Sunday, August 2, 2026

పర్వతాలు మరిచిపోలేని పేర్లు

 NIRMAL PURJA - JOHN SNORRI - ALI SADPARA - JUAN PABLO 

ఈ మధ్య ఒక డాక్యుమెంటరీకి సబ్‌టైటిల్స్ రాశాను. 2021లో K2 వింటర్ సమ్మిట్ డిజాస్టర్‌లో జాన్ స్నోరి, అలీ సద్పారా, వాన్ పాబ్లో అనే ముగ్గురు పర్వతారోహకులు చనిపోవడం గురించిన డాక్యుమెంటరీ అది. చాలా రోజులు వెంటాడిన డాక్యుమెంటరీ(లాస్ట్ మంత్ అంతర్‌గంగ దగ్గర ఒక చిన్న గుట్ట ఎక్కినప్పుడు దీని గురించి చాలా సేపు మాట్లాడుకున్నాం.) K2 వింటర్ సమ్మిట్‌కు ముందు జాన్ స్నోరిని ఒక ఐస్‌లాండ్ జర్నలిస్టు ఇంటర్వ్యూ చేస్తూ ఒక ప్రశ్న అడుగుతాడు. ఇలాంటి యాత్రకి వెళ్లేటప్పుడు చావు గురించి ఆలోచిస్తారా? అని. దానికి సమాధానంగా... "ఇలాంటి యాత్రలకు వెళ్లినప్పుడు చావు మనతో కలిసే ఉంటుంది. మనం దానికి ఎదురుతిరిగి నిలబడగలగాలి... ఆ క్షణంలో కాస్త గర్వంగా ఉంటుంది." అంటాడు స్నోరి. అదే ఇంటర్వ్యూలో స్నోరి భార్య ఒక మాట అంటుంది. "శిఖరాన్ని చేరుకున్నాక వచ్చే థ్రిల్, పర్వతారోహకులకు వ్యసనంగా మారుతుంది" అని.

పాకిస్తాన్‌కు చెందిన అలీ సద్పారా, సాజిద్ సద్పారా(అలీ కుమారుడు)ని గైడ్‌లుగా తీసుకుని సమ్మిట్‌కు వెళ్తాడు స్నోరి. అప్పటివరకు K2ని వింటర్‌లో ఎవరూ ఎక్కలేదు. 8,000 మీటర్ల కంటే ఎత్తయిన 14 పర్వతాల్లో... అత్యంత ప్రమాదకరమైన పర్వతం K2. దాన్ని వేసవిలో ఎక్కడమే కష్టం అంటారు పర్వతారోహకులు. అలాంటిది వింటర్‌లో ఎక్కాలని వెళ్లారు వీళ్లు. అది కరోనా సీజన్ కావడంతో సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ లాంటి మౌంటనీరింగ్ కంపెనీల వ్యాపారాలు దాదాపు మూతబడే పరిస్థితి. స్నోరి అనౌన్స్‌మెంట్ చూసి సెవెన్ సమ్మిట్ ట్రెక్స్‌కు బిజినెస్ ఐడియా వచ్చింది. తాము కూడా K2 వింటర్ ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో కుప్పలుతెప్పలుగా ఔత్సాహికులు పాకిస్తాన్ చేరారు. ఏనాడూ పర్వతాల ముఖం చూడనివాళ్లు కూడా వీళ్లలో ఉన్నారు. 

ఏదైనా పర్వతారోహణని క్యాంపులుగా విడగొట్టుకుంటారు మౌంటెనీర్స్. బేస్ క్యాంప్, ఫస్ట్ క్యాంప్, సెకండ్ క్యాంప్, థర్డ్ క్యాంప్, సమ్మిట్. పర్వతం మొదట్లో వేసుకునేది బేస్ క్యాంప్ అయితే కొంత ఎత్తు ఎక్కాక ఫస్ట్ క్యాంప్ వేసుకుంటారు. అక్కడికి అవసరమైన సామగ్రిని అంతా మోసుకెళ్తారు. ముఖ్యంగా సమ్మిట్‌కు అవసరమైన రోప్స్. ఫస్ట్ క్యాంప్‌లో అక్కడి వాతావరణానికి అలవాటు పడే వరకు ఉండి, మళ్లీ కిందకొస్తారు. కొంత గ్యాప్ తీసుకుని ఈసారి రెండో క్యాంప్ వరకు వెళ్తారు. సామగ్రిని అక్కడికి మార్చుకుంటారు. మళ్లీ కిందకొస్తారు. ఈసారి థర్డ్ క్యాంప్ వరకు వెళ్తారు. అక్కడే రెస్ట్ తీసుకుని సమ్మిట్‌కు వెళ్తారు.  K2ని అలా మూడు క్యాంపులుగా విభజించుకుంది స్నోరి, సద్పారా టీమ్. వాళ్లు రెండో క్యాంప్ వరకు సామగ్రిని చేర్చుకుని కిందకొచ్చేసరికి... బేస్ క్యాంప్ అంతా జంతర్ మంతర్ అయిపోయింది. గుంపులు గుంపులుగా జనం వచ్చారు. అందులో నిర్మల్ పూర్జా అలియాస్ నిమ్స్‌డాయ్ టీమ్ కూడా ఉంది. దీంతో స్నోరి, సద్పారా టీమ్‌లో నిరాశ మొదలవుతుంది. తామేదో వింటర్‌లో ఫస్ట్ టైమ్ K2ని అధిరోహించిన రికార్డ్ కొట్టాలని వస్తే... వీళ్లంతా వచ్చి పరిస్థితి మార్చేశారనే బాధ కలుగుతుంది. చివరకు అంతా కలిసి పర్వతాన్ని అధిరోహించాలని నిర్ణయించుకుంటారు. అయితే నిర్మల్ పూర్జా మాత్రం తన నేపాలీ టీమ్‌తో రహస్యంగా మీటింగ్ పెట్టుకుంటాడు.

మౌంటెనీరింగ్‌లో నిర్మల్ పూర్జా ఒక సంచలనం. బ్రిటీష్ ఆర్మీలో గూర్ఖా బ్రిగేడ్‌లో 'కోల్డ్ వెదర్ వార్‌ఫేర్ స్పెషలిస్ట్'గా పనిచేసిన పూర్జా... 2014లో తొలిసారి ఎయిట్ థౌజండర్ సమ్మిట్ చేశాడు. ధవళగిరి పర్వతాన్ని అత్యంత వేగంగా ఎక్కి చూపించాడు. 2016లో ఎవరెస్ట్ ఎక్కాడు. 2018లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా పర్వతారోహణకి అంకితం అయ్యాడు. అప్పటివరకు 14 ఎయిట్ థౌజండర్స్‌ని అత్యంత వేగంగా ఎక్కిన రికార్డ్, కొరియన్ క్లైంబర్ కిమ్‌చాంగ్ హో పేరుతో ఉంటంది. 7 సంవత్సరాలా 310 రోజుల్లో ఆయన ఆ ఫీట్ సాధించాడు. అయితే 7 నెలల్లో 14 పర్వతాల్ని ఎక్కుతానని, చెప్పి మరీ చేసి చూపించాడు పూర్జా. దానికోసం నిమ్స్‌డాయ్ అవలంభించిన పద్ధతులపై విమర్శలున్నాయి. బేస్ క్యాంప్ టు బేస్ క్యాంప్ హెలికాప్టర్లలో వెళ్లడం లాంటి అంశాల్ని చాలామంది వ్యతిరేకించినా... నిర్మల్ పూర్జా సాధించిన రికార్డుల్ని తక్కువ చేసి చూడలేము.

K2 వింటర్ విషయానికొస్తే నిర్మల్ పూర్జా టార్గెట్‌లో క్లారిటీ ఉంది. అదేంటి అంటే... షేర్పాల సాయం లేకుండా ఏ పాశ్చాత్యుడు ఎయిట్ థౌజండర్ సమ్మిట్ చేసిందే లేదు. కానీ ఎక్కిన ఘనత మాత్రం పాశ్చాత్యులకే దక్కుతోంది. నేపాలీల కష్టానికి ఒక్కటైనా "ఫస్ట్ ఇన్ హిస్టరీ" గుర్తింపు ఉండాలి. అది K2 వింటర్ కావాలి. ఈ పర్వతంపై నేపాలీ షేర్పాల పేరు నిలిచిపోవాలి. నేపాలీల కంటే ముందు ఇంకెవరైనా పైకి ఎక్కాలని చూస్తే... "వాళ్ల తాళ్లు కట్ చేస్తాను" అంటాడు. రహస్య మీటింగ్‌లో ఇదే చెప్తాడు నిమ్స్‌డాయ్. అయితే స్నోరి, సద్పారా టీమ్ ఆల్రెడీ 700 మీటర్ల రోప్‌ని సెకండ్ క్యాంప్ వరకు చేర్చి  ఉన్నారు కాబట్టి వాళ్లతో కలిసి వెళ్లాలని నేపాలీ టీమ్ ఒక నిర్ణయానికి వస్తుంది. స్నోరి, సద్పారా ఒప్పుకుంటారు. అయితే ఎవరికీ చెప్పకుండానే ఒకరోజు నిర్మల్ పూర్జా టీమ్ సమ్మిట్ పూర్తి చేసి తిరిగొస్తుంది. అంతా షాక్. పాకిస్తాన్ ఆర్మీ వచ్చి వాళ్లని సన్మానిస్తుంది. సన్మానించిన వాళ్లు ఊరికే పోకుండా... "మీరు ఎక్కారు సరే, మా అలీ సద్పారా టీమ్ ఇక్కడికి వచ్చి నెల దాటింది. వాళ్లు ఇంకా ఎందుకు ఎక్కలేదు?" అని గెలికి పోతారు. దాంతో స్నోరి, సద్పారాల ఈగో హర్ట్ అవుతుంది. అదే సమయంలో ఎలియా సైకలి అనే ఫిల్మ్‌మేకర్ వచ్చి, అలీ సద్పారా గొప్పతనంపై డాక్యుమెంటరీ తీస్తానని చెప్పడంతో... తనలో కసి పెరుగుతుంది. కొన్ని సందర్భాల్ల్లో దీన్ని కీర్తి కాంక్ష అని కూడా అనుకోవాలి.

నిర్మల్ పూర్జా టీమ్ విజయాన్ని బేస్ క్యాంప్ దగ్గర సెలబ్రేట్ చేసుకునే సమయంలోనే... సెకండ్ క్యాంప్ నుంచి కిందకు దిగొస్తూ సెర్జీ మింగోటే అనే పర్వతారోహకుడు... అంత ఎత్తు నుంచి కిందకు పడి చనిపోతాడు. దాంతో బేస్ క్యాంప్ దాదాపు సగానికి పైగా ఖాళీ అయిపోతుంది. స్నోరి, సద్పారా టీమ్ మరో వెదర్ విండో కోసం ఆగుతారు. అనుకూల వాతావరణానికి సంబంధించిన రిపోర్ట్ రాగానే ఫైనల్ సమ్మిట్‌కు సిద్ధమవుతారు. సెవన్ సమ్మిట్ ట్రెక్స్‌తో వచ్చిన వాళ్లు కూడా వీళ్లతో బయలుదేరుతారు. 

పర్వతారోహణలో అత్యంత కీలకమైంది టైమింగ్. ఫస్ట్ క్యాంప్ వరకు ఇన్ని గంటల్లో చేరుకోవాలి, సెకండ్ క్యాంప్‌కు ఇన్ని గంటలు, థర్డ్ క్యాంప్‌కు ఇన్ని గంటలు, సమ్మిట్‌కు ఇంత సమయం... ఇలా ప్రతిదీ టైమింగ్‌లోపు పూర్తవ్వాలి. ఎక్కడైనా టైమింగ్ మిస్ అయిందా, అన్నీ మూసుకుని వెనక్కి వెళ్లిపోవాలి. ముందుకుపోతే మాత్రం... కాలం ఎంత కర్కశమైంది అనేది తెలుస్తుంది. K2 వింటర్‌ని డిజాస్టర్ చేసింది ఆ కాలమే. కాకపోతే తప్పు ఒకరు చేస్తే... ఫలితం ఇంకొకరు అనుభవించారు.

ఫిబ్రవరి 4, 2021లో స్నోరి, సద్పారా టీమ్ K2 వింటర్ ఫైనల్ సమ్మిట్ మొదలుపెడతారు. వాళ్లతో వాన్ పాబ్లో(JP) - తమారా లాంగర్ టీమ్, సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ టీమ్ కూడా బయలుదేరుతారు. స్నోరి, అలీ సద్పారా, సాజిద్ సద్పారా... థర్డ్ క్యాంప్ చేరుకుని టెంట్ వేసుకుంటాడు. వాన్ పాబ్లో, తమారా లాంగర్ కూడా చేరుకుంటారు. కొలిన్ అనే మరో యువ క్లైంబర్ కూడా పైకి చేరుకుని టెంట్ వేసుకుంటాడు. గడువు ముగిసిపోవడంతో మిగిలినవాళ్లంతా వెనక్కి వెళ్లిపోయుంటారు అనుకుంటారు. కానీ రాత్రి గడిచేకొద్ది వచ్చేవాళ్లు వస్తూనే ఉంటారు. కానీ థర్డ్ క్యాంప్‌లో టెంట్లు ఉండవు. ప్రతి ఒక్కరూ తమ టెంట్ ఇంకొకరు తెస్తున్నారులే అన్న భ్రమలో ఉంటారు. చివరకు టెంట్లు లేకుండా పైకి వస్తారు. సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ మాత్రం... ఎవరూ గడువు లోపల థర్డ్ క్యాంప్ వరకు చేరుకోరులే అన్న ఉద్దేశ్యంతో సరిపడా టెంట్లు పంపించదు. ఒకవేళ అందరూ నిర్ణీత సమయంలోనే థర్డ్ క్యాంప్ వరకు చేరుకుంటే ఏంటి పరిస్థితి? ఈ ప్రశ్నకు సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ దగ్గర సమాధానం ఉండదు. 

చివరకు ఉన్న మూడు టెంట్లలోనే అంతా సర్దుకుంటారు. ఎవరికీ రెస్ట్ దొరకదు. మరుసటి పొద్దుటికి అంతా తీవ్రంగా అలసిపోయి కనిపిస్తారు. ఈ సందర్భంలో కొలిన్ స్పష్టంగా నిర్ణయించుకుంటాడు... పర్వతారోహణకు సంబంధించి తాను పెట్టుకున్న 10 అంశాల్లో 9 అనుకూలంగా లేవు. దీంతో కిందకు వెళ్లిపోవాలి అనుకుంటాడు. చివరకు జాన్ స్నోరి, అలీ సద్పారా, సాజిద్ సద్పారా, వాన్ పాబ్లో మాత్రమే ఫైనల్ సమ్మిట్‌కు వెళ్తారు. మిగిలిన అంతా కిందకు వెళ్లిపోతారు. అలా వెళ్తుండగా ఆటనస్ స్కటోవ్ అనే క్లైంబర్... దాదాపు 2,000 మీటర్ల ఎత్తు నుంచి కిందకు పడి చనిపోతాడు. అందరూ కిందకు దిగేసరికి మరో వార్త. స్నోరి, అలీ సద్పారా, వాన్ పాబ్లో ఇంకా సమ్మిట్ పూర్తి చేయలేదని, వాళ్లు ఏమయ్యారో తెలియడం లేదని. ఆక్సిజన్ రెగ్యులేటర్ పనిచేయక సాజిద్ సద్పారా, బాటిల్‌నెక్ దగ్గర్నించి వెనక్కి వచ్చి థర్డ్ క్యాంపులో ఎదురుచూస్తూ కూర్చుంటాడు. గంటలు గడిచినా పైకి వెళ్లిన ముగ్గురూ తిరిగి వస్తున్న జాడ లేదు. రెస్క్యూ టీమ్ వచ్చి వెతికిచూసింది. అప్పటికే సాజిద్‌కు అర్ధమైంది. వాళ్లు ఇక రారని... లేరని. 

