Friday, April 25, 2025
ఒకే మతం... ఒకే దేశం..!
Saturday, March 22, 2025
అనోరా : HONOR
ప్రపంచం అంతా పరితపించే లగ్జరీ. స్వేచ్ఛ కంటే ఖరీదైనది. ఓలిగార్క్‌లు కూడా కొనలేనిది. అనోరా కావాలి అనుకునేది. ది ఆనర్. ఈ సినిమాలో ఇగోర్ కళ్లలో దొరుకుతుంది.
న్యూడిటీ తప్ప కట్టిపడేసే కథ ఏం ఉంది ఇందులో అనిపించింది మొదట. స్ట్రిప్ క్లబ్లో డ్యాన్సర్‌గా పనిచేస్తుంటుంది అనోరా. సినిమా ప్రారంభంలో ఒక కస్టమర్ అడుగుతాడు... నువ్వు ఈ పని చేస్తున్నట్టు మీ ఇంట్లోవాళ్లకి తెలుసా? అని. తెలుసంటుంది. వాళ్లు దీనికి ఓకేనా? అంటాడు. నువ్వు ఇక్కడికి వచ్చినట్టు మీ ఇంట్లోవాళ్లకి తెలుసా? అని ప్రశ్నిస్తుంది అనోరా. తెలియదు అని చెప్తాడు. ఎక్కడా పాజ్లు, ఎమోషన్స్ కట్ చేయడం ఉండదు. ఇట్సే ఫ్లో. నాటకీయతకి చోటే ఉండదు. అలా సాగిపోతుంది.
ఒక రష్యన్ ఓలిగార్క్ కొడుకు వాన్యా, అనోరాని బుక్ చేసుకుంటాడు. ఇద్దరూ కామంలో, డ్రగ్స్‌లో మునిగితేలుతారు. ఆ కుర్రాడు ఆ ట్రిప్ ముగించి రష్యా వెళ్తే, అక్కడ తండ్రి కంపెనీలో పనిచేస్తూ పర్మనెంట్‌గా ఉండాలి. కానీ అమెరికాలో ఎవరినైనా పెళ్లి చేసుకుంటే, గ్రీన్‌కార్డ్ సంపాదించి ఇక్కడే ఉండిపోవచ్చు. కామంలోనే అనోరాని ఇష్టపడి, ఆమె ముందు పెళ్లి ప్రపోజల్ పెడతాడు. ముందు ఆమె ఒప్పుకోదు. కానీ ఆమెని నిజంగానే ఇష్టపడుతున్నాను అని చెప్తాడు. పెళ్లయ్యాక వాడి ఇంట్లో తెలుస్తుంది. ఇద్దర్నీ విడదీయాలి అనుకుంటారు. ఆమె గొప్పగా చూసుకుంటున్న ఎంగేజ్మెంట్ రింగ్‌ని బలవంతంగా లాక్కుంటారు. మొదట పెళ్లి రద్దుని ప్రతిఘటించిన అనోరా, వాన్యా గాడి నిజస్వరూపం చూశాక వివాహం రద్దుకి ఒప్పుకుంటుంది.
ఇద్దర్నీ విడదీయడానికి వచ్చిన గ్యాంగ్‌లో ఇగోర్ అని ఒకడుంటాడు. నిజానికి తనకి దక్కాల్సిన గౌరవం కోసం అనోరా పోరాడే సమయంలో... ఆ బాధ ఆమె నుంచి కంటే, ఇగోర్ కళ్లలో బాడీలాంగ్వేజ్‌లో వ్యక్తమయ్యేలా చూపడంలో డైరెక్టర్ షాన్ బేకర్ టేకింగ్ కనిపిస్తుంది. ఎక్కడా పైకి వ్యక్తం చేయడం ఉండదు. క్లైమాక్స్‌లో అనోరా ఎంగేజ్మెంట్ రింగ్‌ని ఆమెకే ఇవ్వడం, తర్వాత ఇద్దరూ ఒక్కటయ్యే సీన్ కదిలిస్తుంది.
