Thursday, May 16, 2019

ఈ వాననిలా కురవనీ

టప్…..

టప్..  టప్..

రాత్రంతా కురిసిన వాన వెలిసింది. దాని జ్ఞాపకాలింకా ఇంటి పైనుంచి రాలుతున్నాయి. టప్..

బాల్కనీ నిండా నీళ్లు. తలుపు తెరిచే ఉండడంతో గదిలోపల సగందాకా తడిచి ఉంది. తడిచిన చాపమీదే మునగదీసుకుని పడుకుని ఉన్నాడు భాను. ఒకటే వాన వాసన.

తలుపు చప్పుడైంది. ఒకట్రెండు సార్లు చప్పుడయ్యాక ఆగిపోయింది. భాను పక్కనున్న ఫోన్ మోగడంతో.. వెంటనే లేచి ముందుగదిలోకెళ్లి తలుపు తీశాడు. ఎదురుగా విహారి. మళ్లీ వచ్చి పడుకున్నాడు.

‘లంజా కొడుకు.. రాత్రి ఆరు ప్యాక్లు కొట్టించాడు డార్లింగ్. అరగంట కూడా పడుకోలేదు.’

విహారి మాట్లాడుతుంటే పడుకునే వింటున్నాడు. చేతిలో ఉన్న క్యారీబ్యాగ్ షెల్ఫ్లో పెట్టాడు విహారి.

అవునూ రాత్రి అడగడం మర్చిపోయా.. ఢిల్లీవాలాకి హైదరాబాద్లో పనేంటబ్బా.?

కొద్ది సేపు గదిలో మౌనం.

ఓ ‘ఫ్రెండ్’ ని కలవాలి.. భాను లేచి బాత్ రూమ్లో దూరాడు.

అటువైపే ఓ క్షణం చూసి.. షెల్ఫ్లో పెట్టిన క్యారీబ్యాగ్ లోంచి ఓ ప్యాకెట్ తీసుకున్నాడు. రెండు నిమిషాల్లో ఇడ్లీ తినడం పూర్తిచేసి.. తడిచిన చాపని చుట్టి ఓ మూలకి ఆనించాడు. ముందు గదిలో బెడ్షీట్ పరుచుకుంటుంటే.. బాత్రూమ్ నుంచి భాను బైటకొచ్చాడు.

‘క్యారీబ్యాగ్ లో టిఫిన్ ఉంది. బైటకెళ్లే పనయితే బండి కీస్ అక్కడే ఉన్నాయి. నన్ను డిస్ట్రబ్ చెయ్యకే..’ విహారి ముసుగు తన్నేశాడు.

అద్దం ముందు నిల్చున్నాడు భాను. రఫ్ గా పెరిగిన గడ్డం తడుముతూ.. తన కళ్లలోకి తనే ఒకసారి చూసుకున్నాడు. వెంటనే తల దువ్వుకుని అద్దంలోంచి బైటపడ్డాడు. టవల్ తీసేసి హ్యాంగర్ పై ఉన్న జీన్స్ పాంట్ తగిలించుకున్నాడు. టీ షర్ట్ మార్చాల్సిన అవసరం లేదనిపించింది. క్యారీ బ్యాగ్ పక్కనే బండి తాళాలు.. తీసుకుందామా.. వద్దా..? ఆఖరిక్షణంలో వాటిని తీసుకుని తలుపు దగ్గరగా వేసి బైటకొచ్చేశాడు. మెట్లు దిగి మొబైల్లో టైమ్ చూసుకుంటే ఏడు దాటింది. గోడ పక్కనున్న బైక్ స్టార్ట్ చేసి రెండు సందులు తిరిగి నేరెడ్మెట్ బస్టాప్ చేరుకున్నాడు.

గాల్లో వాన వాసన ఇంకా పోలేదు. గుండెల్నిండా గాలి పీల్చుకుని బస్టాప్ బెంచ్ మీద కూర్చున్నాడు.

కాసేపటికి సిక్స్ టీన్-ఏ వచ్చింది. పదిమంది దిగారు. పాతికమంది ఎక్కారు.

అవతల వైపున్న బస్టాప్ లో థర్టీ సెవెన్-డి ఆగినట్టే ఆగి వెళ్లిపోయింది. కొంతమంది ఎక్కారు. ఇంకొందరు సగమే ఎక్కారు. మెట్లమీద నిలబడలేని కొన్ని కాళ్లు దిగిపోయాయి.

సమ్ ఏంజిల్స్.. సమ్ హార్సెస్..

అటు థర్టీఫోర్.. ఇటు ట్వంటీ ఫోర్-ఈ..

సెకన్లు.. నిమిషాలు.. గంటలు..

వచ్చీపోయే ప్రతి బస్సునీ చూస్తున్నాడు.

“మధు జాడ లేదు.”  తనని ఇక్కడే కలిశానని పావని చెప్పింది.

పన్నెండు దాటింది. బస్సుల రష్ తగ్గిపోయింది. పక్కనున్న కేఫ్లోకి వెళ్లినా బస్టాప్ వైపే చూపు ఉంచాడు. రెండు టీలు తాగి వచ్చి పాత బెంచీపైనే చేరాడు. మళ్లీ సెకన్లు.. నిమిషాలు.. గంటలు.. ‘అనుకుంటాంగానీ కాలం కొన్నిసార్లు మరీ మొండికేస్తుంది. ఆ క్షణాలు నరకం.’ ఏడాదిన్నరగా ఇలాంటి క్షణాలతోనే గడుపుతున్నాడు తను.


*       *       *

“మూడేళ్ల కిందట ఓ న్యూస్‌చానెల్‌లో జర్నలిస్టుగా చేరాడు భాను. తర్వాత ఏడాదికి మధు గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్లోకి వచ్చింది. తనని చూశాక భాను జీవితంలో ఓ కొత్త జోష్.  మధు మౌనం అతన్ని కట్టిపడేసింది. ఆమె చూపుల్లో లోతులు తెలియని లోకాలేవో కనిపించేవి. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు. అసలెవర్నీ దగ్గరికి రానిచ్చేది కాదు. ఎవరితో అయినా పనివరకే మాట్లాడేది. పావని ఒక్కదానితో అప్పుడప్పుడూ కనిపించేది. చేరిన ఆర్నెళ్లలోనే బెస్ట్ గ్రాఫిక్ డిజైనర్ గా పేరు తెచ్చుకుంది.

మధుని మాటల్లోకి దించేందుకు చాలా కష్టపడ్డాడు. ఆర్నెళ్ల కష్టం తర్వాత… భాను ఓయ్ అంటే, తను ఊ అనేది. క్రమంగా మధులో ఉన్న ఆడపిల్ల బైటపడింది. భానుతో కల్సి ఉన్నంతసేపు తను చిన్నపిల్లలా మారిపోయేది. పావనికి పెళ్లి అయి ఆఫీస్ నుంచి వెళ్లిపోయాక.. ఇద్దరూ మరింత దగ్గరయ్యారు. మధుతో ఉంటే గంటలు క్షణాల్లా గడిచిపోయేవి. చివరికి తన ప్రేమ విషయం చెప్పెయ్యాలనుకున్నాడు. ఓ రోజు ఈవెనింగ్ పార్క్కు రమ్మని ఫోన్ చేశాడు. గిఫ్ట్ షాప్‌కెళ్లి గంటసేపు వెదికి ఓ బహుమతి తీసుకున్నాడు. ప్యాక్ మీద తనే స్వయంగా.. ‘విత్ లవ్.. నీ భాను’. అని రాసుకున్నాడు.

దేవతలా వచ్చింది మధు. పార్కులో ముసురుకుంటున్న చీకట్లలోనూ మెరిసిపోతూ కనిపించింది. తనని చూసి మాటలు మర్చిపోయాడు. గిఫ్ట్ ప్యాక్ ని ఎడంచేత్తో వెనుక దాచాడు. పార్కులో ఓ బెంచ్‌పై కూర్చున్నాక.. ఎందుకు పిలిచావో చెప్పమంది. తెలిసిన విషయాన్ని తన నోటి నుంచి వినాలన్న ఆతృత ఆమె మాటల్లో ఉంది. కానీ ఏదో తెలియని భావం కూడా అందులో దాగుంది. భాను వెనకాడుతుంటే తనే అందుకుంది. ఆ స్వరంలో అంతకుముందున్నఅల్లరి స్థానాన్ని ఇప్పుడు ఒకరకమైన గాంభీర్యం ఆక్రమించుకుంది. చల్లటి గాలి చీకటిని కోస్తుంటే… ” నువ్వెప్పుడూ అంటూ ఉంటావే… నా మౌనం నీకు నచ్చుతుందని, ఆ మౌనం వెనుక కారణాలు నీకు తెలియవురా..!” చీకట్లో మధు ముఖం అస్పష్టంగా కనిపించినా… గొంతులో విషాదం స్పష్టంగా తెలుస్తోంది. ఏదో భయం భానులో చేరుతుంటే.. మధు మాట్లాడుతూ పోతోంది. నమ్మిన స్నేహితుడు, మరో ఇద్దరితో కల్సి తనపై చేసిన అత్యాచారాన్ని చెప్తుంటే.. భాను కాళ్లకింద భూమి బద్దలవలేదు కానీ, ఎడమచేతిలో ఉన్న గిఫ్ట్ ప్యాక్ జారి పడిపోయింది. చీకటి దాన్ని దాచేసింది. చెప్పాల్సినదంతా చెప్పాక కిందికి చూస్తూ ఉండిపోయింది మధు. భాను తలదించుకుని ఆలోచిస్తున్నాడు. చేతిలోంచి జారిపడిన గిఫ్ట్ ప్యాక్ మళ్లీ తీసుకోవాలనుకోలేదు. కాసేపటి తర్వాత వెళ్దాం అన్నట్టు లేచి నిలుచున్నాడు. మధు ఇంకా గతం తాలూకు విషాదంలోనే ఉంది. కొన్ని క్షణాలు అలాగే కూర్చున్నాక లేచింది. మౌనంగా మధు ముందు నడుస్తుంటే.. కొన్ని అడుగులు వెనగ్గా నడుస్తున్నాడు భాను”


*       *       *

హారన్ మోతతో ఈ లోకంలోకి వచ్చాడు భాను. బస్టాప్ కి కాస్త దూరంలో యాక్సిడెంట్. దెబ్బలు తగిలినా తగలనట్టే నటిస్తున్నారు. కానిస్టేబుల్ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాడు. పక్కన ఎవరో కూర్చున్నట్టు అనిపించింది భానుకి. చూస్తే విహారి. టీ తాగడానికి వచ్చినట్టున్నాడు.

ఫ్రెండ్ ని కలిశావా..?

‘————–‘  సమాధానం చెప్పకుండా నవ్వుతూ చూశాడు తనవైపు.

రూమ్ కి వెళ్దామా?..  భాను నుంచి సమాధానం లేదు.

‘ఎవరి కోసమో వెదుకుతున్నట్టున్నావ్.?’

‘వెదకడం లేదు.. ఎదురుచూస్తున్నా..’ విహారి కళ్లలోకి చూస్తూ చెప్పాడు భాను.

సరే చావు.. నే వెళ్తున్నా.

వెళ్లిపోయాడు విహారి.

