెడ్ లైన్... రక్తరత్న, జూనియర్ ఎగిరేస్టార్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న "పరమ పిశాచ పావన".

(ఒక సినిమా ట్రయిలర్ చూసిన తన్మయత్వంతో తిక్కరేగి ఇలా రాయాలనిపించింది.)

Monday, August 20, 2018

దెయ్యంతో ప్రయాణం

నేను ఇర్లపాడులో ఇంటర్ చదివేటప్పుడు. అప్పటికి మా ఊరికింకా తార్రోడ్డు లేదు. ఊరికి వెళ్లాలంటే ఎర్రబస్సే దిక్కు. ఇర్లపాడు నుంచి వెళ్లాలంటే ఆఖరి బస్సు రాత్రి 9గంటలకి. దానికి వెళ్లొచ్చనే సాయంత్రం బస్సుకి పోలేదు.  9గంటలకి బస్సు రాలేదు. గతుకుల రోడ్డుపై యాడనో చెడిపోయినట్టుంది. దాని కోసమే ఉన్న ఒకరిద్దరు ప్యాసింజర్లు ఇంకో గంట చూసి ఇళ్లకి వెళ్లిపోయారు. నేను కచ్చితంగా ఊరికెళ్లాలి. 

పిండారబోసినట్టు వెన్నెల. నడవడం నాక్కొంచెం సరదానే. కానీ చీకట్లో అంత దూరం ఎప్పుడూ వెళ్లలేదు. వెన్నెలే క‌దా అని బ‌య‌లుదేరా. త‌ర్వాతే తెలిసింది వెన్నేలే ఎక్కువ భ‌య‌పెడుతుంద‌ని. చిమ్మ‌చీక‌ట్లో అయితే దారి త‌ప్ప మ‌రోదానిపై మ‌నం దృష్టి పెట్టం. వెన్నెల్లో చుట్టూ ఉన్న చెట్లు, నీడ‌లు అన్నీ నా క‌ళ్ల‌లోకి చొర‌బ‌డుతున్నాయి. చెట్లు నల్లటి భూతాల్లా, వాటి మధ్యలో ఉన్న సందులు తెల్లటి ప్రేతాల్లా కనిపిస్తున్నాయి. రోడ్డు అయితే పొడుగాటి దెయ్యం పడుకున్నట్టుంది. 

వెన్నెల్లో ఎవరైనా తోడుంటే చుట్టూ ఉండేవన్నీ అందంగా క‌నిపిస్తాయి. ఒంట‌రిగా ఉన్న‌ప్పుడే దెయ్యాల్లా క‌నిపిస్తాయి. "మ‌రి దెయ్య‌మే తోడు వ‌స్తే..."

భూతాలు ఇలా ఉంటాయని చంద‌మామ‌, బాల‌మిత్ర క‌థ‌ల్లో చ‌ద‌వ‌డ‌మే త‌ప్ప పెద్ద‌గా తెలియ‌దు. మా నాన్న చాలా సార్లు ఇలా అర్ధ‌రాత్రుల్లో న‌డిచొచ్చేవాడు. త‌ను దెయ్యాల్ని చాలాసార్లు చూశాన‌ని, వాటితో మాట్లాడాన‌ని చెప్పేవాడు. బీడీ తాగడానికి నిప్పు కూడా ఇచ్చాయనేవాడు. తాగిన మత్తులో ఆయనేదో వాగుతున్నాడని అనుకున్నా... అందులో నిజముందేమో అని కూడా అనిపించేది. నా విష‌యానికొస్తే దేవుడు లేడ‌ని చాలా చిన్న‌ప్పుడే ఓ న‌మ్మ‌కానికి వ‌చ్చినా... దెయ్యం మీద మాత్రం నా భ‌యం ఇప్ప‌టికీ పోలేదు. భయం అని కూడా కాదు. అదో ముచ్చట అనుకోవచ్చేమో. దెయ్యం శాశ్వ‌తం దేవుడు మూఢ‌న‌మ్మ‌కం అనేది నా గుడ్డిన‌మ్మ‌కం. నిజానికి దేవుడి గురించి ఈ మాత్రం మాట్లాడ్డం అంటేనే పెద్ద పెంట విష‌యం నాకు. అందరికీ దేవుడ్ని చూడాలనే కోరిక ఉన్నట్టే, నాకు దెయ్యాన్ని చూడాలని కోరిక. అదే నాతో ఇలా ఈ అప‌రాత్రి న‌డిపిస్తుందేమో. 