సినిమా అంతా బలమైన స్త్రీగా అనోరా పాత్రని చిత్రీకరించారు. అలాంటి అనోరాలో భయంతో, బాధతో వణికిపోయే ఒక చిన్నపిల్ల ఉంటుంది. ఆ చిన్నారి ఆఖరి సీన్లో మన కళ్లముందుకొస్తుంది. ఏడుస్తూ బేలగా ఇగోర్ గుండెలపై వాలిపోయే ఆ సీన్ కంటతడి పెట్టిస్తుంది.
Friday, November 1, 2024
NOCTURNAL ANIMALS
గతం...
ప్రస్తుతం...
ఒక కథ...
ఎంత కృత్రిమంగా రాయాలన్నా
ఎంతో కొంత జీవితం అతుక్కుంటుంది
రాత్రి బహుచెడ్డది
వెలుగుని చూడనీదు
మైత్రి కుదరనీదు
అందుకే అప్పుడప్పుడైనా నిద్రపోవాలి
మనుషులు మళ్లీ దొరకరు
ఒక చేయి విడిస్తే
ఇంకో తోడు దొరుకుతుంది అనుకోకు
చీకటి ఒక ఒంటరి
గతం దానికి తోడు
నిన్ను వదలదు, నీతో ఉండదు
Thursday, June 20, 2024
డియర్ డీర్
మా ఊరి అడివిలో
మా చేనులో
నీతో నాకున్న పరిచయం వేరు
నిన్ను నేను చూసింది వేరు
నీ వేగం వేరు
నీపై నా కోరిక వేరు
నీ ముక్కలు తప్ప
నేరుగా ముట్టుకున్నదే లేదు
డియర్ డీర్
నీ నోటికి మేతనందించా
నీ నెత్తిన నిమరాలని చూశా
నా పిల్లలకి తప్పుగా పరిచయం చేశా
జంతుప్రేమ జీవ వైవిధ్యం కాదని
అభయం ఇచ్చేది అసలు అరణ్యమే కాదని
చెప్పాలని ఉంది కానీ
చాలా దూరం వచ్చేశాం
వెనక్కి వెళ్లడం నాకే ఇష్టం లేదేమో
అసలది కుదరని పనేమో!
డియర్ డీర్
మళ్లీ మనం కలుస్తామో లేదో
రేపు అడివంటూ బ్రతికుంటే
నా పిల్లలెప్పుడైనా అక్కడికొస్తే
ఒట్టిచేతులతో నీ వెంటబడిన
నా గురించి వాళ్లకి గుర్తు చెయ్
రిజర్వ్ ఫారెస్టుని మించిన
జీవితం ఒకటుందని చెప్పు
వీలైతే అందులోంచి
వాళ్లనయినా బైటపడమని చెప్పు
Sunday, March 10, 2024
పర్యావరణం - ఆలియాభట్
నీతులు చెప్పడం మంచి వ్యాపారం అయిపోయింది. రీసెంట్గా పోచర్ సిరీస్ చూశాను. అందులో పర్యావరణ స్పృహ గురించి దంచిపడేశారు. ఇండియాలో వేట అనేదాన్ని 50 ఏళ్ల కిందట బ్యాన్ చేశారు. రాత్రికి రాత్రే వేలమంది వేటగాళ్లు నేరస్తులుగా మారిపోయారు. ఇప్పటికీ వేట అనేది అన్నిచోట్లా కొనసాగుతోంది. మరీ అటవీ పోలీసుల దృష్టికి వెళ్లకుండా ఎలాగోలా కానిస్తుంటారు. మా ఊళ్ల దగ్గర అడవిపందుల వేటే ఎక్కువగా చూస్తుంటాం. నాకు అన్ని మాంసాల్లోకి అడవిపంది మాంసం అంటే చాలా ఇష్టం కాబట్టి, ఆ వేట చేసేవాళ్లతో మాట్లాడుతుంటా. ఎక్కువమంది కుక్కలతో వేటాడుతుంటారు. బాంబులు పెట్టేవాళ్లు ఉన్నారు. చాలా తక్కువమంది, చాలా రేర్‌గా నాటు తుపాకులతో వేటాడతారు. నాకు తెలిసిన ఒకరిద్దరు, చాలాసార్లు పోలీసుల వేధింపుల