రాత్రి పదయింది. రూమ్ కి చేరుకున్నాడు భాను. తనకోసమే ఎదురు చూస్తున్నట్టున్నాడు విహారి. ఎదురుగా టీచర్స్ ని పెట్టుకుని.. అప్పటికే ఒకరౌండ్ వేసినట్టున్నాడు. తను వెళ్లి పక్కనే కూర్చున్నాడు. గ్లాసులోకి బాటిల్ ఒంపి భానుకివ్వబోయాడు. కళ్లతోనే వద్దన్నాడు.

‘నీ కోసమే ఇవాళ వీక్ ఆఫ్ తీసుకున్నా.. ఫాలో ది టీచర్స్ డార్లింగ్. పాత ప్రపంచాలన్నీ బద్దలుకొట్టి.. సరికొత్త జీవితంలోకి దారి చూపిస్తారు’.

‘ఐ హేట్ టీచర్స్’ సూటిగా చూస్తూ చెప్పాడు భాను. నవ్వుతూ ఒక్క గుక్కలో గ్లాసు ఖాళీచేశాడు విహారి.

‘ప్రేమించుకున్నంత మాత్రాన.. ఇద్దరు ఎప్పటికీ కలిసి ఉండలేకపోవచ్చు. అదే జీవితం.’ మూతికంటిన విస్కీని నాలికతో  తుడుచుకున్నాడు.

‘అఫ్ కోర్స్.. కానీ నేను తనతోనే ఉన్నా… అందుకే ఎదురుచూస్తున్నా..’

అసలు వదిలేయడం ఎందుకు.. ఎదురుచూడటం ఎందుకు..?

‘తనతో కల్సి బతకడం భయమేసింది అప్పుడు.. ఇప్పుడు తను లేకుండా బతకడం భయమేస్తోంది. నేను ఎదురుచూస్తోంది, వెదుకుతోంది నా కోసమే. తనకోసం కాదు’.

ఈ మాటలు చెప్పేటప్పుడు భాను కళ్లలో సన్నటి నీటిపొర. కొంచెం ఆగి అన్నాడు.. అయామ్ ఏ ‘మిడిల్ క్లాస్ లవర్’ విహారీ.

కాసేపటి తర్వాత విహారి నిద్రలోకి జారుకున్నాడు. బాల్కనీలోంచి శూన్యంలోకి చూస్తూ నిల్చున్నాడు భాను..


*       *       *

“మధు గతం విన్నాక, ఇద్దరూ పార్క్ నుంచి బైటకొచ్చి బైక్ ఎక్కారు. హాస్టల్ దగ్గర మధు దిగాక.. బై చెప్పాడు. తను మాట్లాడలేదు.

రేపు ఆఫీస్ కి వస్తున్నావా అంటే.. ‘తను నవ్వింది. ఏదో చెప్తున్నట్టు’. భానుకి అర్ధం కాలేదు.

వెంటనే హాస్టల్ లోపలికి వెళ్లిపోయింది మధు. రాత్రి పడుకునే ముందు గుడ్‌నైట్ మెసేజ్ పెట్టాడు.  రిప్లయి లేదు. ఆఫీసుకి వెళ్లాక మాట్లాడొచ్చు అనుకున్నాడు. మరుసటిరోజు మధు ఆఫీసుకి రాలేదు. వాళ్ల ఇంచార్జ్‌ని అడిగితే తెలియదన్నాడు. తనూ ఫోన్లో ట్రై చేస్తున్నానని చెప్పాడు. మెయిల్ ఓపెన్ చేసి చూశాడు భాను.. నో మెసేజ్. తన ఆఖరి మెసేజ్.. తనకర్ధం కాని ఆ నవ్వేనని భానుకి తెలిసేసరికి ఆలస్యమయింది.

“ఆ తర్వాత అతనిలో చాలా మార్పొచ్చింది. అప్పుడప్పుడూ నిద్రలో ఉలిక్కిపడి లేచేవాడు. ఎప్పుడూ పరధ్యానంగా.. ఏ పనీ కరెక్టుగా చేయలేకపోయేవాడు. కారణం.. ఓటమి అలాంటిది. మనిషిని కృంగదీస్తుంది. మానసికంగా చంపుతుంటుంది. ఓటమి గురించి భానుకి స్పష్టంగా తెలుసు. కానీ ఎందులో, ఎలా ఓడిపోయానన్నదే అర్ధం కాలేదతనికి. తనని తాను ఎన్నోసార్లు ఈ ప్రశ్న వేసుకున్నాడు. అర్ధరాత్రుల్లో ఉలిక్కిపడి లేచినప్పుడూ, నిద్రపోకుండా గడిపిన సమయాల్లో ఈ ప్రశ్న మరీ బాధించేది. ఒక నిద్రలేని వేకువలో తన ప్రశ్నకు సమాధానం దొరికింది. ‘తను మనిషిగా ఓడిపోయాడు’. ఆ క్షణం స్వచ్ఛంగా ఏడ్చాడు భాను.”

తర్వాత రోజే హెచ్ఆర్ దగ్గరకెళ్లి మధు వాళ్ల ఊరి అడ్రస్ సంపాదించాడు. ఊరిచివర పాడుబడ్డ బడిలో మధు వాళ్ల నాన్నని కలిశాడు. తనపై అఘాయిత్యం చేసిన రాక్షసుల్ని మధు ఎలా ధైర్యంగా జైల్లో వేయించిందో చెప్పాడు. కానీ ఇంట్లో వదినల వేధింపులు, చుట్టుపక్కలవాళ్ల మాటలు తట్టుకోలేక ఇంట్లోంచి బైటకు వెళ్లిపోతుంటే నిస్సహాయంగా ఉండిపోయానన్నాడు.

తర్వాత ఆయనకు వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా వైజాగ్ వెళ్లి వెతికాడు భాను. కానీ మధుని కలుసుకోలేకపోయాడు. తన పరిస్థితి గమనించే ఆరునెలల క్రితం ఢిల్లీ పంపించారు ఆఫీస్ వాళ్లు. అక్కడే అనుకోకుండా పావని కలిసింది. మూడు నెలల క్రితం మధుని.. హైదరాబాద్, నేరెడ్ మెట్ లో కలిశానని పావనే చెప్పింది. అంతకుమించి వివరాలేమీ తెలియదంది.”


*       *       *

రోజు మారింది. అదే బస్టాప్. నిన్న ఉన్నంత హుషారు ఇవాళ లేదు భానులో. రేపు ఢిల్లీ వెళ్లిపోవాలి. ఉదయం నుంచీ బస్సులు వస్తున్నాయి పోతున్నాయి. మధు జాడ లేదు. సాయంత్రమైంది. కేఫ్ లోకి వెళ్లాడు. దో ఛాయ్.. ఆర్డరిచ్చాడు. ఎదురుగా ఉన్న పెద్దాయన నవ్వుతూ చూశాడు. రెండు టీలు తాగినా ఎందుకో నీరసంగా ఉంది. మళ్లీ బెంచీపైకి చేరాడు. మరో గంట గడిచింది. చీకటి పడుతోంది. నిన్నటినుంచి చూసిన వందలకొద్దీ ముఖాలు తనని చూసి నవ్వుతున్నట్టు ఫీలయ్యాడు భాను. ఇందాక నవ్విన పెద్దాయన కూడా గుర్తొచ్చాడు.

ఒక్కసారిగా అలర్టయ్యాడు. ఆయన్ని ఎక్కడో చూసినట్టుంది. ‘ఎక్కడ చూశాను..?’  పరిగెత్తుకుంటూ కేఫ్ లోకి వెళ్లాడు. అప్పటికే వెళ్లిపోయినట్టున్నాడు. ఎక్కడ చూశాను తనని.. మెదడు పగిలిపోయేలా ఆలోచించాడు. చాలా సేపటి తర్వాత స్ట్రయిక్ అయింది. ఓ సోషల్ అవేర్ నెస్ ప్రోగ్రామ్ కోసం.. మధుతో కల్సి అతనోసారి ఆఫీస్కి వచ్చినట్టు గుర్తొచ్చింది. నేరెడ్మెట్లోనే ఓ అనాధాశ్రమం నడుపుతున్నాడు. వెంటనే బైక్ స్టార్ట్ చేసి నిమిషాల్లో ఆశ్రమం చేరాడు. ఇందాకటి పెద్దాయన్ని కలిశాడు. మధు గురించి విన్నాక.. తమకు విరాళాలిచ్చే వాళ్ల రిజిస్టర్‌లు తీసి ఇద్దరూ పరిశీలించారు. పావని చెప్పిన తేదీన మాధవి పేరుతో పదివేలు రాసి ఉంది. అడ్రస్ కాలమ్ మాత్రం వదిలేసి కనిపించింది. తనకీ ఆ అమ్మాయి వివరాలు తెలియదన్న పెద్దాయన… అంతకుముందు కూడా తన పేరుతో ఏవైనా విరాళాలు వచ్చాయేమో చూసే పనిలో పడ్డాడు.

నిలువునా నిరాశ కమ్ముకుంటుండగా బైటకొచ్చి బెంచ్‌పై కూర్చున్నాడు భాను. అప్పుడే చీకట్లు కమ్ముకుంటున్నాయి. లేచివస్తుంటే వెనక నుంచి ఎవరో పిలిచారు. బండి కీస్ మర్చిపోలేదు కదా అని జేబులు తడుముకుంటుంటే ఆయనే దగ్గరకొచ్చాడు. ‘ఆ అమ్మాయి గురించి పార్వతమ్మ గారికి తెలిసుండొచ్చేమో.. ఈ విరాళాల వ్యవహారాలు  ఆవిడే చూసుకుంటుంది. హెల్త్ సరిగాలేక నెలరోజుల్నించీ రావడం లేదు’. అంటూ ఆమె అడ్రస్ ఇచ్చాడు. అరగంటలో ఆ అడ్రస్ కు చేరుకున్నాడు భాను. పెద్దగా కష్టపడకుండానే పార్వతమ్మ ఇళ్లు కనుక్కున్నాడు. ఆవిడే తలుపుతెరిచింది. వయస్సు అరవై పైనే ఉండొచ్చు. మధు గురించి చెప్పగానే… ఎవరు, ఏమిటీ అని అడక్కుండానే భానుని లోపలికి రమ్మంటూ తీసుకెళ్లింది. సోఫాలో కూర్చున్నాక మధు గురించి చెప్తూ వెళ్లింది. ‘చాలా మంచి పిల్లయ్యా. తను సంపాదిస్తున్నదాంట్లో ఎంతోకొంత సాయం చేయాలనుకుంటుంది. ఎందుకో మనుషుల మీద పెద్దగా ఆసక్తి చూపించదు. నాలో ఏంచూసిందో కానీ ఆప్యాయంగా మాట్లాడేది. తన గురించిన వివరాలు చెప్పేది కాదు గానీ, చాలా విషయాల గురించి మాట్లాడేది. ఆశ్రమానికి అప్పుడప్పుడూ వచ్చేది. ఇంతకు ముందోసారి నా కార్లోనే దించా తనని’ అని ఆగింది. అప్పటివరకూ శూన్యంలో మధుని ఊహించుకుంటున్న భాను… ఒక్కసారిగా ముందుకు ఒంగాడు. పార్వతమ్మ ఒక్క క్షణం ఊపిరి పీల్చుకుని మళ్లీ మాట్లాడ్డం మొదలుపెట్టింది. ‘ఇక్కడే మధురానగర్‌, వోరా టవర్స్ పక్క సందులో ఐదో ఇళ్లో, ఆరో ఇళ్లో..  తను అక్కడే అద్దెకుంటున్నానని చెప్పింది.’ లేచి పార్వతమ్మ పాదాల్ని చేత్తో తాకి వస్తానని చెప్పి బయలుదేరాడు భాను. క్షణాల్లో ఆమె చెప్పిన అడ్రస్ పట్టుకున్నాడు. మధు రూమ్ కి తాళం వేసి ఉంది.