నాలుగు నెలల తర్వాత సాజిద్ సద్పారా, ఎలియా సైకలి కె2కి తిరిగి వెళ్లారు. అప్పటికే K2 డిజాస్టర్‌కు నిర్మల్ పూర్జాకు ముడిపెట్టి కొన్ని పుకార్లు వ్యాప్తిలోకి వచ్చాయి. ఫైనల్ సమ్మిట్‌కు వెళ్లే దారిలో రోప్స్‌ని నిర్మల్ పూర్జా కట్ చేశాడని, దానివల్లే స్నోరి, సద్పారా, పాబ్లో చనిపోయారనేది ఆ పుకార్ల సారాంశం. తండ్రి మృతదేహాన్ని ఎలాగైనా గుర్తించాలని తిరిగొచ్చిన సాజిద్ సద్పారా... ఆ పుకార్లలో నిజం లేదని స్పష్టం చేశాడు. నిర్మల్ పూర్జా టీమ్ ఏర్పాటు చేసిన రోప్స్ చెక్కుచెదరకుండా ఉన్నాయని ఆధారాలతో సహా రుజువు చేశాడు. చివరకు మంచుతుపానులో గడ్డకట్టుకుపోవడం వల్లే స్నోరి, అలీ సద్పారా, వాన్ పాబ్లో చనిపోయినట్లు తేల్చారు. ముగ్గురి మృతదేహాల్ని K2 పర్వతం పైనే సమాధి చేశారు.

ఈ డాక్యుమెంటరీ ఏ అడ్వెంచరస్ సినిమాకు తక్కువ కాదు. జాన్ స్నోరి కల, అలీ సద్పారా - సాజిద్ సద్పారాల తండ్రికొడుకుల అనుబంధం, వాన్ పాబ్లో - తమారా లాంగర్ లవ్ స్టోరీ, నిర్మల్ పూర్జా దూకుడు, సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ దురాశ, మిస్ క్యాలిక్యులేషన్, ఎలియా సైకలి రేపిన కీర్తి కాంక్ష... ఇవన్నీ ఇందులో కనిపిస్తాయి. చావుతో సావాసం చేసే మనుషులు కనిపిస్తారు.

పాకిస్తాన్‌లోని మరో ఎయిట్ థౌజండర్ - బ్రాడ్ పీక్‌ని అధిరోహిస్తూ నిర్మల్ పూర్జా చనిపోయాడు అన్న వార్త చూడగానే... ఈ డాక్యుమెంటరీ గుర్తొచ్చింది. 43 ఏళ్ల వయసుకే మౌంటెనీరింగ్ ప్రపంచంలో మరిచిపోలేని ముద్ర వేసి వెళ్లిపోయాడు నిర్మల్ పూర్జా. ఆండిస్ గుండెలపై మరణించిన మల్లి మస్తాన్ మళ్లీ ఒకసారి గుర్తొచ్చాడు.

Thursday, July 9, 2026

21 గ్రామ్స్



ప్రాణం బరువెంత..?

ఫిజికల్లీ 21 గ్రామ్స్

మరి మానసికంగా..?


ప్రేమ బరువెంత... 

పాపం బరువెంత...

పగిలిన బతుకుల బరువెంత?


ఆశ, పాశం, పాపం

ప్రాణం ఒక తీర్చలేని రుణం

పాపం ఒక మోయలేని భారం


పీల్చేగాలి విషం అనిపించేంత

ప్రియమైన వారి ముందూ ఉండలేనంత

ప్రాణమే పోతున్నంత


గుండె గాయాన్ని ఎవరైనా

చనుమొనలతో నిమరాలి

నా లోపలి హమ్మింగ్‌బర్డ్ ఎగిరి పోయేదాకా..!

Tuesday, November 25, 2025

అడవి ప్రవహిస్తుంది..!

చెట్టుని పట్టె మంచం చేసుకోగానే

అడవి మనకు అర్ధమైనట్టు కాదు

అక్కడ రాలిన ఆకుల బాధ

మనకి అర్ధమూ కాదు

శిశిరం అనుకోవచ్చు

ఇక్కడితో అడవి అంతమైంది అని

వసంతం రావచ్చు, రాకపోవచ్చు

అడవి మళ్లీ చిగురించకపోవచ్చు

కానీ...

అడవికి తెలుసు

ఎడారుల్లోకి ఎలా ప్రవహించాలో

ఏమీ లేనిచోట 

వెదురు వనాలై ఎలా వికసించాలో

ఖనిజాల వేటలో

రాలిన ఆకుల నెత్తురు

కొత్త ఊపిరులు పీల్చుకోవచ్చు

కాంక్రీట్ జూల్లోకి కానలు ప్రవహించడం 

కాస్త కష్టం కావచ్చు

ఆక్సిజన్ అందక అల్లాడే మనుషులకు

అది అత్యవసరం అయ్యే రోజు వస్తుంది

పన్నెండు గంటలు అంటున్నారు

అప్పుడే పది చేశారు

నీళ్లు విషం, గాలి విషం, 

తినే తిండి విషం

థూ... ఏం బతుకురా ఇది..?

నీరసం నిండిన ఈ తరం

నిస్తేజమే మతమైన మనుషులు

ఏదో ఒకరోజు ప్రశ్నించడం నేర్చుకోవచ్చు

అడవి ప్రజాస్వామ్యమై

హస్తినని పడగొట్టే రోజొకటి రావచ్చు

Saturday, May 10, 2025

సైనికుడు - సరిహద్దు

మూడు రోజుల్లో ముగిస్తాం!

ఐదు రోజుల్లో తేల్చేస్తాం!

మొదలు పెట్టేటప్పుడు అందరూ ఇదే చెప్తారు. ఇప్పుడు ముగిసిపోవడానికి, ఇప్పుడే మొదలైంది కాదు ఇది. 78 ఏళ్ల కాష్టం. యుద్ధం మరో యుద్ధానికి పురుడు పోస్తుందే తప్ప శాంతి రాదు. పార్టీలు, వాటి రంగులు మారొచ్చు కానీ వాళ్లు నడిపేది ప్రభుత్వాన్నే. దాని లక్షణం ఎప్పటికీ మారదు. ఇలాంటి సమయాల్లో జనం జై కొట్టాల్సింది ప్రభుత్వాలకి కాదు... జవాన్లకి! మద్దతివ్వాల్సింది ప్రభుత్వాలకి కాదు... సైనికులకి, సరిహద్దుల్లో ఉన్న ప్రజలకు! వాళ్ల జీవితాలు నిత్యాగ్నిగుండాలు. వాళ్ల ప్రాణాలతో పండుగ చేసుకోవద్దు. యుద్ధం సమస్యనీ ముగించలేదు. ఇంకొందరి సిందూరాలు తుడవడం తప్ప

సైనికుల జీవితాల్ని చాలా దగ్గర నుంచి చూశాను. మా నాన్న బరేలీలో ఉన్నప్పుడు లీవ్ అడిగితే తిట్టాడని, కమాండింగ్ ఆఫీసర్ని కుర్చితో కొడితే ఆయన చనిపోయాడు. వెంటనే అరెస్ట్ చేశారు. రెండు మూడు నెలలు జీతం లేదు. ఖర్చులకు ఇంటి దగ్గర నుంచే మా అమ్మ డబ్బులు పంపింది. ఇంక మా నాన్న రాడేమో అని మమ్మల్ని పట్టుకుని ఏడ్చేది. మేమూ ఏడ్చేవాళ్లం తప్ప, విషయం పూర్గిగా తెలియదు. నాకు అప్పుడు ఆరేళ్లు ఉంటాయి. అందరి ముఖాల్లో ఏడుపు తప్ప ఇంకేమీ కనిపించేది కాదు. మూడు నెలల తర్వాత మిలట్రీ కోర్టు మా నాన్నని వదిలేసింది. మా అమ్మ పడిన సంబరం నాకిప్పటికీ గుర్తుంది. మామూలు కోర్టుల కంటే మిలట్రీ కోర్టులు మనసున్నవి అని ఇప్పటికీ నేను నమ్మేలా చేసిన ఘటన. కోర్టు, జరిగిన ఘటనని మాత్రమే చూడలేదు. సైనికుడి గుండె చూసింది. ఎంత నలిగిపోయి ఉంటే అంత కోపం వస్తుందో గుర్తించింది

మళ్లీ యూనిఫామ్ వేసుకోగానే మా నాన్నకి వేసిన తొలి డ్యూటీ... చనిపోయిన కమాండింగ్ ఆఫీసర్ ఫ్యామిలీని ఇంటి దగ్గర దించి రావడం. రెండు రోజుల ప్రయాణంలో వాళ్లు ఏం పెట్టినా తినలేదంట మా నాన్న. ఏమైనా కలిపి ఇస్తారేమో అని భయం. ఇంటికి వెళ్లాక సీవో భార్య, మా నాన్నని పిలిచి ఫ్యామిలీ గురించి అడిగిందట. సర్వీస్ పొడిగించుకోకుండా సాధ్యమైనంత త్వరగా రిటైర్ అయి భార్యాపిల్లలతో కలిసి మంచిగా బతుకు అని దీవించి పంపిందంట. కోర్టు తండ్రి స్థానంలో ఉండి తీర్పు ఇస్తే, ఆమె తల్లిలా దీవించి పంపింది. ఆమె మాట ప్రకారమే సర్వీస్ కంటే నాలుగేళ్లు ముందుగానే రిటైరయ్యాడు మా నాన్న. కానీ బాధని మాత్రం ఆయన బతికున్నన్నాళ్లూ మోశాడు. అది నేను స్పష్టంగా చూశాను.

ఎంతోమంది సైన్యంలో నలిగిపోయి ఆత్మహత్యలు చేసుకున్నవాళ్లున్నారు. నిద్రలేచిన దగ్గర నుంచి వాళ్ల జీవితం యుద్ధం. ఆర్డర్ పాటించడం తప్ప, ప్రశ్నించడం తెలియదు సైనికుడికి. అలా శిక్షణ ఇస్తారు. ట్రయినింగ్లో ఉన్న సిపాయితో ఎప్పుడైనా మాట్లాడి చూడండి. షో చేయడానికి వాళ్లు టెరిటోరియల్‌ 'పైలట్లు' కాదు. అసలైన సైనికులు. వాళ్ల పని డిఫెన్స్. ఎదురు ప్రశ్నించడం తెలియకపోయినా సైనికుడు సైనికుడే. స్లేవ్ కాదు. అత్యవసర పరిస్థితిలోనే యుద్ధం. ఎమోషన్ కోసం కాదు. ఆపరేషన్ లక్ష్యం ముగిసింది. ఇంకా కొనసాగించడం జవాన్ ప్రాణాలతో ఆడుకోవడమే. ఎప్పుడూ వాళ్లే మనల్ని కాపాడటం కాదు. మనమూ వాళ్లని కాపాడుకోవాలి. మరణాల ఉసురు తగిలేది మనకే

సైన్యం కంటే ముందే సరిహద్దుకు వెళ్తామన్న వాళ్లెవరూ ఇప్పుడు కనిపించడం లేదు. వీళ్లెవరూ అక్కడ చావడం లేదు. సైనికులు, అక్కడి ప్రజలే బలి అవుతున్నారు. పంజాబ్లో అయితే గొడవ మొదలయ్యేసరికి సరిగ్గా కోతలకాలం సగంలో ఉంది. అయినా ఊళ్లకు ఊళ్లు ఎమర్జన్సీ స్థితిలోకి వెళ్లిపోయాయి. దూరం నుంచి దీపావళిలా చూస్తున్నాం మనం. మనకు చేతనైతే యుద్ధం ఆపాలని చెప్పాలి. త్వరగా దాన్ని ముగించే దారులు వెతకాలని కోరాలి. ఏకాకిని చేస్తేనే... చచ్చే ప్రత్యర్ధి అవతల ఉన్నది. మన పతనం కోసం ఎదురుచూసే బలమైన ప్రత్యర్ధులు ఇంకా వేరే ఉన్నారు. మధ్యవర్తిత్వం పేరుతో వచ్చి వాలడానికి వాళ్లు రెడీగా ఉన్నారు. వాళ్లకి ఇది అవకాశం కాకూడదు.


Friday, April 25, 2025

ఒకే మతం... ఒకే దేశం..!

ప్రపంచంలో క్యాపిటలిజం తప్ప మరో మతం లేదు. పాత మతాల్లో దేవుళ్లు, దెయ్యాల గోల ఉంటుంది. కానీ దెయ్యాలు మాత్రమే ఉండే మతం ఇది. అనుసరించడం మనకు అనివార్యం. అసలు నీ అనుమతి ఎవడిక్కావాలి. నువ్వు పుట్టకముందే నువ్వు క్యాపిటలిస్టువి. నేనూ అంతే. 

యుద్ధాన్ని అదే పుట్టిస్తుంది. శాంతి కోసం అదే ఏడుస్తుంది. కుట్ర ఎవరైనా చేయొచ్చు. యుద్ధం అది చెప్పినవాళ్లతోనే చేయాలి. వార్‌కి ఒక మార్కెట్. శాంతికి మరో మార్కెట్. రెండు చోట్లా లాభపడేది మాత్రం బిగ్ ప్లేయర్లే. మనుషులు ఇక్కడ మార్కెట్ ముడిసరుకులు. బిగ్ ప్లేయర్స్ విల్ ప్లే విత్ దెమ్ అకార్డింగ్ దెయిర్ ఇంటరెస్ట్. పంచభూతాలే అంగడి సరుకులుగా మారిపోయాయి. నువ్వెంత..!  నువ్వు ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఏ భాష మాట్లాడాలి, ఎవరిని పూజించాలి, ఎవరితో కలిసి బతకాలి, ఎంతమందిని కనాలి, ఏ పని చేయాలి, ఎవర్ని ద్వేషించాలి, ఎప్పుడు చావాలి..? ఇట్ డిసైడ్స్ ఎవ్రీథింగ్. నాకు నచ్చినట్టు బతుకుతున్నా అని సోకులు చెప్పుకోవద్దు. యు డోన్ట్ హేవ్ ఎనీ ఎగ్జంప్షన్స్. 