దెబ్బతో తుపాకీతో వేటాడటం మానేశారు. కుక్కలతో వేట కొనసాగుతుంది. కొన్నిసార్లు నిషేధం ఉన్న జంతువుల్ని వేటాడటం కూడా జరుగుతుంది. మరీ అంత ఇష్టానుసారంగా అయితే జరగడం లేదు. వేటలో పార్టిసిపేట్ చేసేవాళ్లలో ఎక్కువమంది అడవుల్లో బతికేవాళ్లే. వాళ్లకి మనకంటే ఎక్కువే పర్యావరణ స్పృహ ఉంది. ఎందుకంటే అడవి మీదే ఆధారపడి బతికేవాళ్లు వాళ్లు. మనం అడవుల్ని నరికి బతుకుతున్నవాళ్లం. జంతువుల చర్మాలు, దంతాలు, గోళ్లని అలంకారాలుగా గోడలకి తగిలించుకుని మురిసిపోయేవాళ్లం. వేట... మాంసం వరకే పరిమితం అయినప్పుడు దానితో ఎలాంటి ప్రమాదం లేదు. ఈ అలంకారాల దాకా వచ్చినప్పుడే అది వ్యాపారమైంది. విస్తృతమైంది.
ఇక సిరీస్ విషయానికొస్తే ప్రధానపాత్ర మాల అటవీ అధికారి. ఆమెకి తండ్రిమీద విపరీతమైన అసహ్యం ఉంటుంది. ఎందుకంటే తండ్రి వేటగాడు. ఏనుగుల్ని చంపేవాడు. ఇంకో ప్రధానపాత్ర అలన్కి కూడా పర్యావరణ స్పృహ కారిపోతూ ఉంటుంది. భార్యాబిడ్డల్ని కూడా పట్టించుకోకుండా ప్రకృతిని ప్రేమిస్తుంటాడు. వీళ్లిద్దరూ ఏనుగుల్ని దంతాల కోసం చంపుతున్నవాళ్లని పట్టుకునే బాధ్యతలో ఉంటారు. చివరికి ఎలాగోలా ముగిస్తారు. అయితే పర్యావరణం, ప్రకృతి, వంకాయ అంటూ అవకాశం వచ్చినప్పుడల్లా ఏదో ట్రాన్స్‌లోకి వెళ్లినట్టు మాట్లాడుతూ ఉంటారు వీళ్లు. అవతలివాళ్ల వాదనకి కూడా 8 ఎపిసోడ్లలో ఒకట్రెండు సార్లు అవకాశం ఇచ్చారనుకోండి. అయితే ఇక్కడ వేటగాళ్ల మీద కంటే, వాటితో వ్యాపారం చేసేవాళ్లపై కాస్త ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టు నటించారు. కానీ మూడు ఎపిసోడ్ల వరకు ఒక వేటగాడిని చూపించకుండానే వాడి చుట్టూ అల్లిన కథ సిరీస్ తీసిన నీతిపరుల కుట్ర స్పష్టంగా తెలిసిపోతుంది. వేట, వేటగాడు అన్న పదాల్లో ఉన్న థ్రిల్‌ని వాడుకోవడమే ఆ కుట్ర. ఒకసారి అలన్ తండ్రి, ఓ పెళ్లి తంతులో అలన్‌పై కోప్పడతాడు. పెద్ద ఇల్లు కట్టుకోలేకపోయాడనేది ఆయన ఆవేదన. దానికి... పెద్ద ఇల్లు, పర్యావరణానికి వ్యతిరేకం అంటూ ఇంకొకరు వత్తాసు పలుకుతారు. మంచిదే. కానీ ఈ సిరీస్ తీసిన ఆలియా భట్ కూడా అలాంటి చిన్న ఇంటిలో ఉండి ఈ నీతులు చెబితే, ఆహా అనుకోవచ్చు. ఆమెకి ఒకటి కాదు రెండు ఇళ్లున్నాయి. ఒక్కొక్కటి ముప్పయి నలభై కోట్ల విలువైనవి. నాలుగు కార్లున్నాయి. వాళ్లాయనకి ఎన్నున్నాయో చూడలేదు. సిరీస్‌లో మాత్రం చిన్న ఇల్లు, చింతలు లేని ఇల్లు అంటూ కబుర్లు చెప్పించారు.