‘ఆ అమ్మాయి పదింటికి కానీ రాదు..’ ఇంటి ఓనర్ మాటతో, టైమ్ చూశాడు. రాత్రి తొమ్మిదవుతోంది. ఇంకా గంట..

వర్షం వచ్చేలా ఉంది. మెయిన్ రోడ్ పైకొచ్చి దగ్గర్లో ఉన్న హోటల్ కెళ్లాడు. మూడు రోజుల తర్వాత ప్రశాంతంగా భోజనం చేశాడు. వెయిటర్ ని అడిగి ఓ పేపర్ తీసుకున్నాడు. ఏవేవో రాస్తూ కొట్టేస్తూ పోయాడు. చివరకు నలిపి పడేయబోయి.. ఎందుకో దాన్ని మడిచి జేబులో పెట్టుకున్నాడు.

రాత్రి 10:10

బైట సన్నటి జల్లు మొదలైంది. ఆ గది తలుపు దగ్గర ఒక్క క్షణం ఆగాడు భాను. ఏదో తెలియని అనుభూతి. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తోంది. తలుపు కొడదామని చెయ్యి వేశాడు. లోపల గడియ పెట్టకపోవడంతో దానంతటదే వెళ్లిపోయింది. ఎదురుగా మధు. నేలమీద కూర్చుని  ఏవో పేపర్స్ చూస్తూ ఉంది. తలుపు చప్పడుకి తలెత్తిచూసింది. ఒక్కక్షణం ఆమె కళ్లలో ఏదో వెలుగు కనిపించినట్టే కనిపించి మాయమైంది. మౌనంగా  లోపలికి వచ్చి కింద కూర్చున్నాడు తను. వర్షం పెద్దదవుతోంది.

కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత… “ఎలా ఉన్నావు” ప్రశ్నలో ఎలాంటి భావం కనిపించకుండా ఉండేందుకు ప్రయత్నించింది మధు. వానకి తోడు గాలి పెరిగింది. తలుపు కొట్టుకుంటుంటే.. కొక్కేన్ని కిందకు దించి కదలకుండా చేసింది. గాలితో పాటు చినుకులూ గది లోపలకు కొడ్తున్నాయి.

సమాధానం చెప్పకుండా చేత్తో నుదురునీ, ముఖాన్నీ రుద్దుకున్నాడు.

ఇంతలో తనే “ఎందుకొచ్చావు భానూ..?

దూరంగా ఎక్కడో పిడుగు పడ్డట్టుంది. భయంకరంగా ఉరిమింది ఆకాశం.

“నేనిక్కడ ప్రశాంతంగా బతుకుతున్నాను” లేని కర్కశత్వాన్ని బలవంతంగా గొంతులోకి తెచ్చుకుని పలికింది.

“వెళ్లిపో భాను” అంటూ తనవైపు చూసింది. భాను ముఖంలో ఎలాంటి భావమూ లేదు. గాలివాన హోరు పెరిగింది. ఒకటిన్నర సంవత్సరం నుంచి తనకు చెప్పాలనుకున్న వేలవేల మాటలు మౌనంగా మారిపోయాయి. మధు కళ్లలోకి చూస్తూ మౌనంగా అయినా సంభాషించాలనుకున్నాడు. కానీ చూపుల్ని పక్కకి తప్పించి.. కిటీకీలోంచి వర్షాన్ని చూస్తోంది తను. జేబులో మడిచిపెట్టిన పేపర్ తీసి తన ముందుంచాడు.  తనలో ఏ మార్పూ లేదు. కొన్ని క్షణాల తర్వాత భాను లేచాడు. మరోసారి మధుని చూశాడు. తను నిశ్చలంగా వర్షాన్ని చూస్తోంది. కదల్లేక కదులుతూ గదిలోంచి బైటకు వెళ్లిపోయాడు.

తను వెళ్లిన కొద్ది సేపటి తర్వాత.. పేపరు మడత విప్పింది. దాన్నిండా కొట్టివేతలు.

ఆఖరి వాక్యం మాత్రం అలాగే ఉంచాడు.

‘ఐ లవ్యూ మధు’.

కాగితంపై మధు కన్నీళ్లు పరుచుకుంటున్నాయి.

కంటి నరం తెగినట్టుంది. కన్నీరు కాలువ కట్టింది. ఏళ్లుగా గుండెళ్లో గూడుకట్టుకుపోయిన బాధంతా కళ్లలోంచి బైటకొస్తోంది. భాను గుర్తొచ్చి వెంటనే లేచింది. వెనుక గదిలోకి వెళ్లి వెంటనే బైటకొచ్చింది. చెప్పులు వేసుకోవడం కూడా మర్చిపోయింది. ఒక్క ఉదుటున బిల్డింగ్ పైనుంచి దిగి వీధిలోకి పరిగెత్తుకుంటూ వచ్చి చూసింది. వీధి చివరెక్కడో మలుపు తిరుగుతున్నాడు భాను. వర్షంలో మసగ్గా కనిపించాడు. భానూ… వెర్రిగా అరిచింది. వాన హోరులో ఆమె అరుపు కలిసిపోయింది. పరిగెత్తుకుంటూ రోడ్డుపైకొచ్చింది. భాను కనిపించలేదు.

కుంభవృష్టి దెబ్బకు రోడ్డుపై ఎవరూ లేరు. ఒకటీ అరా వాహనాలు తిరుగుతున్నాయి. వీధి లైట్లు ఎప్పుడు ఆరిపోతాయో అన్నట్టు వెలుగుతున్నాయి. కాస్త దూరంలో ఉన్న బస్టాప్ కు పిచ్చిదానిలా పరిగెత్తింది. అక్కడా అతను లేడు. వర్షంలో కన్నీళ్లు కనిపించకున్నా ఎగసిపడుతున్న గుండెలు.. ఆమె దుఃఖాన్ని దాచలేకపోతున్నాయి. హోరున కురుస్తున్న వర్షంలో కొద్దిసేపు అలాగే నిలుచుంది. ఇక తనని కలుసుకోలేనన్న బాధతో వెనక్కి తిరిగింది. కాస్త దూరంలో రోడ్డు పక్కన ఉన్నఓ షెడ్ కింద భాను. వణుకుతూ నిలుచుని ఉన్నాడు. రోడ్డుకీ తనకీ మధ్య గోడ ఉండడంతో.. అంతకుముందు కనిపించలేదు తను.   ఎదురుగా నడిచివస్తున్న మధుని భాను చూశాడు. ఆమె కళ్లలోంచి కన్నీళ్లింకా కారుతున్నాయి. దగ్గర కొచ్చాక నవ్వుతూ కుడిచేయి ముందుకు చాచింది తను. మధు చేతిలో గిఫ్ట్ ప్యాక్. పార్క్ లో భాను చేతినుంచి జారిపడ్డ గిఫ్ట్ ప్యాక్. దానిపై రేపర్ పాతబడినట్టుంది కానీ అక్షరాలు అలాగే ఉన్నాయి. ‘విత్ లవ్.. నీ భాను’.

ఫ్యాక్ తీసుకుని కొద్దిసేపు అలాగే చూశాడు. కళ్లలో నీళ్లు తిరుగుతుంటే.. మధుని దగ్గరకు తీసుకున్నాడు. ఇంకెప్పటికీ విడిచిపెట్టనన్నంత దగ్గరగా..!

వాన ఇంకా కురుస్తోంది.

కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ తేరుకున్నారు.

పద.. అంటూ కదిలాడు భాను.

వర్షం తగ్గనీ.. గడ్డం మీదుగా కారుతున్న నీటిచుక్కని తుడుచుకుంటూ అంది మధు.

తగ్గేదాకా ఉండాలంటే, ఇక్కడే ఆగిపోతామేమో.. చేయందించాడు భాను.

ఇద్దరూ నడుస్తూ.. హోరున కురుస్తున్న వర్షంలో కలిసిపోయారు.

('సారంగ' వెబ్ మ్యాగజీన్ లో ప్రచురితం)

సగంమనిషి

టీకప్పులోంచి పొగలు. సాసర్ లోకి వంచా. మూసీలో మురికినీళ్లు గుర్తొచ్చాయి. తాగాలనిపించలేదు. సాసర్ ని పక్కకి నెట్టి బేరర్ ని పిలిచా. డబ్బులిచ్చేసి బ్యాగ్ తీసుకుని బైటకొస్తుంటే.. ప్రొప్రయిటర్ డెస్క్ లోంచి రెండు కలువలు. ఐ లైనర్ మధ్యలోంచి నవ్వుతున్నాయి. టీ తాగినట్టనిపించింది.

ఎటెళ్లాలి..?

హాస్టల్ కి వెళ్లే మూడ్ లేదు. మూసీ వైపు తీసుకెళ్లాయి కాళ్లు. బ్రిడ్జి అంచునకూర్చుని వచ్చీపోయే వాహనాలు చూస్తున్నా. మధ్యమధ్యలో కేఫ్ వైపు కూడా.

ఇంకెంత సేపు ఎదురుచూడాలో.?

తనొచ్చేదాకా తప్పదా..

అసలొస్తాడా.. ఆల్రెడీ వచ్చేశాడా.. మనుషుల మొఖాలన్నీ ఒకేలా ఉన్నాయి. వచ్చినా గుర్తు పట్టేదెలా..?

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బైట కొన్న పర్స్ తీసి చూసుకున్నా. ఐదొందల నోటు.. కొన్ని పదులు.. చిల్లర. సీన్ చివరికొచ్చేసింది. మళ్లీ జేబులో పెట్టుకున్నా.

కేఫ్ కి కాస్త దూరంలో ఉన్న హాస్టల్ వైపు చూశా. సిటీకొచ్చి వారం దాటింది. నిజానికి వచ్చినరోజే నరేంద్రని కలవాలి. వారం తర్వాత కలుస్తానన్నాడు.

బ్యాగ్ లోంచి సర్టిఫికెట్లు తీశా. మాస్టర్ ఇన్ మాస్ కమ్యూనికేషన్స్. మాట్లాడ్డం రాకపోయినా డిగ్రీ వచ్చేసింది. జైలు నా జీవితాన్ని తినేసినా.. మాస్టర్ డిగ్రీ ఇచ్చింది.

ఫోన్ మోగడంతో సర్టిఫికెట్లు అలాగే బ్యాగ్ లోకి తోసి.. ఠక్కున పైకి లేచి కాల్ రిసీవ్ చేసుకున్నా. ఐదు నిమిషాల్లో వస్తున్నా అన్నాడు. ‘ఒకే సార్’ అని చెప్పి.. కాసేపు అటూ ఇటూ రోమింగ్ చేశా. మళ్లీ వచ్చి బ్రిడ్జి అంచునే జారబడ్డా. టైమ్ పది దాటినా పెద్దగా ఎండ లేదు.. వానొచ్చేంత మబ్బుల్లేవు. వాతావరణం చిరాకులో ఉన్నట్టుంది.

కాసేపట్లో కేఫ్ దగ్గర హోండా సిటీ ఆగింది. లేచి వెళ్లా. విండో ఓపెన్ చేసి అటూ ఇటూ చూస్తున్నాడతను. నన్ను చూసి ఆగాడు. నా వైపు వేలు చూపించి..శివ.. అని అడిగాడు.

