Monday, August 20, 2018

దెయ్యంతో ప్రయాణం

నేను ఇర్లపాడులో ఇంటర్ చదివేటప్పుడు. అప్పటికి మా ఊరికింకా తార్రోడ్డు లేదు. ఊరికి వెళ్లాలంటే ఎర్రబస్సే దిక్కు. ఇర్లపాడు నుంచి వెళ్లాలంటే ఆఖరి బస్సు రాత్రి 9గంటలకి. దానికి వెళ్లొచ్చనే సాయంత్రం బస్సుకి పోలేదు.  9గంటలకి బస్సు రాలేదు. గతుకుల రోడ్డుపై యాడనో చెడిపోయినట్టుంది. దాని కోసమే ఉన్న ఒకరిద్దరు ప్యాసింజర్లు ఇంకో గంట చూసి ఇళ్లకి వెళ్లిపోయారు. నేను కచ్చితంగా ఊరికెళ్లాలి. 

పిండారబోసినట్టు వెన్నెల. నడవడం నాక్కొంచెం సరదానే. కానీ చీకట్లో అంత దూరం ఎప్పుడూ వెళ్లలేదు. వెన్నెలే క‌దా అని బ‌య‌లుదేరా. త‌ర్వాతే తెలిసింది వెన్నేలే ఎక్కువ భ‌య‌పెడుతుంద‌ని. చిమ్మ‌చీక‌ట్లో అయితే దారి త‌ప్ప మ‌రోదానిపై మ‌నం దృష్టి పెట్టం. వెన్నెల్లో చుట్టూ ఉన్న చెట్లు, నీడ‌లు అన్నీ నా క‌ళ్ల‌లోకి చొర‌బ‌డుతున్నాయి. చెట్లు నల్లటి భూతాల్లా, వాటి మధ్యలో ఉన్న సందులు తెల్లటి ప్రేతాల్లా కనిపిస్తున్నాయి. రోడ్డు అయితే పొడుగాటి దెయ్యం పడుకున్నట్టుంది. 

వెన్నెల్లో ఎవరైనా తోడుంటే చుట్టూ ఉండేవన్నీ అందంగా క‌నిపిస్తాయి. ఒంట‌రిగా ఉన్న‌ప్పుడే దెయ్యాల్లా క‌నిపిస్తాయి. "మ‌రి దెయ్య‌మే తోడు వ‌స్తే..."

భూతాలు ఇలా ఉంటాయని చంద‌మామ‌, బాల‌మిత్ర క‌థ‌ల్లో చ‌ద‌వ‌డ‌మే త‌ప్ప పెద్ద‌గా తెలియ‌దు. మా నాన్న చాలా సార్లు ఇలా అర్ధ‌రాత్రుల్లో న‌డిచొచ్చేవాడు. త‌ను దెయ్యాల్ని చాలాసార్లు చూశాన‌ని, వాటితో మాట్లాడాన‌ని చెప్పేవాడు. బీడీ తాగడానికి నిప్పు కూడా ఇచ్చాయనేవాడు. తాగిన మత్తులో ఆయనేదో వాగుతున్నాడని అనుకున్నా... అందులో నిజముందేమో అని కూడా అనిపించేది. నా విష‌యానికొస్తే దేవుడు లేడ‌ని చాలా చిన్న‌ప్పుడే ఓ న‌మ్మ‌కానికి వ‌చ్చినా... దెయ్యం మీద మాత్రం నా భ‌యం ఇప్ప‌టికీ పోలేదు. భయం అని కూడా కాదు. అదో ముచ్చట అనుకోవచ్చేమో. దెయ్యం శాశ్వ‌తం దేవుడు మూఢ‌న‌మ్మ‌కం అనేది నా గుడ్డిన‌మ్మ‌కం. నిజానికి దేవుడి గురించి ఈ మాత్రం మాట్లాడ్డం అంటేనే పెద్ద పెంట విష‌యం నాకు. అందరికీ దేవుడ్ని చూడాలనే కోరిక ఉన్నట్టే, నాకు దెయ్యాన్ని చూడాలని కోరిక. అదే నాతో ఇలా ఈ అప‌రాత్రి న‌డిపిస్తుందేమో. 