పర్యావరణం గురించి ఎవరు మాట్లాడినా నవ్వొస్తుంది. పర్యావరణం గురించీ, ప్రకృతి విధ్వంసం గురించి మాట్లాడటానికి ఏమాత్రం అర్హత లేనిది మనిషే. ఇంకోవైపు ప్రకృతి విధ్వంసం గురించి, వ్యవసాయం గురించీ ఒకేసారి బాధపడిపోతుంటాం. అసలు ప్రకృతి ధ్వంసానికి తొలి మెట్టు వ్యవసాయమే. మనందరికీ అది తిండిపెట్టొచ్చు. కానీ వాస్తవం అదే. చెట్లు నరకడంతో మొదలై, నేలకి చెదలు కూడా పట్టకుండా పురుగుమందులతో సమస్త జీవాల్ని చంపడమే లక్ష్యంగా బతుకుతున్నాం. పైకి మాత్రం ఒక్కశాతం కూడా కనిపించని ఆర్గానిక్ వ్యవసాయం అంటూ నకరాలు పోతుంటాం.
లాక్డౌన్ టైమ్‌లో మా పొలంలో మినుము వేశాను. మినుము వేయడానికి ముందు దుక్కి దున్నడం అయ్యాక, ఒక నెలకి చేనంతా గడ్డిపడింది. మా బావ పొలం చూడ్డానికి వచ్చి, ఇంత గడ్డిలో మినుము చల్లితే పంట రాదు అన్నాడు. దాంతో ఫ్యామిలీ మొత్తం చేలోకి వెళ్లి గడ్డంతా పీకడం మొదలుపెట్టాం. అందరూ మమ్మల్ని చూసి కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టుంది నా యవ్వారం అనుకున్నారు. ఈ లోపల మిగతా చేలల్లో మినుము చల్లడం కూడా మొదలైంది. కొంతమంది ఆగి ఆడిగేవాళ్లు, ఇట్టా గడ్డి పీక్కోడమేనా మినుము ఏస్తరా లేదా అని. చివరికి కొందరు సీనియర్లు, వ్యవసాయంలో మునిగితేలినవాళ్లు మా తతంగం చూసి, ఒక సలహా ఇచ్చారు. అదేంటంటే... ఇలా ఎవరూ గడ్డి పీకరు నాయనా, మినుము చల్లి, మొక్క వచ్చాక గడ్డి మందు కొడతారు. అది కొట్టాక ఏ గడ్డి మొక్కా రాదు అనేది వాళ్ల సలహా సారాంశం. అయితే గడ్డి మందు కొడితే ఎర్రలు లాంటివి, నేలసారాన్ని పెంచే మరికొన్ని జీవులు చచ్చిపోతాయి, భూమిసారం కూడా దెబ్బతింటుంది కదా అని వాళ్లని అడిగాను. వాళ్లు నన్ను కిందకీపైకి చూసి వెళ్లిపోయారు. మీరెంత పీకినా... మళ్లీ ఒక వాన పడితే గడ్డి వస్తుంది అన్నారు. మా బావకి ఈ గడ్డి మందు వ్యవహారమే తెలియదు. మళ్లీ పడితే, మళ్లీ పీకడమే, వ్యవసాయం అంటే అంతే అన్నాడు ఆయన. ఆయనకి ఏమీ తెలియదు అన్నట్టు మావాళ్లు చూశారు. సరే ఎలాగూ మొదలుపెట్టాం కదా అని, సాధ్యమైనంత వరకు గడ్డి పీకేశాం. కానీ మినుము వేశాక, ఇష్టం లేకపోయినా గడ్డి మందు కూడా కొట్టాం. తర్వాత మరో