ఇలా నాలో నేను ఊహించుకుంటూనే మొండోడి బండ దాటినా. కానీ కోదండ‌రామాపురం వ‌చ్చేస‌రికి భయం మొదలైంది. దెయ్యం గురించి కాదు. ఆ ఊళ్లో రోడ్డు నిండా కుక్క‌లుంటాయి. ఎందుకైనా మంచిదని న‌డుముకున్న బెల్ట్ తీసి చేత్తో ప‌ట్టుకున్నా. ఊరంతా మంచి నిద్ర‌లో ఉంది. కీచురాళ్ల గోల త‌ప్ప ఇంకే చ‌ప్పుడు లేదు. వెన్నెల్లో ఊరి స‌త్రం ద‌గ్గ‌రున్న మ‌ర్రిచెట్టు బ్రహ్మరాక్షసుడిలా ఉంది. స‌త్రం ద‌గ్గ‌ర‌కి వ‌చ్చేసరికి అర్ధ‌మైంది. అక్క‌డ కుక్కలేం లేవ‌ని. నాకే న‌మ్మబుద్ధి కాలేదు. ఏదో ఒకటి. గండం గ‌డిచింది చాల‌నుకుని వేగంగా ఊరు దాటా. 

కోదండ‌రామాపురం దాటినాక నుంచే అస‌లు భ‌యం మొద‌లైంది. మ‌రో కిలోమీట‌ర్ త‌ర్వాత మ‌న్న‌మోడి క‌ట్ట వ‌స్తది. మా ఊరి పొలిమేర అది. అక్క‌డ పున్న‌మి రాత్రుల్లో దెయ్యాలు పెళ్లిళ్లు చేసుకుంటాయ‌ని, క‌ట్ట‌మీద కొరివి దెయ్యాలు కాపాలా ఉంటాయ‌ని చెప్పుకుంటారు. దెయ్యాల మాటేమో గానీ క‌ట్ట ద‌గ్గ‌ర వ‌రుస‌గా ఉన్న తాడిచెట్లే రాకాసుల్లాగా ఊగుతున్నాయి గాలికి. కోదండరామ‌పురం నుంచి మ‌న్న‌మోడి క‌ట్ట దాకా చెట్ట‌న్న‌దే లేదు. కట్ట దగ్గర మాత్రం ఒక్కసారిగా గోడ కట్టినట్టు తాడి చెట్లు. చీక‌ట్లో చుట్టూ చెట్లు ఉంటే ఎంత భ‌యంగా ఉంటుందో.. ఇలా ఎడారిలా ఉన్నా అంతే భ‌యంక‌రంగా ఉంటుంది. దూరం నుంచి గాలికి ఊగుతున్న తాడిచెట్లు నా వైపే నడిచి వస్తున్నట్టు కనిపిస్తున్నాయి. వాటినే చూస్తూ న‌డుస్తున్న నాకు.. "నా వెన‌కెవ‌రో న‌డుస్తున్నట్టు అనిపించింది." 

అలాగే కొంచెం దూరం న‌డిచినాక అనుమానం ఇంకా ఎక్కువైంది. న‌డుస్తున్న‌వాడిన‌ల్లా ఒక్క‌సారి ఆగా. "వెన‌క నుంచి చ‌ప్పుడు ఆగిపోయింది."

తిరిగి చూడ్డానికి ధైర్యం చాల్లా. ఒక్క క్ష‌ణం ఆగి మ‌ళ్లీ న‌డ‌క మొద‌లుపెట్టా. అడుగుల‌ చ‌ప్పుడు తిరిగి మొద‌లైంది. ఆ చ‌ప్పుడు చాలా ల‌య‌బ‌ద్దంగా ఉంది. మనిషి పాదాల్లాగా బ‌రువుగా నేల‌ని తాక‌డం లేదు ఆ పాదాలు. సుతిమెత్త‌గా తాకుతున్న‌ట్టుంది. గాలి కూడా పెరిగింది. వెన‌క నుంచి చ‌ల్ల‌టిగాలి నా వెన్నుని తాకిన‌ప్పుడ‌ల్లా ఒళ్లంతా జ‌ల‌ద‌రిస్తోంది. అంత గాల్లో కూడా నా ఒళ్లంతా చెమ‌ట్లు ప‌ట్టాయి. భ‌యంతో న‌డ‌క‌లో వేగం త‌గ్గిపోయింది. "వెన‌క వ‌చ్చేది ఎవ‌రు." దెయ్య‌మా... లేక దెయ్యాలా...? ఎందుకంటే పాదాల చ‌ప్పుడు అలా ఉంది. ఒక‌రా ఇద్ద‌రా ముగ్గురా అనేది తెలియ‌డం లేదు. 