ఇలా నాలో నేను ఊహించుకుంటూనే మొండోడి బండ దాటినా. కానీ కోదండ‌రామాపురం వ‌చ్చేస‌రికి భయం మొదలైంది. దెయ్యం గురించి కాదు. ఆ ఊళ్లో రోడ్డు నిండా కుక్క‌లుంటాయి. ఎందుకైనా మంచిదని న‌డుముకున్న బెల్ట్ తీసి చేత్తో ప‌ట్టుకున్నా. ఊరంతా మంచి నిద్ర‌లో ఉంది. కీచురాళ్ల గోల త‌ప్ప ఇంకే చ‌ప్పుడు లేదు. వెన్నెల్లో ఊరి స‌త్రం ద‌గ్గ‌రున్న మ‌ర్రిచెట్టు బ్రహ్మరాక్షసుడిలా ఉంది. స‌త్రం ద‌గ్గ‌ర‌కి వ‌చ్చేసరికి అర్ధ‌మైంది. అక్క‌డ కుక్కలేం లేవ‌ని. నాకే న‌మ్మబుద్ధి కాలేదు. ఏదో ఒకటి. గండం గ‌డిచింది చాల‌నుకుని వేగంగా ఊరు దాటా. 

కోదండ‌రామాపురం దాటినాక నుంచే అస‌లు భ‌యం మొద‌లైంది. మ‌రో కిలోమీట‌ర్ త‌ర్వాత మ‌న్న‌మోడి క‌ట్ట వ‌స్తది. మా ఊరి పొలిమేర అది. అక్క‌డ పున్న‌మి రాత్రుల్లో దెయ్యాలు పెళ్లిళ్లు చేసుకుంటాయ‌ని, క‌ట్ట‌మీద కొరివి దెయ్యాలు కాపాలా ఉంటాయ‌ని చెప్పుకుంటారు. దెయ్యాల మాటేమో గానీ క‌ట్ట ద‌గ్గ‌ర వ‌రుస‌గా ఉన్న తాడిచెట్లే రాకాసుల్లాగా ఊగుతున్నాయి గాలికి. కోదండరామ‌పురం నుంచి మ‌న్న‌మోడి క‌ట్ట దాకా చెట్ట‌న్న‌దే లేదు. కట్ట దగ్గర మాత్రం ఒక్కసారిగా గోడ కట్టినట్టు తాడి చెట్లు. చీక‌ట్లో చుట్టూ చెట్లు ఉంటే ఎంత భ‌యంగా ఉంటుందో.. ఇలా ఎడారిలా ఉన్నా అంతే భ‌యంక‌రంగా ఉంటుంది. దూరం నుంచి గాలికి ఊగుతున్న తాడిచెట్లు నా వైపే నడిచి వస్తున్నట్టు కనిపిస్తున్నాయి. వాటినే చూస్తూ న‌డుస్తున్న నాకు.. "నా వెన‌కెవ‌రో న‌డుస్తున్నట్టు అనిపించింది." 

అలాగే కొంచెం దూరం న‌డిచినాక అనుమానం ఇంకా ఎక్కువైంది. న‌డుస్తున్న‌వాడిన‌ల్లా ఒక్క‌సారి ఆగా. "వెన‌క నుంచి చ‌ప్పుడు ఆగిపోయింది."