భిన్నత్వంలో మనుషులకి ఇష్టాఇష్టాలు ఉంటాయి. ఏకత్వంలో మార్కెట్ చెప్పిందే శాసనం. మనుషులంతా హెర్డ్ థియరీ పాటిస్తేనే దానికి లాభం. సమూహాలన్నీ ఒకే దేవుడ్ని పూజిస్తే లాభం. సామ్రాజ్యవాదం పునాదిగా ఎదిగిన మతాలనే చూడండి. ఒకే దేవుడు ఉంటాడు. మిగిలిన చిన్నా చితకా మతాలు కూడా ఇప్పుడు పాటిస్తున్నది అదే. ఈ మతాలన్నీ తమ అసలు ఆకారాన్ని ఎప్పుడో కోల్పోయాయి. క్యాపిటలిజం అవసరాల మేరకు మాత్రమే ఉనికిలో ఉన్నాయి. ప్రపంచం ఏకత్వం వైపు ఎప్పటినుంచో నడుస్తోంది. నడిపించబడుతోంది. మన తరమో, మరో తరమో... ఇట్స్ ఇనెవిటబుల్.

Saturday, March 22, 2025

అనోరా : HONOR

ప్రపంచం అంతా పరితపించే లగ్జరీ. స్వేచ్ఛ కంటే ఖరీదైనది. ఓలిగార్క్‌లు కూడా కొనలేనిది. అనోరా కావాలి అనుకునేది. ది ఆనర్. ఈ సినిమాలో ఇగోర్ కళ్లలో దొరుకుతుంది. 


న్యూడిటీ తప్ప కట్టిపడేసే కథ ఏం ఉంది ఇందులో అనిపించింది మొదట. స్ట్రిప్ క్లబ్‌లో డ్యాన్సర్‌గా పనిచేస్తుంటుంది అనోరా. సినిమా ప్రారంభంలో ఒక కస్టమర్ అడుగుతాడు... నువ్వు ఈ పని చేస్తున్నట్టు మీ ఇంట్లోవాళ్లకి తెలుసా? అని. తెలుసంటుంది. వాళ్లు దీనికి ఓకేనా? అంటాడు. నువ్వు ఇక్కడికి వచ్చినట్టు మీ ఇంట్లోవాళ్లకి తెలుసా? అని ప్రశ్నిస్తుంది అనోరా. తెలియదు అని చెప్తాడు. ఎక్కడా పాజ్‌లు, ఎమోషన్స్ కట్ చేయడం ఉండదు. ఇట్సే ఫ్లో. నాటకీయతకి చోటే ఉండదు. అలా సాగిపోతుంది.

ఒక రష్యన్ ఓలిగార్క్ కొడుకు వాన్యా, అనోరాని బుక్ చేసుకుంటాడు. ఇద్దరూ కామంలో, డ్రగ్స్‌లో మునిగితేలుతారు. ఆ కుర్రాడు ఆ ట్రిప్ ముగించి రష్యా వెళ్తే, అక్కడ తండ్రి కంపెనీలో పనిచేస్తూ పర్మనెంట్‌గా ఉండాలి. కానీ అమెరికాలో ఎవరినైనా పెళ్లి చేసుకుంటే, గ్రీన్‌కార్డ్ సంపాదించి ఇక్కడే ఉండిపోవచ్చు. కామంలోనే అనోరాని ఇష్టపడి, ఆమె ముందు పెళ్లి ప్రపోజల్ పెడతాడు. ముందు ఆమె ఒప్పుకోదు. కానీ ఆమెని నిజంగానే ఇష్టపడుతున్నాను అని చెప్తాడు. పెళ్లయ్యాక వాడి ఇంట్లో తెలుస్తుంది. ఇద్దర్నీ విడదీయాలి అనుకుంటారు. ఆమె గొప్పగా చూసుకుంటున్న ఎంగేజ్‌మెంట్ రింగ్‌ని బలవంతంగా లాక్కుంటారు. మొదట పెళ్లి రద్దుని ప్రతిఘటించిన అనోరా, వాన్యా గాడి నిజస్వరూపం చూశాక వివాహం రద్దుకి ఒప్పుకుంటుంది. 

ఇద్దర్నీ విడదీయడానికి వచ్చిన గ్యాంగ్‌లో ఇగోర్ అని ఒకడుంటాడు. నిజానికి తనకి దక్కాల్సిన గౌరవం కోసం అనోరా పోరాడే సమయంలో... ఆ బాధ ఆమె నుంచి కంటే, ఇగోర్ కళ్లలో బాడీలాంగ్వేజ్‌లో వ్యక్తమయ్యేలా చూపడంలో డైరెక్టర్ షాన్ బేకర్ టేకింగ్ కనిపిస్తుంది. ఎక్కడా పైకి వ్యక్తం చేయడం ఉండదు. క్లైమాక్స్‌లో అనోరా ఎంగేజ్‌మెంట్ రింగ్‌ని ఆమెకే ఇవ్వడం, తర్వాత ఇద్దరూ ఒక్కటయ్యే సీన్‌ కదిలిస్తుంది. 

సినిమా అంతా బలమైన స్త్రీగా అనోరా పాత్రని చిత్రీకరించారు. అలాంటి అనోరాలో భయంతో, బాధతో వణికిపోయే ఒక చిన్నపిల్ల ఉంటుంది. ఆ చిన్నారి ఆఖరి సీన్‌లో మన కళ్లముందుకొస్తుంది. ఏడుస్తూ బేలగా ఇగోర్ గుండెలపై వాలిపోయే ఆ సీన్ కంటతడి పెట్టిస్తుంది.

Friday, November 1, 2024

NOCTURNAL ANIMALS



గతం... 

ప్రస్తుతం...

ఒక కథ...

ఎంత కృత్రిమంగా రాయాలన్నా

ఎంతో కొంత జీవితం అతుక్కుంటుంది

రాత్రి బహుచెడ్డది

వెలుగుని చూడనీదు

మైత్రి కుదరనీదు

అందుకే అప్పుడప్పుడైనా నిద్రపోవాలి

మనుషులు మళ్లీ దొరకరు

ఒక చేయి విడిస్తే

ఇంకో తోడు దొరుకుతుంది అనుకోకు

చీకటి ఒక ఒంటరి

గతం దానికి తోడు

నిన్ను వదలదు, నీతో ఉండదు 

Thursday, June 20, 2024

డియర్ డీర్

డియర్ డీర్

మా ఊరి అడివిలో

మా చేనులో

నీతో నాకున్న పరిచయం వేరు

నిన్ను నేను చూసింది వేరు

నీ వేగం వేరు

నీపై నా కోరిక వేరు

నీ ముక్కలు తప్ప

నేరుగా ముట్టుకున్నదే లేదు


డియర్ డీర్

నీ నోటికి మేతనందించా

నీ నెత్తిన నిమరాలని చూశా

నా పిల్లలకి తప్పుగా పరిచయం చేశా

జంతుప్రేమ జీవ వైవిధ్యం కాదని

అభయం ఇచ్చేది అసలు అరణ్యమే కాదని

చెప్పాలని ఉంది కానీ 

చాలా దూరం వచ్చేశాం

వెనక్కి వెళ్లడం నాకే ఇష్టం లేదేమో

అసలది కుదరని పనేమో!


డియర్ డీర్

మళ్లీ మనం కలుస్తామో లేదో

రేపు అడివంటూ బ్రతికుంటే

నా పిల్లలెప్పుడైనా అక్కడికొస్తే

ఒట్టిచేతులతో నీ వెంటబడిన

నా గురించి వాళ్లకి గుర్తు చెయ్

రిజర్వ్ ఫారెస్టుని మించిన

జీవితం ఒకటుందని చెప్పు

వీలైతే అందులోంచి 

వాళ్లనయినా బైటపడమని చెప్పు

Sunday, March 10, 2024

పర్యావరణం - ఆలియాభట్



నీతులు చెప్పడం మంచి వ్యాపారం అయిపోయింది. రీసెంట్‌గా పోచర్ సిరీస్ చూశాను. అందులో పర్యావరణ స్పృహ గురించి దంచిపడేశారు. ఇండియాలో వేట అనేదాన్ని 50 ఏళ్ల కిందట బ్యాన్ చేశారు. రాత్రికి రాత్రే వేలమంది వేటగాళ్లు నేరస్తులుగా మారిపోయారు. ఇప్పటికీ వేట అనేది అన్నిచోట్లా కొనసాగుతోంది. మరీ అటవీ పోలీసుల దృష్టికి వెళ్లకుండా ఎలాగోలా కానిస్తుంటారు. మా ఊళ్ల దగ్గర అడవిపందుల వేటే ఎక్కువగా చూస్తుంటాం. నాకు అన్ని మాంసాల్లోకి అడవిపంది మాంసం అంటే చాలా ఇష్టం కాబట్టి, ఆ వేట చేసేవాళ్లతో మాట్లాడుతుంటా. ఎక్కువమంది కుక్కలతో వేటాడుతుంటారు. బాంబులు పెట్టేవాళ్లు ఉన్నారు. చాలా తక్కువమంది, చాలా రేర్‌గా నాటు తుపాకులతో వేటాడతారు. నాకు తెలిసిన ఒకరిద్దరు, చాలాసార్లు పోలీసుల వేధింపుల దెబ్బతో తుపాకీతో వేటాడటం మానేశారు. కుక్కలతో వేట కొనసాగుతుంది. కొన్నిసార్లు నిషేధం ఉన్న జంతువుల్ని వేటాడటం కూడా జరుగుతుంది. మరీ అంత ఇష్టానుసారంగా అయితే జరగడం లేదు. వేటలో పార్టిసిపేట్ చేసేవాళ్లలో ఎక్కువమంది అడవుల్లో బతికేవాళ్లే. వాళ్లకి మనకంటే ఎక్కువే పర్యావరణ స్పృహ ఉంది. ఎందుకంటే అడవి మీదే ఆధారపడి బతికేవాళ్లు వాళ్లు. మనం అడవుల్ని నరికి బతుకుతున్నవాళ్లం. జంతువుల చర్మాలు, దంతాలు, గోళ్లని అలంకారాలుగా గోడలకి తగిలించుకుని మురిసిపోయేవాళ్లం. వేట... మాంసం వరకే పరిమితం అయినప్పుడు దానితో ఎలాంటి ప్రమాదం లేదు. ఈ అలంకారాల దాకా వచ్చినప్పుడే అది వ్యాపారమైంది. విస్తృతమైంది. 

ఇక సిరీస్ విషయానికొస్తే ప్రధానపాత్ర మాల అటవీ అధికారి. ఆమెకి తండ్రిమీద విపరీతమైన అసహ్యం ఉంటుంది. ఎందుకంటే తండ్రి వేటగాడు. ఏనుగుల్ని చంపేవాడు. ఇంకో ప్రధానపాత్ర అలన్‌కి కూడా పర్యావరణ స్పృహ కారిపోతూ ఉంటుంది. భార్యాబిడ్డల్ని కూడా పట్టించుకోకుండా ప్రకృతిని ప్రేమిస్తుంటాడు. వీళ్లిద్దరూ ఏనుగుల్ని దంతాల కోసం చంపుతున్నవాళ్లని పట్టుకునే బాధ్యతలో ఉంటారు. చివరికి ఎలాగోలా ముగిస్తారు. అయితే పర్యావరణం, ప్రకృతి, వంకాయ అంటూ అవకాశం వచ్చినప్పుడల్లా ఏదో ట్రాన్స్‌లోకి వెళ్లినట్టు మాట్లాడుతూ ఉంటారు వీళ్లు. అవతలివాళ్ల వాదనకి కూడా 8 ఎపిసోడ్లలో ఒకట్రెండు సార్లు అవకాశం ఇచ్చారనుకోండి. అయితే ఇక్కడ వేటగాళ్ల మీద కంటే, వాటితో వ్యాపారం చేసేవాళ్లపై కాస్త ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టు నటించారు. కానీ మూడు ఎపిసోడ్ల వరకు ఒక వేటగాడిని చూపించకుండానే వాడి చుట్టూ అల్లిన కథ సిరీస్ తీసిన నీతిపరుల కుట్ర స్పష్టంగా తెలిసిపోతుంది. వేట, వేటగాడు అన్న పదాల్లో ఉన్న థ్రిల్‌ని వాడుకోవడమే ఆ కుట్ర. ఒకసారి అలన్ తండ్రి, ఓ పెళ్లి తంతులో అలన్‌పై కోప్పడతాడు. పెద్ద ఇల్లు కట్టుకోలేకపోయాడనేది ఆయన ఆవేదన. దానికి... పెద్ద ఇల్లు, పర్యావరణానికి వ్యతిరేకం అంటూ ఇంకొకరు వత్తాసు పలుకుతారు. మంచిదే. కానీ ఈ సిరీస్ తీసిన ఆలియా భట్ కూడా అలాంటి చిన్న ఇంటిలో ఉండి ఈ నీతులు చెబితే, ఆహా అనుకోవచ్చు. ఆమెకి ఒకటి కాదు రెండు ఇళ్లున్నాయి. ఒక్కొక్కటి ముప్పయి నలభై కోట్ల విలువైనవి. నాలుగు కార్లున్నాయి. వాళ్లాయనకి ఎన్నున్నాయో చూడలేదు. సిరీస్‌లో మాత్రం చిన్న ఇల్లు, చింతలు లేని ఇల్లు అంటూ కబుర్లు చెప్పించారు. 

పర్యావరణం గురించి ఎవరు మాట్లాడినా నవ్వొస్తుంది. పర్యావరణం గురించీ, ప్రకృతి విధ్వంసం గురించి మాట్లాడటానికి ఏమాత్రం అర్హత లేనిది మనిషే. ఇంకోవైపు ప్రకృతి విధ్వంసం గురించి, వ్యవసాయం గురించీ ఒకేసారి బాధపడిపోతుంటాం. అసలు ప్రకృతి ధ్వంసానికి తొలి మెట్టు వ్యవసాయమే. మనందరికీ అది తిండిపెట్టొచ్చు. కానీ వాస్తవం అదే. చెట్లు నరకడంతో మొదలై, నేలకి చెదలు కూడా పట్టకుండా పురుగుమందులతో సమస్త జీవాల్ని చంపడమే లక్ష్యంగా బతుకుతున్నాం. పైకి మాత్రం ఒక్కశాతం కూడా కనిపించని ఆర్గానిక్ వ్యవసాయం అంటూ నకరాలు పోతుంటాం.

