Friday, June 30, 2017

ఆరంభం


కాసేపు కల నిజం. కాసేపు జీవితం శుద్ధ అబద్ధం. ఆలోచన సరిహద్దు ఆకాశం. అది అంతం కానిది, కల కంటే విస్తృతమైంది. జీవితం అంత లోతైనది. కలల్ని దొంగిలించొచ్చు. ఆలోచనల్ని అవతలివాడి మనసులో నాటేయొచ్చు. సీడ్ బాల్స్ లాగా ఐడియా బాల్స్ విసిరేయొచ్చు. నగరాల్ని మడతపెట్టి మరో కొత్తలోకాన్నిఆవిష్కరించొచ్చు. 

ఎటొచ్చీ జీవితం నుంచి విడిపోలేమే..
ఎన్ని లోకాలైనా సృష్టించు. నీ లైఫ్ నీడ నుంచి తప్పించుకోలేవు. 
ఎన్ని కలల్లోనైనా విహరించు. మనస్సనే మంత్రలోకపు సరిహద్దు దాటలేవు.

క్రిస్టఫర్ నోలాన్.. అద్భుతంగా తీశాడని అనలేను కానీ. ఇది ఐడియాకి అమ్మ మొగుడు లాంటి సినిమా. ఆ ఆలోచనకయితే సలాం చేయొచ్చు. 



Tuesday, June 20, 2017

ఎ సెపరేషన్


సెపరేషన్ మళ్లీ చూశా. ఫర్హాదీ-సేల్స్ మేన్ మూవీ చూసి రాసిన పోస్టుకీ దీనికీ లింకుంది. సెపరేషన్తో పోలిస్తే ఇది కాస్త తేలిపోతుంది అంటూ మెహెర్ కామెంట్ పెట్టాక.. వెంటనే ఐ టూ అగ్రీ అనేశా. తర్వాత కరెక్ట్ కాదేమో అనిపించింది. కరెక్టేనేమో అని కూడా అనిపించింది. అసలు ఈ రెండు సినిమాల్ని ఎందుకు కంపేర్ చేయాలి అనుకుంటూ.. మళ్లీ ఒకసారి సెపరేషన్ చూశా. 

ఒక దేశాన్ని రెండు కుటుంబాలుగా కుదించి తీసిన సినిమా సెపరేషన్. పాలన, న్యాయవ్యవస్థలు, మతం.. ప్రజల డేటూడే లైఫ్ ని సమస్య నుంచి సమస్యల్లోకి ఎలా ఈడ్చుకెళ్తుంటాయో సెపరేషన్లో చూపిస్తాడు ఫర్హాదీ. ఇది ఇరాన్ ఒక్కదేశంలోనే కాదు.. అన్ని దేశాలు, అన్ని మతాలు, అన్ని వ్యవస్థల్లో ప్రజలు వాటితో ఇలాగే ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని కొన్ని మినహాయింపులుండొచ్చు. సినిమాలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒకటి, అప్పుల ఊబిలో ఉన్న పేద కుటుంబం ఇంకొకటి. ఇంకా విడగొడితే.. ఇద్దరు భర్తలు, ఇద్దరు భార్యలు, ఇద్దరు కూతుళ్లు. మోడ్రన్ మిడిల్ క్లాస్, స్లమ్స్ లో బతికే పేదలు. విడగొట్టుకుంటూ వెళ్తే ఈ రెండు కుటుంబాల్లో ఇరాన్ మొత్తం కనిపిస్తుంది. ఆ రేంజ్ లో చెక్కాడా కుటుంబాల్ని ఫర్హాదీ.  

సినిమా ప్రారంభం కోర్టులో.. 
నాదిర్, సిమన్ జంట విడాకుల కోసం వచ్చుంటుంది.

మీరు చెప్పే కారణాలతో విడాకులు ఇవ్వలేం. అసలు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు..? 
ఆయన మిమ్మల్ని కొడ్తున్నారా..? సరిగా చూసుకోవడం లేదా..?

