Friday, March 10, 2017

వెంటాడే ది హంట్


నిజం అనే పాయింట్ మీద ఎప్పుడో 1950లో రషోమన్ మూవీ వచ్చింది. తర్వాత ఎన్ని సినిమాలు ఈ విషయంపై చర్చించాయో తెలీదు కానీ.. అబద్దం అనే విషయంపై తీసిన సినిమా ఒకటి రీసెంట్గా చూశా. డానిష్ ఫిల్మ్ మేకర్ వింటెర్స్ బర్గ్ డైరెక్షన్, మ్యాడ్ మికెల్సన్ ప్రధానపాత్రలో వచ్చిన సినిమా 'ది హంట్'. సినిమా చూసిన వెంటనే ఫేస్ బుక్ లో.. 'అబద్దం ఎవరూ చెప్పరు. నిజాన్ని వెతకడమే చాలామందికి చేతకాదు' అంటూ పోస్ట్ పెట్టా. అసలు అబద్దం అనేది లేదు అనేది నా ఉద్దేశ్యం కాదు. నిజాన్ని పట్టించుకోవాలన్న స్పృహ లేకపోవడం వల్లే.. అబద్దం స్ప్రెడ్ అవుతుందని చెప్పడమే నా ఉద్దేశ్యం. (నిజానికి చాలామంది అబద్దాన్ని కాంక్రీట్ గా చెప్పలేరు కూడా. కానీ దాన్ని స్ప్రెడ్ చేసి ఆనందించాలనుకునే వాళ్లకి దానితో పనిలేదు కదా.)

ది హంట్ సినిమా క్యాప్షనే.. ది లై స్ప్రెడింగ్. ఐదారేళ్ల వయసుండే క్లారా అనే కిండర్గార్డెన్ స్టూడెంట్.. లూకాస్ అనే డే కేర్ టీచర్ తనని లైంగికంగా వేధించాడని చెప్పే చిన్న అబద్ధం చుట్టూ సినిమా తిరుగుతుంది. క్లారా స్వయంగా లూకాస్ బెస్ట్ ఫ్రెండ్ కూతురు కూడా. అప్పటివరకూ లూకాస్ ని ఎంతో మంచోడిగా చూసిన ఆ ఊరివాళ్లు.. ఈ అబద్దంతో కనెక్ట్ అయిపోతారు. అందరూ లూకాస్ ని అనుమానంగా చూడ్డం మొదలుపెడతారు. భార్యతో విడిపోయి ఉంటున్న లూకాస్ దగ్గరకు అతని కొడుకు వచ్చిన సమయంలో తీసిన సీన్.. ఈ అబద్దం కారణంగా లూకాస్ ఎంత నలిగిపోతున్నాడో చూపిస్తుంది. కొన్ని సందర్భాల్లో కేవలం తన ముఖకవళికలతోనే మనతో కన్నీళ్లు పెట్టిస్తాడు మ్యాడ్స్ మికెల్సన్. ఓ వైపు క్లారా.. లూకాస్ తనని ఏమీ చేయలేదని తల్లిదండ్రులకు చెప్పినా వాళ్లు ఒప్పుకోరు. కేసు ఓడిపోతామని క్లారా తల్లి.. భర్త నోరు మూయిస్తుంది. చివరకు ఆధారాల్లేవంటూ కేసు కొట్టేస్తుంది కోర్ట్. దాన్నెవరూ పట్టించుకోరు. అప్పటికే అబద్ధం ఆ ఊరిని ఆక్రమించేస్తుంది. ఎవరో లూకాస్ వాళ్ల కుక్క పిల్లని చంపి అతని ఇంటి ముందు పడేస్తారు. సరుకుల కోసం సూపర్ మార్కెట్ కి వెళ్తే.. అక్కడి వాళ్లు లూకాస్ ని కొట్టి బైటకి గెంటేస్తారు. చివరకు క్రిస్మస్ రోజు చర్చ్ కి వెళ్తాడు లూకాస్. అక్కడే క్లారా తండ్రి, తన ఒకప్పటి బెస్ట్ ఫ్రెండ్ థియోతో వాదనకు దిగుతాడు. తన కళ్లలోకి చూడమనీ, అక్కడేమైనా కనిపిస్తుందా అంటూ నిలదీస్తాడు. ఇకనైనా తనని వదిలేయమంటూ వెళ్లిపోతాడు. అక్కడితో థియో రియలైజ్ అవుతాడు. క్రమంగా విషయాన్ని అందరూ మర్చిపోతారు. లవర్ నడ్జాతో మళ్లీ ఒక్కటవుతాడు లూకాస్. అయితే ఏడాది తర్వాత కొడుక్కి గన్ లైసెన్స్ వచ్చిన సందర్భంగా వెటకి వెళ్లిన లూకాస్ పక్కనుంచి ఓ బుల్లెట్ వెళ్లి చెట్టుకి దిగబడుతుంది. అబద్దం ఆడుతున్న వేట ఇంకా ఆగిపోలేదని అర్ధమవుతుంది. 
(కాల్పులు ఎవరు జరిపారో మనకి చూచాయగా తెలిసిపోతుంది. అదిక్కడ అప్రస్తుతం అనుకుంటున్నాను. నిజానికి ఈ స్టోరీ మొత్తం ఇలా చెప్పేయడం కూడా తప్పే. కానీ ఈ పదిలైన్ల స్టోరీ మాత్రమే.. ఈ సినిమా కాదు. దీనికి కొన్ని వందలరెట్లు అద్భుతంగా మూవీ ఉందని నేననుకుంటున్నా.)