మూడు సార్లు పురుగు మందు కొట్టించా. చివరికి పంట అద్భుతంగా వచ్చింది. చాలామంది తొలిసారి వ్యవసాయం పెట్టినా, బాగా పండించావు అని పొగిడారు. అయితే పడాల్సిన టైమ్‌లో పడని వానలు పంటంతా చేతికొచ్చాక పడ్డాయి. మూడు రోజులు నాన్‌స్టాప్‌గా కురిసిన వానతో మొత్తం పోయింది. చివరికి పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. పంట పోయినందుకు కూడా పెద్దగా బాధపడలేదు. కానీ వ్యవసాయం అనుకున్నట్టు చేయలేకపోయా అనిపించింది. సేద్యంలో ఎక్కడా పర్యావరణ స్పృహ ఉండదని స్వానుభవంతో తెలుసుకున్నా. పర్యావరణ స్పృహతో వ్యవసాయం చేసేవాళ్లు చాలామంది ఉన్నారు. అదంతా ఇప్పుడు బలిసినోళ్ల యవ్వారంగా మారిపోయింది. ఆ కథంతా వేరే వ్యవహారం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఫుడ్ సైకిల్‌కి మనిషి ఏ రోజూ కట్టుబడి లేడు. అవసరం లేకపోయినా తన సుఖం కోసం, గొప్పల కోసం ఇతర జీవుల్ని చంపుతున్నాడు. అందులో ఏనుగు పెద్దగా కనిపిస్తుంది. ఎర్రలు కనిపించవు.
సిరీస్ విషయానికొస్తే ఎవరో ఐవరీ కొంటున్నారు కాబట్టి, దాని అమ్మకాలు చూసే మాఫియాని పట్టుకుంటే ఏనుగుల వేటని ఆపొచ్చు అని చెప్తుంటారు. కానీ సిరీస్ నడిచేది మొత్తం అడవి, వేటగాళ్ల చుట్టూనే. అడవి అందాల్ని, వేటలో థ్రిల్‌ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో నాలుగు నీతులు చెప్పి చేతులు దులుపుకోవచ్చనుకున్నది స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మాల పాత్ర ఏమాత్రం కన్విన్సింగ్‌గా లేదు. వీగన్ స్లోగన్ వినిపించే ఒక వింత తెగకి చెందిన జోంబీలా అనిపించింది. ఇంక సిరీస్‌లో చాలామంది వినాయకుడి భక్తుల్ని చూపించారు. వాళ్ల ఇళ్లలో వినాయకుడి విగ్రహాలు చూపించారు. అంటే వీళ్లంతా ఏనుగుల్ని చంపడాన్ని వ్యతిరేకించేవాళ్లట. అసలు వినాయకుడి పుట్టుకే ఏనుగు వధతో మొదలయింది అనయినా వీళ్లకి తెలుసా అనిపించింది. ఒకవైపు ఏనుగు దంతాలతో వినాయకుడి బొమ్మలు చేసి అమ్మడం చూపిస్తూనే ఇంకోపక్క గణపతి భక్తి ప్రదర్శిస్తారు. మొత్తంగా అసహజపు కోరికలతో, అసహజపు నటనతో కొనసాగినట్టు ఉంది. దివ్యేందు భట్టాచార్య లాంటి నటుడు కూడా ఇందులో తేలిపోయాడు.