లాక్‌డౌన్ టైమ్‌లో మా పొలంలో మినుము వేశాను. మినుము వేయడానికి ముందు దుక్కి దున్నడం అయ్యాక, ఒక నెలకి చేనంతా గడ్డిపడింది. మా బావ పొలం చూడ్డానికి వచ్చి, ఇంత గడ్డిలో మినుము చల్లితే పంట రాదు అన్నాడు. దాంతో ఫ్యామిలీ మొత్తం చేలోకి వెళ్లి గడ్డంతా పీకడం మొదలుపెట్టాం. అందరూ మమ్మల్ని చూసి కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టుంది నా యవ్వారం అనుకున్నారు. ఈ లోపల మిగతా చేలల్లో మినుము చల్లడం కూడా మొదలైంది. కొంతమంది ఆగి ఆడిగేవాళ్లు, ఇట్టా గడ్డి పీక్కోడమేనా మినుము ఏస్తరా లేదా అని. చివరికి కొందరు సీనియర్లు, వ్యవసాయంలో మునిగితేలినవాళ్లు మా తతంగం చూసి, ఒక సలహా ఇచ్చారు. అదేంటంటే... ఇలా ఎవరూ గడ్డి పీకరు నాయనా, మినుము చల్లి, మొక్క వచ్చాక గడ్డి మందు కొడతారు. అది కొట్టాక ఏ గడ్డి మొక్కా రాదు అనేది వాళ్ల సలహా సారాంశం. అయితే గడ్డి మందు కొడితే ఎర్రలు లాంటివి, నేలసారాన్ని పెంచే మరికొన్ని జీవులు చచ్చిపోతాయి, భూమిసారం కూడా దెబ్బతింటుంది కదా అని వాళ్లని అడిగాను. వాళ్లు నన్ను కిందకీపైకి చూసి వెళ్లిపోయారు. మీరెంత పీకినా... మళ్లీ ఒక వాన పడితే గడ్డి వస్తుంది అన్నారు. మా బావకి ఈ గడ్డి మందు వ్యవహారమే తెలియదు. మళ్లీ పడితే, మళ్లీ పీకడమే, వ్యవసాయం అంటే అంతే అన్నాడు ఆయన. ఆయనకి ఏమీ తెలియదు అన్నట్టు మావాళ్లు చూశారు. సరే ఎలాగూ మొదలుపెట్టాం కదా అని, సాధ్యమైనంత వరకు గడ్డి పీకేశాం. కానీ మినుము వేశాక, ఇష్టం లేకపోయినా గడ్డి మందు కూడా కొట్టాం. తర్వాత మరో మూడు సార్లు పురుగు మందు కొట్టించా. చివరికి పంట అద్భుతంగా వచ్చింది. చాలామంది తొలిసారి వ్యవసాయం పెట్టినా, బాగా పండించావు అని పొగిడారు. అయితే పడాల్సిన టైమ్‌లో పడని వానలు పంటంతా చేతికొచ్చాక పడ్డాయి. మూడు రోజులు నాన్‌స్టాప్‌గా కురిసిన వానతో మొత్తం పోయింది. చివరికి పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. పంట పోయినందుకు కూడా పెద్దగా బాధపడలేదు. కానీ వ్యవసాయం అనుకున్నట్టు చేయలేకపోయా అనిపించింది.  సేద్యంలో ఎక్కడా పర్యావరణ స్పృహ ఉండదని స్వానుభవంతో తెలుసుకున్నా. పర్యావరణ స్పృహతో వ్యవసాయం చేసేవాళ్లు చాలామంది ఉన్నారు. అదంతా ఇప్పుడు బలిసినోళ్ల యవ్వారంగా మారిపోయింది. ఆ కథంతా వేరే వ్యవహారం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఫుడ్ సైకిల్‌కి మనిషి ఏ రోజూ కట్టుబడి లేడు. అవసరం లేకపోయినా తన సుఖం కోసం, గొప్పల కోసం ఇతర జీవుల్ని చంపుతున్నాడు. అందులో ఏనుగు పెద్దగా కనిపిస్తుంది. ఎర్రలు కనిపించవు. 

సిరీస్ విషయానికొస్తే ఎవరో ఐవరీ కొంటున్నారు కాబట్టి, దాని అమ్మకాలు చూసే మాఫియాని పట్టుకుంటే ఏనుగుల వేటని ఆపొచ్చు అని చెప్తుంటారు. కానీ సిరీస్ నడిచేది మొత్తం అడవి, వేటగాళ్ల చుట్టూనే. అడవి అందాల్ని, వేటలో థ్రిల్‌ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో నాలుగు నీతులు చెప్పి చేతులు దులుపుకోవచ్చనుకున్నది స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మాల పాత్ర ఏమాత్రం కన్విన్సింగ్‌గా లేదు. వీగన్ స్లోగన్ వినిపించే ఒక వింత తెగకి చెందిన జోంబీలా అనిపించింది. ఇంక సిరీస్‌లో చాలామంది వినాయకుడి భక్తుల్ని చూపించారు. వాళ్ల ఇళ్లలో వినాయకుడి విగ్రహాలు చూపించారు. అంటే వీళ్లంతా ఏనుగుల్ని చంపడాన్ని వ్యతిరేకించేవాళ్లట. అసలు వినాయకుడి పుట్టుకే ఏనుగు వధతో మొదలయింది అనయినా వీళ్లకి తెలుసా అనిపించింది. ఒకవైపు ఏనుగు దంతాలతో వినాయకుడి బొమ్మలు చేసి అమ్మడం చూపిస్తూనే ఇంకోపక్క గణపతి భక్తి ప్రదర్శిస్తారు. మొత్తంగా అసహజపు కోరికలతో, అసహజపు నటనతో కొనసాగినట్టు ఉంది. దివ్యేందు భట్టాచార్య లాంటి నటుడు కూడా ఇందులో తేలిపోయాడు. 

Tuesday, January 2, 2024

మూగ మనుషులు

ఫ్యామిలీ ఈజే అడిక్షన్
కలల కొలిమి నీలో కాలుతూ ఉండొచ్చు
బట్ ఇట్స్ నాటే బర్డన్
అదొక వ్యామోహం
అంత తేలిక కాదు తెంచుకుని పోవడం
కుటుంబమే నీ తొలి కల
యువర్ లైఫ్ బిగిన్స్ దేర్
అదే సంగీతం, అంతకుమించి సర్వస్వం
రెండు దారులు సమాంతరంగా నడిస్తేనే అందం
లుక్ ఎట్ లైఫ్ ఫ్రం బోత్ సైడ్స్
ఒకటి వదిలేశావా 
రెండో దారి ఎడారి
యు లీవ్ దెమ్ లాఫింగ్ వెన్ యు గో
ద సైన్ ఆఫ్ లవ్ ఎనఫ్ ఫర్ లైఫ్..!

[ఈ మూవీ 1990కి ముందటి కాలానికి సంబంధించినట్టు తీసి ఉంటే బాగుండేదని అమెరికాలో చాలా మంది బధిరుల అభిప్రాయం. ఆ తర్వాత అక్కడ వచ్చిన చట్టాలు వాళ్లకి ప్రొఫెషనల్ ఇంటర్‌ప్రెటర్స్‌ని మాండేట్ చేశాయి. సో అక్కడి బధిరులు చాలామందికి ఈ సినిమా అంతగా నచ్చలేదట. బట్ ఇండియాలో ఇలాంటి ఒక ఫ్యామిలీని ఊహించుకుంటే మాత్రం ఇది గొప్ప సినిమా. అసలు కుటుంబంలో ఎవరూ ఆ డిజబిలిటీతో లేకపోయినా ఆ భావోద్వేగాలు అంతే హత్తుకుంటాయి. ఇట్స్ ఆల్ ఎబౌట్ ఫ్యామిలీ అండ్ డ్రీమ్స్. సో ఫ్యామిలీతో కనెక్ట్ అయి ఉండే ప్రతి ఒక్కరికీ నచ్చే సినిమా. ]

Tuesday, August 15, 2023

మహాకవికి నివాళి

గద్దర్ మరణం, ఆయన ఖననం పూర్తయ్యాక చాలామంది నివాళి వ్యాసాలు రాశారు. రాస్తున్నారు. ఆయనని తమ వాడే అనుకున్నవాళ్లు, తమ దగ్గరే ఆగిపోతే బాగుండు అనుకున్నవాళ్లు బాధపడ్డారు. వాళ్ల బాధకీ అర్ధం ఉండొచ్చు. కానీ జీవితం ఎక్కడో మొదలై ఎక్కడో ముగుస్తుంది. అదిక్కడే ఉండిపోవాలి అనుకోవడం విప్లవం కాదు. ఆయన జీవితంలో ఆయన పాటంత వైరుధ్యం ఉంది. అది జీవితానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. 


ఎందరు కవులు ఈ నేలపై పుట్టారో లెక్కలేదు. కానీ ఇలాంటి అంతిమ సంస్కారం దక్కిన కవులెందరు..? ఏ వాగ్గేయకారుడు ఇలాంటి నివాళి అందుకున్నాడు..? తెలుగు నేల కనీవినీ చూడని అంతిమయాత్ర అది. చనిపోయి వారం దాటినా, ఇంకా ఎక్కడ చూసినా ఆ గానమే. కొన్ని కోట్లమంది ఆ నివాళి గానానికి శృతి కలుపుతున్నారు. ఏ ప్రధాన స్రవంతి మీడియా కూడా ఆయన పాడె పక్కన హడావుడి చేయలేదు. జనం వెల్లువ చూశాకే అంతా వచ్చారు.  కొన్ని లక్షలమంది ప్రజలు ఆయన పాడె మోశారు. అందులో కొందరు రాజ్యం ప్రతినిధులు ఉండొచ్చు. అది వాళ్ల అవసరం.  ఏ రాజ్యం తన గుండెల్లో తూటా దింపిందో, అదే రాజ్యాన్ని భయపెట్టి మరీ అధికార లాంఛనాలు లాక్కున్నవాడు గద్దర్ మాత్రమే.  


విప్లవం అంటే తుపాకీ ఒక్కటే కాదు. విప్లవం అంటే జీవం. అదెప్పటికీ ధ్వంసం కాదు. రూపం మారుతుంది అంతే. ఎప్పుడు సంకెళ్లు బిగిసినా వాటిని తెంచుకుని తీరుతుంది. దానికి ఆయుధం అవసరమైతే పట్టుకుంటుంది. పాట అవసరమైతే పాడుతుంది. పార్టీ అవసరమైతే పెడుతుంది. వనరులన్నీ వాటంతట అవే వచ్చి చేరతాయి. అన్నీ పరస్పర ఆధారాలు. అన్నిటినీ గౌరవించి తీరాల్సిందే. 


తన బిడ్డ ఇంజనీర్ కావాలి అనుకుంది వాళ్లమ్మ. కెనరా బ్యాంకులో క్లర్కుగా ఉండుంటే బాగుణ్ను అనుకున్నవాళ్లూ ఉండుంటారు. అడవిలోనే ఉండిపోతే చాలు అనేవాళ్లూ ఉంటారు. అదే భావజాలంతోనే నిలిచిపోతే బాగుండు అనొచ్చు. కానీ విప్లవమే ఆయన భావజాలం. తిరుగుబాటుతోనే జీవితమంతా బతికాడు. 


తుపాకీ పట్టినవాడే, ఓటేయమని పిలుపునిచ్చాడు. పార్టీ పెట్టాడు. ఎర్రజెండా భుజంపై కప్పుకుని రామానుజ తత్వం అంటూ అద్వైతం పాట పాడాడు. రాహుల్‌ గాంధీకి ముద్దుపెట్టాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో... ఆయనేమీ మోడీని ముద్దుపెట్టుకోలేదు. రాజ్యహింసకి గురవుతున్న బాధితుల తక్షణావసరంగా రాహుల్‌ గాంధీని చూశాడు. ఇక రండిరో రామానుజ జాతరకు పాట మాత్రం కాస్త కలుక్కుమనిపించేదే. అది ఆయన ఏ లక్ష్యంతో పాడినా... అందులో జీవం కనిపించలేదు. ఇంక దానికి భవిష్యత్తేం ఉంటుంది. 


మార్క్స్‌, బుద్ధుడు, అంబేద్కర్ అంటూ ఏవో లెక్కలు చెప్పొచ్చు. విప్లవానికి వాళ్లే మొదలు కాదు, వాళ్లే ఆఖరు కాదు. అది నిరంతర ప్రవాహం. అందరి సారం అందులో జీవనదిలా పారుతూనే ఉంటుంది. 


అందుకే ఏదో ఒక భావజాలం నుంచి పుట్టిన పాట కాదు గద్దర్. మట్టి నుంచి, ఆకలి నుంచి, ఆశల నుంచి పుట్టిన పాట ఆయన. పాటయినా, బతుకైనా... జనంతోనే జీవితాంతం మమేకమై ఉన్నాడు. ఆ తల విసురు, ఓహో అనే ఆ అరుపు, నిర్లక్ష్యం నిండిన ఆ నాట్యపు అడుగులు...  కాలగమనంలో మనుషుల మెదళ్లలోంచి ఎరేజ్ అయిపోవచ్చు. కానీ జీవనదిలాంటి ఆయన పాట మరెంతోమంది వాగ్గేయకారులకి కచ్చితంగా ప్రాణం పోస్తూనే ఉంటుంది.


మనిషి ప్రాణం పోతుందేమో, శిఖరం ఒరిగిపోదు. అది శాశ్వతం. ప్రజల యుద్ధానికి సంగీతమై నిలిచినవాడు గద్దర్. చూపున్న పాటకి చావుండదు. అది మట్టిలో కలిసి... కొన్ని కోట్ల మొక్కలై తిరిగొస్తుంది. జీరబొయిన ఎన్నో గొంతులకి జీవం అందిస్తుంది.

Monday, July 11, 2022

గంద‌ర‌గోళ ప‌ర్వం

వాటీజ్ సినిమా ?

ఏదో ఒక సంఘ‌ట‌నో, 

ఊహో, 

క‌థో, 

న‌వ‌లో, 

నాట‌క‌మో ఎత్తుకోవ‌డం. ప్రొడ్యూస‌ర్ని ప‌ట్టుకోవ‌డం. అంతే. 


స్క్రీన్ ప్లే, సంఘ‌ర్ష‌ణ, ఆ సంఘ‌ర్ష‌ణ‌లోకి ప్రేక్ష‌కుడిని ఈడ్చుకొచ్చి స్నానం చేయించ‌డం, వాడు హాలు బైట‌కొచ్చాక‌, ఇంటికెళ్లాక అన్నం తింటూ కూడా ప‌ర‌ధ్యానంగా ఏదో సినిమాలోకంలో మాలోకంలా ఉండడం. చూసిన సిన్మా డైలాగ్ త‌న‌లో త‌నే చెప్పుకోడం. త‌లుపేసుకుని అద్దం ముందు ఫోజు కొట్ట‌డం. ఫైట్స్ గ‌ట్రా న‌చ్చితే ఎగిరెగిరి కాలో చెయ్యో విరగ్గొట్టుకోవ‌డం. ఇలాంటి తొక్కా తోట‌కూర‌ అవ‌స‌రం లేదు.