అవును సర్…

బ్యాక్ డోర్ ఓపెన్ చేయడంతో.. లోపలికెక్కి కూర్చున్నా.

తనేం మాట్లాడకుండా డ్రైవ్ చేస్తున్నాడు. నా కంటే రెండు మూడేళ్లు ఎక్కువ వయసుండొచ్చు. కానీ అంతకంటే తక్కువగా కనిపిస్తున్నాడు. ఆ వయసుకే ఓ టీవీ చానల్ ఎండీ.

రేర్ వ్యూ మిర్రర్ లో నన్ను నేను చూసుకున్నా. ‘శిరీష’ గుర్తొచ్చింది. కారు వీండోలోంచి వెళ్లిపోతున్న దృశ్యాల్లా.. ఒంగోలులో ఉన్నరోజులు కళ్లముందుకొచ్చాయి. డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉండగా శిరీషతో పరిచయం. ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోగానే ఒంగోలులో ఓ ప్రైవేట్ జాబ్ లో చేరా. శిరీష వాళ్ల నాన్నని కలిస్తే.. పెళ్లి కుదరదన్నాడు. నిజం చెప్పాలంటే కులం కుదరలేదు. తనని నాతో తీసుకెళ్లిపోవాలనుకుని.. ఒకరోజు రాత్రి తనని కలవడానికి వెళ్లా. అంతకుముందు ఎన్నో సార్లు అలాగే కలుసుకున్నా తనని. ఆ రోజు అంతా రివర్సైంది. గోడ దూకేటప్పుడు.. పక్కింట్లోంచి ఒకాయన చూశాడు. దొంగా దొంగా అంటూ పట్టుకోబోతుంటే.. పక్కనే దొరికిన కర్రతో ఒక్కటిచ్చి పారిపోయాను.

మరుసటి రోజు సాయంత్రం పోలీసులు నేరుగా మా ఆఫీస్ కొచ్చారు. రాత్రి నేను కొట్టిన వ్యక్తి చనిపోయాడంట. ఒక్కరోజులో అంతా తల్లకిందులైపోయింది. దొంగతనానికొచ్చి ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశానని కేసు. శిరీష వాళ్ల నాన్నే సాక్ష్యం చెప్పాడు. తను నన్ను చూశానని. ఆ కాలనీలోని వాళ్ల కులపోళ్లంతా నా కేసుని ఓ ఉద్యమంగా మార్చారు. వాళ్ల చేతిలోని మీడియా నన్నో నరరూపరాక్షసుడిగా రాసింది. కోర్టులో నేనేం మాట్లాడలేకపోయాను. కావాలని తనని చంపలేదని.. తప్పించుకోడానికి మాత్రమే కొట్టి పారిపోయానని మాత్రమే చెప్పగలిగాను. ఓ మనిషి ప్రాణం తీశానన్న బాధో, పోలీసులు కొట్టిన దెబ్బల భయమో అంతకుమించి నన్ను మాట్లాడనివ్వలేదు. వీటన్నిటి కంటే మా అమ్మ కన్నీళ్లు నన్ను మరింత మౌనంగా మార్చాయి.

కులపంచాయతీ ముగిసి చివరికి తీర్పొచ్చింది.

ఏడేళ్లు.. ఏడు యుగాలు..

జైల్లో నేరస్తుల మధ్య నన్నో హాఫ్ క్రిమినల్ గా చూసుకునేవాణ్ని. అక్కడున్నవాళ్లు చేసిన నేరాలు, వాళ్లనుభవిస్తున్న శిక్షలు విన్నప్పుడల్లా.. నేను చేసిన పని పదేపదే గుర్తొచ్చేది. కొన్ని సార్లు నాకు సరైన శిక్షే పడిందనిపించేది. మరికొన్ని సమయాల్లో అసలు నేను తప్పు చేశానా అనిపించేది. కోర్టులకు అసలు నేరస్తుల్ని శిక్షించేంత అర్హత ఉందా.. ఎలాంటి ప్రభావాలకూ లొంగకుండాతీర్పులిచ్చే న్యాయమూర్తులుంటారా.. జవాబుల్లేని ఇలాంటి ప్రశ్నలెన్నో..! నిద్రలో ఉలిక్కిపడి లేచేవాణ్ని. ఒక్కోసారి నా కేసులో తీర్పు మార్చేసి ఉరితీస్తున్నట్లు కలొచ్చేది. మరోసారి కేసు రద్దుచేసి విడుదల చేస్తున్నట్టు. రెండిట్లో ఏది జరిగినా బాగుండనిపించేది. రెండూ జరగలేదు.

‘పోరాడేశక్తి ఉన్నవాళ్లు పైకోర్టుల్లో బేరమాడుతున్నారు. బేరమాడే శక్తి ఉన్నవాళ్లు నాణ్యమైన తీర్పు, నచ్చిన తీర్పు వచ్చేవరకూ పోరాడుతున్నారు. కోర్టుల్నే కొనేవాళ్లు తీర్పుని జీవితకాలం వాయిదావేయించుకుంటున్నారు. నాలాంటి ఏ కొందరో తీర్పుకి తలొంచుతున్నారు’.

జైల్లో పరిచయం అయిన చాలామంది.. వాళ్లు విడుదలయ్యేటప్పుడు, బైటకొచ్చాక కలవమని అడ్రస్ లు, ఫోన్ నంబర్ లు ఇచ్చేవాళ్లు. తెలిసో తెలియకో ఓసారి ఈ ప్రపంచంలోకి వచ్చా.. మళ్లీ ఇటు రాకూడదని ఎప్పుడో నిర్ణయించుకున్నా. జైలు నుంచే డిస్టెన్స్ లో పీజీ చేశా. విడుదలవడానికి కొద్దిరోజుల ముందు యాదగిరితో పరిచయమైంది. స్మగ్లింగ్ కేసులో జైలుకొచ్చాడు. తనే నరేంద్ర గురించి చెప్పాడు. హైదరాబాద్లో ఓ టీవీ చానల్ నడుపుతున్నాడని.. వెళ్లి కలవమని ఫోన్ నంబర్ ఇచ్చాడు.

‘హలో..’ అన్న పిలుపుతో నేనెక్కడున్నానో గుర్తొచ్చింది.

చేతులతో ఏదో మాట్లాడుతున్నాడు.. దిగమన్నట్టు.

కారు ఓ ఫామ్ హౌస్ ముందు ఆగి ఉంది. తను ముందు వెళ్తుంటే ఫాలో అయ్యా. లోపలకెళ్లాక కూర్చోమని సోఫా చూపించాడు. కేఫ్ దగ్గర్నుంచి చూస్తున్నా.. తను నాతో నోటితో మాట్లాడ్డం లేదు. చేతులతోనే సైగలు చేస్తున్నాడు. నాస్థాయి చూపించాలనో.. తన హోదా చూపించుకోవాలనో తాపత్రయం. నన్ను ఆఫీస్ కు కాకుండా ఇంతదూరం ఎందుకు తీసుకొచ్చాడో అర్ధం కావడం లేదు. బ్యాగ్ తీసి ముందుపెట్టుకున్నా. సర్టిఫికెట్స్ కోసం జిప్ తీయబోతుంటే..

నరేంద్ర మాట్లాడ్డం మొదలుపెట్టాడు. ‘యాదగిరితో మాట్లాడాను. నీ గురించి చెప్పాడు. అసలిది.. తనే చేయాల్సిన పని..’

బ్యాగ్ జిప్ తీయడం ఆపేశా.

‘నీకు తెలిసిన పనే’. ఒక్కక్షణం ఆగాడు.

‘కాకపోతే అప్పుడు ఒక్కరు.. ఇప్పుడు ఇద్దరు.. నిజానికి ఒకటిన్నరే..’ వేళ్లతో మళ్లీ సైగ.

తనని తొలిసారి స్పష్టంగా చూశా. ముఖంలో తోడేలు పోలికలు. నవ్వుతున్నాడు కానీ అదేదో వికృతంగా అనిపించింది.

నాలో ఏ భావమూ లేదు. అలా చూస్తుండిపోయా.

తనే మళ్లీ.. ‘పెద్ద కష్టమేం కాదు’. టేబుల్ మీదున్న వాటర్ బాటిల్ తీసుకున్నాడు.

‘డర్టీ బిచ్.. నన్నే మోసం చేస్తుందా..’ వాటర్ తాగి నావైపు చూశాడు. తన కళ్లలో ఎరుపుజీరలు. వెంటనే నవ్వు. లేచి అటూ ఇటూ రెండడుగులేసి.. ఓ స్లిప్ నాముందు పెట్టాడు.

‘నా ఇంటి అడ్రస్. కింద పార్కింగ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ లెఫ్ట్ సైడ్ బెడ్ రూమ్’.

నా కళ్లలోకి సూటిగా చూస్తూ.. ‘దొంగతనానికి వచ్చినట్టుండాలి.. పని జరిగిపోవాలి’.

అంటూ వేగంగా లోపలికెళ్లి వెంటనే తిరిగొచ్చాడు.

నా ముందున్న అడ్రస్ స్టిప్ పై.. రెండు ఐదువందల నోట్ల కట్టలు పెట్టాడు. లక్ష రూపాయలు.

‘అంతా ఓకే అయ్యాక మళ్లీ కనిపించు’.

ఒక్కసారి నరేంద్రవైపు చూశా. వెంటనే స్లిప్ తో పాటు నోట్లకట్టలు తీసుకున్నా.. బ్యాగు జిప్ తీసి సర్టిఫికెట్ల పక్కనే సర్దేశా.

ఏదో విరిగిపోతున్న చప్పుడు.. మనస్సు అనుకుంటా..!

తను మళ్లీ మాట్లాడలేదు. రెండు నిమిషాల తర్వాత మళ్లీ కారులో బయల్దేరాం. అరగంట తర్వాత కేఫ్ దగ్గర దించేశాడు. తనవైపు చూడకుండానే దిగేశా. వెంటనే కారెళ్లిపోయింది నామీదకి పొగచిమ్ముతూ..

టైమ్ మధ్యాహ్నం ఒంటిగంటవుతోంది. నేరుగా హాస్టల్ కెళ్లి నా గదిలో పడుకున్నా. రూమ్ మేట్స్ పేకాడుతున్నారు. ఒకతను మాత్రం స్క్రూడ్రైవర్ తీసుకుని సీపీయూతో కుస్తీ పడుతున్నాడు. కాసేపు పడుకుందామంటే నిద్రపట్టడం లేదు. అమ్మ గుర్తొచ్చింది.

‘జైలు నుంచి రిలీజయ్యాక నేరుగా ఇంటికెళ్లా. నెలకోసారి జైలుకొచ్చి చూసే అమ్మకి నేనేం కొత్తకాదు. నాకు మాత్రం ఆ వాతావరణం కొత్తగా అనిపించింది. రెండు రోజులు కూడా ఉండలేకపోయా. ఒకప్పుడు నాకు బాగా తెలిసిన మనుషులే.. నన్ను వింతగా చూస్తున్నారు. వాళ్లు నన్ను దూరం పెడ్తున్నారో.. నేనే దూరంగా ఉంటున్నానో అర్ధం కాలేదు. అక్కడ ఉండలేనని స్పష్టంగా అర్ధమయ్యాక.. హైదరాబాద్ రావాలని నిర్ణయించుకున్నా. జాబ్ చూసుకున్నాక తననీ తీసుకెళ్తానని చెప్పా. నమ్మకం కనిపించలేదు అమ్మలో. ముభావంగానే వెళ్లిరమ్మంది. ఇక్కడికొచ్చాక తొలి ఫోన్ నరేంద్రకు చేశా. తను లేటవుతుందని చెప్పాక.. డిగ్రీలో నాక్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు హైదరాబాద్ లోనే ఉన్నారని తెలిసి, వాళ్లని కలవడానికి ప్రయత్నించా. ఒకడు ఫోన్లో నా పేరు విన్నవింటనే కట్ చేశాడు. మరొకడు చాలాసేపటి తర్వాత గుర్తుపట్టాడు. ఆరోజే తనని కలిశా. జాబ్ అన్నమాట విన్నతర్వాత వాడి మాటతీరులో మార్పొచ్చింది. సరే చూస్తానన్నాడు కానీ, మరుసటిరోజే నంబర్ మార్చేశాడు’.