Tuesday, January 2, 2024
మూగ మనుషులు
కలల కొలిమి నీలో కాలుతూ ఉండొచ్చు
బట్ ఇట్స్ నాటే బర్డన్
అదొక వ్యామోహం
అంత తేలిక కాదు తెంచుకుని పోవడం
కుటుంబమే నీ తొలి కల
యువర్ లైఫ్ బిగిన్స్ దేర్
అదే సంగీతం, అంతకుమించి సర్వస్వం
రెండు దారులు సమాంతరంగా నడిస్తేనే అందం
లుక్ ఎట్ లైఫ్ ఫ్రం బోత్ సైడ్స్
ఒకటి వదిలేశావా
రెండో దారి ఎడారి
ద సైన్ ఆఫ్ లవ్ ఎనఫ్ ఫర్ లైఫ్..!
[ఈ మూవీ 1990కి ముందటి కాలానికి సంబంధించినట్టు తీసి ఉంటే బాగుండేదని అమెరికాలో చాలా మంది బధిరుల అభిప్రాయం. ఆ తర్వాత అక్కడ వచ్చిన చట్టాలు వాళ్లకి ప్రొఫెషనల్ ఇంటర్ప్రెటర్స్ని మాండేట్ చేశాయి. సో అక్కడి బధిరులు చాలామందికి ఈ సినిమా అంతగా నచ్చలేదట. బట్ ఇండియాలో ఇలాంటి ఒక ఫ్యామిలీని ఊహించుకుంటే మాత్రం ఇది గొప్ప సినిమా. అసలు కుటుంబంలో ఎవరూ ఆ డిజబిలిటీతో లేకపోయినా ఆ భావోద్వేగాలు అంతే హత్తుకుంటాయి. ఇట్స్ ఆల్ ఎబౌట్ ఫ్యామిలీ అండ్ డ్రీమ్స్. సో ఫ్యామిలీతో కనెక్ట్ అయి ఉండే ప్రతి ఒక్కరికీ నచ్చే సినిమా. ]
Tuesday, August 15, 2023
మహాకవికి నివాళి
గద్దర్ మరణం, ఆయన ఖననం పూర్తయ్యాక చాలామంది నివాళి వ్యాసాలు రాశారు. రాస్తున్నారు. ఆయనని తమ వాడే అనుకున్నవాళ్లు, తమ దగ్గరే ఆగిపోతే బాగుండు అనుకున్నవాళ్లు బాధపడ్డారు. వాళ్ల బాధకీ అర్ధం ఉండొచ్చు. కానీ జీవితం ఎక్కడో మొదలై ఎక్కడో ముగుస్తుంది. అదిక్కడే ఉండిపోవాలి అనుకోవడం విప్లవం కాదు. ఆయన జీవితంలో ఆయన పాటంత వైరుధ్యం ఉంది. అది జీవితానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
ఎందరు కవులు ఈ నేలపై పుట్టారో లెక్కలేదు. కానీ ఇలాంటి అంతిమ సంస్కారం దక్కిన కవులెందరు..? ఏ వాగ్గేయకారుడు ఇలాంటి నివాళి అందుకున్నాడు..? తెలుగు నేల కనీవినీ చూడని అంతిమయాత్ర అది. చనిపోయి వారం దాటినా, ఇంకా ఎక్కడ చూసినా ఆ గానమే. కొన్ని కోట్లమంది ఆ నివాళి గానానికి శృతి కలుపుతున్నారు. ఏ ప్రధాన స్రవంతి మీడియా కూడా ఆయన పాడె పక్కన హడావుడి చేయలేదు. జనం వెల్లువ చూశాకే అంతా వచ్చారు. కొన్ని లక్షలమంది ప్రజలు ఆయన పాడె మోశారు. అందులో కొందరు రాజ్యం ప్రతినిధులు ఉండొచ్చు. అది వాళ్ల అవసరం. ఏ రాజ్యం తన గుండెల్లో తూటా దింపిందో, అదే రాజ్యాన్ని భయపెట్టి మరీ అధికార లాంఛనాలు లాక్కున్నవాడు గద్దర్ మాత్రమే.