నిజం చుట్టూ తిరిగే రషోమన్ లాగా ఇది మిస్టరీ మూవీ కాదు. చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది. క్లారా చేసే ఆరోపణల్ని స్పష్టంగా చూపిస్తారు. కానీ అబద్దం ఎంత బలమైనదో చూపించడమే వింటెర్స్ బర్గ్ పనితనం. అది అబద్దం అని చెప్పినా ఎవరూ వినే పరిస్థితి ఉండనంత బలంగా అది అల్లుకుపోతుందని చూపిస్తాడు. 

పిల్లలు అబద్దం చెప్పరంటారు. మరి క్లారా అబద్దం ఎందుకు చెప్పింది.?
ఏదైనా ఒక విషయాన్ని కాంక్రీట్గా ఎలా అంగీకరిస్తారు.? 
అసలు క్లారా అబద్దం చెప్పలేదనే నేనంటాను. తను పూర్తి క్లారిటీతో ఏదీ చెప్పదు. ఒకరు ఒక విషయం చెప్పినప్పుడు దానికి ఎలాంటి విలువా ఉండదనే నేననుకుంటాను. దానితో మనం ఏకీభవించాకే ఒక రూపం వస్తుంది. అది నిజమో, అబద్దమో అవుతుంది. ఇక్కడ అబద్దం ఇచ్చినంత ఎంటర్ టైన్మెంట్ నిజం ఇవ్వదు. అందుకే వేగంగా విస్తరిస్తుందది. విస్తరించేకొద్దీ బలపడుతుంది. సినిమాలో లూకాస్ నిర్దోషి అని కోర్టు తేల్చాక.. ఆల్రెడీ ఒక బలమైన నిర్ణయానికి వచ్చేసిన జనం దాన్ని అంగీకరించలేరు. అక్కడ్నించే హింస మొదలవుతుంది. 

లూకాస్ పై అంతలా ఫోకస్ పెట్టిన స్కూల్ కానీ, ఊరివాళ్లు కానీ.. క్లారా చెప్పిన అంశాలపై ఎందుకు చర్చించరు.? హౌ క్లారా నోస్ ఎబౌట్ ఏ విల్లీ..? లూకాస్ కొడుకు వైఖరికీ, థియో కొడుకు తీరుకీ అంత తేడా ఎందుకు..? ఇలాంటి లోతుల్లోకి ఎవరూ వెళ్లరు. ఇక ఐదారేళ్ల చిన్నారికి ఓ టీచర్ పై ఏర్పడే క్రష్ మీద జనం అసలే మాట్లాడలేరని అనుకుంటా. కానీ ఇలాంటి ఎన్నోఅంశాల్నీ అంతర్లీనంగా చర్చకు పెడుతుంది ది హంట్. 

ఓవర్ ప్రొటెక్టివ్ పేరెంట్స్ మీద వేసిన సెటైర్ లాగా కూడా ఈసినిమాని చూడొచ్చు. వీళ్లు తమ పిల్లలకి సొంతంగా ఆలోచించే చాన్స్ ఇవ్వరు. సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వరన్న వాదన ఉంది(లైక్ బొమ్మరిల్లు). అందుకే క్లారా తను అబద్దం చెప్పానని చెప్పినా.. ఆమె పేరెంట్స్ దానికి విలువ ఇవ్వరు.(నిజానికి మొదట్లో క్లారాని పెద్దగా పట్టించుకోనట్టు కనిపించే వీళ్లు.. గొడవ మొదలయ్యాకే ఓవర్ ప్రొటెక్టివ్ అవుతారు.)

ఒంటరి స్త్రీని సమాజం ఎలా చూస్తుందో మెలీనా మూవీలో చూడొచ్చు. అలాగే ఒంటరి మగాడ్ని కూడా సమాజం అంత తేలిగ్గా వదిలిపెట్టదేమో అనిపిస్తుంది హంట్ సినిమా చూశాక. అప్పటివరకూ జింకల వేటలో లూకాస్ నైపుణ్యం, అతని ఫ్రెండ్లీ నేచర్ని చూసినవాళ్లు.. లైంగిక వేధింపుల ప్రస్తావన రాగానే లూకాస్ ఒంటరి తనాన్ని కౌంట్ చేయడం మొదలుపెడతారు.

'ది వాల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఈవిల్. బట్ ఇఫ్ వియ్ హోల్డాన్ ఈచ్ అదర్, ఇట్ గోస్ అవే'
చర్చ్ సీన్ తర్వాత క్లారా తండ్రి రియలైజ్ అవుతూ చెప్పే ఈ డైలాగ్తో.. అబద్దం ఎంత బలమైనదైనా దాన్ని ఎదుర్కొనేందుకు రెమిడీ చూపిస్తాడు వింటెర్స్ బర్గ్. మేకింగ్ విషయానికొస్తే హ్యాండ్ హెల్డ్ కెమెరా వర్క్, నేచురల్ లైట్ కే అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వింటెర్స్ బర్గ్ ఈ సినిమాలో అక్కడక్కడా రెగ్యులర్ మేకింగ్ స్టైల్నికూడా ఫాలో అయ్యాడనిపిస్తుంది. ఒక్కోసారి తప్పదేమో కూడా. ఓవరాల్గా ఈ సినిమా కొన్నాళ్ల పాటు నన్ను వదలదేమో.