లేదు. ఆయన చాలా మంచోడు.

మరేం..?

విదేశాలకు వెళ్లాలి. ఏడాదిన్నర కష్టపడితే వీసాలొచ్చాయి. వీసా గడువు 40 రోజులే ఉంది. ఆయనేమో తండ్రినొదిలి రానంటున్నాడు. అందుకే విడాకులు కావాలి.

నీ భార్యతో వెళ్లడానికేం ?

నాన్నని విడిచి వెళ్లలేను. తనని వెళ్లమనండి.

వాళ్ల నాన్నకి అల్జీమర్స్. అసలాయన ఈయన్ని గుర్తు కూడా పట్టలేడు. 

కానీ నాకాయన తండ్రి అని తెలుసు కదా..?

తన కూతురి భవిష్యత్తు గురించి పట్టించుకోడా ?

నీ కూతురి భవిష్యత్తుకి ఇక్కడేమైంది ? 

ఇక్కడున్న పరిస్థితుల్లో, ఇలాంటి వాతావరణంలో నా కూతురు పెరగకూడదనుకుంటున్నాను. అది నా హక్కు.

ఇక్కడి పరిస్థితులకేమైంది. మీ ఇద్దరూ కలిసుంటేనే తనకి భవిష్యత్తు. 

అందుకే కదా తనని నాతో రమ్మంటున్నాను. సరే తను రావడం లేదు. నా కూతుర్నయినా నాతో పంపించమనండి.

మీ అమ్మాయి వయసెంత..?

పదకొండేళ్లు. 

ఆ వయసులో ఉన్న అమ్మాయి తండ్రి అనుమతి లేకుండా మీతో రాకూడదు. 

నేను నా సమస్యని తీర్చమని మీ దగ్గరకొచ్చాను. 

తనకి నేనంటేనే ఇష్టం. తను నీతో రాదు. 

తనకి సమస్య అర్ధం కావడం లేదు.

పదకొండేళ్ల అమ్మాయికి ఏది మంచో, ఏది చెడో.. ఆమాత్రం తెలియదా. 

మీరొచ్చి ఇక్కడ సంతకం పెట్టండి.

నాకు 40రోజులే గడువుంది. నా సమస్యని ఎందుకు అర్ధం చేసుకోరూ..?

మీరు ప్రతిసారి చిన్న సమస్య పట్టుకొచ్చి విడొకులు ఇమ్మంటున్నారు. దయచేసి కోర్టు సమయాన్ని వృధా చేయొద్దు. 

కేసు కొట్టేశాడు జడ్జి. ఈ సీన్లో జడ్జి మనకి కనిపించడు. ఇద్దరూ డైరెక్ట్ గా మనతోనే మాట్లాడుతూ, మనని జడ్జిని చేసి కథలోకి లాక్కెళ్తారు. కేసు కొట్టేయడంతో తన పుట్టింటికి వెళ్లిపోతుంది సిమన్. కూతురు తెర్మియా రానంటుంది. ముసలాడు తన చేయి పట్టుకుని వదలడు. కానీ మొండిగా వెళ్లిపోతుంది సిమన్. తండ్రిని చూసుకోవడం కోసం రజియా అనే పనిమనిషిని మాట్లాడుతాడు నాదిర్. తనతో నాలుగైదేళ్ల కూతురు కూడా వస్తుంది. రజియా ప్రెగ్నెన్సీతో ఉండి భర్తకి తెలియకుండా వీళ్లింట్లో పనికి కుదురుతుంది. ముసలాడ్ని చూసుకోవడం తనవల్ల కాదని.. (ముఖ్యంగా తన బట్టలు కూడా మార్చాల్సి వస్తుండడంతో, అదెక్కడ తనకి పాపంలా అవుతుందేమో అన్న భయంతో) తన బదులు తన భర్తని పనిలోకి తీసుకోవాలని అడుగుతుంది. బ్యాంకులో నాదిర్ని కలుస్తాడు రజియా వాళ్లాయన. నిజానికి ఈ మగ క్యారెక్టర్ల మధ్య సిమిలారిటీ ఉంటుంది. ఒకరు తండ్రిని విడవలేక, భార్యని ఒదులుకోలేక ఫ్రస్టేషన్లో ఉంటే.. మరొకరు ఉద్యోగం పోగొట్టుకుని డిప్రెషన్ అనుభవిస్తున్న మనిషి. సరే.. రజియా వాళ్లాయన్ని మరసటి రోజు నుంచి పన్లోకి రమ్మంటాడు. కానీ తను రాడు. మరుసటిరోజు కూడా రజియానే వస్తుంది.

