Friday, February 8, 2019

మేర్కు తొడార్చి మలై


శ్రమైక జీవన సౌందర్యం... 
తేరగా తిని కూర్చుని ఇలా ఎంతైనా వర్ణించొచ్చు. కానీ శ్రమలో ఉండే కష్టం చేసేవాడికి తెలుస్తుంది. ఎందుకంటే చేసేది ఎక్సర్ సైజ్ కాదు. పని. కానీ పైన చెప్పిన వర్ణన లాంటివే చెప్పి కూలీల శ్రమని దోచుకోవడం వ్యవస్థీకృతమైపోయిన కుట్ర. 
నీ అంత మొగోడు లేడురా, బరువు మొయ్యాలంటే నీ తర్వాతే ఎవుడైనా... 
ఈ రెండు ముక్కలు చాలు వాడు తన గుండెలు పగిలేంత వరకూ పనిచేయడానికి. 
మనం ఒక్క మునం నాటితే, అది మూడు మునాలు నాటుద్ది, దానితో మనమేడ చేస్తాం...
ఈ మూడు మాటలు చాలు ఆ పిల్ల నడుములు పోయేదాకా నాట్లేయడానికి. (మునం=సాలు)
రెండు పొగడ్తలతో ఒకరి చాకిరీని దోచుకుంటారు కానీ కూలీ ఇచ్చేటప్పుడు ఈ మాటలేవీ వినిపించవు. కూలి పని తమకి మెరుగైన బతుకు ఇవ్వదనుకుని తెలుసుకునే సరికి నడుములు వంగిపోయి ఉంటాయి, కండల్లో సత్తువ జారిపోయి ఉంటుంది. 

పశ్చిమ కనుమల పాదాల చెంత ఉండే పల్లెల్లోని కూలి బతుకుల‌పై తీసిన సినిమా 'మేర్కు తొడార్చి మలై'. సినిమాలో ప్రధాన పాత్రధారి రంగసామి ఓ పోర్టర్. కొండలపై బరువైన సరుకుల్ని, సమాచారాన్ని చేరవేసే పని. ఏడాదికో రెండేళ్లకో సరదాగా తిరుపతి కొండెక్కడమో, ట్రెక్కింగ్ కి వెళ్లడమో కాదు... సరైన దారి కూడా లేని అత్యంత ఎత్తైన కొండలపై ప్రతి రోజూ బరువైన బస్తాల్ని మోసుకుని ఎక్కడం దిగడం. ఆ బరువుల్ని మోసీ మోసీ గుండెలు పగిలి చనిపోయిన తోటి కూలీల్ని చూస్తూ పెరిగిన రంగసామికి ఉన్నదల్లా చిన్న కల. చారెడు నేలని వాళ్ల అమ్మ పేరుతో రిజిస్టర్ చేయించడం. కాస్తయినా వ్యవసాయ భూమిని సంపాదించాకే పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. ఆ కల నిజం కాకుండానే పెళ్లి చేసుకుంటాడు. అయితే ఎస్టేట్‌లో పనులు చేయించే కంగని ఉదారతతో భూమిని సంపాదించుకుంటాడు రంగసామి. కానీ ఆ కూలివాడి కలల్ని ఇండస్ట్రియలైజేషన్ ఎలా కూల్చేసిందనేదే ఈ సినిమా.

శ్రమనీ, ప్రేమని నిజాయితీగా పంచుకునే మనుషులు... 
డబ్బుని మాత్రమే తొలిప్రాధాన్యంగా భావించే మనుషులు...
మొదటి రకం మనుషుల వల్ల రంగసామి భూమిని సంపాదించుకుంటే, రెండో రకం మనుషుల వల్ల దాన్ని పోగొట్టుకుంటాడు. సినిమా ప్రారంభంలో కొండపైకి వెళ్లే సమయంలో ఏనుగుల గురించి మాట్లాడుకుంటుంటారు. తొలిసారి ఆ కొండపైకి వచ్చే ఒక వ్యక్తి ఏనుగుల భయం గురించి చెప్పే సమయంలో జరిగే చర్చ.. ఈ సినిమా ఐడియాలజీ ఏంటో చెప్పేస్తుంది. 

సినిమాలో నటుల ఎమోషన్స్ పట్టుకోవాలంటే క్లోజ్ షాట్సే ముఖ్యం. ఈ సంప్రదాయ మేకింగ్ స్టైల్ ని దర్శకుడు లెనిన్ భారతి బ్రేక్ చేశాడు. అత్యంత కీలక సన్నివేశాల్లో కూడా క్లోజ్ షాట్స్ జోలికి పోలేదు. ఏ ఒక్క క్యారెక్టర్ పైనా ఫోకస్ పెట్టకుండా మొత్తం సన్నివేశంతో సంబంధమున్న అందర్నీ చూపించడానికి ప్రయత్నించాడు. దాంతో మనం కూడా వాళ్లందరిలో ఒకరిలా ఆ సన్నివేశాన్ని దగ్గరగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. లెనిన్ ఈ ఆలోచనని తెరపై అద్భుతంగా చూపించడంలో తెని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ, ఇళయరాజా సంగీతం రెండూ ప్లస్ అయ్యాయి. సినిమాలో వచ్చే ఒక్కో ఏరియల్ షాట్ ఒక్కో రకమైన ఏమోషన్ ని పట్టిస్తుంది. చివరిలో రంగసామి తన పొలంలోనే వాచ్ మెన్ గా కూర్చున్నాక వచ్చే ఏరియల్ షాట్ ముందు వంద ఫైటింగ్ క్లైమాక్స్ లు కూడా పనికిరావు. ఇక పశ్చిమ కనుమలపై దిగులు మబ్బులేవో ఆవరించినట్టు ఇళయరాజా సంగీతం సినిమా ఎమోషన్ని మోసుకుంటూ వెళ్తుంది. ఆ దిగులు మబ్బులు చేసే సంగీత రొద మన చెవుల్లోకి దూరి కొన్నిసార్లు కళ్ల నుంచి కన్నీరై వస్తుంది. సినిమా అంతా చూసిన తర్వాత యూట్యూబ్ లో బీజీఎం వింటుంటే... కథ మొత్తం మళ్ళీ కళ్ల ముందు తిరుగుతూ కన్నీళ్లొచ్చాయి. నేల ఒక కలై, ఆ కల కలగానే మిగిలిపోయే కూలి బతుకు కథ ఈ సినిమా. 

నేల గురించి ఈ మధ్య కాలంలో రెండు సినిమాలు చూశాను ఒకటి కాలా, రెండు మేర్కు తొడార్చి మలై. రెండూ తమిళ సినిమాలే.

('మేర్కు తొడార్చి మలై' సినిమా చూసి రెండు రోజులైంది. వేరే సినిమా చూడాలని నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా అన్నీ వెతుకుతున్నా ఏదీ ఆనడం లేదు. ఈ సినిమా వదలడం లేదు. ఇది రాశాక కాస్త బరువు దిగుతుందేమో.)