నరేంద్ర ఇచ్చిన అడ్రస్ స్లిప్ చేతిలోకి తీసుకున్నా. ‘మనిషిని చంపగలనా నేను. అందులోనూ స్త్రీని. అసలు డబ్బుతో పారిపోతే. ఏం జరుగుతుందో తెలుసు. మళ్లీ జైలుకే’. ఇక నిద్ర రాదనిపించింది.

స్లిప్ పర్స్ లో పెట్టుకుని హాస్టల్ నుంచి బైటకొచ్చా. మరో రెండు గంటల్లో అడ్రస్ పట్టుకున్నా. తను చెప్పిన ఆనవాళ్లున్న బిల్డింగ్ చుట్టూ రెండు రౌండ్లు కొట్టా. మనుషులెవరూ కనిపించలేదు. తిరిగి హాస్టల్ కొచ్చా.

రాత్రి పదకొండుదాటింది. గదిలో కంటే నాలో భయంకరమైన నిశ్శబ్దం ఆవరించుకుంది. సీపీయూ పార్ట్స్ పక్కనే ఉన్న స్క్రూడ్రైవర్ తీసుకున్నా. మరో గంటలో నరేంద్ర ఇంటిముందున్నా. వర్షం వస్తుందేమో అన్నట్టున్నవాతావరణం చీకటిని మరింత చిక్కగా చేస్తోంది.

మెయిన్ గేట్ తీసుకుని నేరుగా ఇంట్లోకి వెళ్లా. ఫస్ట్ ఫ్లోర్ లో అడుగుపెట్టా. ఎడమవైపున్న గదిలో బెడ్ లైట్ వెలుగుతోంది. డోర్ తీసే ఉంది. చప్పుడు చేయకుండా లోపలకు అడుగుపెట్టా. ఇద్దరూ నిద్రపోతున్నారు. మొదట నా చూపు బెడ్ మీద నిద్రపోతున్న పాపపై పడింది. ఆరేళ్ల వయసుంటుందేమో. మసక వెలుతురులోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకో దగ్గరనుంచి చూడాలనిపించి కిందికివంగా. అద్దంలో నన్ను చూసుకున్నట్టు అనిపించింది. రెండు క్షణాల తర్వాత తల పక్కకి తిప్పా. ఒక్కసారిగా ఊపిరి ఆగిపోతున్న సెన్సేషన్.

”శిరీష”

నా గుండె చప్పుడు నాకే వినిపిస్తోంది. కళ్లు తిరుగుతున్న భావం. వెంటనే వెనక్కి తిరిగా. గదిలోంచి వేగంగా బైటకొచ్చేశా. మరో ఆలోచన లేకుండా దూరంగా పారిపోవాలి. మెట్ల వైపు వెళ్లేంతలో.. ఎదురుగా నరేంద్ర. ఒక్క క్షణం ఏం చేయాలో తోచలేదు. మరుక్షణం నా చేతిలో ఉన్న స్క్రూ డ్రైవర్ నరేంద్ర కణతలోకి దూసుకుపోయింది. అంతే వేగంతో స్క్రూడ్రైవర్ బైటకు లాగి పరుగులాంటి నడకతో మెట్లుదిగి బైటకొచ్చా. క్షణాల్లో చీకట్లో కలిసిపోయా. లోపల్నించి అరుపులు వినిపిస్తున్నాయి. బైట వర్షం మొదలైంది.

రెండునెలల తర్వాత మూసీనది పక్కనే ఉన్న ఓ పార్క్ లో..

దూరంగా బెంచ్ పై కూర్చునుంది శిరీష. ప్రపంచంతో సంబంధం లేకుండా పాప ఆడుకుంటోంది. తననే చూస్తుండిపోయా. చిన్నప్పుడు నేనెలా ఉండేవాడినో అమ్మ చెప్పే మాటలు గుర్తొస్తున్నాయి..!

('సారంగ' వెబ్ మ్యాగజీన్ లో ప్రచురితం)

Friday, February 8, 2019

మేర్కు తొడార్చి మలై


శ్రమైక జీవన సౌందర్యం... 
తేరగా తిని కూర్చుని ఇలా ఎంతైనా వర్ణించొచ్చు. కానీ శ్రమలో ఉండే కష్టం చేసేవాడికి తెలుస్తుంది. ఎందుకంటే చేసేది ఎక్సర్ సైజ్ కాదు. పని. కానీ పైన చెప్పిన వర్ణన లాంటివే చెప్పి కూలీల శ్రమని దోచుకోవడం వ్యవస్థీకృతమైపోయిన కుట్ర. 
నీ అంత మొగోడు లేడురా, బరువు మొయ్యాలంటే నీ తర్వాతే ఎవుడైనా... 
ఈ రెండు ముక్కలు చాలు వాడు తన గుండెలు పగిలేంత వరకూ పనిచేయడానికి. 
మనం ఒక్క మునం నాటితే, అది మూడు మునాలు నాటుద్ది, దానితో మనమేడ చేస్తాం...
ఈ మూడు మాటలు చాలు ఆ పిల్ల నడుములు పోయేదాకా నాట్లేయడానికి. (మునం=సాలు)
రెండు పొగడ్తలతో ఒకరి చాకిరీని దోచుకుంటారు కానీ కూలీ ఇచ్చేటప్పుడు ఈ మాటలేవీ వినిపించవు. కూలి పని తమకి మెరుగైన బతుకు ఇవ్వదనుకుని తెలుసుకునే సరికి నడుములు వంగిపోయి ఉంటాయి, కండల్లో సత్తువ జారిపోయి ఉంటుంది. 

పశ్చిమ కనుమల పాదాల చెంత ఉండే పల్లెల్లోని కూలి బతుకుల‌పై తీసిన సినిమా 'మేర్కు తొడార్చి మలై'. సినిమాలో ప్రధాన పాత్రధారి రంగసామి ఓ పోర్టర్. కొండలపై బరువైన సరుకుల్ని, సమాచారాన్ని చేరవేసే పని. ఏడాదికో రెండేళ్లకో సరదాగా తిరుపతి కొండెక్కడమో, ట్రెక్కింగ్ కి వెళ్లడమో కాదు... సరైన దారి కూడా లేని అత్యంత ఎత్తైన కొండలపై ప్రతి రోజూ బరువైన బస్తాల్ని మోసుకుని ఎక్కడం దిగడం. ఆ బరువుల్ని మోసీ మోసీ గుండెలు పగిలి చనిపోయిన తోటి కూలీల్ని చూస్తూ పెరిగిన రంగసామికి ఉన్నదల్లా చిన్న కల. చారెడు నేలని వాళ్ల అమ్మ పేరుతో రిజిస్టర్ చేయించడం. కాస్తయినా వ్యవసాయ భూమిని సంపాదించాకే పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. ఆ కల నిజం కాకుండానే పెళ్లి చేసుకుంటాడు. అయితే ఎస్టేట్‌లో పనులు చేయించే కంగని ఉదారతతో భూమిని సంపాదించుకుంటాడు రంగసామి. కానీ ఆ కూలివాడి కలల్ని ఇండస్ట్రియలైజేషన్ ఎలా కూల్చేసిందనేదే ఈ సినిమా.

శ్రమనీ, ప్రేమని నిజాయితీగా పంచుకునే మనుషులు... 
డబ్బుని మాత్రమే తొలిప్రాధాన్యంగా భావించే మనుషులు...
మొదటి రకం మనుషుల వల్ల రంగసామి భూమిని సంపాదించుకుంటే, రెండో రకం మనుషుల వల్ల దాన్ని పోగొట్టుకుంటాడు. సినిమా ప్రారంభంలో కొండపైకి వెళ్లే సమయంలో ఏనుగుల గురించి మాట్లాడుకుంటుంటారు. తొలిసారి ఆ కొండపైకి వచ్చే ఒక వ్యక్తి ఏనుగుల భయం గురించి చెప్పే సమయంలో జరిగే చర్చ.. ఈ సినిమా ఐడియాలజీ ఏంటో చెప్పేస్తుంది. 

సినిమాలో నటుల ఎమోషన్స్ పట్టుకోవాలంటే క్లోజ్ షాట్సే ముఖ్యం. ఈ సంప్రదాయ మేకింగ్ స్టైల్ ని దర్శకుడు లెనిన్ భారతి బ్రేక్ చేశాడు. అత్యంత కీలక సన్నివేశాల్లో కూడా క్లోజ్ షాట్స్ జోలికి పోలేదు. ఏ ఒక్క క్యారెక్టర్ పైనా ఫోకస్ పెట్టకుండా మొత్తం సన్నివేశంతో సంబంధమున్న అందర్నీ చూపించడానికి ప్రయత్నించాడు. దాంతో మనం కూడా వాళ్లందరిలో ఒకరిలా ఆ సన్నివేశాన్ని దగ్గరగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. లెనిన్ ఈ ఆలోచనని తెరపై అద్భుతంగా చూపించడంలో తెని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ, ఇళయరాజా సంగీతం రెండూ ప్లస్ అయ్యాయి. సినిమాలో వచ్చే ఒక్కో ఏరియల్ షాట్ ఒక్కో రకమైన ఏమోషన్ ని పట్టిస్తుంది. చివరిలో రంగసామి తన పొలంలోనే వాచ్ మెన్ గా కూర్చున్నాక వచ్చే ఏరియల్ షాట్ ముందు వంద ఫైటింగ్ క్లైమాక్స్ లు కూడా పనికిరావు. ఇక పశ్చిమ కనుమలపై దిగులు మబ్బులేవో ఆవరించినట్టు ఇళయరాజా సంగీతం సినిమా ఎమోషన్ని మోసుకుంటూ వెళ్తుంది. ఆ దిగులు మబ్బులు చేసే సంగీత రొద మన చెవుల్లోకి దూరి కొన్నిసార్లు కళ్ల నుంచి కన్నీరై వస్తుంది. సినిమా అంతా చూసిన తర్వాత యూట్యూబ్ లో బీజీఎం వింటుంటే... కథ మొత్తం మళ్ళీ కళ్ల ముందు తిరుగుతూ కన్నీళ్లొచ్చాయి. నేల ఒక కలై, ఆ కల కలగానే మిగిలిపోయే కూలి బతుకు కథ ఈ సినిమా. 

నేల గురించి ఈ మధ్య కాలంలో రెండు సినిమాలు చూశాను ఒకటి కాలా, రెండు మేర్కు తొడార్చి మలై. రెండూ తమిళ సినిమాలే.