ఒకరోజు నాదిర్, కూతురితో కల్సి ఇంటికొచ్చేసరికి ముసలాడు బెడ్డుపైనుంచి పడిపోయుంటాడు. తనని మంచానికి కట్టేసి ఎటో వెళ్లిపోయుంటుంది రజియా. తండ్రి చనిపోయాడని అనుకుంటాడు. కొద్దిసేపటి తర్వాత తను మామాలుగా అవుతాడు. ఇంట్లో చూస్తే కొంత సొమ్ము మాయం అయ్యుంటుంది. కోపంలో ఉండగానే రజియా వస్తుంది. తనపై ఒక్కసారిగా సీరియస్ అవుతాడు. తనని ఇంట్లోంచి బైటకి గెంటేసే ప్రయత్నంలో.. రజియా మెట్లపై పడిపోతుంది. మరుసటి రోజు తెలుస్తుంది తనకి అబార్షన్ అయిందని. నాదిర్ పై హత్య కేసు నమోదవుతుంది. అక్కడ్నించి ఆట మొదలవుతుంది. కథ ఇక్కడితో ఆపేస్తున్నా.

స్టార్టింగ్ నుంచి చివరివరకూ.. ఇంట్లో , కోర్టులో, హాస్పిటల్లో, స్కూళ్లో, కారులో.. దాదాపు ఎక్కడా వైడ్ యాంగిల్లో సినిమా కనిపించదు. మనని అందులోంచి బైటకు రాకుండా పాత్రల వెంట తిప్పుతాడు. ఏ ఒక్క షాట్ కానీ, డైలాగ్ కానీ, పాత్రల్ని కానీ అనవసరంగా వాడడు. 

ముఖ్యపాత్రల్ని చూస్తే.. ఫ్రస్టేషన్లో ఉన్న ఇద్దరు భర్తలు. ఇద్దరిది దాదాపు ఒకే రకమైన మానసిక స్థితి. కాకపోతే ఒకరు సెక్యులర్ అయినా, తనకున్న స్టేటస్తో, అబద్దాలతో తన సమస్య నుంచి బైటపడేందుకు ప్రయత్నించే మనిషి. తన తప్పు లేదని నిరూపించుకునే ప్రయత్నమే అది. మరొకరు ఉద్యోగం పోగొట్టుకుని, మోడ్రన్ మిడిల్ క్లాస్ అర్బన్ సొసైటీతో పోరాడేందుకు తన స్థాయి సరిపోక మరింత నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయే మనిషి. వారికోసం పోరాడే ఇద్దరు భార్యలు. నిజాన్ని రెండుగా విడగొడితే వీళ్లిద్దరూ. మోడ్రన్ అండ్ రెలీజియస్. కుటుంబం కోసం ఎలాంటి నిర్ణయాన్నైనా స్వతహాగా తీసుకోగలిగిన స్త్రీ ఒకరు. మరొకరు మతానికి కట్టుబడిన స్త్రీ. భర్త అనుమతి లేకుండా బైటకి అడుగుపెట్టడానికి భయపడే మనిషి.