మ‌న్న‌మోడి క‌ట్ట ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర‌కి వ‌చ్చేదాకా ఓపిక ప‌ట్టా. ఇంగ నా వ‌ల్ల కాలేదు. 
ఒక్క‌సారిగా ఆగా. చ‌ప్పుడు మ‌ళ్లీ ఆగిపోయింది. 
వెన‌క్కి తిరిగి చూడాలా... వ‌ద్దా...? రెండు క్ష‌ణాలు ఆలోచించా. 
ధైర్యం అంతా కూడ‌గ‌ట్టుకున్నా. 
మ‌న్న‌మోడి క‌ట్ట‌మీద ఉండాల్సిన కొరివిదెయ్యాలు నా వెన‌కే ఉన్న‌ట్టు అనిపిస్తున్నాయి. 
వెన‌క్కి తిరగాలా... వ‌ద్దా...
నా ఊపిరి శ‌బ్దమే నాకు నక్క ఊళలా వినిపిస్తోంది.
ఏదైతే అద‌వుతుంద‌ని మెల్ల‌గా తిరిగా. 
అలా తిరిగేట‌ప్పుడు నా కాలు రాయి మీద ప‌డి బెసికిన‌ట్టు అవ‌డంతో కిందకి వంగిపోయా.
అంతే... 
భౌ... అంటూ కుక్క‌. గీపెట్టి అరిచింది. 
చుట్టూ ఉన్న నిశ్శబ్దంలో కుక్క అరుపు గింగిరాలు తిరుగుతూ ప్రతిధ్వనించింది. 
నా గుండెకాయ గొంతులోకి వ‌చ్చింది. ముడ్డిపూసలో నుంచి ముచ్చింగుంత దాకా షాక్ కొట్టినట్టు వణుకు. 
అంత భ‌యంలో నా చేతిలో ఉన్న బెల్టుని కుక్క‌కేసి విసిరా. గురిచూసినట్టు దాని మూతిమీద త‌గిలింది. కుయ్యిమంటూ వెన‌క్కి తిరిగి  ప‌రిగెత్తింది కోదండరామాపురం వైపు. 

షాక్ నుంచి తేరుకోవ‌డానికి రెండు నిమిషాలు ప‌ట్టింది నాకు. రోడ్డు మీదే కూర్చుని కుక్క వెళ్లిన వైపే కాసేపు చూశా. నిదానంగా లేచి మా ఊరివైపు నడిచా. ఆ షాక్ దెబ్బకి నాకు మన్నమోడి కట్ట గుర్తే లేకుండా పోయింది. కట్ట దగ్గర కొరివిదయ్యాల సంగతీ మర్చిపోయా. అలాగే నడుచుకుంటూ ఊరికి చేరుకున్నా. అప్పటికే మావోళ్లంతా నిద్రపొయినట్టున్నారు. వాళ్లని లేపడం ఎందుకులే అని, బైట కనిపించిన దుప్పటి తీసుకుని మిద్దె మీదకెక్కి పడుకున్నా. మరుసటి రోజు, పొద్దు నామీదకి వచ్చేదాకా నిద్రపోయా. 

ఇది జరిగాక నాకు దెయ్యంపై మరింత నమ్మకం పెరిగింది. దేవుడు సర్వాంతర్యామి అనేది అబద్ధం. దెయ్యం సర్వాంతర్యామి. "అదే భయం."

Monday, October 2, 2017

ఒన్ ఫ్లూ ఓవ‌ర్ ద‌ కుకూస్ నెస్ట్‌

వాల్డ్ ఈజే మెంట‌లాస్పిట‌ల్‌. త‌లొంచావా.. యు ఆర్ లాక్డ్‌. అందుకే జ‌స్ట్ పిస్ ఆన్ ఇట్స్ ఫేస్‌. ఇంకా చాత‌నైతే నోట్లో పొయ్యి. వెనెవ‌ర్ యు వాంట్ టు ఎస్కేప్‌. జ‌స్ట్ డూ ద‌ట్‌. లేదంటే నీ గుడ్డు ప‌గ‌ల‌కొట్టేస్తారు. (గుడ్డు అంటే గుడ్డు కాదు.) ప్ర‌పంచం పిచ్చాసుప‌త్రి మాత్ర‌మే కాదు చాలా విశాల‌మైంది కూడా. పాత మాట అని కొత్త‌గా ట్రై చెయ్య‌లేని పిరికి వాళ్లు చెప్పొచ్చు. బంధాలు, భ‌యాలు త‌ల‌బ‌ద్ద‌లయిపోయేంత భారం కాకుండా చూసుకో. అయ్యాయ‌నుకో సిగ్గులేకుండా వాటిలోంచి బైట‌కొచ్చెయ్‌. స‌లాహాలు ఇవ్వ‌డానికి బోల్డెంత మంది వ‌స్తారు. జ‌స్ట్ సే ఫ‌క్ ఆఫ్‌.. అచ్చ‌ తెలుగులో దెంగెయ్ అను. 