('మేర్కు తొడార్చి మలై' సినిమా చూసి రెండు రోజులైంది. వేరే సినిమా చూడాలని నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా అన్నీ వెతుకుతున్నా ఏదీ ఆనడం లేదు. ఈ సినిమా వదలడం లేదు. ఇది రాశాక కాస్త బరువు దిగుతుందేమో.)

Saturday, January 26, 2019

రోమా


గతించిపోయిన జీవితం తిరిగిరాదు... వదిలీ వెళ్లదు. మరీముఖ్యంగా బాల్యపు జ్ఞాపకాలు అంత తేలిగ్గా ఎరేజ్ కావు. ప్రపంచాన్ని, మనుషుల్ని, జీవితపు ప్రతి అనుభూతినీ ప్రేమించడం తెలిస్తే ఏ దశలోని జ్ఞాపకాలూ ఎరేజ్ కావేమో.! 

తన బాల్యపు జ్ఞాపకాల్ని, దానితో ముడిపడిన స్థలాన్ని సినిమాగా తీశాడు అల్ఫాన్సో క్వడాన్. ఈ ఆటోబయోగ్రఫీ లాంటి మూవీలో తల్లినో తండ్రినో ప్రధాన పాత్రధారిగా ఎంచుకోలేదు. ఇంటి పనిమనిషిని ప్రధాన పాత్రదారిని చేశాడు. ఆమెకే ఈ సినిమాని అంకితం ఇచ్చాడు. పనిమనిషి క్లియోతో పాటు, తనదైన కెమెరా పనితనంతో ఈ సినిమాని నడిపించాడు. ఓపెనింగ్ షాట్‌లో తన ఇంటి గచ్చుపై, ఆకాశంలో వెళ్లే విమానాన్ని అద్భుతంగా చూపిస్తాడు క్వడాన్. అదే విమానం ఎగిరిపోతున్న షాట్ తో సినిమా ముగిస్తాడు. మధ్యలో క్లియో జీవితం సాక్ష్యంగా స్త్రీల స్థితిని తెరపై ఆవిష్కరించాడు. క్లియో మృతశిశువుని ప్రసవించే సన్నివేశం నాకైతే కన్నీళ్లు తెప్పించింది. ఈ నాలుగు ముక్కలు రాసేలా చేసింది. ఓ సన్నివేశంలో తన భర్త ఇక తిరిగిరాడని స్పష్టంగా తెలిసిపోయిన ఇంటి యజమానురాలు సోఫియా చెప్పే డైలాగ్ "విమెన్ ఆర్ ఆల్వేస్ ఎలోన్" ఈ సినిమా ఆత్మగా అనిపిస్తుంది. క్లైమాక్స్ లో సముద్రంలోకి క్లియో వెళ్లేటప్పుడు పారలల్గా కెమెరా నడిపిస్తూ తీసిన విధానం సూపర్బ్.

(మ‌న‌కేమాత్రం సంబంధం లేని వాతావ‌ర‌ణం కాబ‌ట్టి మొద‌ట్లో కాస్త బోర్ కొడుతుంది. బ‌ట్ డోంట్ మిస్ దిస్ బ్లాక్ అండ్ వైట్ ఎపిక్. నెట్ ఫ్లిక్స్ దాత వినోద్‌కి థ్యాంక్యూ.)

Sunday, January 13, 2019

రక్తరత్న - రాబందు

ఏడో తరగతి ఫెయిలై బర్రెలు కాసుకుంటున్న రాయపాటి సుబ్బారావు మంచి మాటకారి. తను చెప్పే కట్టుకథల్ని వినడానికి అతగాడు కాచే బర్రెలన్నీ చెవులు కోసుకునేయి. మేత కూడా మేయకుండా కథలతోనే కడుపునింపుకునేయి. తన తోటి సావాసగాళ్లు కాసే గొర్రెలు కూడా సుబ్బారావు కథలంటే పడిచచ్చిపోయేవి. గొర్రెలు బర్రెల మౌత్ పబ్లిసిటీతో సుబ్బారావు ఖ్యాతి వాళ్ల కులమంతా పాకింది. దాంతో వాళ్ల కులపోడే అయిన ఓ ర‌చ‌యిత‌ ద‌గ్గ‌ర‌ సుబ్బారావుని అసిస్టెంటుగా పెట్టించారు కుల‌సంఘం త‌ర‌ఫున‌. చేరిన నాలుగు రోజులకే సినిమా శాస్త్రాన్ని ఆమూలాగ్రం చదివేశానని డిసైడయిన సుబ్బారావు గురువుకి శ‌ఠ‌గోపం పెట్టి సొంత కుంపటి పెట్టాడు. అదే వేగంతో దర్శకుడిగా సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. గోడమీద బొమ్మలు ఎగరడమే సినిమా అనుకునే తెలుగు ప్రేక్షకులకి రాయపాటి సుబ్బారావు తీసిన తొలిసినిమా పిచ్చపిచ్చగా నచ్చింది. కారణం ఆ సినిమాలో బొమ్మలు మాత్రమే ఎగరలేదు. వాటి తలకాయలు కూడా ఎగిరాయి. సినిమా పేర్లు పడినప్పటి నుంచి ఎండ్ కార్డ్స్ పడేదాకా ఏదో ఒక తలకాయ ఎగురుతూనే ఉంది. తెర మొత్తం ఎర్రగా నెత్తురు పులిమేశాడు సుబ్బారావు. హీరో చేత్తోనే తలకాయలు నరుకుతాడు ఈ సినిమాలో. వాళ్లింటో కూరగాయలకి బదులు తలకాయలే తరుగుతుంటారు. పాటల్లో కూడా హీరో హీరోయిన్లు ఒకర్నొకరు రక్కుకుంటూ రక్తాలు కారేలా డ్యాన్స్‌లు చేశారు. సినిమాలో హీరో నుంచి జూనియర్ ఆర్టిస్ట్ వరకూ అందరూ కత్తులు పట్టుకునే తిరుగుతుంటారు. సినిమా స్టార్టింగ్‌లో హీరో ఎగరకొట్టిన తల ఎండింగ్‌లో కింద పడుతుంది. అదే క్లైమాక్స్ ట్విస్ట్. సినిమా చూసినంతసేపూ థియేటర్లో జనాలు చప్పట్లు ఈలలకు బదులు తొడలు కొట్టుకుంటూ ఎంజాయ్ చేశారు. కొంత‌మంది త‌ల‌లు కూడా ప‌గ‌ల‌గొట్టుకుంటారు. దెబ్బకి సుబ్బారావుకి రక్తరత్న అని బిరుదిచ్చేశారు ప్రేక్షకరత్నాలు. నటన అంటే ఒళ్లంతా ఇరగదీసుకుంటూ ఎక్సర్‌సైజులు చేయడమే అని ఫిక్స్ అయిపోయిన హీరోలంతా రక్తరత్న దర్శకత్వంలో సినిమాలు చేయడానికి ఎగబడ్డారు. అయితే వాళ్ల కులపోళ్లకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడంతో కొంతమందికి రక్తరత్న దర్శకత్వంలో రక్తపిశాచాలు అయ్యే అవకాశం రాలేదు.

రక్తరత్న పేరుప్రఖ్యాతులు ఫిలిం నగర్లో వీధివీధికీ ఎగరడంతో... సినిమా పరిశ్రమని శాసిస్తున్న మరో కులపు ఎగిరేస్టార్ పుత్రరత్నం ఆలోచనలో పడ్డాడు. చేస్తే గీస్తే అతనితోనే తన తర్వాత ప్రాజెక్ట్ చేయాలని తండ్రికి చెప్పాడు. 
"రేయ్ ఒళ్లు ఇరగదీసుకోవడంలో మనమే కింగ్‌లం సినిమా పరిశ్రమలో. దాన్ని వదిలేసి ఇలా రక్తపిశాచిలా మారడం అవసరమా అన్నాడు" ఆ పెద్దాయన. 
"ఇరగదీసుకుని ఇరగదీసుకుని ఒళ్లంతా పులిసిపోతోంది డాడీ. ఈ రక్తకోలాతో దాన్ని కాస్త తగ్గించుకోవచ్చు. పైగా తెరంతా రక్తం కనిపించడం, తలకాయలు ఎగురుతూ ఉండడం ఇప్పటి ట్రెండ్ డాడీ" అంటూ ఎలాగోలా ఎగిరేస్టార్ ని ఒప్పించాడు. 
కథ చెప్పడానికి వచ్చిన రాయపాటి సుబ్బారావు గొంతుని కత్తితో సవరించుకుంటుంటే.. మధ్యలోనే ఆపేశాడు జూనియర్ ఎగిరేస్టార్. 
"కథంతా అక్కర్లేదు. తలకాయలు ఎగిరే సీన్లలో హైలెట్లు చెప్పండి చాలు అన్నాడు". 
దాంతో సినిమా మధ్యలో వచ్చే రక్తభరిత సన్నివేశాన్ని వివరించాడు రక్తరత్న. 
ఆ సీన్ లో "హీరో చేతుల్లో కత్తులు పెట్టి ఇనపగొలుసులతో కట్టేస్తారు విలన్లు. వాటిని నోటితో కొరికి తెంచుకున్న హీరో... ఇద్దరు విలన్ల తలల్ని కంటిచూపుతో నరికేస్తాడు. ఎగిరిన తలల్ని అక్కడే ఎగురుతున్న రాబందు ఎగరేసుకుని పోతుంది. ఆ తలల కోసం విలన్ల మొండేలు గాలిలోకి ఎగురుతాయి. వాళ్లకి తలలు దొరక్కుండా రాబందు పైకెక్కి సవారీ చేస్తాడు హీరో. రాబందుపై గాలిలో దూసుకెళ్తున్న హీరోని, మరో రాబందుపైకి ఎక్కి హీరోయిన్ ఫాలో అవుతుంది. ఇద్దరి మద్య మేఘాల్లో డ్యూయెట్. రెండు తలల్ని బంతుల్లా విసురుకుంటూ డ్యూయెట్ పాడుతారు హీరో హీరోయిన్లు. పాట అయిపోగానే హీరోయిన్ మాయం అయిపోతుంది. అదంతా కలని తెలుసుకుని కళ్లనిండా నిప్పులు కక్కుతాడు హీరో. ఆ నిప్పుల్లో విలన్ల తలలు రెండూ మాడి మసయిపోతాయి. ఇక్కడ ఇంటర్వెల్ బ్యాంగ్."
అప్పటిదాకా కథ అనే యుద్ధం చేస్తున్న రక్తరత్న కూడా విరామం తీసుకున్నాడు. అటు ఊహల్లో రాబందులపై సవారీ చేస్తున్న హీరో... తన్మయత్వంతో రాయపాటి సుబ్బారావు వైపు చూశాడు. త‌న క‌ళ్ల‌నించి ఆనంద‌భాష్పాలు. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకూ గుర్రాలపై సవారీ చూశారు. తొలిసారి రాబందుపై సవారీ ట్రెండ్ సెట్ చేస్తుందన్నాడు రక్తరత్న. సెకండాఫ్‌లో పూర్తిగా రాబందుపైనే తిరుగుతుంటాడు హీరో. క్లైమాక్స్ ఈ సీన్‌ని మించి ఉంటుంది. సినిమా మొదలయ్యాక దాన్ని ప్లాన్ చేస్తాం అన్నాడు రక్తరత్న. హీరోయిన్ పూర్తిగా పాటల్లో మాత్రమే వచ్చి వెళ్తుంటుంది. దాని వెనకే అసలైన ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ క్లైమాక్స్‌లో తెలుస్తుంది. హీరో ఎక్కి తిరుగుతున్న రాబందే హీరోయిన్ అని తెలుస్తుంది. చ‌నిపోయిన హీరోయిన్ ఆత్మ రాబందులో ఉంటుంది. అలా లాజిక్ కూడా కవర్ చేస్తాం. ఇంకా ఇందులో హీరో ట్వల్వ్ ప్యాక్స్ తో కనిపిస్తాడు. ర‌క్తర‌త్న మాట‌ల‌తో అర్ధంకాక అయోమయంగా చూశాడు జూనియర్ ఎగిరేస్టార్. ఆరు ముందు ఆరు వెనక అన్నాడు రక్త రత్న. వెనక ప్యాక్స్ గ్రాఫిక్స్‌తో మ్యానేజ్ చేస్తామన్నాడు. ఊహించుకోవడానికే అద్భుతంగా ఉంది హీరోకి. వెంటనే ఓకే చేశాడు సినిమాని. మరుసటి రోజు పేపర్లన్నింటిలో ఒకటే హెడ్ లైన్... రక్తరత్న, జూనియర్ ఎగిరేస్టార్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న "పరమ పిశాచ పావన".