రెండు కుటుంబాల నుంచి, రెండు వేర్వేరు ప్రపంచాలకి రేపటి ప్రతినిధులైన ఇద్దరు కూతుళ్లు. వీళ్లిద్దరిలో తెర్మియాకి అక్కడక్కడా డైలాగులుంటాయి. రజియా కూతురికి మాత్రం ఒకట్రెండు మాటలు తప్ప మరేం ఉండదు. కానీ వీళ్ల చూపుల నుంచే సినిమాకి కావల్సింది రాబట్టుకున్నాడు ఫర్హాదీ. కోర్టు అవరణలోని ఒక సీన్లో తెర్మియా తన అమ్మమ్మ సాయంతో ఎగ్జామ్కి ప్రిపేరవుతూ ఉంటుంది. రజియా కూతురు మాత్రం ఒంటరిగా దిక్కులు చూస్తూ నిలబడి ఉంటుంది. క్లైమాక్స్ కు ముందు సీన్లో.. రజియా ఖురాన్ పై ప్రమాణం చేయడానికి ఒప్పుకోకపోవడంతో, తన భర్త తనని తానే కొట్టుకుంటూ వెళ్లిపోతాడు. ఆ క్షణంలో తెర్మియా, చిన్నమ్మాయి వైపు చూస్తుంది. పేదరికంలోని సమస్త నరకమంతా ఆ చిన్న పిల్ల కళ్లలో కనిపిస్తుంది. 

అయిపోవచ్చింది సినిమా. 
క్లైమాక్స్ కోర్టులో..
తెర్మియాని లోపలికి తీసుకెళ్తాడు నాదిర్. 

మీ అమ్మానాన్ననిర్ణయాన్ని నీకొదిలేశారు. వాళ్లలో ఎవరితో నువ్వుండాలో నువ్వే నిర్ణయించుకోవచ్చు. 
చెప్పు. అమ్మ కావాలా.. నాన్నా కావాలా..? ఎవరితో ఉండాలో నిర్ణయించుకున్నావా ?

నిర్ణయించుకున్నా. (కళ్లలోంచి నీళ్లు)

ఎవరితో ఉండాలనుకుంటున్నావు ?

ఇప్పుడే చెప్పాలా ?

నిర్ణయించుకోలేదా ఇంకా ?

నిర్ణయించుకున్నా.

మరి చెప్పు. 

-------------------

మీ అమ్మానాన్నల్ని బైటకి పంపించనా ?

ఆ అవకాశముందా ?

మీరిద్దరూ ఓ నిమిషం బైటకెళ్తారా ?

ఇద్దరూ బైటకొస్తారు. 
లోపల తెర్మియా ఏం చెప్తుంది....................................
ఎవరితో ఉంటానంటుంది.......................................

ఎండ్ క్రెడిట్స్ మొదలైపోతాయి. 

అయిపోయింది సినిమా. 

మొదటి సీన్లో జడ్జ్ కనిపించడు. చివరి సీన్లో జడ్జి కనిపిస్తాడు. సినిమా మొత్తం కోర్టుల చుట్టూ తిరుగుతుంది. కానీ తుది తీర్పు రాదు. తీర్పు  వ్యవస్థల చేతిలో లేదు. తెర్మియా చేతుల్లో ఉందది. రేపటి చరిత్రలో ఎవరుండబోతున్నారో వారి చేతుల్లో ఉందది. సినిమా కేవలం ఇరాన్ ప్రభుత్వం, ఇరాన్ ప్రజల మధ్య సెపరేషన్ గురించి మాత్రమే కాదు.. బీయింగ్ ఏ ముస్లిం, బీయింగ్ పర్షియన్ మధ్య తేడాని వెస్ట్రన్ ప్రపంచానికి చూపించడానికీ కూడా ఫర్హాదీ ప్రయత్నించాడేమో.? 