అంతా ఒక రోటీన్‌కి అలవాటు ప‌డి ఉంటారు క‌దా. నువ్వు బైట‌కెళ్తానంటే ఒప్పుకోరు. ఈ రోటీన్ నీకు పిచ్చ‌లాగే ఉండొచ్చు.  అందులోంచి నువ్వు బైట‌కి వెళ్తానంటే మాత్రం మొత్తం వ్య‌వ‌స్థ అప్ర‌మ‌త్త‌మైపోతుంది. ఏవో కొంప‌లు మునిగిపోతున్నాయ‌ని అరుస్తుంది.  నిన్ను సైలెంట్ చేయాల‌ని చూస్తుంది. కుద‌ర‌క‌పోతే చంపేస్తుంది. కానీ ఆల్రెడీ అల‌జ‌డి మొద‌లైపోయింది కాబ‌ట్టి రోటీన్ లోనుంచి ఒక్కొక్క‌రే బైట‌కి వెళ్లడం మొద‌ల‌వుతుంది. ఆప‌డం విల‌నిజ‌మేం కాదు గానీ.. వెళ్ల‌డం మాత్రం హీరోయిజ‌మే. ఇక్క‌డ విల‌నీ అనేది వ్య‌క్తిగ‌తం కాదు... అది వ్య‌వ‌స్థీకృతం. ఎవ‌డికి వాడు త‌న సైడ్ నుంచి క‌రెక్టే. సినిమాలో న‌ర్స్ రేచెద్‌ కూడా అలాంటిదే. వృత్తిగ‌తంగా త‌ను ఒక ఫ్రేమ్ సెట్ చేసుకుంది. రోగులెవ‌రూ ఆమెకి శ‌త్రువులు కాదు. పైగా కొంద‌రు ఆమెకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. కాక‌పోతే త‌ను పెట్టిన రూల్స్ అనేవి అక్క‌డి మాన‌సిక రోగుల్ని మామూలు మ‌నుషులుగా మార్చేలా లేవు. ఈగో అనే ఎవిల్ ఎలాగూ ఉంటుంది కాబ‌ట్టి న‌ర్స్ విల‌నైందిక్క‌డ‌. ఎలాంటి ఈగోలు లేకుండా ఒక పిచ్చలో నుంచి బైట‌కి రావాల‌నుకున్నాడు కాబ‌ట్టే మ‌ర్ఫీ హీరో అయ్యాడు. 

42 ఏళ్ల‌కింద‌టి సినిమా. కొన్ని వంద‌ల సినిమాల‌కి ఇన్‌స్పిరేష‌న్‌. కానీ ఈ మూవీ ఇప్పుడు చూసినా ఫ్రెష్‌గానే అనిపిస్తుంది. డైరెక్ట‌ర్ ఫ‌ర్మాన్‌, హీరో జాక్ నికొల్స‌న్ ఈ ఇద్ద‌రి గురించే చెప్తారు చాలామంది. కానీ ఇందులో చిన్న చిన్న పాత్ర‌లు వేసిన చాలామంది అద్భుతంగా న‌టించారు. ఓవ‌రాల్‌గా జాక్ నికొల్స‌న్ టాప్‌లేపేశాడు కానీ.. మిగిలిన‌వాళ్ల గురించి కూడా చెప్పుకోవాలి. మార్టిని పాత్ర వేసిన డానీ డెవిటో,  చెస్‌విక్‌గా న‌టించిన లాసిక్, హార్డింగ్‌గా క‌నిపించిన రెడ్‌ఫీల్డ్‌ గుర్తుండిపోతారు. ఈ ముగ్గురిలో కూడా డానీ డెవిటో చాల నేచుర‌ల్ పిచ్చోడిలా క‌నిపిస్తాడు. ప్ర‌తినాయ‌క పాత్ర  న‌ర్స్ రేచెద్‌గా వేసిన‌ లూయిస్ ఫ్లెచ‌ర్‌.. ఆ పాత్ర‌పై డైరెక్ట‌ర్ ఫ‌ర్మాన్ పర్‌సెప్ష‌న్‌ని మార్చి మ‌రీ సినిమాలో అవ‌కాశాన్ని ద‌క్కించుకుంద‌ట‌. న‌ర్స్ పాత్ర‌ని భ‌యంక‌ర‌మైన విల‌న్‌గా చూపించాల‌నుకున్నాడట‌ ఫ‌ర్మాన్‌. కానీ విల‌న్‌ కేవ‌లం ఇన్‌స్ట్రుమెంట్ అన్న కోణంలోనే చూపించాల‌న్న ఆలోచ‌న ఫ్లెచ‌ర్‌ది. త‌న కోణంలో త‌ను అంద‌రికీ మంచి చేస్తున్న‌ట్టే ఫీల‌వుతుంది, కాకపోతే అది రోగుల్ని ఇబ్బంది పెడుతుంది. ఫ్లెచ‌ర్ ఈ వాద‌న‌కే ఫ‌ర్మాన్ ఓటేశాడు. 

డైరెక్ట‌ర్‌గా ఫ‌ర్మాన్ చేసిందేంటి..?
యాక్ట‌ర్లకి ఎలాంటి స్క్రిప్ట్ ఇచ్చేవాడు కాదు ఫ‌ర్మాన్‌. కేవ‌లం వాళ్ల పాత్ర‌లేంటో చెప్పి.. ఇంప్ర‌వైజ్ చేయ‌మ‌నేవాడు. వాళ్లు గ్రూప్ ఇంప్ర‌వైజేష‌న్ మొద‌లుపెట్ట‌గానే వాళ్ల‌కి తెలియ‌కుండా కెమెరాలు రోల్ అయ్యేవి. చాలా సీన్లు యాక్ట‌ర్ల‌కి తెలియ‌కుండా షూటింగ్ చేశాడ‌ట‌. ఇక సినిమాలో చాలా పాత్ర‌లు వేసింది ప్రొఫెష‌న‌ల్‌ న‌టులు కాదు. ఓరెగాన్ హాస్పిట‌ల్ సైకియాట్రిక్‌ వార్డులో పేషెంట్స్‌నే చిన్నాచిత‌కా పాత్ర‌లో వాడుకున్నారు. మ‌ధ్య‌లో వ‌చ్చే ఫిషింగ్ ట్రిప్ సీన్ మొత్తం ఆఖ‌ర్లో షూట్ చేశార‌ట‌. హాస్పిటల్ త‌ప్ప మ‌రోటి సినిమాలో క‌నిపించ‌కూడ‌ద‌న్న‌ది డైరెక్ట‌ర్ ఫార్మ‌న్ ఆలోచ‌న‌. అయితే ప్రొడ్యూస‌ర్లు ప‌ట్టుబ‌ట్టి ఫిషింగ్ సీన్ షూట్ చేయించార‌ట‌. 