తిరిగి చూడ్డానికి ధైర్యం చాల్లా. ఒక్క క్ష‌ణం ఆగి మ‌ళ్లీ న‌డ‌క మొద‌లుపెట్టా. అడుగుల‌ చ‌ప్పుడు తిరిగి మొద‌లైంది. ఆ చ‌ప్పుడు చాలా ల‌య‌బ‌ద్దంగా ఉంది. మనిషి పాదాల్లాగా బ‌రువుగా నేల‌ని తాక‌డం లేదు ఆ పాదాలు. సుతిమెత్త‌గా తాకుతున్న‌ట్టుంది. గాలి కూడా పెరిగింది. వెన‌క నుంచి చ‌ల్ల‌టిగాలి నా వెన్నుని తాకిన‌ప్పుడ‌ల్లా ఒళ్లంతా జ‌ల‌ద‌రిస్తోంది. అంత గాల్లో కూడా నా ఒళ్లంతా చెమ‌ట్లు ప‌ట్టాయి. భ‌యంతో న‌డ‌క‌లో వేగం త‌గ్గిపోయింది. "వెన‌క వ‌చ్చేది ఎవ‌రు." దెయ్య‌మా... లేక దెయ్యాలా...? ఎందుకంటే పాదాల చ‌ప్పుడు అలా ఉంది. ఒక‌రా ఇద్ద‌రా ముగ్గురా అనేది తెలియ‌డం లేదు. 

మ‌న్న‌మోడి క‌ట్ట ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర‌కి వ‌చ్చేదాకా ఓపిక ప‌ట్టా. ఇంగ నా వ‌ల్ల కాలేదు. 
ఒక్క‌సారిగా ఆగా. చ‌ప్పుడు మ‌ళ్లీ ఆగిపోయింది. 
వెన‌క్కి తిరిగి చూడాలా... వ‌ద్దా...? రెండు క్ష‌ణాలు ఆలోచించా. 
ధైర్యం అంతా కూడ‌గ‌ట్టుకున్నా. 
మ‌న్న‌మోడి క‌ట్ట‌మీద ఉండాల్సిన కొరివిదెయ్యాలు నా వెన‌కే ఉన్న‌ట్టు అనిపిస్తున్నాయి. 
వెన‌క్కి తిరగాలా... వ‌ద్దా...
నా ఊపిరి శ‌బ్దమే నాకు నక్క ఊళలా వినిపిస్తోంది.
ఏదైతే అద‌వుతుంద‌ని మెల్ల‌గా తిరిగా. 
అలా తిరిగేట‌ప్పుడు నా కాలు రాయి మీద ప‌డి బెసికిన‌ట్టు అవ‌డంతో కిందకి వంగిపోయా.
అంతే... 
భౌ... అంటూ కుక్క‌. గీపెట్టి అరిచింది. 
చుట్టూ ఉన్న నిశ్శబ్దంలో కుక్క అరుపు గింగిరాలు తిరుగుతూ ప్రతిధ్వనించింది. 
నా గుండెకాయ గొంతులోకి వ‌చ్చింది. ముడ్డిపూసలో నుంచి ముచ్చింగుంత దాకా షాక్ కొట్టినట్టు వణుకు. 
అంత భ‌యంలో నా చేతిలో ఉన్న బెల్టుని కుక్క‌కేసి విసిరా. గురిచూసినట్టు దాని మూతిమీద త‌గిలింది. కుయ్యిమంటూ వెన‌క్కి తిరిగి  ప‌రిగెత్తింది కోదండరామాపురం వైపు. 

షాక్ నుంచి తేరుకోవ‌డానికి రెండు నిమిషాలు ప‌ట్టింది నాకు. రోడ్డు మీదే కూర్చుని కుక్క వెళ్లిన వైపే కాసేపు చూశా. నిదానంగా లేచి మా ఊరివైపు నడిచా. ఆ షాక్ దెబ్బకి నాకు మన్నమోడి కట్ట గుర్తే లేకుండా పోయింది. కట్ట దగ్గర కొరివిదయ్యాల సంగతీ మర్చిపోయా. అలాగే నడుచుకుంటూ ఊరికి చేరుకున్నా. అప్పటికే మావోళ్లంతా నిద్రపొయినట్టున్నారు. వాళ్లని లేపడం ఎందుకులే అని, బైట కనిపించిన దుప్పటి తీసుకుని మిద్దె మీదకెక్కి పడుకున్నా. మరుసటి రోజు, పొద్దు నామీదకి వచ్చేదాకా నిద్రపోయా. 

ఇది జరిగాక నాకు దెయ్యంపై మరింత నమ్మకం పెరిగింది. దేవుడు సర్వాంతర్యామి అనేది అబద్ధం. దెయ్యం సర్వాంతర్యామి. "అదే భయం."