(ఒక సినిమా ట్రయిలర్ చూసిన తన్మయత్వంతో తిక్కరేగి ఇలా రాయాలనిపించింది.)

Monday, August 20, 2018

దెయ్యంతో ప్రయాణం

నేను ఇర్లపాడులో ఇంటర్ చదివేటప్పుడు. అప్పటికి మా ఊరికింకా తార్రోడ్డు లేదు. ఊరికి వెళ్లాలంటే ఎర్రబస్సే దిక్కు. ఇర్లపాడు నుంచి వెళ్లాలంటే ఆఖరి బస్సు రాత్రి 9గంటలకి. దానికి వెళ్లొచ్చనే సాయంత్రం బస్సుకి పోలేదు.  9గంటలకి బస్సు రాలేదు. గతుకుల రోడ్డుపై యాడనో చెడిపోయినట్టుంది. దాని కోసమే ఉన్న ఒకరిద్దరు ప్యాసింజర్లు ఇంకో గంట చూసి ఇళ్లకి వెళ్లిపోయారు. నేను కచ్చితంగా ఊరికెళ్లాలి. 

పిండారబోసినట్టు వెన్నెల. నడవడం నాక్కొంచెం సరదానే. కానీ చీకట్లో అంత దూరం ఎప్పుడూ వెళ్లలేదు. వెన్నెలే క‌దా అని బ‌య‌లుదేరా. త‌ర్వాతే తెలిసింది వెన్నేలే ఎక్కువ భ‌య‌పెడుతుంద‌ని. చిమ్మ‌చీక‌ట్లో అయితే దారి త‌ప్ప మ‌రోదానిపై మ‌నం దృష్టి పెట్టం. వెన్నెల్లో చుట్టూ ఉన్న చెట్లు, నీడ‌లు అన్నీ నా క‌ళ్ల‌లోకి చొర‌బ‌డుతున్నాయి. చెట్లు నల్లటి భూతాల్లా, వాటి మధ్యలో ఉన్న సందులు తెల్లటి ప్రేతాల్లా కనిపిస్తున్నాయి. రోడ్డు అయితే పొడుగాటి దెయ్యం పడుకున్నట్టుంది. 

వెన్నెల్లో ఎవరైనా తోడుంటే చుట్టూ ఉండేవన్నీ అందంగా క‌నిపిస్తాయి. ఒంట‌రిగా ఉన్న‌ప్పుడే దెయ్యాల్లా క‌నిపిస్తాయి. "మ‌రి దెయ్య‌మే తోడు వ‌స్తే..."

భూతాలు ఇలా ఉంటాయని చంద‌మామ‌, బాల‌మిత్ర క‌థ‌ల్లో చ‌ద‌వ‌డ‌మే త‌ప్ప పెద్ద‌గా తెలియ‌దు. మా నాన్న చాలా సార్లు ఇలా అర్ధ‌రాత్రుల్లో న‌డిచొచ్చేవాడు. త‌ను దెయ్యాల్ని చాలాసార్లు చూశాన‌ని, వాటితో మాట్లాడాన‌ని చెప్పేవాడు. బీడీ తాగడానికి నిప్పు కూడా ఇచ్చాయనేవాడు. తాగిన మత్తులో ఆయనేదో వాగుతున్నాడని అనుకున్నా... అందులో నిజముందేమో అని కూడా అనిపించేది. నా విష‌యానికొస్తే దేవుడు లేడ‌ని చాలా చిన్న‌ప్పుడే ఓ న‌మ్మ‌కానికి వ‌చ్చినా... దెయ్యం మీద మాత్రం నా భ‌యం ఇప్ప‌టికీ పోలేదు. భయం అని కూడా కాదు. అదో ముచ్చట అనుకోవచ్చేమో. దెయ్యం శాశ్వ‌తం దేవుడు మూఢ‌న‌మ్మ‌కం అనేది నా గుడ్డిన‌మ్మ‌కం. నిజానికి దేవుడి గురించి ఈ మాత్రం మాట్లాడ్డం అంటేనే పెద్ద పెంట విష‌యం నాకు. అందరికీ దేవుడ్ని చూడాలనే కోరిక ఉన్నట్టే, నాకు దెయ్యాన్ని చూడాలని కోరిక. అదే నాతో ఇలా ఈ అప‌రాత్రి న‌డిపిస్తుందేమో. 

ఇలా నాలో నేను ఊహించుకుంటూనే మొండోడి బండ దాటినా. కానీ కోదండ‌రామాపురం వ‌చ్చేస‌రికి భయం మొదలైంది. దెయ్యం గురించి కాదు. ఆ ఊళ్లో రోడ్డు నిండా కుక్క‌లుంటాయి. ఎందుకైనా మంచిదని న‌డుముకున్న బెల్ట్ తీసి చేత్తో ప‌ట్టుకున్నా. ఊరంతా మంచి నిద్ర‌లో ఉంది. కీచురాళ్ల గోల త‌ప్ప ఇంకే చ‌ప్పుడు లేదు. వెన్నెల్లో ఊరి స‌త్రం ద‌గ్గ‌రున్న మ‌ర్రిచెట్టు బ్రహ్మరాక్షసుడిలా ఉంది. స‌త్రం ద‌గ్గ‌ర‌కి వ‌చ్చేసరికి అర్ధ‌మైంది. అక్క‌డ కుక్కలేం లేవ‌ని. నాకే న‌మ్మబుద్ధి కాలేదు. ఏదో ఒకటి. గండం గ‌డిచింది చాల‌నుకుని వేగంగా ఊరు దాటా. 

కోదండ‌రామాపురం దాటినాక నుంచే అస‌లు భ‌యం మొద‌లైంది. మ‌రో కిలోమీట‌ర్ త‌ర్వాత మ‌న్న‌మోడి క‌ట్ట వ‌స్తది. మా ఊరి పొలిమేర అది. అక్క‌డ పున్న‌మి రాత్రుల్లో దెయ్యాలు పెళ్లిళ్లు చేసుకుంటాయ‌ని, క‌ట్ట‌మీద కొరివి దెయ్యాలు కాపాలా ఉంటాయ‌ని చెప్పుకుంటారు. దెయ్యాల మాటేమో గానీ క‌ట్ట ద‌గ్గ‌ర వ‌రుస‌గా ఉన్న తాడిచెట్లే రాకాసుల్లాగా ఊగుతున్నాయి గాలికి. కోదండరామ‌పురం నుంచి మ‌న్న‌మోడి క‌ట్ట దాకా చెట్ట‌న్న‌దే లేదు. కట్ట దగ్గర మాత్రం ఒక్కసారిగా గోడ కట్టినట్టు తాడి చెట్లు. చీక‌ట్లో చుట్టూ చెట్లు ఉంటే ఎంత భ‌యంగా ఉంటుందో.. ఇలా ఎడారిలా ఉన్నా అంతే భ‌యంక‌రంగా ఉంటుంది. దూరం నుంచి గాలికి ఊగుతున్న తాడిచెట్లు నా వైపే నడిచి వస్తున్నట్టు కనిపిస్తున్నాయి. వాటినే చూస్తూ న‌డుస్తున్న నాకు.. "నా వెన‌కెవ‌రో న‌డుస్తున్నట్టు అనిపించింది." 

అలాగే కొంచెం దూరం న‌డిచినాక అనుమానం ఇంకా ఎక్కువైంది. న‌డుస్తున్న‌వాడిన‌ల్లా ఒక్క‌సారి ఆగా. "వెన‌క నుంచి చ‌ప్పుడు ఆగిపోయింది."

తిరిగి చూడ్డానికి ధైర్యం చాల్లా. ఒక్క క్ష‌ణం ఆగి మ‌ళ్లీ న‌డ‌క మొద‌లుపెట్టా. అడుగుల‌ చ‌ప్పుడు తిరిగి మొద‌లైంది. ఆ చ‌ప్పుడు చాలా ల‌య‌బ‌ద్దంగా ఉంది. మనిషి పాదాల్లాగా బ‌రువుగా నేల‌ని తాక‌డం లేదు ఆ పాదాలు. సుతిమెత్త‌గా తాకుతున్న‌ట్టుంది. గాలి కూడా పెరిగింది. వెన‌క నుంచి చ‌ల్ల‌టిగాలి నా వెన్నుని తాకిన‌ప్పుడ‌ల్లా ఒళ్లంతా జ‌ల‌ద‌రిస్తోంది. అంత గాల్లో కూడా నా ఒళ్లంతా చెమ‌ట్లు ప‌ట్టాయి. భ‌యంతో న‌డ‌క‌లో వేగం త‌గ్గిపోయింది. "వెన‌క వ‌చ్చేది ఎవ‌రు." దెయ్య‌మా... లేక దెయ్యాలా...? ఎందుకంటే పాదాల చ‌ప్పుడు అలా ఉంది. ఒక‌రా ఇద్ద‌రా ముగ్గురా అనేది తెలియ‌డం లేదు. 

మ‌న్న‌మోడి క‌ట్ట ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర‌కి వ‌చ్చేదాకా ఓపిక ప‌ట్టా. ఇంగ నా వ‌ల్ల కాలేదు. 
ఒక్క‌సారిగా ఆగా. చ‌ప్పుడు మ‌ళ్లీ ఆగిపోయింది. 
వెన‌క్కి తిరిగి చూడాలా... వ‌ద్దా...? రెండు క్ష‌ణాలు ఆలోచించా. 
ధైర్యం అంతా కూడ‌గ‌ట్టుకున్నా. 
మ‌న్న‌మోడి క‌ట్ట‌మీద ఉండాల్సిన కొరివిదెయ్యాలు నా వెన‌కే ఉన్న‌ట్టు అనిపిస్తున్నాయి. 
వెన‌క్కి తిరగాలా... వ‌ద్దా...
నా ఊపిరి శ‌బ్దమే నాకు నక్క ఊళలా వినిపిస్తోంది.
ఏదైతే అద‌వుతుంద‌ని మెల్ల‌గా తిరిగా. 
అలా తిరిగేట‌ప్పుడు నా కాలు రాయి మీద ప‌డి బెసికిన‌ట్టు అవ‌డంతో కిందకి వంగిపోయా.
అంతే... 
భౌ... అంటూ కుక్క‌. గీపెట్టి అరిచింది. 
చుట్టూ ఉన్న నిశ్శబ్దంలో కుక్క అరుపు గింగిరాలు తిరుగుతూ ప్రతిధ్వనించింది. 
నా గుండెకాయ గొంతులోకి వ‌చ్చింది. ముడ్డిపూసలో నుంచి ముచ్చింగుంత దాకా షాక్ కొట్టినట్టు వణుకు. 
అంత భ‌యంలో నా చేతిలో ఉన్న బెల్టుని కుక్క‌కేసి విసిరా. గురిచూసినట్టు దాని మూతిమీద త‌గిలింది. కుయ్యిమంటూ వెన‌క్కి తిరిగి  ప‌రిగెత్తింది కోదండరామాపురం వైపు. 