ఒన్ ఫ్లూ ఓవ‌ర్ కుకూస్ నెస్ట్‌ న‌వ‌లా ర‌చ‌యిత కేసీ మాత్రం ఈ సినిమా చూడ్డానికి ఇష్ట‌ప‌డ‌లేద‌ట‌. మ‌ర్ఫీ ఇన్‌స్పిరేష‌న్‌తో ఆస్ప‌త్రి నుంచి పారిపోయే చీఫ్ బ్రామ్‌డెన్.. న‌వ‌ల‌లో ఈ క‌థ మొత్తాన్ని నెరేట్ చేస్తాడు. సినిమాలో అలా ఉండ‌దు. ఈ విష‌యంలో కేసీకి సినిమా యూనిట్‌కి మ‌ధ్య గొడ‌వ జ‌రిగిందంటారు. చాలామంది సినిమా కంటే న‌వ‌లే బాగుందని చెప్తారు. న‌వ‌ల నేను చ‌ద‌వ‌లేదు కానీ.. మూవీ అయితే మాస్ట‌ర్ పీస్‌. జాక్ నికొల్స‌న్ న‌టన పీక్స్‌. 

(ఈ మూవీ గురించి ఎప్ప‌టినుంచో రాయాల‌నుకున్నా.. ఇప్ప‌టికి రాసేశా)

Tuesday, September 26, 2017

బీడెవిల్డ్‌


సినిమాల్లో క‌త్తుల‌తో పొడుచుకునే సీన్లంటే నాక‌స‌హ్యం. చిన్న‌ప్పుడైతే ఆ సీన్లు వ‌స్తుంటే చ‌ల్ల‌గా ప‌క్క‌కి జారుకునేవాడ్ని. ఆ టైమ్‌లో మా అక్కోళ్లు న‌న్నుఓ రేంజ్‌లో ఏడిపించేవాళ్లు. త‌ర్వాత భ‌యం పోయింది కానీ.. ఆ సీన్లంటే మాత్రం ఇప్ప‌టికీ అస‌హ్య‌మే. ఈ మూవీ చూసేట‌ప్పుడు కూడా కొన్నిచోట్ల కాస్త‌ చిరాకేసింది. కానీ ఎందుకో రెండు రోజుల్నించీ సినిమా క‌దిలిస్తూనే ఉంది. కార‌ణం ఇందులో స‌బ్జెక్ట్‌. 

చ‌దువు ఎలాంటి జ్ఞానాన్ని ఇవ్వ‌ద‌ని నేను న‌మ్ముతాను. కేవ‌లం ఉద్యోగం సంపాదించుకోడానికి మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డుతుంది అనుకుంటాను. చ‌దువుకున్న చాలామందిపై నాకున్న స్వంత అభిప్రాయాలు కావ‌చ్చు, అక‌డ‌మిక్ ఎడ్యుకేష‌న్ తీరుపై నాకున్న అస‌హ్యం కూడా కార‌ణం కావ‌చ్చు. సొంతంగా ఆలోచించే శ‌క్తి క‌లిగిన‌వాళ్లు చ‌దువుకున్నా, చ‌దువుకోక‌పోయినా సివిలైజ్డ్‌గానే ఉంటారు. ప్ర‌త్యేకించి.. చ‌దువుకున్న వారిలోనే ఎక్కువ‌గా గొర్రెల్లాంటి మ‌న‌స్త‌త్వం పెరుగుతుంద‌నేది కూడా నా అభిప్రాయం. అలాంటి వాళ్ల‌ని త‌యారుచేసుకోవ‌డ‌మే అక‌డ‌మిక్ సిస్ట‌మ్ ల‌క్ష్య‌మేమో అనిపిస్తుంది. అదే నిజ‌మేమో కూడా. ఇక‌ ఈ ఉన్న‌త చ‌దువులు చదివిన వాళ్లేదో ఉద్ధ‌రించేస్తార‌న్న పిచ్చి న‌మ్మ‌కం మ‌రికొంద‌రిది. ఇలాంటి అభిప్రాయంతోనే బీ డెవిల్డ్ తీసిన‌ట్టున్నారు. సినిమాలో చాలా సీన్లు మ‌రీ హింసాత్మ‌కంగా అనిపిస్తాయి. స్త్రీలు భ‌రించే హింస‌తో పోలిస్తే ఇది చాలా త‌క్కువేనేమో.. అన్న కోణంలో చూస్తే మాత్రం బిడెవిల్డ్ మ‌రీ అంత భ‌యంక‌రంగా అనిపించ‌దు. చాలామంది ఆడ‌వాళ్లు ఎంత‌ భ‌యంక‌ర‌మైన జీవితాన్ని చూస్తున్నారో అన్న‌ది మాత్ర‌మే అర్ధ‌మ‌వుతుంది.