ఇప్పుడొచ్చిన ఇంకో కొత్త‌ప‌దం అవిడియాల‌జీ. మ‌న స‌బ్జెక్టుకి సంబంధించిన ఐడియాల‌జీ ఉన్న ఒక గుంపుని మ‌చ్చిక చేసుకుంటే వాళ్లే ప్ర‌చారం చేసి పెడ‌తారు. ఆ మ‌ధ్య కశ్మీర్ ఫైల్స్ అప్పుడు ఇలాంటి హ‌డావుడే చూశాం. అలా సోష‌ల్ మీడియాలో ఈ మ‌ధ్య విప‌రీతంగా ప్ర‌చారం జ‌రిగిన సినిమా ఒక‌టుంది. అదే విరాట ప‌ర్వం. ముఖ్యంగా కాస్త సాహిత్యంపై ప్రేమ‌, అభ్యుద‌య భావాలు ఉన్న‌వాళ్లయితే... ఈ సినిమా తెలుగుతెర‌పై స‌రికొత్త ప‌ర్వానికి దారితీస్తుంద‌న్నంత క‌ల‌రిచ్చారు. మూవీ విడుదల అయ్యాక కూడా అలాంటి అభిప్రాయాలే చెప్పారు. మ‌రి ఇంత గొప్ప‌గా చెప్తున్న సిన్మా చూడ‌క‌పోతే బాగోదేమోన‌ని నెట్‌ఫ్లిక్స్‌లో చూశాను. కేవ‌లం మూడంటే మూడు నిమిషాలు మాత్ర‌మే చూడ‌గ‌లిగా. 


ఇందులో స‌బ్జక్ట్ ఏంటో తెలిసిందే. అద్భుత‌మైన సంఘ‌ర్ష‌ణ ఉన్న ఘ‌ట‌న‌. సినిమా తీయ‌డానికి కావాల్సినంత మ్యాట‌రున్న జీవితం. తెలుగు తెర‌కి కొత్త త‌ర‌హా కంటెంట్. కానీ మూవీ తీయ‌డానికి ఆ సంఘ‌ర్ష‌ణ స‌రిపోద‌నుకున్నాడో ఏమో డైరెక్ట‌ర్. కంటెంట్ కొత్త‌ద‌యినా మ‌సాలా మాత్రం పాచిపోయిందే ద‌ట్టించాడు. హీరోయిన్‌కి పేరు పెట్ట‌డానికే ఒక భ‌యంక‌ర‌మైన సీన్ రాసుకున్నారు. ఆ సీన్ చూసే ఇక సినిమా చూడాల్సిన పని లేద‌నిపిచ్చింది. అంత పిచ్చెక్కించింది ఆ సీన్. 


అడ‌విలో ఒక ట్రాక్ట‌ర్ వెళ్తుంటుంది. దారి మ‌ధ్య‌లో న‌క్స‌లైట్ల‌కి, పోలీసుల‌కి మ‌ధ్య కాల్పులు. ట్రాక్ట‌ర్లో అరుపులు. ఇంత‌లో స‌డ‌న్‌గా భారీ వ‌ర్షం. ట్రాక్ట‌ర్లో ఒకావిడ ప్ర‌స‌వ‌వేద‌న‌. వ‌ర్ఘంలో పోలీసుల‌తో త‌ల‌ప‌డుతూనే ఓ మ‌హిళా న‌క్స‌లైట్ ట్రాక్ట‌ర్ ఎక్కి ప్ర‌స‌వం స‌జావుగా సాగేలా చేస్తుంది. పుట్టిన పాపకి పేరు కూడా, ఆమెనే పెట్ట‌మ‌ని అడుగుతాడు తండ్రి. అంత వ‌ర్షంలోనూ మ‌బ్బుల చాటున దాక్కోకుండా... ఈ మ‌హ‌త్త‌ర దృశ్యాన్ని చూడాల‌ని బ‌య‌టే ఉన్న చంద‌మామ దేదీప్య‌మానంగా వెలిగిపోతుంటాడు. అత‌న్ని చూసిన ఆ మ‌హిళా న‌క్స‌లైటు... పాప‌కి వెన్నెల అని పేరు పెడుతుంది. ఆ వెంట‌నే బుల్లెట్ త‌గిలి కింద‌కి ఒరిగిపోతుంది. ఈ హృద్య‌మైన దృశ్యం చూశాక నా బ్రెయిన్ బ‌రువెక్కి చూడ‌టం ఆపేశాను. 


ఇప్పుడూ... అమ్మాయికి వెన్నెల అని పేరు పెట్టాల‌నుకున్న‌ప్పుడు వ‌ర్షం వ్య‌వ‌హారం లేకుండా చూసుకుని ఉండాల్సింది. వ‌ర్షానికి పెట్టిన డ‌బ్బులూ బొక్క, ఈ వ‌ర్షం వ‌ల్ల సినిమాకీ బొక్క‌. అమ్మాయి పేరు వెన్నెల అయితే రాత్రిపూట, అబ్బాయి పేరు ర‌వి కాబ‌ట్టి ప‌గ‌టిపూట సీన్లు తీయాల‌ని రూల్ ఉన్న‌ట్టుంది. అయినా నువ్వెంచుకున్న విష‌యంలో ఎంతో విష‌యం ఉన్న‌ప్పుడు ఇలాంటి అర్ధంప‌ర్ధం లేని డ్రామా అవ‌స‌రమా? రెండున్న‌ర‌ నిమిషాల సీన్‌లోనే ఇంత పెద్ద బొక్క ఉంటే...  హోల్ మూవీలో ఇంకెన్ని హోల్స్ ఉన్నాయో? పోనీ ఈ సన్నివేశంలో ఏదైనా కాన్‌ఫ్లిక్ట్ ఎలివేట్ అయిందా అంటే అదీ లేదు. అంత బ‌రువుగా, సినిమాకే భారంగా తొలి సీన్ ఉంటే... థియేట‌ర్లోకి అప్పుడే వ‌చ్చిన ప్రేక్ష‌కుడు, సినిమా అంతా ముళ్ల‌పై కూర్చున్న ఫీలింగ్‌తోనే చూస్తాడు. 


ఇంత‌కుముందు జార్జిరెడ్డి, ఇప్పుడీ గంద‌ర‌గోళ ప‌ర్వం. రెంటిలో కంటెంట్ చాలా గొప్ప‌ది. కానీ వాటిని తీసి త‌గ‌లెట్టిన విధానం ద‌రిద్రంగా ఉంది. మంచి స‌బ్జ‌క్ట్ ప్రేక్ష‌కుల‌కి చెప్పాల‌నుకునే ఆలోచ‌న మంచిదే, కానీ ఇలా అర్ధం ప‌ర్ధం లేకుండా తెర‌కెక్కించ‌డం మాత్రం క‌రెక్టు కాదు. అప్పుడు మీకూ రొడ్డ‌కొట్టుడు సినిమాలు తీసేవాళ్ల‌కీ ఏంటి తేడా ? 

Monday, February 10, 2020

మెమ‌రీస్ ఆఫ్ మ‌ర్డ‌ర్


పేరసైట్‌కి ఆస్కార్ల పంట పండ‌గానే... ఒక ప‌త్రిక‌లో 'విమ‌ర్శ‌కుల అంచ‌నాలు త‌ల‌క్రిందులు చేస్తూ' అంటూ రాశారు. నిజానికి ప్ర‌పంచ సినిమాని ఇష్ట‌ప‌డేవాళ్లలో పేరసైట్ గురించి జ‌రిగినంత చ‌ర్చ మ‌రేదాని గురించీ జ‌ర‌గ‌లేదు. బాంగ్ జూన్ హో ఇవాళ ప్ర‌పంచానికి తెలిసిన డైరెక్ట‌ర్ కాదు. ప‌ద‌హారు ప‌దిహేడేళ్ల క్రిత‌మే ప్ర‌పంచం దృష్టిని ఆక‌ట్టుకున్న డైరెక్ట‌ర్. నేను పేరసైట్ ఇంకా చూడ‌లేదు కానీ ఇదే బాంగ్ జూన్ హో తీసిన మెమ‌రీస్ ఆఫ్ మ‌ర్డ‌ర్ చూశా. ఎన‌భైల్లో ద‌క్షిణ‌ కొరియాని వణికించిన సీరియ‌ల్ హ‌త్య‌ల నేప‌థ్యంగా వ‌చ్చిన సినిమా(ఆ దేశంలో తొలి సీరియ‌ల్ కిల్ల‌ర్ కేసుగా చెప్పుకుంటారు). సీరియ‌ల్ హ‌త్య‌ల‌పై నేను చూసిన వాటిలో బాగా న‌చ్చిన సినిమా. 

నేర‌స్తుడంటే... ప్ర‌తి ఒక్క‌రి దృష్టిలో ఒక నిర్వ‌చనం ఉంటుంది. కొంద‌రికి గ‌డ్డంబాగా పెంచుకున్న‌వాళ్లంటే అనుమానం. ఎవ‌రితో ఎక్కువ‌గా మాట్లాడ‌ని వాళ్లంటే మ‌రికొంద‌రికి అనుమానం. కొన్ని కులాల వాళ్లు మాత్ర‌మే నేర‌స్తులుగా ఉంటార‌ని కొంద‌రి న‌మ్మ‌కం. న‌ల్ల‌గా ఉండేవాళ్లే నేర‌స్తుల‌ని మ‌రికొంద‌రి న‌మ్మ‌కం. టీవీలో హ‌త్య వార్తా రాగానే అంద‌రం డిటెక్టివుల్లా అయిపోతాం. 'చ‌నిపోయినపిల్ల‌ అమ్మానాన్న స‌రిగా ఏడవ‌డమే లేదు. వాళ్లే హంత‌కులు! వాళ్ల ఇంట్లో ప‌నోళ్లే ఈ ప‌ని చేసుంటారు. వాళ్లే అలాంటి ప‌నులు చేస్తుంటారు!' ఇలా మ‌న‌కి న‌చ్చ‌నివాళ్ల‌ని, మ‌న‌కి చిన్న‌చూపు ఉండే మ‌నుషుల్ని నేర‌స్తుల్ని చేస్తూ మాన‌సికంగా తృప్తి ప‌డుతుంటాం. మ‌న‌కంటే పోలీసులేం తురుంఖాన్లు కాదు. టెక్నాల‌జీ స‌రిగా అభివృద్ధికాని, నేర‌ప‌రిశోధ‌న‌లో శాస్త్రీయ‌త మెరుగ‌వ‌ని దేశాల్లో మామూలు జ‌నానికీ, పోలీసుల‌కీ పెద్ద తేడా ఉండ‌దు. ప‌దహారేళ్ల కింద ఈ విష‌యాల్ని ప్ర‌పంచ‌సినిమా స్క్రీన్ మీద చ‌ర్చ‌కు పెట్టింది మెమ‌రీస్ ఆఫ్ మ‌ర్డ‌ర్.

నేర‌స్తుడ్ని కంటి చూపుతోనే ప‌సిగ‌ట్ట‌గ‌ల‌నని డ‌ప్పాలు కొట్టే డిటెక్టివ్, ఏ నిందితుడికైనా థ‌ర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ మాత్ర‌మే ఇచ్చి నేరాన్ని ఒప్పుకోవ‌డ‌మే శ‌ర‌ణ్యంగా చేసే మ‌రో పోలీస్, సియోల్ నుంచి ప్ర‌త్యేకంగా వ‌చ్చిన ఇంకో డిటెక్టివ్(కాస్త ఎఫ్‌బిఐ టైప్). ఈ ముగ్గురి పరిశోధ‌న, ప‌రిశోధ‌న‌లో వాళ్ల వాళ్ల శైలి, ఒక‌రిపై మ‌రొక‌రి ప్ర‌భావం, వాళ్ల అహం, వాళ్ల‌లో వ‌చ్చే మార్పు... ఇదే సినిమా.  హంత‌కుడ్ని ప‌ట్టుకునే క్ర‌మంలో వాళ్లేంటో వాళ్లు తెలుసుకుంటారు. వాళ్ల‌కీ హంత‌కుడికీ మ‌ధ్య పెద్ద‌గా తేడా లేద‌ని తెలుసుకుంటారు. 

సీరియ‌ల్ హ‌త్య‌ల సినిమాల చ‌రిత్ర‌లో ఈ మూవీ ముగింపు ఊహించ‌నిది. ఊహ‌కి అంద‌నిది. 

ముగింపు సీన్‌లో... ఉద్యోగం వ‌దిలేసి త‌న మానాన త‌ను బ‌తుకుతున్న డిటెక్టివ్, సీరియ‌ల్ హ‌త్య‌ల్లో తొలి హత్య‌ జ‌రిగిన చోటుండే దారిన వెళ్తూ ఆగుతాడు. గ‌తంలో హ‌త్య జ‌రిగిన కాలువ ద‌గ్గ‌ర‌కి వెళ్లి తొంగి చూస్తుంటాడు. 

అటే వెళ్తున్న ఓ పిల్ల 'ఏం చూస్తున్నావు' అని అడుగుతుంది. 

మామూలుగానే చూస్తున్నా... అంటాడు. 

కొన్నిరోజుల‌క్రితం కూడా ఇంకొక అత‌ను ఇలాగే చూశాడు అంటుందా పిల్ల‌. త‌న‌ని ఏం చూస్తున్నావు అని అడిగితే... 'చాలా ఏళ్ల‌క్రితం ఇక్క‌డో ప‌ని చేశా, అందుకే ఈ చోటుని చూడ‌టానికి వ‌చ్చాను' అన్నాడ‌ని  చెప్తుంది. 

ఆ వ్య‌క్తి ఎలా ఉంటాడో చెప్పమంటాడు మాజీ డిటెక్టివ్. 

మామాలుగానే ఉన్నాడు అంటుంది. 

మామూలుగానే అంటే... అని రెట్టిస్తాడు.
 
దానికా పిల్ల 'అంద‌రిలాగే  ఉన్నాడు' అంటుంది. 

అక్క‌డితో సినిమా ముగుస్తుంది.
https://www.youtube.com/watch?v=Ycd3lISxogg

Thursday, May 30, 2019

వైట్ టైగర్

'They remain slaves because they cant see what is beautiful in this world-IQBAL'

భారతదేశంలో నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం అనేవి దరిద్రులు మాత్రమే పాటించాల్సిన నియమాలు. అగ్రవర్ణాల ధనవంతులు, పాలకులకి జీవితాంతం ఏదో ఒకరూపంలో సేవ చేసుకోవడమే దరిద్రుల విధిరాత. ఈ దరిద్రులు కట్టుతప్పకుండా కొందరు బానిస దేవుళ్లనీ సృష్టించారు. ఆ బానిస దేవుళ్ల జీవితం మొత్తం తమ యజమానుల పాదపూజ చేసుకోవడమే. కొండలు పెకళించే శక్తి ఉన్నా... కేవలం యజమానుల సేవే పరమావధిగా ఎలా ఉంటారో అరవింద్ ఆడిగ వైట్ టైగర్ నవల చెప్తుంది. అందులోంచి బైటపడాలంటే అడ్డదారి తప్ప మరోదారి లేని పరిస్థితుల్ని... తన హీరో బలరాం ద్వారా మనకి వివరిస్తాడు.