విప్లవం అంటే తుపాకీ ఒక్కటే కాదు. విప్లవం అంటే జీవం. అదెప్పటికీ ధ్వంసం కాదు. రూపం మారుతుంది అంతే. ఎప్పుడు సంకెళ్లు బిగిసినా వాటిని తెంచుకుని తీరుతుంది. దానికి ఆయుధం అవసరమైతే పట్టుకుంటుంది. పాట అవసరమైతే పాడుతుంది. పార్టీ అవసరమైతే పెడుతుంది. వనరులన్నీ వాటంతట అవే వచ్చి చేరతాయి. అన్నీ పరస్పర ఆధారాలు. అన్నిటినీ గౌరవించి తీరాల్సిందే.
తన బిడ్డ ఇంజనీర్ కావాలి అనుకుంది వాళ్లమ్మ. కెనరా బ్యాంకులో క్లర్కుగా ఉండుంటే బాగుణ్ను అనుకున్నవాళ్లూ ఉండుంటారు. అడవిలోనే ఉండిపోతే చాలు అనేవాళ్లూ ఉంటారు. అదే భావజాలంతోనే నిలిచిపోతే బాగుండు అనొచ్చు. కానీ విప్లవమే ఆయన భావజాలం. తిరుగుబాటుతోనే జీవితమంతా బతికాడు.
తుపాకీ పట్టినవాడే, ఓటేయమని పిలుపునిచ్చాడు. పార్టీ పెట్టాడు. ఎర్రజెండా భుజంపై కప్పుకుని రామానుజ తత్వం అంటూ అద్వైతం పాట పాడాడు. రాహుల్ గాంధీకి ముద్దుపెట్టాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో... ఆయనేమీ మోడీని ముద్దుపెట్టుకోలేదు. రాజ్యహింసకి గురవుతున్న బాధితుల తక్షణావసరంగా రాహుల్ గాంధీని చూశాడు. ఇక రండిరో రామానుజ జాతరకు పాట మాత్రం కాస్త కలుక్కుమనిపించేదే. అది ఆయన ఏ లక్ష్యంతో పాడినా... అందులో జీవం కనిపించలేదు. ఇంక దానికి భవిష్యత్తేం ఉంటుంది.
మార్క్స్, బుద్ధుడు, అంబేద్కర్ అంటూ ఏవో లెక్కలు చెప్పొచ్చు. విప్లవానికి వాళ్లే మొదలు కాదు, వాళ్లే ఆఖరు కాదు. అది నిరంతర ప్రవాహం. అందరి సారం అందులో జీవనదిలా పారుతూనే ఉంటుంది.
అందుకే ఏదో ఒక భావజాలం నుంచి పుట్టిన పాట కాదు గద్దర్. మట్టి నుంచి, ఆకలి నుంచి, ఆశల నుంచి పుట్టిన పాట ఆయన. పాటయినా, బతుకైనా... జనంతోనే జీవితాంతం మమేకమై ఉన్నాడు. ఆ తల విసురు, ఓహో అనే ఆ అరుపు, నిర్లక్ష్యం నిండిన ఆ నాట్యపు అడుగులు... కాలగమనంలో మనుషుల మెదళ్లలోంచి ఎరేజ్ అయిపోవచ్చు. కానీ జీవనదిలాంటి ఆయన పాట మరెంతోమంది వాగ్గేయకారులకి కచ్చితంగా ప్రాణం పోస్తూనే ఉంటుంది.
మనిషి ప్రాణం పోతుందేమో, శిఖరం ఒరిగిపోదు. అది శాశ్వతం. ప్రజల యుద్ధానికి సంగీతమై నిలిచినవాడు గద్దర్. చూపున్న పాటకి చావుండదు. అది మట్టిలో కలిసి... కొన్ని కోట్ల మొక్కలై తిరిగొస్తుంది. జీరబొయిన ఎన్నో గొంతులకి జీవం అందిస్తుంది.