ఈ సినిమా చూడ్డానికి కార‌ణం పాకాల రాజేష్‌. ఏపీ రెసిడెన్షియ‌ల్ స్కూల్‌, గ‌ణ‌ప‌వ‌రంలో నా ఫ్రెండ్‌. ఎయిత్‌ టు టెన్త్‌
క‌లిసి చ‌దువుకున్నాం. త‌ర్వాత ఎవ‌రి జీవితం వాళ్ల‌ది. లాస్టియ‌ర్ స‌డెన్‌గా ఎఫ్‌బీలో ఫ్రెండ్ రిక్వెస్ట్‌. ఎలా ప‌ట్టుకున్నాడో కానీ సాధించాడు. నిన్న చాటింగ్‌లో త‌ను కొన్ని సినిమాల లిస్ట్ పంపాడు. నాకున్న స్నేహితుల్లో నాకే ఎక్కువ సినిమా జ్ఞానం ఉంద‌న్న కొవ్వు ఏ మూలో ఉంటుంద‌నిపిస్తుంది. కానీ త‌ను పంపిన‌ లిస్ట్ చూశాక ఆ కొవ్వు కాస్తా క‌రిగిపోయింది. ఒన్ ఫ్లూ ఓవ‌ర్ కుకూస్ నెస్ట్ ద‌గ్గ‌ర నుంచి ఎన్ని సినిమాలో. అందులో కొరియ‌న్ సినిమాల్లో ఈ బీడెవిల్డ్ కూడా ఒక‌టి. క‌చ్చితంగా చూడ‌మ‌ని ఆర్డ‌రేశాడు. దాంతో చూడాల్సొచ్చింది. కానీ ఇంత దుఃఖాన్ని భ‌రించలేమేమో. ఇంత దుఃఖాన్ని అనుభ‌వించే మ‌నుషుల జీవితాల్ని మార్చ‌లేక‌పోయినా.. క‌నీసం కాస్త మాట‌సాయ‌మైనా అందించ‌గ‌ల‌మా..? 

ఈ సినిమాలో అంతులేని దుఃఖ‌మే కాదు.. అద్భుత‌మైన స్నేహం ఉంది. మే బీ రాజేష్ ఇందుకే న‌న్నీ సినిమా చూడ‌మ‌న్నాడేమో.! ల‌వ్ యూ రాజేష్‌. బ‌ట్ అయామ్ నాటే గుడ్ ఫ్రెండ్‌.

(సినిమాలో హే-వోకి బోక్‌-నామ్ రాసిన లెట‌ర్స్ చూస్తుంటే, టెన్త్ అయిపోయాక రాజేష్ నాకు రాసిన లెట‌ర్ గుర్తొచ్చింది. దానికి నేను రిప్లై రాయలేదు. 20 ఏళ్ల‌ త‌ర్వాత మ‌ళ్లీ ఎఫ్‌బీలో వాడే న‌న్ను ప‌ట్టుకున్నాడు.)

Monday, September 11, 2017

అర్జున్‌'రెడ్డి'

ఎన్ని ప్రేమ క‌థ‌లైనా చెప్పు.. 
ఏదో ఒక మూల ఎదో స్టోరీ మిగిలిపోయే ఉంటది.
ఏ ఇద్ద‌రి వేలిముద్ర‌లు ఒక‌లా ఉండ‌న‌ట్టే.. ఏ ఇద్ద‌రి ప్రేమ‌కథ‌లు ఒక‌లా ఉండ‌వు. సామాజిక‌, ఆర్ధిక‌, మాన‌సిక స్థితిగ‌తుల వ‌ల్లే అనుకుంటావో లేక మ‌రోలా అనుకున్నా. ల‌వ్ ఈజ్ ఎట‌ర్న‌ల్‌, ల‌వ్ ఫెయిల్యూర్స్ ఆర్ ఎట‌ర్న‌ల్‌. 

ప్రేమ క‌థ‌ల్లో ఎన్ని షేడ్స్ ఉన్నా.. అందులో ఉన్నంత‌వ‌ర‌కూ ప్ర‌పంచంలో తామిద్ద‌ర‌మే ఉన్న‌ట్టు అనిపిస్తుంది. ప్రేమించిన మ‌నిషి దూర‌మైతే ప్రపంచంలో త‌నొక్క‌రే మిగిలిపోయిన‌ట్టనిపిస్తుంది. త‌ల్లిదండ్రులు, స్నేహితులు వీళ్లంతా నీ చుట్టూ ఉన్నా క‌నిపించ‌రు. ఆ ఒంట‌రిత‌నంలో ఉన్న పెయిన్‌ అనుభ‌వించిన‌వాళ్ల‌కే తెలుస్తుంది. నీలో నువ్వు బ్లీడ్ అవుతున్న‌ట్టు.. న‌ర్వ్‌స్‌ని ఎవ‌రో మెలిపెట్టి లాగుతున్న‌ట్టు.. త‌ల నిండా బ్ల‌డ్ క్లాట్ అయిపోయిన‌ట్టు.. 