భారతదేశానికి రెండు ముఖాలు
ఒకటి లక్ష్మణ్‌గ‌ఢ్
రెండు బెంగళూరు

ఒకటి చీకటి
రెండు వెలుతురు

భారతదేశంలో రెండు రకాల మనుషులుంటారు
బలిసిన బాన పొట్టలు
బానిసత్వంలో కునారిల్లే చిన్న పొట్టలు

గాడ్స్ ఆఫ్ స్లేవ్స్...
ఉత్తమ బానిస ఎలా ఉండాలి ?
యజమానికి సేవ చేసుకోవడం తన పూర్వజన్మ సుకృతంలా భావించాలి. యజమాని కాళ్లు నొక్కుతున్నా తన కళ్లలో ప్రేమ కురుస్తూ ఉండాలి. వాడి కాలితో నెత్తిమీద తన్నితే... చిరునవ్వుతో స్వీకరించాలి. అన్నింటికంటే ముఖ్యంగా ప్రతిఫలం గురించి పెద్దగా ఆశించకుండా, అలసట అనేది తెలియకుండా పనిచేస్తూనే ఉండాలి.
నవల మొదటల్లో తన సొంత ఊరు గురించి వర్ణిస్తూ ఓ గుడి గురించి ఇలా చెప్తాడు బలరామ్.
"At the end of the market there is a tall, whitewashed, conelike tower, with intertwining snakes... inside you will find an image of a saffron coloured creature, half human half monkey-Hanuman, everyone's god in darkness. he was faithful servant of the god Rama, and we worship him in our temples because he is a shining example of how to serve your owners with fidelity, love, devotion.

These are gods they foisted on us. understand now, how hard it is for a man to win his freedom in india."

బఫెలో...
లక్ష్మణ్‌గఢ్‌ని శాసించే నలుగురు ధనవంతుల్ని నాలుగు జంతువుల పేర్లతో పిలుచుకుంటుంటాడు బలరాం. బర్రె, అడవి పంది, బలిసిన కాకి, ముంగిస. వీటన్నింటిలో బర్రె గురించి తను చెప్పే విధానం బాగుంటుంది. అది నాకు ఈ దేశ ప్రభుత్వాన్ని గుర్తు చేసింది. కార్పొరేట్ కంపెనీల్ని కళ్లముందు నిలిపింది. 
తన ఇంటి ముందు కట్టేసి ఉండే బర్రెని ఇలా వర్ణిస్తాడు బలరాం. 'మా ఇంట్లో అందరికంటే బలిసి ఉండే ప్రాణి అది. దాని శరీరం నున్నగా మెరిసిపోతూ ఉంటుంది. ఎల్లవేళలా అది ఏ పనీలేకుండా ఇంటి ముందు కూర్చుని ఉంటుంది. దాన్ని బలంగా ఉంచడమే... అన్ని ఇళ్లల్లోని ఆడవాళ్ల అందరి లక్ష్యం అన్నట్టు పనిచేస్తారు. అదేమైనా దయతలచి కాస్త ఎక్కువ పాలు ఇస్తే... అమ్ముకోవచ్చని ఆశ.'

కోళ్ల గూడు...
భారతదేశంలో పేదరికాన్ని, బానిస బతుకుల్ని కోళ్లగూడుతో పోలుస్తాడు బలరాం. 'చికెన్ షాపులో కోళ్ల గూడుని ఎప్పుడైనా చూశారా..? ఒక పక్క తమ సోదర కోళ్లని నరుకుతూ ఉన్నా... గూడులోని కోళ్లలో ఎలాంటి చలనం ఉండదు. తర్వాత వంతు తమదే అన్న స్పృహే వాటికి ఉండదు. గూడు బద్దలు కొట్టుకుని బయటపడటానికి అవి ఎలాంటి ప్రయత్నం చేయవు.'

నవలలో మరోచోట బలరాం అంటాడు... 'ఈ కోళ్లగూడుని నియంత్రించడానికి వాటి యజమాని ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన పనిలేదు. అది లోపల్నించే నియంత్రించబడుతుంది. బానిసత్వంలో బతికే జనాలే... మరొకడు అందులోంచి బయటపడకుండా చూసుకుంటుంటారు.'

ల‌క్ష్మ‌ణ్‌గ‌ఢ్‌ని చీక‌టితో.. బెంగ‌ళూరుని వెలుతురుతో పోలుస్తాడు అర‌వింద్ ఆడిగ‌. న‌వ‌ల మొద‌ట్లోనే ఈ దేశం త‌న‌లో త‌నే రెండు దేశాలుగా ఉంద‌ని చెప్తాడు. స‌ముద్రం ఈ దేశానికి వెలుతురు తెస్తుంటే... న‌ది చీక‌టిని మోసుకొస్తోంది అంటాడు. ఈ దేశంలో స‌ముద్రంతో సంబంధ‌మున్న ప్రాంత‌మంతా వెలుతురు నిండి ఉంది. కానీ జీవ‌న‌ది గంగ‌ పారే చోట చీక‌టి నిండి ఉంది అంటాడు.

నవల సారాంశం అంతా తనే రెండు వాక్యాల్లో చెప్తాడు. 
'i was looking for the key for years
but the door was always open'

(ఇంగ్లీషులో ఏకబిగిన చదివిన మొట్టమొదటి నవల. ఇంగ్లీష్ అర్ధం చేసుకోవడం కొంచెం బెటర్ అయినట్టే అనిపిస్తోంది.)

లాక్ అండ్ సెర్చింగ్

మూడు రోజుల క్రితం లాక్ సినిమా చూశా. ఇప్పుడే సెర్చింగ్ మూవీ చూశా. రెండింటి గురించి విడివిడిగా రాయొచ్చు. కానీ కలిపి రాయాల్సిన సినిమాలు అనిపిచ్చింది. 

లాక్...

ఒక కారు, ఫోన్, టామ్ హార్డీ. అంతే సినిమా. మూవీ మొత్తం ఐవన్ లాక్(టామ్ హార్డీ) మాత్రమే కనిపిస్తాడు. ఒకే ఒక్క షాట్ లో రోడ్డు మీద కొందరు నిలబడి కనిపిస్తారు. అంతే. సినిమా అంతా ఫోన్ లో మాట్లాడుతూ, కారు నడుపుతూ ఉంటాడు టామ్ హార్డీ. ఇట్స్ బోరింగ్ కదా. బట్ ఇట్సే బోరింగ్ మాస్టర్ పీస్. 

సెర్చింగ్...

ఈ సినిమా కోసం దాదాపు 6 నెలల నుంచి సెర్చ్ చేస్తుంటే. నిన్న ప్రైమ్ వీడియోలో దొరికింది. సినిమా మొత్తం కేవలం ల్యాప్ టాప్ స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది. అందులోనే వాట్సాప్ మెసేజ్ లు, వీడియో చాటింగ్స్, ఫేస్ బుక్, రకరకాల సోషల్ మీడియా సైట్స్. వీటితోనే ఒక నరాలు తెగే ఉత్కంఠ భరిత సినిమా తీశారు.

లాక్ (మే బీ లోక్ కావచ్చు. లేదా లా..కి, లో..కి మధ్యలో పలకాలేమో) సినిమాలో ఒకే ఒక్క క్యారెక్టర్ కనిపిస్తుంది. కానీ వినిపించే క్యారెక్టర్లు చాలా ఉన్నాయి. కేవలం ఒకేసారి సెక్స్ పాల్గొంటే గర్భం దాల్చి, బిడ్డని కనడానికి సిద్ధంగా ఉన్న ఒకామె... లాక్ భార్య, ఇద్దరు కొడుకులు, లాక్ చేస్తున్న కన్ స్ట్రక్షన్ వర్క్ కి సంబంధించి ఆదేశాలు జారీ చేసే వ్యక్తి, లాక్ నుంచి ఆదేశాలు అందుకునే వ్యక్తి ... ఇలా చాలామందితో లాక్ ఫోన్ సంభాషణలు కొనసాగుతుంటాయి. సినిమా స్టార్టింగ్ లో కాస్త బోర్ అనిపించింది. వినోద్ చెప్పాడని ఓపిగ్గా చూశా. రేప్పొద్దునే తన కెరీర్లోనే అత్యంత ముఖ్యమైన పనిపెట్టుకుని, రాత్రికి భార్యాపిల్లలతో కలిసి ఫుట్ బాల్ మ్యాచ్ చూట్టానికి సిద్ధమై... అన్నింటినీ వదిలేసి తనకి పెద్దగా పరిచయమే లేని, కేవలం ఒక్కరాత్రి సెక్స్ తో తన బిడ్డకి తల్లవుతున్న స్త్రీ కోసం తనెందుకు వెళ్తున్నాడో అర్ధమయ్యేకొద్దీ ఇది నెయిల్ బైటింగ్ సినిమా అయిపోతుంది. టామ్ హార్డీ నటన, స్టీవెన్ నైట్ స్క్రీన్ ప్లే డైరెక్షన్... సినిమాని చివరి వరకూ వదలకుండా చూసేలా చేస్తాయి. 

సెర్చింగ్ ప్లే చేయగానే.. నా డెస్క్ టాప్ వాల్ పేపర్ మారిపోయింది. ఆ వాల్ పేపర్ మార్చి చాలా రోజులయింది. మళ్లీ ఎలా వచ్చింది అనుకుంటుంటే... నాకు తెలియకుండానే డెస్క్ టాప్ ఫోల్డర్స్ ఓపెన్ అవుతున్నాయి. నిజానికి అది నా డెస్క్ టాప్ కాదు. సినిమా ఓపెనింగ్ సీన్ అది. ల్యాప్ టాప్ స్క్రీన్ మీద సినిమా ప్రారంభం అవుతుంది. కొద్ది క్షణాల తర్వాత ల్యాప్ టాప్ ఓనర్ కిమ్.. తన కూతురు మార్గోకి వీడియో కాల్ చేస్తాడు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నాక, ల్యాప్ టాప్ షట్ డౌన్ చేస్తాడు కిమ్. అర్ధరాత్రి మార్గో నుంచి కాల్ వస్తుంది. కిమ్ ఫుల్లుగా నిద్రపోతుంటాడు. ల్యాప్ టాప్ స్క్రీన్ పై కాల్ కట్ అవుతుంది. ఇంకో రెండు సార్లు కాల్ వచ్చి కట్ అవుతుంది. ఉదయం లేచి మిస్డ్ కాల్స్ చూసుకుని కూతురికి కాల్ చేస్తాడు. నో రెస్పాన్స్. తన ఫ్రెండ్స్ కి కాల్ చేస్తాడు. నో రెస్పాన్స్. అక్కడ్నించి కూతురు జాడ కనుక్కోవడమే సెర్చింగ్. రోటీన్ స్టోరీ కదా. కానీ ఈ సినిమా మొత్తం కిమ్ ల్యాప్ టాప్ లోనే జరుగుతుంది. ఎవ్రీథింగ్ ల్యాప్ టాప్ పాయింటాఫ్ వ్యూ నుంచే చూపిస్తాడు డైరెక్టర్ అనీష్ చాగంటి. ప్యూర్ బ్రిలియన్స్ అంటే ఏంటో ఈ సినిమా చూస్తే అర్ధమవుతుంది. 

నాలుగు రోజుల వ్యవధిలో చూసిన ఈ రెండు సినిమాలు... న్యూ వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్.

Friday, May 24, 2019

మాంచెస్టర్ బై ద సీ


మృత్యువు. 
కనుచూపు మేరంతా మంచులా గడ్డకట్టుకుపోయిన మృత్యువు. 
ఎంత తవ్విపోద్దామన్నా ఎడతెగని విషాదపు మంచు. 
పాయింట్ బ్లాంక్ లో బుల్లెట్ దించేసుకుంటే బాధ దిగిపోతుంది. కానీ చావనివ్వదు, బతకనివ్వదు. కాస్తంత చిరునవ్వుని ముఖం మీదకి తెచ్చుకుందామన్నా తీరికలేనంత వేదన.

చిన్నప్పుడెప్పుడో మాతృదేవోభవ చూసినప్పుడు ఇంతలా ఏడ్చా. దీనెమ్మ సినిమా... ఆ యాక్టింగ్ ఏందసలు. వాడి ఒళ్లంతా విషాదమే. వాడి చూపు, నడక, పని... ఆఖరికి ఎవర్నైనా కొడుతున్నా ఏడుపొచ్చేంత విషాదం. ప్రపంచం నుంచి తనని తాను వెలి వేసుకున్నట్టు.. సినిమా మొదటి నుంచి చివరి వరకూ విషాదం తప్ప తన ముఖంలో మరో ఎక్స్ ప్రెషన్ ఉండదు. కేవలం ఫ్లాష్ బ్యాక్ రివీల్ అయ్యే సీన్లలోనే ఆ ముఖంపై నవ్వు కనిపిస్తుంది. ఎవరితో అయినా కాసేపు మాట్లాడటం కూడా తన వల్ల కాదన్నంత బాధ. 

కేసీ అఫ్లెక్... బెన్ అఫ్లెక్ తమ్ముడు. గుడ్ విల్ హంటింగ్ లో అన్నతో పాటు చిన్న రోల్. ఓషన్స్ లెవెన్, ట్వల్వ్, థర్టీన్ లలో కూడా ఉంటాడు. అవుటాఫ్ ఫర్నేస్ లో క్రిస్టియన్ బేల్ సోదరుడిలా చిన్నపాత్రలో కూడా ప్రత్యేకంగా కనిపిస్తాడు. మాంచెస్టర్ బై ద సీ చూశాక వీడికి ఈ మధ్యెప్పుడో ఆస్కార్ వచ్చింది కదా అని గుర్తొచ్చింది. వెతికితే ఈ సినిమాకే వచ్చిందది.  ఆస్కార్ ఏంది, ఏదైనా ఇచ్చెయ్యచ్చు

సినిమా మొత్తంలో ఒక్కచోట కూడా తను ఏడవడు. ఒక సీన్ లో లీ షాండ్లర్(కేసీ అఫ్లెక్)తో మాజీ భార్య ర్యాండీ కాసేపు మాట్లాడాలంటూ ఏడుస్తూ బతిమాలుతుంటుంది. తను మాత్రం క్యాజువల్గా 'నా వల్ల కాదు. వెళ్లిపోవాలి' అంటుంటాడు. మన కళ్లవెంట మాత్రం కన్నీళ్లు కారిపోతుంటాయి. మనస్పూర్తిగా ఏడవాలనుకుంటే ఈ సినిమా చూడొచ్చు. స్లో బర్నింగ్ స్టోరీ. సూపర్బ్ స్క్రీన్ ప్లే. అందుకే ఒక్క ముక్క కూడా స్టోరీ చెప్పాలనిపించడం లేదు.