ఇక సెపరేషన్ vs సేల్స్ మేన్ గురించి. ఇలా అనడం తప్పేమో. సెపరేషన్ మహాద్భుతమే. కానీ సేల్స్ మేన్ని తక్కువ చేయగలమా ? ఒక ప్రఖ్యాత నాటకాన్ని సైమల్టేనియస్గా నడుపుతూ అందులోని పాత్రల్ని మనముందుకు మళ్లీ తీసుకొచ్చే ప్రయత్నాన్ని తక్కువ చేయలేమేమో. సేల్స్ మేన్ లో హీరో.. వ్యాన్ ఓనర్ కోసం వేసిన ట్రాప్లో, తను అనుకున్న మనిషికి బ‌దులు వేరొకరు వస్తుంటే షాక్ అవుతాడు. తను అనుకున్నవాడు కాకుండా ఇంకెవరో పెద్దాయన వస్తున్నాడని. అదే సమయంలో ప్రేక్షకుడిగా మనం తినే షాక్ చాలా పెద్దది. సినిమా ఎక్కడ్నుంచి ఎక్కడికి వచ్చిందని. అది గుర్తొచ్చినప్పుడల్లా.. అరే, అనుకోకుండా ఉండలేం. ఫర్హాదీ వర్క్స్ లో సెపరేషన్, పాస్ట్, ఎబౌట్ ఎల్లీ, సేల్స్ మేన్.. దేన్నీ ఒకదానితో మరోదాన్ని పోల్చలేను. ఒక్కోసారి అన్నీ ఒకే సినిమాగా.. ఒకదానికొకటి సీక్వెల్గా కూడా అనిపిస్తాయి. 

Thursday, June 15, 2017

ది సేల్స్ మేన్


భవనం ఎంత బలమైనదైనా కావొచ్చు. చిన్నపగులు మనల్ని భయపెడుతుంది. అందులో ఉండడమంటే భయం పుట్టిస్తుంది. ఏదైనా అనుబంధం కూడా అంతే. అది బలమైనదే కావొచ్చు. మేల్ ప్రివిలేజ్ అనే పగులు దాని అతిపెద్ద బలహీనత. ఇంకా చాలా బలహీనతలున్నా ఇది చేసే విధ్వంసమే ఎక్కువ. గాయం తగిలాక అది మానిపోవచ్చు. కానీ మచ్చ ఎక్కడో ఓచోట మిగిలిపోతుంది. 

త్రిపుర కథ. ఫర్హాదీ సినిమా. అవి నాకు అర్ధం అయినా, కాకపోయినా అద్భుతాలే. ఏవేవో గుర్తు చేస్తుంటాయి. వాటిని చదివేటప్పుడు, చూసేటప్పుడు.. జీవితంలోని ఏదో మూలకి టార్చ్ లైట్ వేసి చూపించినట్టు అనిపిస్తుంది. 

సేల్స్ మేన్ కి ఆస్కార్ వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తుంటే ఇప్పటికి సబ్ టైటిల్స్ తో ఉన్న లింక్ దొరికింది. 
సినిమాలో ఓ సీన్ లో హీరో ఎమాద్.. స్కూల్ నుంచి వెళ్తూ మరో స్టూడెంట్ తో కల్సి ట్యాక్సీ ఎక్కుతాడు. అప్పటికే అందులో ఉన్న ఒకామె హీరోని ముందు సీట్లోకి మార్చాలంటూ డ్రైవర్ తో గొడవ చేస్తుంది. హీరో కామ్గా సీటు మారతాడు. తర్వాత క్లాస్ లో స్టూడెంట్ అడుగుతాడు.. ఆమె అలా అన్నందుకు మీరు బాధ పడ్డారు కదా అని. అందులో బాధ పడ్డానికి ఏముంది.. అంతకుముందు ఉన్న వాడెవడో ఆమెని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. అందుకే ఆమె నన్ను సీటు మార్పించాలని కోరి ఉండొచ్చు కదా అంటాడు హీరో. 

సినిమా మొదట్లో సీన్. బిల్డింగ్ కూలిపోయే ప్రమాదముందని అంతా భయంతో ఖాళీ చేస్తుంటారు. అంత హడావుడిలో కూడా హీరో.. పక్కింట్లో నడవలేని పరిస్థితిల్లో ఉన్న ఓ వ్యక్తిని మోసుకుని తీసుకెళ్తాడు. 