ఇదంతా అర్జున్‌రెడ్డిలో క‌నిపిస్తుంది. ప్రేమ‌లో ఫెయిల్ అయిన ప్ర‌తి ఒక్క‌రిలో క‌నిపిస్తుంది. అర్జున్‌రెడ్డి దానికి రియాక్ట్ అయ్యే విధాన‌మే తెలుగుసినిమాకి కొత్త‌. మ‌రీ కొత్త‌దేం కాదు సూర్య స‌న్నాప్ కృష్ణ‌న్‌లో కొంత‌మేర‌కు ఇలాంటి పాత్రే క‌నిపిస్తుంది. కానీ దానికి ఇంత సీన్ లేదు. అందులో ఉన్నసూర్యకి అర్జున్‌రెడ్డికి యాటిట్యూడ్ తేడా ఉంది. మిడిల్ క్లాస్ అండ్ రిచ్‌కు ఉన్న తేడా. కాస్త పాత రోజుల‌కెళ్తే దేవ‌దాసుతో అర్జున్‌రెడ్డిని బాగా పోల్చొచ్చు. కానీ ప్రొఫెష‌న్ అనేది యాడ్ అయింది అర్జున్‌రెడ్డికి. అందుకే దేవ‌దాసు అంత విషాదంలో కూరుకుపోయే ధైర్యం అర్జున్‌రెడ్డి చేయ‌లేదు. కాస్త.. తండ్రి, ఫ్యామిలీ అని ఆలోచించాడు. దేవదాసు పెళ్లికి చాలా విలువిచ్చాడు. అర్జున్‌రెడ్డి ఈ ప‌నికిమాలిన ప‌ర‌మ ప‌విత్ర‌మైన‌ పెళ్లిని ఒక్క త‌న్ను త‌న్నేశాడు. పెళ్లి స్థాయేంటో చెప్పాడు. (మ‌రీ అంత ధైర్యంగా కాక‌పోయినా...)

విజ‌య్ దేవ‌ర‌కొండ యాక్టింగ్‌, లుక్ రెండూ కొన్నాళ్ల‌పాటు గుర్తుండిపోతాయి నిలిచిపోతాయి. అయితే అర్జున్‌రెడ్డి మాత్ర‌మే ఈ సినిమా కాదు. ప్రీతి లాంటి స్ట్రాంగ్ క్యారెక్ట‌ర్‌, హీరో ఫ్రెండ్స్ కూడా అంతే స్థాయిలో ఈ సినిమాకి అస్సెట్ అయ్యారు. సినిమాలో హీరోహీరోయిన్‌కు సంబంధించిన సీన్స్ ప‌క్క‌న‌పెడితే.. కాలేజ్ నుంచి వెళ్లిపోయే స‌మ‌యంలో అర్జున్ ఫ్రెండ్ కీర్తి, మ‌రో ఫ్రెండ్‌కి కిస్ ఆఫ‌ర్ చేసే సీన్ సూప‌ర్బ్‌. ఆ అమ్మాయి మ‌రోసారి క‌నిపిస్తే బాగుండు అనిపించింది. హీరో క్లోజ్‌ఫ్రెండ్ పాత్ర చేసినాయ‌న‌ యాక్టింగ్ బాగుంది. సినిమా లెంథీ బ‌ట్ వ‌ర్తీ. సినిమా మొత్తం రెబెల్‌గా క‌నిపించినా.. క్లైమాక్స్‌లో మ‌రీ ధైర్యం చేయ‌లేక‌పోయారేమో అనిపించింది. క్లైమాక్స్ ఒకే బ‌ట్ మిగిలిన సిన్మా స్థాయికి లేదు. కెమెరా వ‌ర్క్ మ‌రీ అంత గొప్ప‌గా లేదు. ఎడిటింగ్‌లో కొన్నిచోట్ల జంప్‌క‌ట్స్ బాగా చేశారు. బీజీఎంలు అద్భుతంగా ఉన్నాయి.. కానీ ఆ పాట‌లు అవ‌స‌ర‌మా అనిపించింది. 

ఇంకో చిన్న డౌట్ః చివ‌ర్లో హీరోయిన్ అడ్ర‌స్ తెలుసుకున్న‌వాడు.. త‌ను భ‌ర్త‌తో ఉందో, లేక ఒంట‌రిగా ఉందో తెలుసుకోలేక‌పోయాడా అన్న డౌట్ కొడ్తుంది. 

ఇక తోక సంగ‌తికొస్తే... అర్జున్‌రెడ్డి చివ‌ర్లో తోక అంత అవ‌స‌ర‌మా అనిపించింది. బ‌హుశా తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో త‌మ ఉనికిని చాటుకోవాల‌న్న త‌ప‌న ఉందేమో డైరెక్ట‌ర్‌లో అనిపించింది. సినిమాలో అయితే తోక అవ‌స‌రం పెద్ద‌గా క‌న‌బ‌డ‌లేదు.