Friday, May 17, 2019

ద బాయ్ హూ హార్నెస్డ్ ద విండ్


కొన్నిసార్లు అవి కలలు
కొన్నిసార్లు అబద్దాలు
తీరని కలలు
అబద్దాలై ఆవిరైపోతాయి
కానీ కల అబద్ధం కాదు
నిజం కాకపోవచ్చు అంతే...
ఆకలి అందర్నీ తినేస్తుందేమో కానీ
ఆశల్ని కాదు
కలల డైనమోకి
కాస్తంత శక్తి ఇచ్చి చూడు
గాలి నీరవుతుంది
నేల బంగారం అవుతుంది


(వాటే మూవీ.. సినిమాలో బాగా నచ్చిన సీన్... విలియం, కుక్కతో కలిసి చిన్న గుట్ట మీదకి ఎక్కి చెట్లు కొట్టే సన్నివేశం చూస్తాడు. అదే సమయంలో మరో వైపు నుంచి మాస్క్ వేసుకున్న ఇంకో చిన్న కుర్రోడు కూడా అదే సన్నివేశం చూస్తుంటాడు. అటే చూస్తూ చూస్తూ వీళ్లిద్దరూ ఒకర్ని ఒకరు చూసుకుంటారు. ఆ సీన్ పిక్చరైజేషన్ బాగా వచ్చింది.)

Thursday, May 16, 2019

గరుగు చెప్పిన కథ

ఊరికి ఉత్తరాన హద్దు గీసినట్టు తాడిచెట్లు. వాటికి పర్లాంగు దూరంలో గరుగు. దాని తర్వాత నక్కలబోడు. దానికి పైన దోసకాయలబోడు. ముందుకుబోతే పీసెర్లకొండ. ఆ కొండలో కానీ, ఈ పక్క మాలకొండ అడివిలో కానీ, మా ఊరికి దిగవనున్న మల్లప్పగొందిలో కానీ లేని సక్కదనమేందో.. గరుగులో ఉన్నట్టనిపిచ్చేది. మహాకాయుడెవుడో రొమ్మిర్సుకుని పడుకున్నట్టు ఉంటదా గుట్ట. దాన్నిండా యాడచూసినా తెల్లటి కన్నెరాళ్లే. గుట్టకాడికి ఎప్పుడు పొయినా ఎవురో గుసగుసలాడుతున్నట్టనిపిచ్చేది. ఆ ఏపు పెద్దగా మనుషులు పొయ్యేది కూడా లేదు. నాకు మాత్రం అటొచ్చినప్పుడల్లా తెలిసిన మనిసెవురో తిరుగుతున్నట్టనిపిచ్చేది. అక్కి దాసరోడి గురించి ఇన్న కతలన్నీ గుర్తుకు వచ్చేయి.

అక్కి దాసరోడు, అక్కిపిచ్చోడు…

రెండు పేర్లు, రెండు రకాల కతలు. మనిసొకడే.

సిన్నప్పుడు బడికిపోతుంటే పెద్దూరు పిల్లోల్లు అక్కిపిచ్చోడి గురించి కతలుకతలుగా చెప్పేవోళ్లు. వాడు ఉచ్చ పోస్తే రాతిమీద కూడా పెచ్చులు ఎగిరి పొయ్యేయంట. పిగిలీ కొడితే రెండు మైళ్లదూరం ఇనిపిచ్చేదంట. మా ఊరడివిలో ముగ్గురు దొంగోళ్లతో రోజంతా యుద్ధం చేసి సంపిండంట. అక్కోడి గురించి ఇట్టాంటి కతలెన్నో.

‘ఆరున్నర అడుగల ఎత్తు మనిషి. ఈపు మీదికి జారిన జుట్టు, నాపరాయిలాంటి నల్లని నుదురు, పెద్దపెద్ద కనుగుడ్లు, పొడుగ్గా బండలాంటి ముక్కు, మెలితిరిగిన మీసాలు, మోకాళ్లు తాకే చేతులు, కొండలాంటి గుండె. ఈయన్నీ మామూలు విషయాలే. అక్కోడి తొడల్లో ఉంది అసలైన మర్మం’.

అదే ‘సంజీవి’. మనిషికి సావులేకుండా చేసే సంజీవి.

అక్కోడంటే ఇప్పుటి మనిషి కాదు. అరవై డెబ్బయ్యేళ్ల కిందటిమాట. మాయత్త, మానాయన బుడ్డబుడ్డ పిల్లోళ్లుగా ఉన్నప్పటి సంగతి. అడివే వాడికి గూడు. అప్పుడప్పుడూ చేతిలో సితార పట్టుకుని అడుక్కోడానికి ఊర్లమీదికి వచ్చేవోడంట. వాడికి బిచ్చమెయ్యడానికి మాత్రం ఆడోళ్లు బైటకొచ్చేవోళ్లు కాదంట. ఆడమనిసిని చూస్తే శివాలెత్తి పోతాడనేవోళ్లు. కన్నారా చూసిండా, ఆ మనిసిని వదిలేవోడు కాదంట. కొంతమంది మటుకు ‘అసలు అక్కిదాసరోడి పాట, వాటం చూసి ఆడోళ్లే వాడినెతుక్కుంటా పొయ్యేవోళ్లు’ అన్నరు. వాడెప్పుడూ ఎవుర్నీ ఏదీ చేసినట్టు చూసినోళ్లే లేరంటరు. వాడు సితార మీటుతూ, పాడుతుంటే ఏ జీవైనా ఒళ్లుమరిచిపోవాల్సిందే అంట. వాడి గురించి ఇన్న కతలన్నీ గుర్తొస్తా ఉంటే గరుగు మీద కాసేపు కూర్చోవాలనిపిచ్చింది. అప్పుడు మల్లప్పగొంది మీదికి దిగతా ఉంది పొద్దు. ఆడ కూచ్చుని చూస్తా ఉంటే.. డెబ్బయ్యేళ్ల కిందికి పొయింది ఊరు. మిద్దెలన్నీ మాయమయినయి. అడివితో అల్లుకుపోయిన గుడిసెలతో.. చిన్నపల్లె కళ్లముందుకొచ్చింది.

***
మాలకొండ అడివిలోంచి మా ఊళ్లోకొచ్చే సన్నని బాటమీద.. ఆరున్నరడుగుల మనిషి. మోకాళ్లకి కాస్త కిందకి కట్టిన పంచె, మెడమీద పాత కండవ తప్ప ఒంటిపై మరే గుడ్డా లేదు. మిట్టమధ్యాన్నం. గాలికి ఎర్రమట్టి ఎగిరిపోతా ఉంది. చేతిలో ఉన్న సితారని మీటుతూ మెల్లగా నడుస్తుండు. అక్కిదాసరోడు ఊళ్లోకి వచ్చేసరికి.. ఎండ సెగకి తట్టుకోలేని చంటోళ్లు గుక్కపట్టి ఏడుస్తా ఉన్నరు. సిత్రంగా వాళ్లంతా గాలి జోలపాడినట్టు నిద్రలోకి జారుకున్నరు. వాడు అట్టనే సితార వాయిస్తూ ఇళ్లన్నీ తిరిగి రెండు సంగటి ముద్దలు, ఇంత గోగాకు పచ్చడి సంపాయించి బడికొట్టం ముందుకి చేరిండు. ఆడ్నే ఉన్న రావిచెట్టు కింద కూర్చోని సితార తీగల్నిసరిచేసుకుంటుంటే.. కొట్టంలోంచి అయివోరు, అక్కోడ్ని చూసి పలకరించినట్టు నవ్విండు. బదులుగా తను సితార తీగల్ని మీటిండు. బళ్లో పిల్లోళ్లంతా బైటకొచ్చి నిలబడ్డరు. పదినిమిషాల పాటు ఏకబిగిన సితార వాయించి ఆపిండు అక్కోడు. పిల్లోళ్లంతా మాటలు మర్సిపోయి మిటుకూమిటుకూ చూస్తా ఉన్నరు.

అప్పుడే బడికొట్టానికి తూరుపుపక్క వీధిలో ఉన్న ఇంట్లోంచి కడవెత్తుకుని బైటకొచ్చిందొకామె. పెదకాపు చెల్లెలు. భర్త చచ్చిపోడంతో అందమ్ముల ఎదానే ఉంటా ఉంది. పేరు కొండమ్మ. నడిసొత్తున్న నల్లతాసులా ఉంది మనిషి. నెలవంకతో చెక్కిన గెనేటి రాయి బొమ్మలా ఉంది. కడవ తీసుకుని బడికొట్టానికి పడమటి పక్క ఉన్న బాయి దగ్గరికిపొయింది. అటే చూస్తున్న అక్కోడు సితార పట్టుకునే పైకి లేసి, బాయికాడికి నడిచిండు. పిల్లోల్ని మధ్నాన్నం కూటికి ఇంటికి పంపిన అయివోరు.. అడనే కూచ్చోని బాయి దిక్కుకే చూస్తాఉండు.

కొండమ్మ నీళ్లు తోడి కడవకి పోసుకుని ఎత్తుకోబోయేసరికి.. ఆడికి చేరిండు అక్కోడు. దోసిలి పట్టి మంచినీళ్లు పొయ్యమన్నడు. వాడినట్టాగే చూస్తా.. చేదని మళ్లీ బాయిలోకి ఇడిచి నీళ్లు తోడింది. కొండమ్మ కళ్లలోకి అక్కోడి చూపులు గుచ్చుతుంటే.. వాడి చేతివేళ్లని మీటతా ఉన్నయి ఆయమ్మి చూపులు. అట్టనే చూస్తా చేదడు నీళ్లు తాగిండు. నీళ్ల కడవతో తను పోతాఉంటే.. సితార అందుకున్నడు.

కోటే నన్నిడనాడకే
ఓ చిలకల కోటే.. చిట్టెపు రైక
గోటిరైకా.. కొబ్బిరిపొడుమా
కోటే నన్నిడనాడకే…
సేను కాడికి నువ్వే రాయే
శనగపీకను నేనే వస్తా..
నా సాయ నువ్ చూడకపొయినా
శనగమండతో చతురులు ఆడే
కోటే నన్నిడనాడకే
ఓ చిలకల కోటే.. చిట్టెపు రైక
గోటిరైకా.. కొబ్బిరిపొడుమా
కోటే నన్నిడనాడకే
బాయి కాడికి నువ్వే రాయే
నీళ్లు తోడను నేనే వస్తా
నా సాయ నువ్ చూడకపొయినా
నీళ్ల కడవతో చతురులు ఆడే…

కొండమ్మ నీళ్ల కడవతో ఇంట్లోకి పోడంతో.. పాట ఆపి మళ్లీ రావిచెట్టుకిందకొచ్చిండు.

సంగటి ముద్దలు మింగతా ఉంటే..

‘ఆడమనిషి మీద అతిగా బెమలు పెంచుకున్నోళ్లంతా చరిత్రలో రాక్షసులు, పిచ్చోళ్లుగా మిగిలిపొయిన్రురా’

అయ్యవోరి మాటకి తలెత్తి.. ఎర్రినవ్వొకటి నవ్విండు.

‘నీకాడ సంజీవిని ఉందంట గదరా.. తల బద్దలుకొట్టినా ఏంగాదంట..?’

సంగటి ముద్ద గోగాకు పచ్చడిలో తిప్పుతా.. ‘ఊరుకో అయివోరా.. నాకాడ యాముంది’ అంటూ ముద్ద నోట్లో పెట్టుకున్నడు.

‘ఒరేయ్ దరిద్రుడికి సంజీవి కాదు, అమృతం దొరికినా ఈ బూమ్మీద బతకడం కష్టమే గుర్తుబెట్టుకో’

అయివోరొంక అట్నే చూస్తా సంగటి తిన్నడు అక్కోడు.

‘అయినా మంచి వయసులో ఉన్నవు. ఏదొక పనిచేసుకుని బతక్క ఈ అడువులెమ్మట తిరగడమెందుకు..?’

కాసేపాగి ఓ వెర్రినవ్వు నవ్విండు అక్కోడు. సంగటి తినడం పూర్తిచేసి పైకి లేసిండు.

ఇందాక వచ్చిన దిక్కుకి కాక.. మంచినీళ్ల బాయి మీదగా, గరుగు కింద ఉన్న చెరువుకట్ట పక్కకి నడుచుకుంటా పొయిండు. పెదకాపోళ్ల చేను దిక్కుకి పొయి చెట్లలో కలిసిండు. కూటికి పొయిన పిల్లోళ్లు మళ్లీ రావడంతో బడికొట్టంలోకి పొయిండు అయివోరు.

పొద్దుగూకే యాలకి పల్లెంతా గుబట్లాడతా ఉంది. అక్కోడు కొండమ్మని పట్టుకున్నడంట. చేలో గడ్డికిపోతే మీదపడ్డడంట. కొండమ్మ, వాళ్ల ఒదిన.. తప్పించుకుని పరిగెత్తుకుంటా ఒచ్చిన్రంట. ఇదీ వార్త. చెరువుకట్టకి పై ఎత్తున ఉంది పెదకాపు చేను. చేను మధ్యలో ఆరు మట్ల లోతున్న బాయి. బాయొడ్డున ఉన్న గుట్ట పక్కనుంచి మీదకొచ్చిండంట వాడు. కొండమ్మోళ్ల వదినే ఇదంతా చెప్పిందంట. వాడ్నించి అంత దూరం నుంచి తప్పించుకుని వచ్చిన్రంటేనే, అదేదో సాహసం లాగా చెప్పుకుంటా ఉన్నరు ఊళ్లో.

రాత్రికి బడికొట్టం దగ్గిర పంచాయతి పెట్టిండు పెదకాపు. అక్కిదాసరోడు ఊళ్లోకి వస్తే నరికెయ్యడమేనని తీర్మానం చేసిండు. పెదకాపుకి అయినోళ్లు, కొంతమంది కుర్రోళ్లు ఆ మాటకే ఓటేసిన్రు.

‘మొన్నామధ్యన పీసెర్లకొండకి గడ్డికి పొయిన ఆడోళ్ల ఎంట కూడా పడ్డడంట’ గుంపులోంచి ఎవురో గట్టిగా అన్నరు.

‘ఆ దాసరోడు మన ఇళ్లళ్లో అడక్కతింటా.. పాటలు పాడతడా’ నలుగురైదుగురు అక్కసు ఎళ్లగక్కిన్రు.

‘అసలింత పని చేసినోడు మళ్లీ ఊళ్లోకి వస్తడా.. వదిలెయ్యన్రా’ అన్నరు కాస్త వయసులో పెద్దోళ్లు.

‘వాడు పిచ్చినాకొడుకు.. అడక్క తినడానికి కచ్చితంగా వస్తడు. సంపితీరాల్సిందే’. పెదకాపు గట్టిగా అన్నాక ఇంకెవురూ మాట్లాడలేదు.