ఈ రెండు సీన్లలో హీరో మనస్తత్వం, తనెలాంటివాడో అర్ధమైపోతుంది. కానీ తన భార్యపై ఎవడో గుర్తుతెలియని వ్యక్తి ఎటాక్ చేశాడని తెలిశాక.. హీరో ఎందుకు వాడ్ని వేటాడాలనుకుంటాడు. వాళ్లు అద్దెకి మారిన ఇంట్లో ముందున్న ఆమెపై రివేంజ్ తీసుకోడానికి వచ్చిన వ్యక్తే కదా అని.. ఎందుకు దాన్ని లైట్ తీసుకోలేడు..? అసలు పోలీస్ కంప్లయింట్ ఇవ్వకుండా తనే ఎందుకు పోలీసులా మారతాడు..? ఈ ప్రశ్నలకి సమాధానం దొరికేకొద్దీ సేల్స్ మేన్ మామాలు థ్రిల్లర్ సినిమాల కంటే ఏదో ఎక్కువగా అనిపిస్తుంది.

సినిమాని మామూలు థ్రిల్లర్ డ్రామాగా చూసినా అద్భుతమే అనిపిస్తుంది. కానీ ఆర్ధర్ మిల్లర్-డెత్ ఆఫ్ ఏ సేల్స్ మేన్ గురించి తెలిసుంటే ఫర్హాదీ సేల్స్ మేన్ ని ఇంకా ఏంజాయ్ చేయొచ్చు. 

Monday, June 12, 2017

దంగల్ టు పిచ్చిగుంట్లోళ్లు

దంగల్ మూవీ చూసిన చాలా రోజులు 'తూ తో హానికారక్ బాపు' ఎందుకో పదే పదే చూడాలనిపించింది. 'నిక్కర్ ఔర్ టీ షర్ట్ పెహెన్ కే ఆయా సైక్లోన్' సాంగ్ బాగుంటుంది కానీ.. హానికారక్ బాపులో చిన్నపిల్లలు పాడిన స్టైల్ నచ్చింది. ఏదో నేచురల్ ఫ్లేవర్ ఉన్న గొంతులు. పాడిన ఇద్దరు కుర్రాళ్లు సర్వార్ ఖాన్, సర్త్ రాజ్ ఖాన్. 




వీళ్ల గొంతు విన్నాక ఎప్పుడో ఇండియన్ ఐడల్ లో పాడిన సత్తార్ ఖాన్ గుర్తొచ్చాడు. వీళ్ల గొంతుల్లో ఏదో గమ్మత్తుంది. అది ఫోక్ లో ఉండే మజా. రెగ్యులర్ సినిమా పాటల్లో దొరకనిది. ఫోక్ సాంగ్ తో ఇండియన్ ఐడల్ లో ఎంట్రీ ఇచ్చిన సత్తార్ ఖాన్ తర్వాత అందులోంచి ఎలిమినేట్ అయ్యాడు. హిందీ రాని కారణం ఒకటి, అసలు తనకి హిందీ పాటలే విన్నఅనుభవం లేకపోవడంతో ఇండియన్ ఐడల్ కాలేకపోయాడేమో. 


ఎవరీ సత్తార్, సర్వార్, సర్త్ రాజ్.. 
ఈ ముగ్గురిదీ ఒకే కులం. మంగనియర్. రాజస్థాన్ లో ఎక్కువగా కనిపించే కులం. వీళ్ల జీవితం నిండా పాటే ఉంది. ఎందుకంటే పాటే వృత్తిగా జీవిస్తున్న కులం ఇది. సంగీతమే వారికి వారసత్వం. మతం ఇస్లాం అయినా.. వీళ్ల పాటలు హిందూ మతంతో ముడిపోయాయి. రాజుల చరిత్రల్ని పాటల రూపంలో భద్రపరిచిన కులంగా కూడా మంగనియర్లకు ప్రత్యేక పేరుంది. అలెగ్జాండర్ తో పాటు రాజపుత్ర వీరుల యుద్థాలు, జీవితాల్ని పాటలుగా పాడుతుంటారు. రాజ్ పుట్ ల పెళ్లిళ్లలో ఎక్కువగా కచేరీలు ఇస్తూ కనిపిస్తారు. ఏదైనా కచేరీకి ముందు వీళ్లు కృష్ణుడ్ని పూజిస్తారట. దీపావళి, హోలీ పండగల్లో వీరి పాట కంపల్సరీ. కానీ ఆశ్రిత కులంగా వీరిని తక్కువ కులంగానే చూస్తారు. వీళ్ల ప్రత్యేక వాయిద్యం ఖమైచా. మామిడి చెక్కతో తయారు చేసే ఈ వాయిద్యంపై 17 తంత్రులుంటాయి. కింద ఉన్న డొల్ల భాగం మేక చర్చంతో కవర్ చేసి ఉంటది. తంత్రుల్లో కూడా 3 మేకలోంచి తీసిన నేచురల్ ఫైబర్తో చేసినవే బిగిస్తారు. 