హీరో పాత్ర ఎంత ప‌విత్రంగా ఉంది, సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇచ్చారు అన్న విష‌యాల జోలికి వెళ్ల‌ను. ఎందుకంటే ఇది ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ తెలుగు సినిమా మాత్ర‌మే. ప్రేమ విఫ‌ల‌మైన మ‌నిషి పెయిన్‌ని చూపించిన విధానం బాగా క‌నెక్టవుతుంది. హీరోయిన్ ప్రీతి పాత్ర బాగుంది. అర్జున్‌రెడ్డి పాత్ర‌ని తీర్చిదిద్ద‌డంపై మ‌రింత శ్ర‌ద్ధ పెట్టి ఉంటే బాగుండేది.

(మేకింగ్ విష‌యంలో బెంచ్‌మార్క్ అన్న లైన్ ఎడిట్ చేశాను. ఫ్లైట్ సినిమా చూశాక‌. మందులో ఆప‌రేష‌న్ చేయ‌డం, దాని త‌ర్వాత కోర్టు వ్య‌వ‌హారం లాంటివి యాజిటీజ్‌గా దించేశారేమో అనిపించింది. మిగ‌తా సీన్లు మ‌రేదైనా సినిమాలో క‌నిపించ‌క‌పోతే బాగుండు )

Wednesday, September 6, 2017

ఓల్డ్ బాయ్‌

నా జీవితం ఇలా సంక‌నాకి పోవ‌డానికి ఒక‌డు కార‌ణం. వాడు దొర‌కాలి. నాలో నేను కార్చుకున్న ర‌క్తానంతా.. వాడి నుంచి పీల్చుకుంటా. నా గుండెకి అయిన గాయాల‌కి వాడి చ‌ర్మంతో క‌ట్టు క‌ట్టేస్తా. క‌చ్చితంగా దొరుకుతాడు వాడు. కానీ వాడెవ‌డో తెలుసా..? 

నేనే..

నా సినిమాలో నేనే హీరో.. నాకు నేనే విల‌న్‌. 
ఎలా చంపాలి వీడ్ని..? ఎలా నా బాధ‌ని తీర్చుకోవాలి..?

ఈ సినిమా చూశాన‌ని చెప్ప‌గానే.. విహారి ఏమ‌న్నాడంటే.. ఎందుకు చూశావా సినిమాని..? 
వానెమ్మ.. ఏం కాన్సెప్ట్ అది. ఛీ.

నిజ‌మే కాస్త డైజ‌స్ట్ చేసుకోలేని కాన్సెప్టే. కానీ అది ఎంచుకోడానికి వాడెంత ధైర్యం చేసి ఉండాలి. ఒక సినిమాలో హీరో, విల‌న్ ఒక‌డ్నే చూపించడానికి ఎన్ని గుండెలుండాలి..? ద‌ట్స్ వై ఐ ల‌వ్ దిస్ మూవీ. 

గ్రీకు పురాణాల్లోని ఈడిప‌స్ పాత్ర‌ ఇన్‌స్పిరేష‌న్‌తోనే ఈ మూవీ తీశానంటాడు డైరెక్ట‌ర్ చాన్‌-వూ. హీరో పేరు ఈడిప‌స్‌ను గుర్తు తెచ్చేలా డే సు అని పెట్టాడ‌ట‌. అయితే ప్ర‌ధాన పాత్ర‌లు రెండూ ఈడిప‌స్‌ ప్ర‌తిరూపాల్లానే ఉంటాయి. 

ఈ సినిమా చాన్నాళ్ల నుంచి చూడాల‌ని, ధైర్యం చాల‌క చూడలేదు. సినిమా గురించి యూట్యూబ్‌లో చూస్తే ఎప్పుడూ ఒక ఫైట్ సీన్ క‌నిపించేంది. వార్నీ ఇదేదో చైనీస్ టైప్.. ఫైటింగ్ బాప‌త‌ని వ‌దిలేశా. కానీ ఎందుకో ధైర్యం చేసి చూశా. వాటే స్క్రీన్‌ప్లే..వాటే స్క్రీన్ ప్లే. 

సినిమా చూడ‌డానికి ముందు నేను చూసిన కారిడార్ ఫైట్ సింగిల్ టేక్‌లో తీశారంట‌. మూడు రోజులు 17 టేక్‌లు తీస్తే.. ఫైన‌ల్‌గా ఒక టేక్‌ను తీసుకున్నారు. ఒక్క ముక్క కూడా ఎడిట్ చేయ‌లేదు. కేవలం హీరో వీపుపై దిగే క‌త్తి కోసం మాత్రమే గ్రాఫిక్ వ‌ర్క్ చేశారు. 

ఈడిప‌స్ క‌థ తెలిసుంటే సినిమాలో కంటెంట్ కూడా ఏమాత్రం ఇబ్బంది పెట్ట‌దు. మ‌స్ట్ వాచ‌బుల్ మూవీ(మై ఫీలింగ్‌).