***
తెల్లారింది. రాత్రి పంచాయతీ సంగతి మర్సిపొయిన ఊరిజనం.. ఎవురి పనుల్లోకి వాళ్లు పోతా ఉన్రు. పొద్దు బారెడు పైకెక్కినాక.. సితార మోగింది. ఊరంతా ఉలుకూపలుకూ లేకుండా అయిపోయింది. మంచినీళ్ల బాయిదగ్గర ఎవురో పిల్లోళ్లు. నీళ్లు చేదుకుంటుంటే పొయిండు అక్కోడు. చేదిన నీళ్లు, కడవలు ఆడ్నే పడేసి పరిగెత్తిన్రు వాళ్లు. సితార పక్కనబెట్టి చేదలో నీళ్లు దోసిటతో తాగుతుంటే.. తలమీద ఠంగ్ మని దెబ్బ. ముందుకి పడబోయి తట్టుకుని నిలబడ్డడు. చేతిలో ఉన్న చేదని తీసుకుని.. సర్రున ఎనక్కి ఇసిరిండు. పెదకాపు పక్కనున్న మనిషి నాలుగడుగుల దూరంలో పడ్డడు. పెదకాపు చేతిలో ఉన్న కర్ర చూసి, తననీ లాగి ఒక్క తన్ను తన్నిండు. ముందు పడినోడి పక్కనే పెదకాపు పడ్డంతో ఇంకో ఇద్దరు గుమ్మునుండిపొయిన్రు. కిందపడ్డోళ్ల దగ్గరికి పోయి లేపి నిలబెట్టిన్రు.

‘నా కొడకా.. నువ్వియ్యాల సచ్చినవ్ ఆగు..’ అంటా చరచరా నడస్తా పొయిండు పెదకాపు. పక్కనున్న ముగ్గురు కూడా.
వాళ్ల పోతున్న దిక్కే అర్ధంకానట్టు చూస్తా బాయి కాడనే కాసేపు నిల్చుండు అక్కిదాసరోడు. నెత్తి మీద తగిలిన దెబ్బని తడుముకుంటా. తర్వాత బడికొట్టం దగ్గరికి చేరిండు. రావిచెట్టుకి ఆనుకుని కూర్చుని సితార చేతిలోకి తీసుకున్నడు. కొట్టంలో ఉన్న అయ్యవోరు, అక్కోడి పక్కకి భయంభయంగా చూస్తా ఉండు. వాడు మాత్రం ఎప్పుటిలాగే కళ్లు మూసుకుని తీగల్ని మీటుకుంటూ రాగం తీస్తున్నడు. ఇంతలో చెట్టు ఎనక చప్పుడయింది. లేచేలోపే.. పగ్గంతో అక్కోడ్ని చెట్టుకు లాగి కట్టిన్రు. పెదకాపుతో కల్సి 20మంది దాకా ఉన్నరు. చేతిలో ఉన్న కర్ర విరిగిపోయేదాకా కొట్టిండు పెదకాపు. నోటికొచ్చిన బూతులన్నీ తిడుతూ. తర్వాత వాడు తప్పించుకోకుండా జాగ్రత్తగా చెట్టునుంచి విప్పి ఎద్దులబండి ఎనక కట్టేసిన్రు అక్కోడ్ని. అప్పటికే వాడి తలపగిలి రక్తం కారతా ఉంది. సితార వైపే చూస్తా ఉండు అక్కోడు. పెద్ద బండొకటి తీసుకుని ఒక్కదెబ్బకి దాన్ని బద్దలుకొట్టిండు పెదకాపు. గింజుకుంటా ఉన్నడు అక్కోడు. చుట్టూ ఉన్న కొంతమంది ఆడోళ్లు.. వాడిపాపాన వాడు పోతడు వదిలెయ్యండని అన్నా పెదకాపు విన్లేదు. అంతకుమించి గట్టిగా అడగడానికి.. అక్కోడు ఆడున్న ఎవురికీ చుట్టం కాదు. వాడు పాడుతుంటే మైమరిచిపోయి ఓ సంగటిముద్ద పడేసినోళ్లంతా.. ఇప్పుడు జాలి చూపులు పడేయడం తప్ప ఏం చేయలేకపోయిన్రు. వాడు సితార మీటినప్పుడల్లా గుండెల్లో కోసినట్టు అనిపించినోళ్లు.. ఇప్పుడు కసి తీర్చుకుంటున్రు.

బడికొట్టం దగ్గరే ఉంటే ఇబ్బందిగా ఉంటదనో ఏమో.. ‘ఈడ ఒద్దురా గరుగుమీదకి తీసకపోదాం పాండి’ అన్నడు పెదకాపు. బండిని కదిలించి అక్కోడ్ని ఈడ్చుకుంటా పొయిన్రు. గరుగుమీదకి పొయ్యేసరికి పొద్దు నెత్తిమీదకి వస్తా ఉంది. ఎద్దుల్ని కాడి ఇప్పి చేను మీదకి తోలిన్రు.

‘కొట్టన్రా నా కొడుకుని’ పెదకాపు ఆ మాటన్నడో లేదో నలుగురు ముందుకొచ్చిన్రు.

బండెనక పక్క కటేసిన్రు అక్కోడ్ని. ఊళ్లోంచి ఈడ్చుకొచ్చేటప్పుడే చేతులకి కట్టిన తాళ్లు తెంపుకోడానికి చూసిండు. ఆడోళ్ల బారు ఎంట్రుకలతో పేనిన బలమైన తాళ్లు ఇప్పుకోడం వాడి వశం కాలా. కానీ బండి ఎనకున్నకొయ్య మీద చేతలకి పట్టుచిక్కింది. అంతే బలంకొద్దీ బండిని లేపి ఒక్క ఇసురుతో చుట్టూ తిరిగిండు. అంతపెద్ద బండి కూడా పట్టెమంచం తిరిగినట్టు గాల్లో తిరిగింది. అప్పుడే ఉరుక్కుంటా వచ్చిన నలుగురిలో ఇద్దరికి బండి నొగలు తాకింది. పక్క ఎముకలు ఇరిగినట్టు ఫళక్కుమని చప్పుడొచ్చింది. ఇంకో ఇద్దరు ముందే ఎనక్కి దూకి తప్పించుకున్నరు. కిందపడ్డోళ్లని చూసి మనుషులంతా రాక్షసులైపొయిన్రు. గరుగు మీద దొరికిన రాళ్లు తీసుకుని అక్కోడి మీదకి ఇసరసాగిన్రు. బండిని చాటుచేసుకుని కాచుకున్నా ఒకటీ అరా రాళ్లు వాడి ఒంటికి తగల్తనే ఉన్నయి. అదే అదునుగా పెదకాపు, ఇంకో ఇద్దరు కర్రలు తీసుకుని వాడిమీదకి వచ్చిన్రు. తర్వాత వాడు చేసేదేం లేకుండాపోయింది. నెత్తురు పూసుకుంటా ఉన్న గరుగుని చూసి బయపడినట్టు.. పొద్దు మబ్బుల మద్దిన దాక్కుంది. దూరంగా ఉన్న ఎద్దులు మేత మానుకుని ఇటే చూస్తా నిలుచున్నయి.

మద్దినేల నుంచి పొద్దు కొండలో పడేదాకా అక్కిదాసరోడి మీద కసితీర్చుకుంటనే ఉన్నరు. ఒంట్లో ఉన్న ఎముకల్ని గుల్ల చేసిన్రు. ముక్కూ మొకం యాకం అయిపొయినయి. ముందుకుపడిన జుట్టులోంచి నెత్తురు కారతా ఉంది. నోటిలోంచి సొంగ పడతుంది. కానీ అప్పుటిదాకా వాడి కంట్లోంచి మాత్రం నీళ్లు రాలేదు. ఊరి దిక్కుకే ఉన్నయి చూపులు. ఇంతలో ఎవురో అక్కిదాసరోడి చేతివేళ్లని విరగ్గొట్టిన్రు. ఎన్నో పాటలు, పదాలకి సొరాలు కట్టిన వేళ్లు. బాధగా మూలిగిండు. కంట్లోంచి తొలి నీటిబొట్టు రాలింది. ఎవురికోసమో చూస్తా ఉన్న ఆ కళ్లు.. చేతివేళ్లవైపు తిరిగినయి. చూపులతోనే వాటిని ఆఖరుసారి తడుముకున్నడు. కన్నీళ్లవరద మళ్లీ ఆ అవకాశం ఇయ్యలేదు. కొండలాంటి మనిషి ఇప్పుడు ఒళ్లంతా నలిగిపోయి.. బండి గానుకి అనుకుని కూర్చొని ఉన్నడు. ఒంటి మీద దెబ్బ పడ్డప్పుడల్లా.. వాడు ఒళ్లు కదులుతోందంతే. చివరికి బలమంతా కూడగట్టుకుని ‘రేయ్ ఆపండ్రా’ అని బారంగా అరిచిండు. పెదకాపు చెయ్యెత్తి అందరికీ సైగ చేసి, వాడి దగ్గరకొచ్చిండు.

కుడితొడని చీల్చమంటూ.. సగం మాటలు, సగం సైగలతో చెప్పిండు అక్కోడు. కత్తి తీసుకొచ్చిండు పెదకాపు తమ్ముడు. కుడితొడని రెండంగులాల లోతున కోసిండు. తెల్లటి నరం లాంటిదేదో ఎగిరి బైటపడింది. పెదకాపు ముందుకి వంగబోయేసరికి.. ఎందుకో ఒక్కసారిగా గింజుకున్నడు వాడు. మళ్లీ అంతా మీద పడ్డరు. కాసేపటికి అక్కోడిలో కదలిక ఆగిపొయింది.

గరుగు మీద చిమ్మిన నెత్తురు అద్దినట్టు.. కొండలో పడుతోన్న పొద్దు రక్తపు ముద్దలా ఉంది. అప్పటిదాకా కసితో వాడ్ని చంపినోళ్లలో క్రమంగా భయం కమ్ముకుంటా ఉంది. వాడెక్కడ మళ్లా లేస్తడో అన్న భయం. పెదకాపు ఇద్దరు కుర్రోళ్లని ఊళ్లోకి పంపిండు. నాలుగైదు గొడ్డళ్లు, గడ్డపారలు తీస్కరమ్మన్నడు. నిమిషాల్లో వాళ్లు వెళ్లొచ్చాక.. అందరూ ఒగపాలి ఒకరి మొగాలొకరు చూసుకున్నరు. గొడ్డళ్లు చేతులోకి తీసుకుని.. అక్కోడ్ని ముక్కలు ముక్కలుగా నరికారు. గోతులు తీసి ఒక్కో ముక్కని ఒక్కోదాంట్లో కప్పెట్టిన్రు. అంతా అయిపోయాక ఆయుధాలు తీసుకుని, ఎద్దుల్ని తోలుకుంటా తిరిగి చూడకుండా ఊళ్లోకి మళ్లిన్రు. వాడ్ని కట్టేసి తీసుకొచ్చిన బండిని, తాళ్లనీ అక్కడే ఒదిలేసిన్రు. శ్మశానమైపొయిన గరుగు వాళ్లు పొయిన దిక్కుకే చూస్తున్నట్టుంది.

***
అక్కి దాసరోడ్ని చంపినాక ఊళ్లో అందరూ సంజీవి గురించే మాట్లాడుకున్నరు. వాడి తొడ కోసినప్పుడు కింద పడింది సంజీవి పుల్ల అన్నరు. వాడ్ని చంపే ఊపులో దాన్ని పట్టించుకోకపోతిమే అనుకున్నరు.

ఇది జరిగిన తర్వాత…

సరిగ్గా పదారు రోజులకి కొండమ్మ కనిపించకుండా పోయింది. ఎటు పొయిందో ఎవ్వురికీ అంతుపట్టలా. పెదకాపు కూడా పెద్దగా వెతికించలేదు. చుట్టుపక్కల ఊళ్లలో తిరిగినా కొండమ్మ కనిపించలేదు. తర్వాత అంతా ఆ సంగతే మర్చిపొయిన్రు. కానీ అక్కిదాసరోడి కథ మాత్రం ఇప్పుటికీ చెప్పుకుంటనే ఉన్నరు. ఊళ్లో ఇప్పుడు పెదకాపు కుటుంబానికి చెందినోళ్లెవురూ లేరు. వాళ్ల చేనంతా చిల్లచెట్లు మొలిచినయి. ఆరు మట్ల బాయి సగానికి పైగా పూడిపొయింది. ఉన్న కాసిని నీళ్ల మీద పచ్చగా కప్పగుడ్లు. దానికి కప్పగుడ్డుబాయని పేరు పడింది.

***

కథంతా కళ్లముందు జరిగినట్టనిపించి.. కడుపులో దేవుకు పోతున్నట్లు అయిపోయింది నాకు. చుట్టూ చూస్తే.. నిండా చీకట్లు గమ్ముకున్నయి. కనుచూపు మేరలో మనుషులెవురూ అవుపడ్డం లేదు. ఇంటికి పోదామని లుంగీ ఎగ్గట్టుకుని గరుగుమీద నుంచి లేసినా. అంతే.. జరజర అంటా శబ్దం. ఏందా అని సూద్దునుగదా.. ఒక్కసారి గుండెలదిరిపొయినయ్. ఇప్పుటిదాకా నేను కూర్చున్న రాయి కదల్తా ఉంది. చుట్టుపక్కలంతా అదే సప్పుడు. నాకిందున్న రాయే కాదు. చుట్టూ ఉన్నపెద్ద పెద్ద రాళ్లన్నీ కదుల్తున్నయి. చీకట్లో తెల్లని రాళ్లన్నీ చిన్నచిన్న దయ్యాల్లాగ ఊగిపోతున్నై. నేను రాయిలాగా నిలబడ్డా. కాసేపటికి.. ఒక్కో రాయి కిందనుంచి ఒక్కో అకారం పైకిలేసింది. నాకు ఊపిరి ఆగినట్టనిపిచ్చింది. ఆకారాలన్నీ ఒక్కటై నా ముందు నాలుగడుగుల దూరంలో ఓ మహాకాయుడు ప్రత్యక్షమయిండు.

అంతపెద్ద ఆకారం నన్ను పట్టించుకోకుండా చెరువుకట్ట వైపు తిరిగింది. అలా నడుచుకుంటూ వెళ్తున్న దాని ఎనకనే ధైర్యం చేసి ఎళ్లా. నేరుగా పెదకాపు చేలోకి ఎళ్లిందది. దూరం నుంచి నడుస్తా అటు చూసిన నాకు.. కప్పగుడ్డు బాయి ఒడ్డున ఎవురో ఆడ మనిసి ఉన్నట్టు అనిపిచ్చింది. చీకట్లో సరిగా కనిపించకపొయినా.. నగ్నంగా ఉందని తెలస్తా ఉంది. అతను తనని చేరాక.. ఇద్దరూ ఒకేసారి తిరిగి నన్ను చూసినట్టనిపిచ్చింది. చీకట్లోంచి రెండు జతల కళ్లు.. అంత దూరం నుంచి కూడా కొట్టొచ్చినట్టు కనిపించినయి. గిరుకున్న తిరిగి పరిగెత్తుకుంటా గుట్టమీదకి వచ్చినా. ఎనక్కి తిరిగి చూడాలనుంది, కానీ దైర్యం సాల్లేదు. అదే ఊపులో కిందకి దిగినా.

గరుగు దాటి పోతాఉంటే.. పాటని వదిలి పోతున్నట్టు ఉంది.

దూరంగా చీకట్లో మా ఊరు. ఎనక నుంచి సితార సప్పుడు.

('వాకిలి' వెబ్ మ్యాగజీన్ లో ప్రచురితం)