షాక్ నుంచి తేరుకోవ‌డానికి రెండు నిమిషాలు ప‌ట్టింది నాకు. రోడ్డు మీదే కూర్చుని కుక్క వెళ్లిన వైపే కాసేపు చూశా. నిదానంగా లేచి మా ఊరివైపు నడిచా. ఆ షాక్ దెబ్బకి నాకు మన్నమోడి కట్ట గుర్తే లేకుండా పోయింది. కట్ట దగ్గర కొరివిదయ్యాల సంగతీ మర్చిపోయా. అలాగే నడుచుకుంటూ ఊరికి చేరుకున్నా. అప్పటికే మావోళ్లంతా నిద్రపొయినట్టున్నారు. వాళ్లని లేపడం ఎందుకులే అని, బైట కనిపించిన దుప్పటి తీసుకుని మిద్దె మీదకెక్కి పడుకున్నా. మరుసటి రోజు, పొద్దు నామీదకి వచ్చేదాకా నిద్రపోయా. 

ఇది జరిగాక నాకు దెయ్యంపై మరింత నమ్మకం పెరిగింది. దేవుడు సర్వాంతర్యామి అనేది అబద్ధం. దెయ్యం సర్వాంతర్యామి. "అదే భయం."

Monday, October 2, 2017

ఒన్ ఫ్లూ ఓవ‌ర్ ద‌ కుకూస్ నెస్ట్‌

వాల్డ్ ఈజే మెంట‌లాస్పిట‌ల్‌. త‌లొంచావా.. యు ఆర్ లాక్డ్‌. అందుకే జ‌స్ట్ పిస్ ఆన్ ఇట్స్ ఫేస్‌. ఇంకా చాత‌నైతే నోట్లో పొయ్యి. వెనెవ‌ర్ యు వాంట్ టు ఎస్కేప్‌. జ‌స్ట్ డూ ద‌ట్‌. లేదంటే నీ గుడ్డు ప‌గ‌ల‌కొట్టేస్తారు. (గుడ్డు అంటే గుడ్డు కాదు.) ప్ర‌పంచం పిచ్చాసుప‌త్రి మాత్ర‌మే కాదు చాలా విశాల‌మైంది కూడా. పాత మాట అని కొత్త‌గా ట్రై చెయ్య‌లేని పిరికి వాళ్లు చెప్పొచ్చు. బంధాలు, భ‌యాలు త‌ల‌బ‌ద్ద‌లయిపోయేంత భారం కాకుండా చూసుకో. అయ్యాయ‌నుకో సిగ్గులేకుండా వాటిలోంచి బైట‌కొచ్చెయ్‌. స‌లాహాలు ఇవ్వ‌డానికి బోల్డెంత మంది వ‌స్తారు. జ‌స్ట్ సే ఫ‌క్ ఆఫ్‌.. అచ్చ‌ తెలుగులో దెంగెయ్ అను. 

అంతా ఒక రోటీన్‌కి అలవాటు ప‌డి ఉంటారు క‌దా. నువ్వు బైట‌కెళ్తానంటే ఒప్పుకోరు. ఈ రోటీన్ నీకు పిచ్చ‌లాగే ఉండొచ్చు.  అందులోంచి నువ్వు బైట‌కి వెళ్తానంటే మాత్రం మొత్తం వ్య‌వ‌స్థ అప్ర‌మ‌త్త‌మైపోతుంది. ఏవో కొంప‌లు మునిగిపోతున్నాయ‌ని అరుస్తుంది.  నిన్ను సైలెంట్ చేయాల‌ని చూస్తుంది. కుద‌ర‌క‌పోతే చంపేస్తుంది. కానీ ఆల్రెడీ అల‌జ‌డి మొద‌లైపోయింది కాబ‌ట్టి రోటీన్ లోనుంచి ఒక్కొక్క‌రే బైట‌కి వెళ్లడం మొద‌ల‌వుతుంది. ఆప‌డం విల‌నిజ‌మేం కాదు గానీ.. వెళ్ల‌డం మాత్రం హీరోయిజ‌మే. ఇక్క‌డ విల‌నీ అనేది వ్య‌క్తిగ‌తం కాదు... అది వ్య‌వ‌స్థీకృతం. ఎవ‌డికి వాడు త‌న సైడ్ నుంచి క‌రెక్టే. సినిమాలో న‌ర్స్ రేచెద్‌ కూడా అలాంటిదే. వృత్తిగ‌తంగా త‌ను ఒక ఫ్రేమ్ సెట్ చేసుకుంది. రోగులెవ‌రూ ఆమెకి శ‌త్రువులు కాదు. పైగా కొంద‌రు ఆమెకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. కాక‌పోతే త‌ను పెట్టిన రూల్స్ అనేవి అక్క‌డి మాన‌సిక రోగుల్ని మామూలు మ‌నుషులుగా మార్చేలా లేవు. ఈగో అనే ఎవిల్ ఎలాగూ ఉంటుంది కాబ‌ట్టి న‌ర్స్ విల‌నైందిక్క‌డ‌. ఎలాంటి ఈగోలు లేకుండా ఒక పిచ్చలో నుంచి బైట‌కి రావాల‌నుకున్నాడు కాబ‌ట్టే మ‌ర్ఫీ హీరో అయ్యాడు. 

42 ఏళ్ల‌కింద‌టి సినిమా. కొన్ని వంద‌ల సినిమాల‌కి ఇన్‌స్పిరేష‌న్‌. కానీ ఈ మూవీ ఇప్పుడు చూసినా ఫ్రెష్‌గానే అనిపిస్తుంది. డైరెక్ట‌ర్ ఫ‌ర్మాన్‌, హీరో జాక్ నికొల్స‌న్ ఈ ఇద్ద‌రి గురించే చెప్తారు చాలామంది. కానీ ఇందులో చిన్న చిన్న పాత్ర‌లు వేసిన చాలామంది అద్భుతంగా న‌టించారు. ఓవ‌రాల్‌గా జాక్ నికొల్స‌న్ టాప్‌లేపేశాడు కానీ.. మిగిలిన‌వాళ్ల గురించి కూడా చెప్పుకోవాలి. మార్టిని పాత్ర వేసిన డానీ డెవిటో,  చెస్‌విక్‌గా న‌టించిన లాసిక్, హార్డింగ్‌గా క‌నిపించిన రెడ్‌ఫీల్డ్‌ గుర్తుండిపోతారు. ఈ ముగ్గురిలో కూడా డానీ డెవిటో చాల నేచుర‌ల్ పిచ్చోడిలా క‌నిపిస్తాడు. ప్ర‌తినాయ‌క పాత్ర  న‌ర్స్ రేచెద్‌గా వేసిన‌ లూయిస్ ఫ్లెచ‌ర్‌.. ఆ పాత్ర‌పై డైరెక్ట‌ర్ ఫ‌ర్మాన్ పర్‌సెప్ష‌న్‌ని మార్చి మ‌రీ సినిమాలో అవ‌కాశాన్ని ద‌క్కించుకుంద‌ట‌. న‌ర్స్ పాత్ర‌ని భ‌యంక‌ర‌మైన విల‌న్‌గా చూపించాల‌నుకున్నాడట‌ ఫ‌ర్మాన్‌. కానీ విల‌న్‌ కేవ‌లం ఇన్‌స్ట్రుమెంట్ అన్న కోణంలోనే చూపించాల‌న్న ఆలోచ‌న ఫ్లెచ‌ర్‌ది. త‌న కోణంలో త‌ను అంద‌రికీ మంచి చేస్తున్న‌ట్టే ఫీల‌వుతుంది, కాకపోతే అది రోగుల్ని ఇబ్బంది పెడుతుంది. ఫ్లెచ‌ర్ ఈ వాద‌న‌కే ఫ‌ర్మాన్ ఓటేశాడు. 

డైరెక్ట‌ర్‌గా ఫ‌ర్మాన్ చేసిందేంటి..?
యాక్ట‌ర్లకి ఎలాంటి స్క్రిప్ట్ ఇచ్చేవాడు కాదు ఫ‌ర్మాన్‌. కేవ‌లం వాళ్ల పాత్ర‌లేంటో చెప్పి.. ఇంప్ర‌వైజ్ చేయ‌మ‌నేవాడు. వాళ్లు గ్రూప్ ఇంప్ర‌వైజేష‌న్ మొద‌లుపెట్ట‌గానే వాళ్ల‌కి తెలియ‌కుండా కెమెరాలు రోల్ అయ్యేవి. చాలా సీన్లు యాక్ట‌ర్ల‌కి తెలియ‌కుండా షూటింగ్ చేశాడ‌ట‌. ఇక సినిమాలో చాలా పాత్ర‌లు వేసింది ప్రొఫెష‌న‌ల్‌ న‌టులు కాదు. ఓరెగాన్ హాస్పిట‌ల్ సైకియాట్రిక్‌ వార్డులో పేషెంట్స్‌నే చిన్నాచిత‌కా పాత్ర‌లో వాడుకున్నారు. మ‌ధ్య‌లో వ‌చ్చే ఫిషింగ్ ట్రిప్ సీన్ మొత్తం ఆఖ‌ర్లో షూట్ చేశార‌ట‌. హాస్పిటల్ త‌ప్ప మ‌రోటి సినిమాలో క‌నిపించ‌కూడ‌ద‌న్న‌ది డైరెక్ట‌ర్ ఫార్మ‌న్ ఆలోచ‌న‌. అయితే ప్రొడ్యూస‌ర్లు ప‌ట్టుబ‌ట్టి ఫిషింగ్ సీన్ షూట్ చేయించార‌ట‌. 

ఒన్ ఫ్లూ ఓవ‌ర్ కుకూస్ నెస్ట్‌ న‌వ‌లా ర‌చ‌యిత కేసీ మాత్రం ఈ సినిమా చూడ్డానికి ఇష్ట‌ప‌డ‌లేద‌ట‌. మ‌ర్ఫీ ఇన్‌స్పిరేష‌న్‌తో ఆస్ప‌త్రి నుంచి పారిపోయే చీఫ్ బ్రామ్‌డెన్.. న‌వ‌ల‌లో ఈ క‌థ మొత్తాన్ని నెరేట్ చేస్తాడు. సినిమాలో అలా ఉండ‌దు. ఈ విష‌యంలో కేసీకి సినిమా యూనిట్‌కి మ‌ధ్య గొడ‌వ జ‌రిగిందంటారు. చాలామంది సినిమా కంటే న‌వ‌లే బాగుందని చెప్తారు. న‌వ‌ల నేను చ‌ద‌వ‌లేదు కానీ.. మూవీ అయితే మాస్ట‌ర్ పీస్‌. జాక్ నికొల్స‌న్ న‌టన పీక్స్‌. 

(ఈ మూవీ గురించి ఎప్ప‌టినుంచో రాయాల‌నుకున్నా.. ఇప్ప‌టికి రాసేశా)