( పై వీడియో లో కూడా ఇండియన్ ఐడల్ సత్తార్ ఉన్నాడు. ఇందులో ఖమైచాకి బదులు సారంగి వాడారు)
దంగల్ కోసం ప్రత్యేకించి జైసల్మేర్ లో టాలెంట్ హంట్ పెట్టి మరీ సర్వార్ ఖాన్, సర్త్ రాజ్ లని సెలక్ట్ చేసింది ఆమిర్ ఖాన్ టీమ్. మంగనియర్ల గురించి చదివాక.. వీళ్ల సంగీతం విన్నాక.. పిచ్చిగుంట్లోళ్లు గుర్తొచ్చారు. మంగనియర్లది పాటయితే పిచ్చిగుంట్లోళ్లది ఆట. చిన్నప్పుడు సినిమా కంటే ఎక్కువగా నన్ను ఎంటర్ టైన్ చేసింది పిచ్చిగుంట్లోళ్ల కథలే. వీళ్లు రెడ్లకి ఆశ్రితకులం. మా ఊరికి ఎక్కడ్నించో వచ్చేవాళ్లు. అందరూ అనలేను కానీ.. మా పాతిళ్లలో ఉన్నప్పుడు ఒక పొట్టిగా ఉన్నతను కథలు చెప్పడానికొచ్చాడు. ఎగిరెగిరి దూకుతూ కథలు చెప్పేవాడు. రెడ్డి రాజుల కథలతో పాటు భారతానికి కూడా ఏవో కల్పనలు చేర్చి చెప్పేవాళ్లు. మధ్యలో పిట్టకథలు. కొన్ని ఇప్పటికీ గుర్తున్నాయి. అప్పుడు నాకు ఆరేళ్లు. ఆ వయసులో రాత్రి 2, 3 గంటల వరకూ వీళ్ల కథలు చూస్తూ ఉండేవాడ్ని. వాళ్లు అన్నానికొచ్చినప్పుడు మా ఇంట్లో ఉన్న కోడిపుంజుని ఇస్తే, మా ఇంటిదగ్గర కూడా కథ చెప్తాం అనేవోళ్లు. మా అమ్మ ఇచ్చిందీ లేదు వాళ్లు చెప్పిందీ లేదు. తర్వాత ఒకట్రెండు సార్లు పిచ్చిగుంట్లోళ్లు వచ్చినా.. ఆ పొట్టి ఆయనలాగా ఎవురూ కథలు చెప్పలేదు. ప్రస్తుతం వాళ్లు అప్పటిలాగా ఊర్లమీదకి రావడం లేదు. నిజానికి వాళ్లు అద్భుతమైన స్టోరీ టెల్లర్స్. రెడ్లకి ఆశ్రిత కులంగా ఉండిపోవడం వల్లే వాళ్ల ఆర్ట్ అప్ డేట్ కాలేదేమో. 

మంగనియర్ల సంగీతాన్ని పరిచయం చేయడంతో పాటు, పిచ్చిగుంట్లోళ్ల కథల్ని గుర్తొచ్చేలా చేసినందుకు ఆమిర్ ఖాన్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి.