Monday, October 2, 2017

ఒన్ ఫ్లూ ఓవ‌ర్ ద‌ కుకూస్ నెస్ట్‌

వాల్డ్ ఈజే మెంట‌లాస్పిట‌ల్‌. త‌లొంచావా.. యు ఆర్ లాక్డ్‌. అందుకే జ‌స్ట్ పిస్ ఆన్ ఇట్స్ ఫేస్‌. ఇంకా చాత‌నైతే నోట్లో పొయ్యి. వెనెవ‌ర్ యు వాంట్ టు ఎస్కేప్‌. జ‌స్ట్ డూ ద‌ట్‌. లేదంటే నీ గుడ్డు ప‌గ‌ల‌కొట్టేస్తారు. (గుడ్డు అంటే గుడ్డు కాదు.) ప్ర‌పంచం పిచ్చాసుప‌త్రి మాత్ర‌మే కాదు చాలా విశాల‌మైంది కూడా. పాత మాట అని కొత్త‌గా ట్రై చెయ్య‌లేని పిరికి వాళ్లు చెప్పొచ్చు. బంధాలు, భ‌యాలు త‌ల‌బ‌ద్ద‌లయిపోయేంత భారం కాకుండా చూసుకో. అయ్యాయ‌నుకో సిగ్గులేకుండా వాటిలోంచి బైట‌కొచ్చెయ్‌. స‌లాహాలు ఇవ్వ‌డానికి బోల్డెంత మంది వ‌స్తారు. జ‌స్ట్ సే ఫ‌క్ ఆఫ్‌.. అచ్చ‌ తెలుగులో దెంగెయ్ అను. 

అంతా ఒక రోటీన్‌కి అలవాటు ప‌డి ఉంటారు క‌దా. నువ్వు బైట‌కెళ్తానంటే ఒప్పుకోరు. ఈ రోటీన్ నీకు పిచ్చ‌లాగే ఉండొచ్చు.  అందులోంచి నువ్వు బైట‌కి వెళ్తానంటే మాత్రం మొత్తం వ్య‌వ‌స్థ అప్ర‌మ‌త్త‌మైపోతుంది. ఏవో కొంప‌లు మునిగిపోతున్నాయ‌ని అరుస్తుంది.  నిన్ను సైలెంట్ చేయాల‌ని చూస్తుంది. కుద‌ర‌క‌పోతే చంపేస్తుంది. కానీ ఆల్రెడీ అల‌జ‌డి మొద‌లైపోయింది కాబ‌ట్టి రోటీన్ లోనుంచి ఒక్కొక్క‌రే బైట‌కి వెళ్లడం మొద‌ల‌వుతుంది. ఆప‌డం విల‌నిజ‌మేం కాదు గానీ.. వెళ్ల‌డం మాత్రం హీరోయిజ‌మే. ఇక్క‌డ విల‌నీ అనేది వ్య‌క్తిగ‌తం కాదు... అది వ్య‌వ‌స్థీకృతం. ఎవ‌డికి వాడు త‌న సైడ్ నుంచి క‌రెక్టే. సినిమాలో న‌ర్స్ రేచెద్‌ కూడా అలాంటిదే. వృత్తిగ‌తంగా త‌ను ఒక ఫ్రేమ్ సెట్ చేసుకుంది. రోగులెవ‌రూ ఆమెకి శ‌త్రువులు కాదు. పైగా కొంద‌రు ఆమెకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. కాక‌పోతే త‌ను పెట్టిన రూల్స్ అనేవి అక్క‌డి మాన‌సిక రోగుల్ని మామూలు మ‌నుషులుగా మార్చేలా లేవు. ఈగో అనే ఎవిల్ ఎలాగూ ఉంటుంది కాబ‌ట్టి న‌ర్స్ విల‌నైందిక్క‌డ‌. ఎలాంటి ఈగోలు లేకుండా ఒక పిచ్చలో నుంచి బైట‌కి రావాల‌నుకున్నాడు కాబ‌ట్టే మ‌ర్ఫీ హీరో అయ్యాడు. 

42 ఏళ్ల‌కింద‌టి సినిమా. కొన్ని వంద‌ల సినిమాల‌కి ఇన్‌స్పిరేష‌న్‌. కానీ ఈ మూవీ ఇప్పుడు చూసినా ఫ్రెష్‌గానే అనిపిస్తుంది. డైరెక్ట‌ర్ ఫ‌ర్మాన్‌, హీరో జాక్ నికొల్స‌న్ ఈ ఇద్ద‌రి గురించే చెప్తారు చాలామంది. కానీ ఇందులో చిన్న చిన్న పాత్ర‌లు వేసిన చాలామంది అద్భుతంగా న‌టించారు. ఓవ‌రాల్‌గా జాక్ నికొల్స‌న్ టాప్‌లేపేశాడు కానీ.. మిగిలిన‌వాళ్ల గురించి కూడా చెప్పుకోవాలి. మార్టిని పాత్ర వేసిన డానీ డెవిటో,  చెస్‌విక్‌గా న‌టించిన లాసిక్, హార్డింగ్‌గా క‌నిపించిన రెడ్‌ఫీల్డ్‌ గుర్తుండిపోతారు. ఈ ముగ్గురిలో కూడా డానీ డెవిటో చాల నేచుర‌ల్ పిచ్చోడిలా క‌నిపిస్తాడు. ప్ర‌తినాయ‌క పాత్ర  న‌ర్స్ రేచెద్‌గా వేసిన‌ లూయిస్ ఫ్లెచ‌ర్‌.. ఆ పాత్ర‌పై డైరెక్ట‌ర్ ఫ‌ర్మాన్ పర్‌సెప్ష‌న్‌ని మార్చి మ‌రీ సినిమాలో అవ‌కాశాన్ని ద‌క్కించుకుంద‌ట‌. న‌ర్స్ పాత్ర‌ని భ‌యంక‌ర‌మైన విల‌న్‌గా చూపించాల‌నుకున్నాడట‌ ఫ‌ర్మాన్‌. కానీ విల‌న్‌ కేవ‌లం ఇన్‌స్ట్రుమెంట్ అన్న కోణంలోనే చూపించాల‌న్న ఆలోచ‌న ఫ్లెచ‌ర్‌ది. త‌న కోణంలో త‌ను అంద‌రికీ మంచి చేస్తున్న‌ట్టే ఫీల‌వుతుంది, కాకపోతే అది రోగుల్ని ఇబ్బంది పెడుతుంది. ఫ్లెచ‌ర్ ఈ వాద‌న‌కే ఫ‌ర్మాన్ ఓటేశాడు. 

డైరెక్ట‌ర్‌గా ఫ‌ర్మాన్ చేసిందేంటి..?
యాక్ట‌ర్లకి ఎలాంటి స్క్రిప్ట్ ఇచ్చేవాడు కాదు ఫ‌ర్మాన్‌. కేవ‌లం వాళ్ల పాత్ర‌లేంటో చెప్పి.. ఇంప్ర‌వైజ్ చేయ‌మ‌నేవాడు. వాళ్లు గ్రూప్ ఇంప్ర‌వైజేష‌న్ మొద‌లుపెట్ట‌గానే వాళ్ల‌కి తెలియ‌కుండా కెమెరాలు రోల్ అయ్యేవి. చాలా సీన్లు యాక్ట‌ర్ల‌కి తెలియ‌కుండా షూటింగ్ చేశాడ‌ట‌. ఇక సినిమాలో చాలా పాత్ర‌లు వేసింది ప్రొఫెష‌న‌ల్‌ న‌టులు కాదు. ఓరెగాన్ హాస్పిట‌ల్ సైకియాట్రిక్‌ వార్డులో పేషెంట్స్‌నే చిన్నాచిత‌కా పాత్ర‌లో వాడుకున్నారు. మ‌ధ్య‌లో వ‌చ్చే ఫిషింగ్ ట్రిప్ సీన్ మొత్తం ఆఖ‌ర్లో షూట్ చేశార‌ట‌. హాస్పిటల్ త‌ప్ప మ‌రోటి సినిమాలో క‌నిపించ‌కూడ‌ద‌న్న‌ది డైరెక్ట‌ర్ ఫార్మ‌న్ ఆలోచ‌న‌. అయితే ప్రొడ్యూస‌ర్లు ప‌ట్టుబ‌ట్టి ఫిషింగ్ సీన్ షూట్ చేయించార‌ట‌. 

ఒన్ ఫ్లూ ఓవ‌ర్ కుకూస్ నెస్ట్‌ న‌వ‌లా ర‌చ‌యిత కేసీ మాత్రం ఈ సినిమా చూడ్డానికి ఇష్ట‌ప‌డ‌లేద‌ట‌. మ‌ర్ఫీ ఇన్‌స్పిరేష‌న్‌తో ఆస్ప‌త్రి నుంచి పారిపోయే చీఫ్ బ్రామ్‌డెన్.. న‌వ‌ల‌లో ఈ క‌థ మొత్తాన్ని నెరేట్ చేస్తాడు. సినిమాలో అలా ఉండ‌దు. ఈ విష‌యంలో కేసీకి సినిమా యూనిట్‌కి మ‌ధ్య గొడ‌వ జ‌రిగిందంటారు. చాలామంది సినిమా కంటే న‌వ‌లే బాగుందని చెప్తారు. న‌వ‌ల నేను చ‌ద‌వ‌లేదు కానీ.. మూవీ అయితే మాస్ట‌ర్ పీస్‌. జాక్ నికొల్స‌న్ న‌టన పీక్స్‌. 

(ఈ మూవీ గురించి ఎప్ప‌టినుంచో రాయాల‌నుకున్నా.. ఇప్ప‌టికి రాసేశా)

Tuesday, September 26, 2017

బీడెవిల్డ్‌


సినిమాల్లో క‌త్తుల‌తో పొడుచుకునే సీన్లంటే నాక‌స‌హ్యం. చిన్న‌ప్పుడైతే ఆ సీన్లు వ‌స్తుంటే చ‌ల్ల‌గా ప‌క్క‌కి జారుకునేవాడ్ని. ఆ టైమ్‌లో మా అక్కోళ్లు న‌న్నుఓ రేంజ్‌లో ఏడిపించేవాళ్లు. త‌ర్వాత భ‌యం పోయింది కానీ.. ఆ సీన్లంటే మాత్రం ఇప్ప‌టికీ అస‌హ్య‌మే. ఈ మూవీ చూసేట‌ప్పుడు కూడా కొన్నిచోట్ల కాస్త‌ చిరాకేసింది. కానీ ఎందుకో రెండు రోజుల్నించీ సినిమా క‌దిలిస్తూనే ఉంది. కార‌ణం ఇందులో స‌బ్జెక్ట్‌. 

చ‌దువు ఎలాంటి జ్ఞానాన్ని ఇవ్వ‌ద‌ని నేను న‌మ్ముతాను. కేవ‌లం ఉద్యోగం సంపాదించుకోడానికి మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డుతుంది అనుకుంటాను. చ‌దువుకున్న చాలామందిపై నాకున్న స్వంత అభిప్రాయాలు కావ‌చ్చు, అక‌డ‌మిక్ ఎడ్యుకేష‌న్ తీరుపై నాకున్న అస‌హ్యం కూడా కార‌ణం కావ‌చ్చు. సొంతంగా ఆలోచించే శ‌క్తి క‌లిగిన‌వాళ్లు చ‌దువుకున్నా, చ‌దువుకోక‌పోయినా సివిలైజ్డ్‌గానే ఉంటారు. ప్ర‌త్యేకించి.. చ‌దువుకున్న వారిలోనే ఎక్కువ‌గా గొర్రెల్లాంటి మ‌న‌స్త‌త్వం పెరుగుతుంద‌నేది కూడా నా అభిప్రాయం. అలాంటి వాళ్ల‌ని త‌యారుచేసుకోవ‌డ‌మే అక‌డ‌మిక్ సిస్ట‌మ్ ల‌క్ష్య‌మేమో అనిపిస్తుంది. అదే నిజ‌మేమో కూడా. ఇక‌ ఈ ఉన్న‌త చ‌దువులు చదివిన వాళ్లేదో ఉద్ధ‌రించేస్తార‌న్న పిచ్చి న‌మ్మ‌కం మ‌రికొంద‌రిది. ఇలాంటి అభిప్రాయంతోనే బీ డెవిల్డ్ తీసిన‌ట్టున్నారు. సినిమాలో చాలా సీన్లు మ‌రీ హింసాత్మ‌కంగా అనిపిస్తాయి. స్త్రీలు భ‌రించే హింస‌తో పోలిస్తే ఇది చాలా త‌క్కువేనేమో.. అన్న కోణంలో చూస్తే మాత్రం బిడెవిల్డ్ మ‌రీ అంత భ‌యంక‌రంగా అనిపించ‌దు. చాలామంది ఆడ‌వాళ్లు ఎంత‌ భ‌యంక‌ర‌మైన జీవితాన్ని చూస్తున్నారో అన్న‌ది మాత్ర‌మే అర్ధ‌మ‌వుతుంది.

ఈ సినిమా చూడ్డానికి కార‌ణం పాకాల రాజేష్‌. ఏపీ రెసిడెన్షియ‌ల్ స్కూల్‌, గ‌ణ‌ప‌వ‌రంలో నా ఫ్రెండ్‌. ఎయిత్‌ టు టెన్త్‌
క‌లిసి చ‌దువుకున్నాం. త‌ర్వాత ఎవ‌రి జీవితం వాళ్ల‌ది. లాస్టియ‌ర్ స‌డెన్‌గా ఎఫ్‌బీలో ఫ్రెండ్ రిక్వెస్ట్‌. ఎలా ప‌ట్టుకున్నాడో కానీ సాధించాడు. నిన్న చాటింగ్‌లో త‌ను కొన్ని సినిమాల లిస్ట్ పంపాడు. నాకున్న స్నేహితుల్లో నాకే ఎక్కువ సినిమా జ్ఞానం ఉంద‌న్న కొవ్వు ఏ మూలో ఉంటుంద‌నిపిస్తుంది. కానీ త‌ను పంపిన‌ లిస్ట్ చూశాక ఆ కొవ్వు కాస్తా క‌రిగిపోయింది. ఒన్ ఫ్లూ ఓవ‌ర్ కుకూస్ నెస్ట్ ద‌గ్గ‌ర నుంచి ఎన్ని సినిమాలో. అందులో కొరియ‌న్ సినిమాల్లో ఈ బీడెవిల్డ్ కూడా ఒక‌టి. క‌చ్చితంగా చూడ‌మ‌ని ఆర్డ‌రేశాడు. దాంతో చూడాల్సొచ్చింది. కానీ ఇంత దుఃఖాన్ని భ‌రించలేమేమో. ఇంత దుఃఖాన్ని అనుభ‌వించే మ‌నుషుల జీవితాల్ని మార్చ‌లేక‌పోయినా.. క‌నీసం కాస్త మాట‌సాయ‌మైనా అందించ‌గ‌ల‌మా..? 

ఈ సినిమాలో అంతులేని దుఃఖ‌మే కాదు.. అద్భుత‌మైన స్నేహం ఉంది. మే బీ రాజేష్ ఇందుకే న‌న్నీ సినిమా చూడ‌మ‌న్నాడేమో.! ల‌వ్ యూ రాజేష్‌. బ‌ట్ అయామ్ నాటే గుడ్ ఫ్రెండ్‌.

(సినిమాలో హే-వోకి బోక్‌-నామ్ రాసిన లెట‌ర్స్ చూస్తుంటే, టెన్త్ అయిపోయాక రాజేష్ నాకు రాసిన లెట‌ర్ గుర్తొచ్చింది. దానికి నేను రిప్లై రాయలేదు. 20 ఏళ్ల‌ త‌ర్వాత మ‌ళ్లీ ఎఫ్‌బీలో వాడే న‌న్ను ప‌ట్టుకున్నాడు.)

Monday, September 11, 2017

అర్జున్‌'రెడ్డి'

ఎన్ని ప్రేమ క‌థ‌లైనా చెప్పు.. 
ఏదో ఒక మూల ఎదో స్టోరీ మిగిలిపోయే ఉంటది.
ఏ ఇద్ద‌రి వేలిముద్ర‌లు ఒక‌లా ఉండ‌న‌ట్టే.. ఏ ఇద్ద‌రి ప్రేమ‌కథ‌లు ఒక‌లా ఉండ‌వు. సామాజిక‌, ఆర్ధిక‌, మాన‌సిక స్థితిగ‌తుల వ‌ల్లే అనుకుంటావో లేక మ‌రోలా అనుకున్నా. ల‌వ్ ఈజ్ ఎట‌ర్న‌ల్‌, ల‌వ్ ఫెయిల్యూర్స్ ఆర్ ఎట‌ర్న‌ల్‌. 

ప్రేమ క‌థ‌ల్లో ఎన్ని షేడ్స్ ఉన్నా.. అందులో ఉన్నంత‌వ‌ర‌కూ ప్ర‌పంచంలో తామిద్ద‌ర‌మే ఉన్న‌ట్టు అనిపిస్తుంది. ప్రేమించిన మ‌నిషి దూర‌మైతే ప్రపంచంలో త‌నొక్క‌రే మిగిలిపోయిన‌ట్టనిపిస్తుంది. త‌ల్లిదండ్రులు, స్నేహితులు వీళ్లంతా నీ చుట్టూ ఉన్నా క‌నిపించ‌రు. ఆ ఒంట‌రిత‌నంలో ఉన్న పెయిన్‌ అనుభ‌వించిన‌వాళ్ల‌కే తెలుస్తుంది. నీలో నువ్వు బ్లీడ్ అవుతున్న‌ట్టు.. న‌ర్వ్‌స్‌ని ఎవ‌రో మెలిపెట్టి లాగుతున్న‌ట్టు.. త‌ల నిండా బ్ల‌డ్ క్లాట్ అయిపోయిన‌ట్టు.. 

ఇదంతా అర్జున్‌రెడ్డిలో క‌నిపిస్తుంది. ప్రేమ‌లో ఫెయిల్ అయిన ప్ర‌తి ఒక్క‌రిలో క‌నిపిస్తుంది. అర్జున్‌రెడ్డి దానికి రియాక్ట్ అయ్యే విధాన‌మే తెలుగుసినిమాకి కొత్త‌. మ‌రీ కొత్త‌దేం కాదు సూర్య స‌న్నాప్ కృష్ణ‌న్‌లో కొంత‌మేర‌కు ఇలాంటి పాత్రే క‌నిపిస్తుంది. కానీ దానికి ఇంత సీన్ లేదు. అందులో ఉన్నసూర్యకి అర్జున్‌రెడ్డికి యాటిట్యూడ్ తేడా ఉంది. మిడిల్ క్లాస్ అండ్ రిచ్‌కు ఉన్న తేడా. కాస్త పాత రోజుల‌కెళ్తే దేవ‌దాసుతో అర్జున్‌రెడ్డిని బాగా పోల్చొచ్చు. కానీ ప్రొఫెష‌న్ అనేది యాడ్ అయింది అర్జున్‌రెడ్డికి. అందుకే దేవ‌దాసు అంత విషాదంలో కూరుకుపోయే ధైర్యం అర్జున్‌రెడ్డి చేయ‌లేదు. కాస్త.. తండ్రి, ఫ్యామిలీ అని ఆలోచించాడు. దేవదాసు పెళ్లికి చాలా విలువిచ్చాడు. అర్జున్‌రెడ్డి ఈ ప‌నికిమాలిన ప‌ర‌మ ప‌విత్ర‌మైన‌ పెళ్లిని ఒక్క త‌న్ను త‌న్నేశాడు. పెళ్లి స్థాయేంటో చెప్పాడు. (మ‌రీ అంత ధైర్యంగా కాక‌పోయినా...)

విజ‌య్ దేవ‌ర‌కొండ యాక్టింగ్‌, లుక్ రెండూ కొన్నాళ్ల‌పాటు గుర్తుండిపోతాయి నిలిచిపోతాయి. అయితే అర్జున్‌రెడ్డి మాత్ర‌మే ఈ సినిమా కాదు. ప్రీతి లాంటి స్ట్రాంగ్ క్యారెక్ట‌ర్‌, హీరో ఫ్రెండ్స్ కూడా అంతే స్థాయిలో ఈ సినిమాకి అస్సెట్ అయ్యారు. సినిమాలో హీరోహీరోయిన్‌కు సంబంధించిన సీన్స్ ప‌క్క‌న‌పెడితే.. కాలేజ్ నుంచి వెళ్లిపోయే స‌మ‌యంలో అర్జున్ ఫ్రెండ్ కీర్తి, మ‌రో ఫ్రెండ్‌కి కిస్ ఆఫ‌ర్ చేసే సీన్ సూప‌ర్బ్‌. ఆ అమ్మాయి మ‌రోసారి క‌నిపిస్తే బాగుండు అనిపించింది. హీరో క్లోజ్‌ఫ్రెండ్ పాత్ర చేసినాయ‌న‌ యాక్టింగ్ బాగుంది. సినిమా లెంథీ బ‌ట్ వ‌ర్తీ. సినిమా మొత్తం రెబెల్‌గా క‌నిపించినా.. క్లైమాక్స్‌లో మ‌రీ ధైర్యం చేయ‌లేక‌పోయారేమో అనిపించింది. క్లైమాక్స్ ఒకే బ‌ట్ మిగిలిన సిన్మా స్థాయికి లేదు. కెమెరా వ‌ర్క్ మ‌రీ అంత గొప్ప‌గా లేదు. ఎడిటింగ్‌లో కొన్నిచోట్ల జంప్‌క‌ట్స్ బాగా చేశారు. బీజీఎంలు అద్భుతంగా ఉన్నాయి.. కానీ ఆ పాట‌లు అవ‌స‌ర‌మా అనిపించింది. 

ఇంకో చిన్న డౌట్ః చివ‌ర్లో హీరోయిన్ అడ్ర‌స్ తెలుసుకున్న‌వాడు.. త‌ను భ‌ర్త‌తో ఉందో, లేక ఒంట‌రిగా ఉందో తెలుసుకోలేక‌పోయాడా అన్న డౌట్ కొడ్తుంది. 

ఇక తోక సంగ‌తికొస్తే... అర్జున్‌రెడ్డి చివ‌ర్లో తోక అంత అవ‌స‌ర‌మా అనిపించింది. బ‌హుశా తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో త‌మ ఉనికిని చాటుకోవాల‌న్న త‌ప‌న ఉందేమో డైరెక్ట‌ర్‌లో అనిపించింది. సినిమాలో అయితే తోక అవ‌స‌రం పెద్ద‌గా క‌న‌బ‌డ‌లేదు.

హీరో పాత్ర ఎంత ప‌విత్రంగా ఉంది, సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇచ్చారు అన్న విష‌యాల జోలికి వెళ్ల‌ను. ఎందుకంటే ఇది ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ తెలుగు సినిమా మాత్ర‌మే. ప్రేమ విఫ‌ల‌మైన మ‌నిషి పెయిన్‌ని చూపించిన విధానం బాగా క‌నెక్టవుతుంది. హీరోయిన్ ప్రీతి పాత్ర బాగుంది. అర్జున్‌రెడ్డి పాత్ర‌ని తీర్చిదిద్ద‌డంపై మ‌రింత శ్ర‌ద్ధ పెట్టి ఉంటే బాగుండేది.

(మేకింగ్ విష‌యంలో బెంచ్‌మార్క్ అన్న లైన్ ఎడిట్ చేశాను. ఫ్లైట్ సినిమా చూశాక‌. మందులో ఆప‌రేష‌న్ చేయ‌డం, దాని త‌ర్వాత కోర్టు వ్య‌వ‌హారం లాంటివి యాజిటీజ్‌గా దించేశారేమో అనిపించింది. మిగ‌తా సీన్లు మ‌రేదైనా సినిమాలో క‌నిపించ‌క‌పోతే బాగుండు )

Wednesday, September 6, 2017

ఓల్డ్ బాయ్‌

నా జీవితం ఇలా సంక‌నాకి పోవ‌డానికి ఒక‌డు కార‌ణం. వాడు దొర‌కాలి. నాలో నేను కార్చుకున్న ర‌క్తానంతా.. వాడి నుంచి పీల్చుకుంటా. నా గుండెకి అయిన గాయాల‌కి వాడి చ‌ర్మంతో క‌ట్టు క‌ట్టేస్తా. క‌చ్చితంగా దొరుకుతాడు వాడు. కానీ వాడెవ‌డో తెలుసా..? 

నేనే..

నా సినిమాలో నేనే హీరో.. నాకు నేనే విల‌న్‌. 
ఎలా చంపాలి వీడ్ని..? ఎలా నా బాధ‌ని తీర్చుకోవాలి..?

ఈ సినిమా చూశాన‌ని చెప్ప‌గానే.. విహారి ఏమ‌న్నాడంటే.. ఎందుకు చూశావా సినిమాని..? 
వానెమ్మ.. ఏం కాన్సెప్ట్ అది. ఛీ.

నిజ‌మే కాస్త డైజ‌స్ట్ చేసుకోలేని కాన్సెప్టే. కానీ అది ఎంచుకోడానికి వాడెంత ధైర్యం చేసి ఉండాలి. ఒక సినిమాలో హీరో, విల‌న్ ఒక‌డ్నే చూపించడానికి ఎన్ని గుండెలుండాలి..? ద‌ట్స్ వై ఐ ల‌వ్ దిస్ మూవీ. 

గ్రీకు పురాణాల్లోని ఈడిప‌స్ పాత్ర‌ ఇన్‌స్పిరేష‌న్‌తోనే ఈ మూవీ తీశానంటాడు డైరెక్ట‌ర్ చాన్‌-వూ. హీరో పేరు ఈడిప‌స్‌ను గుర్తు తెచ్చేలా డే సు అని పెట్టాడ‌ట‌. అయితే ప్ర‌ధాన పాత్ర‌లు రెండూ ఈడిప‌స్‌ ప్ర‌తిరూపాల్లానే ఉంటాయి. 

ఈ సినిమా చాన్నాళ్ల నుంచి చూడాల‌ని, ధైర్యం చాల‌క చూడలేదు. సినిమా గురించి యూట్యూబ్‌లో చూస్తే ఎప్పుడూ ఒక ఫైట్ సీన్ క‌నిపించేంది. వార్నీ ఇదేదో చైనీస్ టైప్.. ఫైటింగ్ బాప‌త‌ని వ‌దిలేశా. కానీ ఎందుకో ధైర్యం చేసి చూశా. వాటే స్క్రీన్‌ప్లే..వాటే స్క్రీన్ ప్లే. 

సినిమా చూడ‌డానికి ముందు నేను చూసిన కారిడార్ ఫైట్ సింగిల్ టేక్‌లో తీశారంట‌. మూడు రోజులు 17 టేక్‌లు తీస్తే.. ఫైన‌ల్‌గా ఒక టేక్‌ను తీసుకున్నారు. ఒక్క ముక్క కూడా ఎడిట్ చేయ‌లేదు. కేవలం హీరో వీపుపై దిగే క‌త్తి కోసం మాత్రమే గ్రాఫిక్ వ‌ర్క్ చేశారు. 

ఈడిప‌స్ క‌థ తెలిసుంటే సినిమాలో కంటెంట్ కూడా ఏమాత్రం ఇబ్బంది పెట్ట‌దు. మ‌స్ట్ వాచ‌బుల్ మూవీ(మై ఫీలింగ్‌).

Tuesday, August 29, 2017

వాన‌


రాలే ప్ర‌తి చినుకూ
నీ జ్ఞాప‌కంలా తాకుతోంది
నువు నా ప‌క్క‌నే ఉన్న‌ట్టు

ఈ మూడు నెల‌లు
నీ మూడు రోజుల్లాంటివ‌నుకున్నా
ఎక్క‌డో ముల్లు గుచ్చుకుంటున్నట్టు..

ఈ వాన జ‌ల్లు మాత్రం క‌చ్చితంగా నువ్వే
ఇంత చ‌ల్ల‌ద‌నం ఇంకెవరు పంచ‌గ‌ల‌రు
ఎదురుగా ఉన్న సముద్రం త‌ప్ప‌

Sunday, August 27, 2017

ల్యాండ్ ఆఫ్ మైన్‌

యుద్ధం ఎంత విషాద‌మో
స‌రిహ‌ద్దు న‌డిగి చూడు
సైనికుడి క‌ళ్ల‌లో చూడు

యుద్ధం ఎంత విషాద‌మో
అది ముగిశాక చూడు


ముంబ‌యి వ‌చ్చిన నెల‌రోజుల్లో ఇప్ప‌టిదాకా ఒక్క సినిమా చూడ‌లేదు. నిన్న రాత్రి నిద్ర రాక నెట్‌లో సెర్చ్ చేస్తుంటే త‌గిలిందీ సినిమా. ల్యాండ్ ఆఫ్ మైన్‌. డ్యానిష్ ఫిల్మ్‌. ఎందుకో ఆ టైమ్‌లో, అప్పుడున్న మూడ్‌లో మూవీ పోస్ట‌ర్ న‌చ్చింది. పైగా ఆస్కార్ నామినేటెడ్‌. ఐఎమ్‌డీబీ రేటింగ్ కూడా ఓకే క‌నుక సినిమా చూశా. 

రెండో ప్ర‌పంచ‌యుద్ధం త‌ర్వాత డెన్మార్క్‌లోని కోస్ట‌ల్ ఏరియాల్లో జ‌ర్మ‌న్ సైన్యాలు పాతిన‌ కొన్ని ల‌క్ష‌ల కొద్దీ ల్యాండ్‌మైన్స్ మిగిలిపోయి ఉంటాయి. యుద్ధంలో జ‌ర్మ‌నీ ఓడిపోయాక త‌మ‌కు ప‌ట్టుబ‌డిన జ‌ర్మ‌న్ సైనికుల‌తోనే ఆ ల్యాండ్‌మైన్స్‌ని నిర్వీర్యం చేయించాల‌నుకోవ‌డం, కుర్ర‌ సైనికుల క‌ష్టాలు, కొంత‌మంది ప్రాణాలు పోగొట్టుకోవ‌డం ఈ సినిమా. 

సినిమాలో అన్నింటికంటే బాగా న‌చ్చిన పాత్ర డెన్మార్ సైనిక అధికారి లియోపోల్డ్‌ది. స్టార్టింగ్ సీన్‌లో లొంగిపోయిన జ‌ర్మ‌న్ సైనికులు న‌డిచివెళ్తుంటారు. వాళ్ల‌లో ఒక‌రి చేతిలో డెన్మార్క్ జాతీయ జెండా ఉంటుంది. ఆ కార‌ణం చూపి సైనికుడ్ని చావ‌గొడ‌తాడు లియోపోల్డ్‌. జ‌ర్మ‌న్ సైనికులంటే త‌న‌కి ఎంత క‌సి ఉందో క‌నిపిస్తుంది. అదే లియోపోల్డ్‌కి 14మంది జ‌ర్మ‌న్ సైనికఖైదీల్ని అప్ప‌గిస్తారు. వాళ్ల‌తో ల్యాండ్‌మైన్స్ నిర్వీర్యం చేయించాల‌న్న‌ది టార్గెట్‌. అదికూడా ఎలాంటి సేఫ్టీ లేకుండా ఒట్టి చేతుల‌తో ల్యాండ్‌మైన్స్‌ని తొల‌గించాలి. 3 నెల‌ల్లో ఆ ఏరియాలో ఉన్న మైన్స్ అన్నింటినీ తొల‌గిస్తే జ‌ర్మ‌నీ పంపిస్తానంటాడు లియో.  

క‌ర‌డుగ‌ట్టిన సైనిక అధికారి ఒక వైపు.. అప్పుడ‌ప్పుడే బాల్యాన్ని దాటుతున్న కుర్ర సైనికులు ఇంకో వైపు. నిండా చావుని దాచుకున్న స‌ముద్రం ఒడ్డు మ‌రోవైపు. గంట‌న్న‌ర‌లో యుద్ధం మిగిల్చిన విషాదాన్ని బాగానే చూపించాడు డైరెక్ట‌ర్ మార్టిన్. 

Monday, July 31, 2017

దూరం


రాత్రి నాతో నువ్వు..
నీ బాహుమూల‌ల్లో దాచుకున్న నా త‌ల‌పుల వాస‌న‌
ఇంకా నా చుట్టూ నిలుచునే ఉంది

రాత్రి కురిసిన వాన
రాత్రి న‌లిగిన చీక‌టి దుప్ప‌టి

నీ ఎద‌తో నా గుండెపై రాసిన లేఖ‌
నా క‌ళ్ల‌తో తాగిన నీ ఎంగిలి

నీ వీపు నా పెదాలకు ఇంకా అంటుకునే ఉంది
ఆ మెడ‌వంపులో దాక్కున్న నా ముఖం
ఇంకా అక్క‌డే ఉంది

అన్నిటికీ మించి ఈ క‌ల ఇంకా ప‌చ్చిగానే ఉంది
బ‌హుశా నీకూ అదే క‌ల వ‌చ్చింద‌నుకుంటా

దూరం భారమే ఎప్పుడూ
ఒక్కోసారి దూరమే మ‌రింత ద‌గ్గ‌రేమో కూడా...

Friday, June 30, 2017

ఆరంభం


కాసేపు కల నిజం. కాసేపు జీవితం శుద్ధ అబద్ధం. ఆలోచన సరిహద్దు ఆకాశం. అది అంతం కానిది, కల కంటే విస్తృతమైంది. జీవితం అంత లోతైనది. కలల్ని దొంగిలించొచ్చు. ఆలోచనల్ని అవతలివాడి మనసులో నాటేయొచ్చు. సీడ్ బాల్స్ లాగా ఐడియా బాల్స్ విసిరేయొచ్చు. నగరాల్ని మడతపెట్టి మరో కొత్తలోకాన్నిఆవిష్కరించొచ్చు. 

ఎటొచ్చీ జీవితం నుంచి విడిపోలేమే..
ఎన్ని లోకాలైనా సృష్టించు. నీ లైఫ్ నీడ నుంచి తప్పించుకోలేవు. 
ఎన్ని కలల్లోనైనా విహరించు. మనస్సనే మంత్రలోకపు సరిహద్దు దాటలేవు.

క్రిస్టఫర్ నోలాన్.. అద్భుతంగా తీశాడని అనలేను కానీ. ఇది ఐడియాకి అమ్మ మొగుడు లాంటి సినిమా. ఆ ఆలోచనకయితే సలాం చేయొచ్చు. 



Tuesday, June 20, 2017

ఎ సెపరేషన్


సెపరేషన్ మళ్లీ చూశా. ఫర్హాదీ-సేల్స్ మేన్ మూవీ చూసి రాసిన పోస్టుకీ దీనికీ లింకుంది. సెపరేషన్తో పోలిస్తే ఇది కాస్త తేలిపోతుంది అంటూ మెహెర్ కామెంట్ పెట్టాక.. వెంటనే ఐ టూ అగ్రీ అనేశా. తర్వాత కరెక్ట్ కాదేమో అనిపించింది. కరెక్టేనేమో అని కూడా అనిపించింది. అసలు ఈ రెండు సినిమాల్ని ఎందుకు కంపేర్ చేయాలి అనుకుంటూ.. మళ్లీ ఒకసారి సెపరేషన్ చూశా. 

ఒక దేశాన్ని రెండు కుటుంబాలుగా కుదించి తీసిన సినిమా సెపరేషన్. పాలన, న్యాయవ్యవస్థలు, మతం.. ప్రజల డేటూడే లైఫ్ ని సమస్య నుంచి సమస్యల్లోకి ఎలా ఈడ్చుకెళ్తుంటాయో సెపరేషన్లో చూపిస్తాడు ఫర్హాదీ. ఇది ఇరాన్ ఒక్కదేశంలోనే కాదు.. అన్ని దేశాలు, అన్ని మతాలు, అన్ని వ్యవస్థల్లో ప్రజలు వాటితో ఇలాగే ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని కొన్ని మినహాయింపులుండొచ్చు. సినిమాలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒకటి, అప్పుల ఊబిలో ఉన్న పేద కుటుంబం ఇంకొకటి. ఇంకా విడగొడితే.. ఇద్దరు భర్తలు, ఇద్దరు భార్యలు, ఇద్దరు కూతుళ్లు. మోడ్రన్ మిడిల్ క్లాస్, స్లమ్స్ లో బతికే పేదలు. విడగొట్టుకుంటూ వెళ్తే ఈ రెండు కుటుంబాల్లో ఇరాన్ మొత్తం కనిపిస్తుంది. ఆ రేంజ్ లో చెక్కాడా కుటుంబాల్ని ఫర్హాదీ.  

సినిమా ప్రారంభం కోర్టులో.. 
నాదిర్, సిమన్ జంట విడాకుల కోసం వచ్చుంటుంది.

మీరు చెప్పే కారణాలతో విడాకులు ఇవ్వలేం. అసలు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు..? 
ఆయన మిమ్మల్ని కొడ్తున్నారా..? సరిగా చూసుకోవడం లేదా..?

లేదు. ఆయన చాలా మంచోడు.

మరేం..?

విదేశాలకు వెళ్లాలి. ఏడాదిన్నర కష్టపడితే వీసాలొచ్చాయి. వీసా గడువు 40 రోజులే ఉంది. ఆయనేమో తండ్రినొదిలి రానంటున్నాడు. అందుకే విడాకులు కావాలి.

నీ భార్యతో వెళ్లడానికేం ?

నాన్నని విడిచి వెళ్లలేను. తనని వెళ్లమనండి.

వాళ్ల నాన్నకి అల్జీమర్స్. అసలాయన ఈయన్ని గుర్తు కూడా పట్టలేడు. 

కానీ నాకాయన తండ్రి అని తెలుసు కదా..?

తన కూతురి భవిష్యత్తు గురించి పట్టించుకోడా ?

నీ కూతురి భవిష్యత్తుకి ఇక్కడేమైంది ? 

ఇక్కడున్న పరిస్థితుల్లో, ఇలాంటి వాతావరణంలో నా కూతురు పెరగకూడదనుకుంటున్నాను. అది నా హక్కు.

ఇక్కడి పరిస్థితులకేమైంది. మీ ఇద్దరూ కలిసుంటేనే తనకి భవిష్యత్తు. 

అందుకే కదా తనని నాతో రమ్మంటున్నాను. సరే తను రావడం లేదు. నా కూతుర్నయినా నాతో పంపించమనండి.

మీ అమ్మాయి వయసెంత..?

పదకొండేళ్లు. 

ఆ వయసులో ఉన్న అమ్మాయి తండ్రి అనుమతి లేకుండా మీతో రాకూడదు. 

నేను నా సమస్యని తీర్చమని మీ దగ్గరకొచ్చాను. 

తనకి నేనంటేనే ఇష్టం. తను నీతో రాదు. 

తనకి సమస్య అర్ధం కావడం లేదు.

పదకొండేళ్ల అమ్మాయికి ఏది మంచో, ఏది చెడో.. ఆమాత్రం తెలియదా. 

మీరొచ్చి ఇక్కడ సంతకం పెట్టండి.

నాకు 40రోజులే గడువుంది. నా సమస్యని ఎందుకు అర్ధం చేసుకోరూ..?

మీరు ప్రతిసారి చిన్న సమస్య పట్టుకొచ్చి విడొకులు ఇమ్మంటున్నారు. దయచేసి కోర్టు సమయాన్ని వృధా చేయొద్దు. 

కేసు కొట్టేశాడు జడ్జి. ఈ సీన్లో జడ్జి మనకి కనిపించడు. ఇద్దరూ డైరెక్ట్ గా మనతోనే మాట్లాడుతూ, మనని జడ్జిని చేసి కథలోకి లాక్కెళ్తారు. కేసు కొట్టేయడంతో తన పుట్టింటికి వెళ్లిపోతుంది సిమన్. కూతురు తెర్మియా రానంటుంది. ముసలాడు తన చేయి పట్టుకుని వదలడు. కానీ మొండిగా వెళ్లిపోతుంది సిమన్. తండ్రిని చూసుకోవడం కోసం రజియా అనే పనిమనిషిని మాట్లాడుతాడు నాదిర్. తనతో నాలుగైదేళ్ల కూతురు కూడా వస్తుంది. రజియా ప్రెగ్నెన్సీతో ఉండి భర్తకి తెలియకుండా వీళ్లింట్లో పనికి కుదురుతుంది. ముసలాడ్ని చూసుకోవడం తనవల్ల కాదని.. (ముఖ్యంగా తన బట్టలు కూడా మార్చాల్సి వస్తుండడంతో, అదెక్కడ తనకి పాపంలా అవుతుందేమో అన్న భయంతో) తన బదులు తన భర్తని పనిలోకి తీసుకోవాలని అడుగుతుంది. బ్యాంకులో నాదిర్ని కలుస్తాడు రజియా వాళ్లాయన. నిజానికి ఈ మగ క్యారెక్టర్ల మధ్య సిమిలారిటీ ఉంటుంది. ఒకరు తండ్రిని విడవలేక, భార్యని ఒదులుకోలేక ఫ్రస్టేషన్లో ఉంటే.. మరొకరు ఉద్యోగం పోగొట్టుకుని డిప్రెషన్ అనుభవిస్తున్న మనిషి. సరే.. రజియా వాళ్లాయన్ని మరసటి రోజు నుంచి పన్లోకి రమ్మంటాడు. కానీ తను రాడు. మరుసటిరోజు కూడా రజియానే వస్తుంది.

ఒకరోజు నాదిర్, కూతురితో కల్సి ఇంటికొచ్చేసరికి ముసలాడు బెడ్డుపైనుంచి పడిపోయుంటాడు. తనని మంచానికి కట్టేసి ఎటో వెళ్లిపోయుంటుంది రజియా. తండ్రి చనిపోయాడని అనుకుంటాడు. కొద్దిసేపటి తర్వాత తను మామాలుగా అవుతాడు. ఇంట్లో చూస్తే కొంత సొమ్ము మాయం అయ్యుంటుంది. కోపంలో ఉండగానే రజియా వస్తుంది. తనపై ఒక్కసారిగా సీరియస్ అవుతాడు. తనని ఇంట్లోంచి బైటకి గెంటేసే ప్రయత్నంలో.. రజియా మెట్లపై పడిపోతుంది. మరుసటి రోజు తెలుస్తుంది తనకి అబార్షన్ అయిందని. నాదిర్ పై హత్య కేసు నమోదవుతుంది. అక్కడ్నించి ఆట మొదలవుతుంది. కథ ఇక్కడితో ఆపేస్తున్నా.

స్టార్టింగ్ నుంచి చివరివరకూ.. ఇంట్లో , కోర్టులో, హాస్పిటల్లో, స్కూళ్లో, కారులో.. దాదాపు ఎక్కడా వైడ్ యాంగిల్లో సినిమా కనిపించదు. మనని అందులోంచి బైటకు రాకుండా పాత్రల వెంట తిప్పుతాడు. ఏ ఒక్క షాట్ కానీ, డైలాగ్ కానీ, పాత్రల్ని కానీ అనవసరంగా వాడడు. 

ముఖ్యపాత్రల్ని చూస్తే.. ఫ్రస్టేషన్లో ఉన్న ఇద్దరు భర్తలు. ఇద్దరిది దాదాపు ఒకే రకమైన మానసిక స్థితి. కాకపోతే ఒకరు సెక్యులర్ అయినా, తనకున్న స్టేటస్తో, అబద్దాలతో తన సమస్య నుంచి బైటపడేందుకు ప్రయత్నించే మనిషి. తన తప్పు లేదని నిరూపించుకునే ప్రయత్నమే అది. మరొకరు ఉద్యోగం పోగొట్టుకుని, మోడ్రన్ మిడిల్ క్లాస్ అర్బన్ సొసైటీతో పోరాడేందుకు తన స్థాయి సరిపోక మరింత నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయే మనిషి. వారికోసం పోరాడే ఇద్దరు భార్యలు. నిజాన్ని రెండుగా విడగొడితే వీళ్లిద్దరూ. మోడ్రన్ అండ్ రెలీజియస్. కుటుంబం కోసం ఎలాంటి నిర్ణయాన్నైనా స్వతహాగా తీసుకోగలిగిన స్త్రీ ఒకరు. మరొకరు మతానికి కట్టుబడిన స్త్రీ. భర్త అనుమతి లేకుండా బైటకి అడుగుపెట్టడానికి భయపడే మనిషి.

రెండు కుటుంబాల నుంచి, రెండు వేర్వేరు ప్రపంచాలకి రేపటి ప్రతినిధులైన ఇద్దరు కూతుళ్లు. వీళ్లిద్దరిలో తెర్మియాకి అక్కడక్కడా డైలాగులుంటాయి. రజియా కూతురికి మాత్రం ఒకట్రెండు మాటలు తప్ప మరేం ఉండదు. కానీ వీళ్ల చూపుల నుంచే సినిమాకి కావల్సింది రాబట్టుకున్నాడు ఫర్హాదీ. కోర్టు అవరణలోని ఒక సీన్లో తెర్మియా తన అమ్మమ్మ సాయంతో ఎగ్జామ్కి ప్రిపేరవుతూ ఉంటుంది. రజియా కూతురు మాత్రం ఒంటరిగా దిక్కులు చూస్తూ నిలబడి ఉంటుంది. క్లైమాక్స్ కు ముందు సీన్లో.. రజియా ఖురాన్ పై ప్రమాణం చేయడానికి ఒప్పుకోకపోవడంతో, తన భర్త తనని తానే కొట్టుకుంటూ వెళ్లిపోతాడు. ఆ క్షణంలో తెర్మియా, చిన్నమ్మాయి వైపు చూస్తుంది. పేదరికంలోని సమస్త నరకమంతా ఆ చిన్న పిల్ల కళ్లలో కనిపిస్తుంది. 

అయిపోవచ్చింది సినిమా. 
క్లైమాక్స్ కోర్టులో..
తెర్మియాని లోపలికి తీసుకెళ్తాడు నాదిర్. 

మీ అమ్మానాన్ననిర్ణయాన్ని నీకొదిలేశారు. వాళ్లలో ఎవరితో నువ్వుండాలో నువ్వే నిర్ణయించుకోవచ్చు. 
చెప్పు. అమ్మ కావాలా.. నాన్నా కావాలా..? ఎవరితో ఉండాలో నిర్ణయించుకున్నావా ?

నిర్ణయించుకున్నా. (కళ్లలోంచి నీళ్లు)

ఎవరితో ఉండాలనుకుంటున్నావు ?

ఇప్పుడే చెప్పాలా ?

నిర్ణయించుకోలేదా ఇంకా ?

నిర్ణయించుకున్నా.

మరి చెప్పు. 

-------------------

మీ అమ్మానాన్నల్ని బైటకి పంపించనా ?

ఆ అవకాశముందా ?

మీరిద్దరూ ఓ నిమిషం బైటకెళ్తారా ?

ఇద్దరూ బైటకొస్తారు. 
లోపల తెర్మియా ఏం చెప్తుంది....................................
ఎవరితో ఉంటానంటుంది.......................................

ఎండ్ క్రెడిట్స్ మొదలైపోతాయి. 

అయిపోయింది సినిమా. 

మొదటి సీన్లో జడ్జ్ కనిపించడు. చివరి సీన్లో జడ్జి కనిపిస్తాడు. సినిమా మొత్తం కోర్టుల చుట్టూ తిరుగుతుంది. కానీ తుది తీర్పు రాదు. తీర్పు  వ్యవస్థల చేతిలో లేదు. తెర్మియా చేతుల్లో ఉందది. రేపటి చరిత్రలో ఎవరుండబోతున్నారో వారి చేతుల్లో ఉందది. సినిమా కేవలం ఇరాన్ ప్రభుత్వం, ఇరాన్ ప్రజల మధ్య సెపరేషన్ గురించి మాత్రమే కాదు.. బీయింగ్ ఏ ముస్లిం, బీయింగ్ పర్షియన్ మధ్య తేడాని వెస్ట్రన్ ప్రపంచానికి చూపించడానికీ కూడా ఫర్హాదీ ప్రయత్నించాడేమో.? 

ఇక సెపరేషన్ vs సేల్స్ మేన్ గురించి. ఇలా అనడం తప్పేమో. సెపరేషన్ మహాద్భుతమే. కానీ సేల్స్ మేన్ని తక్కువ చేయగలమా ? ఒక ప్రఖ్యాత నాటకాన్ని సైమల్టేనియస్గా నడుపుతూ అందులోని పాత్రల్ని మనముందుకు మళ్లీ తీసుకొచ్చే ప్రయత్నాన్ని తక్కువ చేయలేమేమో. సేల్స్ మేన్ లో హీరో.. వ్యాన్ ఓనర్ కోసం వేసిన ట్రాప్లో, తను అనుకున్న మనిషికి బ‌దులు వేరొకరు వస్తుంటే షాక్ అవుతాడు. తను అనుకున్నవాడు కాకుండా ఇంకెవరో పెద్దాయన వస్తున్నాడని. అదే సమయంలో ప్రేక్షకుడిగా మనం తినే షాక్ చాలా పెద్దది. సినిమా ఎక్కడ్నుంచి ఎక్కడికి వచ్చిందని. అది గుర్తొచ్చినప్పుడల్లా.. అరే, అనుకోకుండా ఉండలేం. ఫర్హాదీ వర్క్స్ లో సెపరేషన్, పాస్ట్, ఎబౌట్ ఎల్లీ, సేల్స్ మేన్.. దేన్నీ ఒకదానితో మరోదాన్ని పోల్చలేను. ఒక్కోసారి అన్నీ ఒకే సినిమాగా.. ఒకదానికొకటి సీక్వెల్గా కూడా అనిపిస్తాయి. 

Thursday, June 15, 2017

ది సేల్స్ మేన్


భవనం ఎంత బలమైనదైనా కావొచ్చు. చిన్నపగులు మనల్ని భయపెడుతుంది. అందులో ఉండడమంటే భయం పుట్టిస్తుంది. ఏదైనా అనుబంధం కూడా అంతే. అది బలమైనదే కావొచ్చు. మేల్ ప్రివిలేజ్ అనే పగులు దాని అతిపెద్ద బలహీనత. ఇంకా చాలా బలహీనతలున్నా ఇది చేసే విధ్వంసమే ఎక్కువ. గాయం తగిలాక అది మానిపోవచ్చు. కానీ మచ్చ ఎక్కడో ఓచోట మిగిలిపోతుంది. 

త్రిపుర కథ. ఫర్హాదీ సినిమా. అవి నాకు అర్ధం అయినా, కాకపోయినా అద్భుతాలే. ఏవేవో గుర్తు చేస్తుంటాయి. వాటిని చదివేటప్పుడు, చూసేటప్పుడు.. జీవితంలోని ఏదో మూలకి టార్చ్ లైట్ వేసి చూపించినట్టు అనిపిస్తుంది. 

సేల్స్ మేన్ కి ఆస్కార్ వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తుంటే ఇప్పటికి సబ్ టైటిల్స్ తో ఉన్న లింక్ దొరికింది. 
సినిమాలో ఓ సీన్ లో హీరో ఎమాద్.. స్కూల్ నుంచి వెళ్తూ మరో స్టూడెంట్ తో కల్సి ట్యాక్సీ ఎక్కుతాడు. అప్పటికే అందులో ఉన్న ఒకామె హీరోని ముందు సీట్లోకి మార్చాలంటూ డ్రైవర్ తో గొడవ చేస్తుంది. హీరో కామ్గా సీటు మారతాడు. తర్వాత క్లాస్ లో స్టూడెంట్ అడుగుతాడు.. ఆమె అలా అన్నందుకు మీరు బాధ పడ్డారు కదా అని. అందులో బాధ పడ్డానికి ఏముంది.. అంతకుముందు ఉన్న వాడెవడో ఆమెని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. అందుకే ఆమె నన్ను సీటు మార్పించాలని కోరి ఉండొచ్చు కదా అంటాడు హీరో. 

సినిమా మొదట్లో సీన్. బిల్డింగ్ కూలిపోయే ప్రమాదముందని అంతా భయంతో ఖాళీ చేస్తుంటారు. అంత హడావుడిలో కూడా హీరో.. పక్కింట్లో నడవలేని పరిస్థితిల్లో ఉన్న ఓ వ్యక్తిని మోసుకుని తీసుకెళ్తాడు. 

ఈ రెండు సీన్లలో హీరో మనస్తత్వం, తనెలాంటివాడో అర్ధమైపోతుంది. కానీ తన భార్యపై ఎవడో గుర్తుతెలియని వ్యక్తి ఎటాక్ చేశాడని తెలిశాక.. హీరో ఎందుకు వాడ్ని వేటాడాలనుకుంటాడు. వాళ్లు అద్దెకి మారిన ఇంట్లో ముందున్న ఆమెపై రివేంజ్ తీసుకోడానికి వచ్చిన వ్యక్తే కదా అని.. ఎందుకు దాన్ని లైట్ తీసుకోలేడు..? అసలు పోలీస్ కంప్లయింట్ ఇవ్వకుండా తనే ఎందుకు పోలీసులా మారతాడు..? ఈ ప్రశ్నలకి సమాధానం దొరికేకొద్దీ సేల్స్ మేన్ మామాలు థ్రిల్లర్ సినిమాల కంటే ఏదో ఎక్కువగా అనిపిస్తుంది.

సినిమాని మామూలు థ్రిల్లర్ డ్రామాగా చూసినా అద్భుతమే అనిపిస్తుంది. కానీ ఆర్ధర్ మిల్లర్-డెత్ ఆఫ్ ఏ సేల్స్ మేన్ గురించి తెలిసుంటే ఫర్హాదీ సేల్స్ మేన్ ని ఇంకా ఏంజాయ్ చేయొచ్చు. 

Monday, June 12, 2017

దంగల్ టు పిచ్చిగుంట్లోళ్లు

దంగల్ మూవీ చూసిన చాలా రోజులు 'తూ తో హానికారక్ బాపు' ఎందుకో పదే పదే చూడాలనిపించింది. 'నిక్కర్ ఔర్ టీ షర్ట్ పెహెన్ కే ఆయా సైక్లోన్' సాంగ్ బాగుంటుంది కానీ.. హానికారక్ బాపులో చిన్నపిల్లలు పాడిన స్టైల్ నచ్చింది. ఏదో నేచురల్ ఫ్లేవర్ ఉన్న గొంతులు. పాడిన ఇద్దరు కుర్రాళ్లు సర్వార్ ఖాన్, సర్త్ రాజ్ ఖాన్. 




వీళ్ల గొంతు విన్నాక ఎప్పుడో ఇండియన్ ఐడల్ లో పాడిన సత్తార్ ఖాన్ గుర్తొచ్చాడు. వీళ్ల గొంతుల్లో ఏదో గమ్మత్తుంది. అది ఫోక్ లో ఉండే మజా. రెగ్యులర్ సినిమా పాటల్లో దొరకనిది. ఫోక్ సాంగ్ తో ఇండియన్ ఐడల్ లో ఎంట్రీ ఇచ్చిన సత్తార్ ఖాన్ తర్వాత అందులోంచి ఎలిమినేట్ అయ్యాడు. హిందీ రాని కారణం ఒకటి, అసలు తనకి హిందీ పాటలే విన్నఅనుభవం లేకపోవడంతో ఇండియన్ ఐడల్ కాలేకపోయాడేమో. 


ఎవరీ సత్తార్, సర్వార్, సర్త్ రాజ్.. 
ఈ ముగ్గురిదీ ఒకే కులం. మంగనియర్. రాజస్థాన్ లో ఎక్కువగా కనిపించే కులం. వీళ్ల జీవితం నిండా పాటే ఉంది. ఎందుకంటే పాటే వృత్తిగా జీవిస్తున్న కులం ఇది. సంగీతమే వారికి వారసత్వం. మతం ఇస్లాం అయినా.. వీళ్ల పాటలు హిందూ మతంతో ముడిపోయాయి. రాజుల చరిత్రల్ని పాటల రూపంలో భద్రపరిచిన కులంగా కూడా మంగనియర్లకు ప్రత్యేక పేరుంది. అలెగ్జాండర్ తో పాటు రాజపుత్ర వీరుల యుద్థాలు, జీవితాల్ని పాటలుగా పాడుతుంటారు. రాజ్ పుట్ ల పెళ్లిళ్లలో ఎక్కువగా కచేరీలు ఇస్తూ కనిపిస్తారు. ఏదైనా కచేరీకి ముందు వీళ్లు కృష్ణుడ్ని పూజిస్తారట. దీపావళి, హోలీ పండగల్లో వీరి పాట కంపల్సరీ. కానీ ఆశ్రిత కులంగా వీరిని తక్కువ కులంగానే చూస్తారు. వీళ్ల ప్రత్యేక వాయిద్యం ఖమైచా. మామిడి చెక్కతో తయారు చేసే ఈ వాయిద్యంపై 17 తంత్రులుంటాయి. కింద ఉన్న డొల్ల భాగం మేక చర్చంతో కవర్ చేసి ఉంటది. తంత్రుల్లో కూడా 3 మేకలోంచి తీసిన నేచురల్ ఫైబర్తో చేసినవే బిగిస్తారు. 

( పై వీడియో లో కూడా ఇండియన్ ఐడల్ సత్తార్ ఉన్నాడు. ఇందులో ఖమైచాకి బదులు సారంగి వాడారు)
దంగల్ కోసం ప్రత్యేకించి జైసల్మేర్ లో టాలెంట్ హంట్ పెట్టి మరీ సర్వార్ ఖాన్, సర్త్ రాజ్ లని సెలక్ట్ చేసింది ఆమిర్ ఖాన్ టీమ్. మంగనియర్ల గురించి చదివాక.. వీళ్ల సంగీతం విన్నాక.. పిచ్చిగుంట్లోళ్లు గుర్తొచ్చారు. మంగనియర్లది పాటయితే పిచ్చిగుంట్లోళ్లది ఆట. చిన్నప్పుడు సినిమా కంటే ఎక్కువగా నన్ను ఎంటర్ టైన్ చేసింది పిచ్చిగుంట్లోళ్ల కథలే. వీళ్లు రెడ్లకి ఆశ్రితకులం. మా ఊరికి ఎక్కడ్నించో వచ్చేవాళ్లు. అందరూ అనలేను కానీ.. మా పాతిళ్లలో ఉన్నప్పుడు ఒక పొట్టిగా ఉన్నతను కథలు చెప్పడానికొచ్చాడు. ఎగిరెగిరి దూకుతూ కథలు చెప్పేవాడు. రెడ్డి రాజుల కథలతో పాటు భారతానికి కూడా ఏవో కల్పనలు చేర్చి చెప్పేవాళ్లు. మధ్యలో పిట్టకథలు. కొన్ని ఇప్పటికీ గుర్తున్నాయి. అప్పుడు నాకు ఆరేళ్లు. ఆ వయసులో రాత్రి 2, 3 గంటల వరకూ వీళ్ల కథలు చూస్తూ ఉండేవాడ్ని. వాళ్లు అన్నానికొచ్చినప్పుడు మా ఇంట్లో ఉన్న కోడిపుంజుని ఇస్తే, మా ఇంటిదగ్గర కూడా కథ చెప్తాం అనేవోళ్లు. మా అమ్మ ఇచ్చిందీ లేదు వాళ్లు చెప్పిందీ లేదు. తర్వాత ఒకట్రెండు సార్లు పిచ్చిగుంట్లోళ్లు వచ్చినా.. ఆ పొట్టి ఆయనలాగా ఎవురూ కథలు చెప్పలేదు. ప్రస్తుతం వాళ్లు అప్పటిలాగా ఊర్లమీదకి రావడం లేదు. నిజానికి వాళ్లు అద్భుతమైన స్టోరీ టెల్లర్స్. రెడ్లకి ఆశ్రిత కులంగా ఉండిపోవడం వల్లే వాళ్ల ఆర్ట్ అప్ డేట్ కాలేదేమో. 

మంగనియర్ల సంగీతాన్ని పరిచయం చేయడంతో పాటు, పిచ్చిగుంట్లోళ్ల కథల్ని గుర్తొచ్చేలా చేసినందుకు ఆమిర్ ఖాన్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. 

Friday, May 19, 2017

ట్రూ గ్రిట్ - 2


మెకన్నాస్ గోల్డ్ చూసేశా. సినిమా అనగానే కొన్ని పేర్లు గుర్తొస్తాయి. వాటి గురించి ఎంత చెప్పినా తక్కువే అంటాం. నిన్న నేను 'అన్ ఫర్గివన్' మూవీ చూశా. మొన్న 'ట్రూ గ్రిట్'. రెండూ చూశాక ట్రూ గ్రిట్ అంటూ ఏదో రాశా. దీన్ని దానికి సీక్వెల్గా రాస్తున్నా. నిజానికి ట్రూ గ్రిట్ అంటే మెకన్నాస్ గోల్డ్. అందుకే ట్రూ గ్రిట్ అన్న పేరు వాడుతున్నా. 

నిన్న రాసిందాంట్లో పాత సినిమా అన్న కారణంతోనే ఈ మూవీ చూల్లేదన్నా. అందులోనే ఒక చోట ఓల్డేజ్ కంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ మీద నాకంత నమ్మకం లేదు కానీ. ఈ సినిమా మాత్రం గోల్డే. గోల్డ్ కోసం చేసే సాహసయాత్రే ఈ సినిమా. డబ్బు మీద ఆశలేని మనిషి ఎవుడూ ఉండడు. డబ్బే జీవితం కాదని కలరింగ్ ఇవ్వొద్దు. ఇందులో హీరో అలాంటి కలరింగ్ ఇస్తాడు కాబట్టే.. సినిమా చరిత్రలో నిలిచిపోయినా ఆ పాత్ర నిలబడలేదు. నాకెందుకో విలన్ క్యారెక్టరే నచ్చింది. హీరో గ్రెగరీ పెక్ ఎక్స్ ప్రెషన్స్ చూస్తే మాత్రం.. హిందీ సినిమాల్లో హీరోలు చాలామంది వాటిని అనుకరించారేమో అనిపించింది. 

స్ర్నీన్ ప్లే విషయంలో నాకు బోల్డన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడీ సినిమా చూసే ఎవరికైనా వచ్చే అబ్జెక్షన్సే అనుకుంటా అవి. వాటికంత ప్రయారిటీ ఇవ్వాల్సిన పన్లేదు కూడా. మెకన్నాస్ గోల్డ్ అంటే కెమెరా పనితనం. దానికోసమే ఈసినిమా ఓ పాతికసార్లు చూడొచ్చు. అప్పటికి స్టడీ కామ్స్ లేవు. భారీ కెమెరాలతోనే గుర్రాల వెంట ఎలా మ్యానేజ్ చేశారో. అదే పెద్ద అడ్వెంచర్. ఇంక వైడ్ యాంగిల్స్, ఈగిల్ వ్యూ షాట్స్ ఇలాగే తీయాలని ఎంతమంది ట్రై చేసి ఫెయిలై ఉంటారో..!

డైరెక్టర్ - జె. లీ థామ్సన్
సినిమాటోగ్రఫీ - జోసెఫ్ మెక్ డొనాల్డ్
మ్యూజిక్ - క్విన్సీ జోన్స్
ఈ ముగ్గురిదే ఈ సినిమా. 

ఈ మూవీ ఫిలాసఫీ గురించి చాలామంది బోల్డంత రాశారు. అంత భయకరంగా ఆలోచించి సినిమా తీసి ఉండకపోవచ్చు. నవల రాసిన హెక్ అలెన్ ఆలోచించి ఉంటాడేమో మే బీ. సినిమా చూసిన వాళ్లు మాత్రం పుంఖానుపుంఖాలుగా ఫిలాసఫీ చెప్పారు. నిజానికి కథ పరంగా పెద్దగా నిలిచేది కాదీ సినిమా అనుకోవచ్చు. సినిమాకీ కథకీ సంబంధం ఉండదనేవాళ్లు దీన్ని ఎగ్జాంపుల్గా కూడా చెప్పుకోవచ్చు. కానీ కథంటే ప్రత్యేకమైన నిబంధనలున్నాయని నేననుకోను. చిన్న జర్నీ కూడా కథే కావచ్చు. కావల్సిందల్లా కాస్త మసాలా. మెకన్నాస్ గోల్డ్ నిండా ఉంటుందది. అదే నిధి. 

సినిమా అంటే హీరో.. విలన్. వీళ్లిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. అందుకే వీళ్లిద్దర్నీ ఎక్కడెక్కడో ఉంచుతారు. ఇద్దరూ ఎదురుపడితే యుద్ధమే. కానీ ఈ మూవీలో హీరో, విలన్ ఇద్దరూ 95శాతం కలిసే ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్న సినిమాలు చాలా మే బీ వేళ్లమీద లెక్కపెట్టాలేమో.(ఇప్పుడు కూడా 3.10 టు యూమా గుర్తొస్తోంది). ఇందులో కెమెరా వర్క్ తర్వాత నచ్చిందేందంటే.. కథ కల్పితమైనా, దానికి నేటివిటీ అద్దడానికి అపాచీల్ని, అమెరికన్ హిస్టరీని టచ్ చేయడం బాగుంది. గుర్రాలతో పాటు మనల్ని పరుగులు పెట్టిస్తూ సినిమా అంతా ప్రవహించే నేపథ్య సంగీతం, పాటలు కూడా. ఈ మూవీలోనే ఫస్ట్ టైమ్ రోప్ బ్రిడ్జ్ ని వాడారు. ఆ సీన్ చూడగానే నాకనిపించింది ఏందంటే.. ఈ సినిమాని కాపీ కొట్టడానికి ప్రయత్నించినవాళ్లంతా ఆ బ్రిడ్జిని దాటలేకపోయారని. ఎంతమంది ఎంత విచ్చలవిడిగా అలాంటి బ్రిడ్జిని వాడేశారో. వీటన్నింటినీ చూడడం వల్ల.. అంత గొప్ప సీన్ నాకు చప్పగా అనిపించింది. సినిమాలో మ‌రో అంశం మీనియేచ‌ర్ వ‌ర్క్‌. గ్రాండ్ కాన్య‌న్ లోయ‌ల్ని మీనియేచ‌ర్‌లో చూస్తున్నామ‌న్న ఆలోచ‌నే రాకుండా పిక్చ‌రైజ్ చేయ‌డం గ్రేట్. ఒక్క క్లైమాక్స్ లో అంతా కూలిపోవ‌డం ఒక్క ద‌గ్గ‌రే కాస్త తేడాగా అనిపిస్తుంది త‌ప్ప మిగ‌తా అంతా.. ఏది అవుట్ డోర్ లో తీశారో, ఏది మీనియేచ‌ర్ వ‌ర్కో గుర్తించలేం. అన్న‌ట్టు ఫ‌స్ట్ రిలీజ్ లో ఈ సినిమా జ‌నానికి ఎక్క‌లా.. 

ఫైనల్గా ఈ సినిమా అంటే మూవీ మేకింగ్ కి ఈగిల్ వ్యూ. చాలా తేలిగ్గా సినిమా తీయొచ్చు అనిపించే సినిమా. కేవలం కెమెరా వర్క్(హార్డ్ వర్క్)తో జనాన్ని థియేటర్లో కూర్చోబెట్టొచ్చు అనిపించే సినిమా. 

ట్రూ గ్రిట్..


ఈ సినిమా చూశాక ఎందుకో ఇది రాయాలనిపించింది. ఒక్క ఈ సినిమా గురించే కాదు. వెస్ట్రన్ మూవీస్(కౌబాయ్ సినిమాలు)లో ఏదో కిక్కుంటది. ఆ లాంగ్ షాట్స్ ఇంకే జానర్ కి కూడా అంతలా నప్పవు. మట్టి రంగు స్క్రీన్, లోయలు, కొండలు(పర్వతాలు కాదు), ఎడారుల్లాంటి ప్రాంతాలు, దుమ్ముతెరలు. బహుశా ప్రపంచాన్ని ఇంత వైడ్ యాంగిల్ లో చూపించే స్టైల్ ఒక్క కౌబాయ్ మూవీస్ లోనే కనిపిచ్చుందెందుకో.
వైల్డ్ అండ్ వైడ్.

'ట్రూ గ్రిట్' చూసినవెంటనే క్లింట్ ఈస్ట్ వుడ్ 'అన్ ఫర్గివన్' మూవీ చూశా. ట్రూ గ్రిట్ కాస్త కొత్తసినిమా. 2010 రిలీజ్ అనుకుంటా. అన్ ఫర్గివన్ కాస్త పాతది. 1992. కానీ రెండు సినిమాల్లో ఫ్లేవర్ ఒకటే. చిన్నప్పుడు కొదమసింహం చూసి.. పెద్దయ్యాక గుర్రం కొనుక్కోవాలనుకున్నా. కొండవీటిదొంగ, మోసగాళ్లకు మోసగాడు చిన్నప్పుడు బాగనిపించినా.. అందులో గుర్రాలు తప్ప నచ్చిందేం లేదు. టక్కరిదొంగ చూశాక ఎందుకో ఇది మనవాళ్ల పనికాదనిపిచ్చింది. మనకా స్టైల్ తెలీదు. ఆ లైఫ్ కొంతైనా చూసుండాలేమో.? చూడకపొయినా తీయచ్చేమో..? 

నిజానికి ఈ జానర్లో లైఫ్ అంతగా దొరకదు. కానీ బైట ప్రపంచంలోని వైల్డ్ నెస్ మాత్రం బోలెడు దొరుకుద్ది. మన సినిమాల్లో చెప్పుకునే పౌరుషం లాంటిది. తొడగొట్టడం లాంటివే ఇక్కడా కనిపిస్తాయి. ఫరెగ్జాంపుల్.. అన్ ఫర్గివన్లో క్లింట్ ఈస్ట్ వుడ్ ఓ కిల్లర్. అత్యంత క్రూరంగా మనుషుల్ని చంపే మనిషి. కానీ అదంతా గతం. భార్య ప్రేమలో తన యవ్వనం చనిపోయాక.. భార్య కూడా చనిపోయాక.. కేవలం పిప్పిలాంటి మనిషిగా కనిపిస్తాడు. పందుల్ని పెంచుకుంటూ, పిల్లలతో కల్సి రైతులా కనిపిస్తాడు. ఇద్దరు మనుషుల్ని చంపే ఆఫర్ వచ్చాక డబ్బుకోసం బయల్దేరతాడు. మొదట్లో గుర్రం ఎక్కడానికే నానా చావు చస్తాడు. తర్వాత తన పాత స్నేహితుడ్ని పార్టనర్గా కలుపుకుని వెళ్తాడు. ఎక్కడా తనో కరుడుకట్టిన కిల్లర్లా కనిపించడు. తన పలవరింతల్లో మాత్రమే గతం కనిపిస్తుంది. చివర్లో ఫ్రెండ్ ని చంపారని తెలిశాక.. మన చిరంజీవి, బాలకృష్ణలాగే బయల్దేరతాడు. కాకపోతే చూపించే దాంట్లో కాస్త వేరియేషన్ ఉంటుంది. నిజానికి మన కొదమసింహం బానే ఉంటుంది. స్టోరీ మరీ పెద్దదై పోయినట్టనిపిస్తుంది.ఇప్పుడు చూస్తే ఎలా ఉంటదో తెలియదు. ఈ తరహా సినిమాల్లో చాలా స్ట్రయిట్గా వెళ్లాలనిపిస్తుంది.  నేను చూసినంతమటుకు వెస్ట్రన్ మూవీస్ లో ఫ్లాష్ బ్యాక్ లు దాదాపు ఉండవు. పాతికేళ్ల కిందటి సినిమా అయినా అన్ ఫర్గివన్ ఎక్కడా బోర్ కొట్టలేదు. అందుకు మాత్రం క్లింట్ ఈస్ట్ వుడ్ కి హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. సినిమాలో కాస్త నీతినియమాల ప్రస్తావన ఎక్కవైందనిపిస్తుంది.(ఇక్కడెందుకో 3.10 టు యూమా గురించి రాయాలనుంది. కానీ ఆ ఒక్క మూవీ గురించే ప్రత్యేకంగా రాయాలి తర్వాతెప్పుడైనా).
ద గుడ్ ద బ్యాడ్ అండ్ ద అగ్లీలో క్లింట్ ఈస్ట్ వుడ్ని అన్ ఫర్గివన్లో చూడలేం. ఇలాంటపుడు మాత్రం ఓల్డేజ్ కంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనిపిస్తుంది. అన్నట్టు ఈసినిమాకి 9 ఆస్కార్ నామినేషన్లు వచ్చాయి. 

ఇక ట్రూ గ్రిట్.. ఆల్రెడీ 1969లో వచ్చిన మూవీనే ఏవో మార్పులు చేసి తీశారంట. పాత సినిమా చూడలేదు. డైరెక్టర్ కోయెన్ బ్రదర్స్ పేరు చూసి ఓపెన్ చేశా. కాస్త కొత్త సినిమానే కాబట్టి విజువల్లీ నో ప్రాబ్లమ్. ఎంత గొప్ప సినిమాలైనా పాతవాటిని చూడాలంటే కాస్త ఆలోచించాలెందుకో. మెకన్నాస్ గోల్డ్ చూడాలని ఎంత ఉన్నా.. ఇప్పటిదాకా అందుకే చూళ్లేదు. సిటిజన్ కేన్ చూసి అందుకే భయమేసిందేమో కూడా. ట్రూ గ్రిట్ విషయానికొస్తే.. పద్నాలుగేళ్ల పిల్ల తన తండ్రిని చంపిన వాఢ్ని పట్టుకునేందుకు చేసే ప్రయత్నం. అన్ ఫర్గివన్ తో పోలిస్తే ట్రూ గ్రిట్ ప్లే పరంగా నాకు పెద్దగా నచ్చలేదు కానీ.. పిక్చరైజేషన్ బావుంది. చెప్పాను కదా లాంగ్ షాట్స్, హార్స్ రైడింగ్ వీటికోసమే ఈ సినిమా చూడొచ్చు. నేనైతే వీటికోసమే చూశా. జెఫ్ బ్రిడ్జెస్ స్టైల్ కూడా ట్రూ గ్రిట్ కి స్పెషల్ అస్సెట్. ట్రూ గ్రిట్ కంటే అన్ ఫర్గివన్ నచ్చినా.. మళ్లి చూడటానికి మాత్రం ట్రూ గ్రిట్ కే ఓటేస్తా. కారణం అది కొత్తది. అందులో విజువల్ క్వాలిటీ. ఎందుకంటే విజువల్ మాత్రమే సినిమా అనిపించే సినిమాలివి. వీటిలో నిజమైన దమ్మంతా ఫ్రేమింగే. తీసేవాళ్లకి బరితెగింపు అన్నా, వైల్డ్ నెస్ అన్నా పిచ్చ ఉండాలనిపిచ్చుద్ది. నేచర్ అంటే పాచిప‌ట్టిన‌ట్టుండే పచ్చదనం మాత్రమే కాదని కూడా తెలిసుండాలనుకుంటా.. 

Monday, May 15, 2017

గురుత్వాకర్షణ



ఇక్కడ మృత్యువు ఉంది
ఇక్కడే జీవం ఉంది
ఇది విశ్వమంతా ఉన్నదే
మొదటిది వెతక్కుండానే వస్తుంది
మరోదాన్ని అన్వేషించాలి
అది అంగారకుడిపైనా దొరకొచ్చు
ట్రాపిస్ట్ ఒన్ చుట్టూ దొరకొచ్చు
లేక ఇంకెక్కడో..
వెతకడమే జీవం
జార్జ్ క్లూనీ మాటల్లాగా ఉండి..
శాండ్రా బులక్ కళ్లల్లో మెరుస్తుందది
కాకుంటే వెతకాలి..
చావు అంచున కూడా
ఆక్సిజన్ దొరకొచ్చు
గ్రావిటీ ఉన్నంతవరకూ
వెతుకులాట సాగాల్సిందే..

(సినిమాలో బాగా అనిపించిన సీన్లు చాలా ఉన్నాయి. శాండ్రా బులక్ ఏడ్చే ఓ స‌న్నివేశంలో త‌న క‌న్నీటి బొట్టు శూన్యంలో అలా తేలుతూ ఉండడం.. ఎందుకో ఆ క్ష‌ణంలో బాగా అనిపించింది. 

Sunday, May 7, 2017

la la land


క్లైంబ్ ద హిల్స్
రీచింగ్ ఫర్ ద హైట్స్
సృష్టి స్థితి లయలన్నీ సంగీతం
డ్యాన్స్ ఈజ్ మ్యూజిక్
మ్యూజిక్ ఈజ్ డ్యాన్స్

అదిగో అక్కడ చూడు
కనుచూపు అంతమయ్యే చోట
భూమి ఆకాశం కలిసి చేస్తున్న నృత్యాన్ని..

జననం సంగీతం జీవితం సంగీతం
కలలు కన్నీళ్లని కుమ్మరించే సంగీతం
చివరకు నీదో తీరం.. నాదో దరి

సిటీ ఆఫ్ స్టార్స్
షైనింగ్ జస్ట్ ఫర్ మి
నేనేమో ఈ చీకటి గదిలో
విషాద స్వరాలేవో స్మరించుకుంటూ..
ఎవరికోసమో ఎదురు చూస్తూ..

Saturday, April 29, 2017

నన్ను వెలేసిన వాన

వానలో అందమేముంది..
చినుకు మనకు తగిలితేనే మజా
తడిసి ముద్దయిపోతే..
మొక్కలొచ్చేలా నానిపోతే..
జోరున కురిసే వానలో
పచ్చికబీళ్లలో పరుగులు పెడితే..
నింగి నుంచి.. నాలోంచి..
నేలదాకా నీళ్లే 
మరో శరీరం నాతో కలిసినంత అందం
వడగళ్ల చప్పుడు
ఇప్పుడు జ్ఞాపకమైపోయింది..
వర్షం ఇంకా కురుస్తూనే ఉంది
నేనే అప్పటిలా లేను
రెయిన్ కోట్ వేసుకున్నా కదా..
వాన నన్ను వెలేసింది..

(ఫేస్బుక్ పోస్ట్)

Wednesday, April 26, 2017

కృష్ణం వందే..2


చీకటిని రాశిగా పోసి
చిటికెడు వెన్నెల కలిపితే..
అమాయకత్వం అందమై
కళ్లముందు నిలుస్తుంది
కదిలే ఈ నల్లనిశిలపై
కళ్లు నిలిపిచూశావో..
నవాజుద్దీన్ మాంఝీ కొండనెందుకు చీల్చాడు
మహాభారత యుద్ధమెందుకు జరిగింది
ప్రశ్నలన్నీ పేలిపోతాయి
ఆత్మబంధువులో రాధ..
ఫగునియాదేవిలా రాధికా..
భారతంలో ద్రౌపది..
నలుపుపై మనసుపడితే
యుద్ధమో వీరకార్యమో
వజ్రం ఊరికే దొరకదు మరి.....
         (పాత ఫేస్బుక్ పోస్ట్)

Sunday, April 23, 2017

గెట్ అవుట్


మా నాన్న జెస్సీ ఒవెన్స్ పక్కనే పరిగెత్తాడు తెల్సా..
ఒబామాకి మూడోసారి ఓటెయ్యడానికి కూడా మేం రెడీ..
వియ్ లవ్ బ్లాక్ పీపుల్
అయినా నలుపు, తెలుపు తేడాలేంటీ.. నాన్సెన్స్

కాకపోతే.. మీ బుర్రల్ని కాస్త వాష్ చెయ్యాలయ్యా. వాటిలో మా బుజ్జిబుజ్జి తెల్లని బ్రెయిన్స్ పెట్టేస్తే సరి. 

చూశావా... మీ నల్లని బుర్రల్లో మా మెదళ్లు పెట్టడం అంటే, ఇంతకంటే సోదరభావం ఉంటుందా..?

ప్రపంచం.. ఓ హారర్ సినిమా. 
మనుషులంతా సైకోలే. సాటిమనిషిపై ప్రేమంటే.. ఆస్కార్ విన్నింగ్ అత్యుత్తమ నటన అంటాడీ సినిమాతో డైరెక్ట‌ర్‌ పీలే

'గెట్ అవుట్' లాంటి సోషల్ సెటైర్ మూవీ తియ్యాలంటే గట్స్ ఉండాలి. హారర్ లో సెటైర్ని మిక్స్ చేయ‌డం.. వావ్‌ 

నల్లని అబ్బాయి, తెల్లని అమ్మాయి ప్రేమించుకుంటారు. అబ్బాయిని తమ ఇంటికి ఆహ్వానిస్తుంది అమ్మాయి. నేను నల్లోడ్ని కదా.. మీ ఇంట్లో వాళ్లు ఒప్పుకుంటారా..? అబ్బాయి ప్రశ్న. 'అబ్బే మా ఇంట్లో వాళ్లు అబ్రహంలింకన్ కంటే మంచోళ్లంటుంది'. వెళ్తారు. వాళ్లు నిజంగానే వీడి రంగుని పట్టించుకోరు. ఇంట్లో ఇద్దరు నల్లని పనివాళ్లు మాత్రం తేడాగా ఉంటారు. యాన్యువల్ గేదరింగ్ కి చాలామంది తెల్లవాళ్లు వస్తారు. ఒక్కడు మాత్రం బ్లాక్. సినిమా బిగినింగ్లో కిడ్నాప్ అయినవాడిలా ఉంటాడు. వాడ్ని ఫోటో తీస్తే.. 'గెట్ అవుట్' అంటూ ఊగిపోతాడు. అప్పటికే ఏదో తేడాగా ఫీలవుతున్న హీరో అక్కడ్నించి పూర్తిగా డిస్ట్రబ్ అవుతాడు. అక్కడ్నించి వెళ్లిపోవాలనుకుంటాడు. తర్వాత పారిపోవాలనుకుంటాడు. కానీ కుదరదు. 

హారర్, హ్యూమర్, సెటైర్ ఈ మూడింటిని మిక్స్ చేసి తీసిన థాట్ ఫుల్ కాక్ టెయిల్ GET OUT.

Wednesday, April 5, 2017

కలలు

కొన్ని కలలు
మనల్ని వెలేసి వెళ్లిపోతుంటాయి
కన్నీళ్లు కన్నుల్ని విడిచినట్టు
కొంతకాలం బాధ మిగిలిపోతుంది
మనుషులం కదా
కలలు కళ్లముందుకొస్తాయని ఆశ
కాలం గడిచేకొద్దీ
గాయం మాసిపోతుంది
కలలన్నీ చెల్లనిరాళ్లని తెలిసిపోతుంది

Friday, March 10, 2017

వెంటాడే ది హంట్


నిజం అనే పాయింట్ మీద ఎప్పుడో 1950లో రషోమన్ మూవీ వచ్చింది. తర్వాత ఎన్ని సినిమాలు ఈ విషయంపై చర్చించాయో తెలీదు కానీ.. అబద్దం అనే విషయంపై తీసిన సినిమా ఒకటి రీసెంట్గా చూశా. డానిష్ ఫిల్మ్ మేకర్ వింటెర్స్ బర్గ్ డైరెక్షన్, మ్యాడ్ మికెల్సన్ ప్రధానపాత్రలో వచ్చిన సినిమా 'ది హంట్'. సినిమా చూసిన వెంటనే ఫేస్ బుక్ లో.. 'అబద్దం ఎవరూ చెప్పరు. నిజాన్ని వెతకడమే చాలామందికి చేతకాదు' అంటూ పోస్ట్ పెట్టా. అసలు అబద్దం అనేది లేదు అనేది నా ఉద్దేశ్యం కాదు. నిజాన్ని పట్టించుకోవాలన్న స్పృహ లేకపోవడం వల్లే.. అబద్దం స్ప్రెడ్ అవుతుందని చెప్పడమే నా ఉద్దేశ్యం. (నిజానికి చాలామంది అబద్దాన్ని కాంక్రీట్ గా చెప్పలేరు కూడా. కానీ దాన్ని స్ప్రెడ్ చేసి ఆనందించాలనుకునే వాళ్లకి దానితో పనిలేదు కదా.)

ది హంట్ సినిమా క్యాప్షనే.. ది లై స్ప్రెడింగ్. ఐదారేళ్ల వయసుండే క్లారా అనే కిండర్గార్డెన్ స్టూడెంట్.. లూకాస్ అనే డే కేర్ టీచర్ తనని లైంగికంగా వేధించాడని చెప్పే చిన్న అబద్ధం చుట్టూ సినిమా తిరుగుతుంది. క్లారా స్వయంగా లూకాస్ బెస్ట్ ఫ్రెండ్ కూతురు కూడా. అప్పటివరకూ లూకాస్ ని ఎంతో మంచోడిగా చూసిన ఆ ఊరివాళ్లు.. ఈ అబద్దంతో కనెక్ట్ అయిపోతారు. అందరూ లూకాస్ ని అనుమానంగా చూడ్డం మొదలుపెడతారు. భార్యతో విడిపోయి ఉంటున్న లూకాస్ దగ్గరకు అతని కొడుకు వచ్చిన సమయంలో తీసిన సీన్.. ఈ అబద్దం కారణంగా లూకాస్ ఎంత నలిగిపోతున్నాడో చూపిస్తుంది. కొన్ని సందర్భాల్లో కేవలం తన ముఖకవళికలతోనే మనతో కన్నీళ్లు పెట్టిస్తాడు మ్యాడ్స్ మికెల్సన్. ఓ వైపు క్లారా.. లూకాస్ తనని ఏమీ చేయలేదని తల్లిదండ్రులకు చెప్పినా వాళ్లు ఒప్పుకోరు. కేసు ఓడిపోతామని క్లారా తల్లి.. భర్త నోరు మూయిస్తుంది. చివరకు ఆధారాల్లేవంటూ కేసు కొట్టేస్తుంది కోర్ట్. దాన్నెవరూ పట్టించుకోరు. అప్పటికే అబద్ధం ఆ ఊరిని ఆక్రమించేస్తుంది. ఎవరో లూకాస్ వాళ్ల కుక్క పిల్లని చంపి అతని ఇంటి ముందు పడేస్తారు. సరుకుల కోసం సూపర్ మార్కెట్ కి వెళ్తే.. అక్కడి వాళ్లు లూకాస్ ని కొట్టి బైటకి గెంటేస్తారు. చివరకు క్రిస్మస్ రోజు చర్చ్ కి వెళ్తాడు లూకాస్. అక్కడే క్లారా తండ్రి, తన ఒకప్పటి బెస్ట్ ఫ్రెండ్ థియోతో వాదనకు దిగుతాడు. తన కళ్లలోకి చూడమనీ, అక్కడేమైనా కనిపిస్తుందా అంటూ నిలదీస్తాడు. ఇకనైనా తనని వదిలేయమంటూ వెళ్లిపోతాడు. అక్కడితో థియో రియలైజ్ అవుతాడు. క్రమంగా విషయాన్ని అందరూ మర్చిపోతారు. లవర్ నడ్జాతో మళ్లీ ఒక్కటవుతాడు లూకాస్. అయితే ఏడాది తర్వాత కొడుక్కి గన్ లైసెన్స్ వచ్చిన సందర్భంగా వెటకి వెళ్లిన లూకాస్ పక్కనుంచి ఓ బుల్లెట్ వెళ్లి చెట్టుకి దిగబడుతుంది. అబద్దం ఆడుతున్న వేట ఇంకా ఆగిపోలేదని అర్ధమవుతుంది. 
(కాల్పులు ఎవరు జరిపారో మనకి చూచాయగా తెలిసిపోతుంది. అదిక్కడ అప్రస్తుతం అనుకుంటున్నాను. నిజానికి ఈ స్టోరీ మొత్తం ఇలా చెప్పేయడం కూడా తప్పే. కానీ ఈ పదిలైన్ల స్టోరీ మాత్రమే.. ఈ సినిమా కాదు. దీనికి కొన్ని వందలరెట్లు అద్భుతంగా మూవీ ఉందని నేననుకుంటున్నా.)


నిజం చుట్టూ తిరిగే రషోమన్ లాగా ఇది మిస్టరీ మూవీ కాదు. చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది. క్లారా చేసే ఆరోపణల్ని స్పష్టంగా చూపిస్తారు. కానీ అబద్దం ఎంత బలమైనదో చూపించడమే వింటెర్స్ బర్గ్ పనితనం. అది అబద్దం అని చెప్పినా ఎవరూ వినే పరిస్థితి ఉండనంత బలంగా అది అల్లుకుపోతుందని చూపిస్తాడు. 

పిల్లలు అబద్దం చెప్పరంటారు. మరి క్లారా అబద్దం ఎందుకు చెప్పింది.?
ఏదైనా ఒక విషయాన్ని కాంక్రీట్గా ఎలా అంగీకరిస్తారు.? 
అసలు క్లారా అబద్దం చెప్పలేదనే నేనంటాను. తను పూర్తి క్లారిటీతో ఏదీ చెప్పదు. ఒకరు ఒక విషయం చెప్పినప్పుడు దానికి ఎలాంటి విలువా ఉండదనే నేననుకుంటాను. దానితో మనం ఏకీభవించాకే ఒక రూపం వస్తుంది. అది నిజమో, అబద్దమో అవుతుంది. ఇక్కడ అబద్దం ఇచ్చినంత ఎంటర్ టైన్మెంట్ నిజం ఇవ్వదు. అందుకే వేగంగా విస్తరిస్తుందది. విస్తరించేకొద్దీ బలపడుతుంది. సినిమాలో లూకాస్ నిర్దోషి అని కోర్టు తేల్చాక.. ఆల్రెడీ ఒక బలమైన నిర్ణయానికి వచ్చేసిన జనం దాన్ని అంగీకరించలేరు. అక్కడ్నించే హింస మొదలవుతుంది. 

లూకాస్ పై అంతలా ఫోకస్ పెట్టిన స్కూల్ కానీ, ఊరివాళ్లు కానీ.. క్లారా చెప్పిన అంశాలపై ఎందుకు చర్చించరు.? హౌ క్లారా నోస్ ఎబౌట్ ఏ విల్లీ..? లూకాస్ కొడుకు వైఖరికీ, థియో కొడుకు తీరుకీ అంత తేడా ఎందుకు..? ఇలాంటి లోతుల్లోకి ఎవరూ వెళ్లరు. ఇక ఐదారేళ్ల చిన్నారికి ఓ టీచర్ పై ఏర్పడే క్రష్ మీద జనం అసలే మాట్లాడలేరని అనుకుంటా. కానీ ఇలాంటి ఎన్నోఅంశాల్నీ అంతర్లీనంగా చర్చకు పెడుతుంది ది హంట్. 

ఓవర్ ప్రొటెక్టివ్ పేరెంట్స్ మీద వేసిన సెటైర్ లాగా కూడా ఈసినిమాని చూడొచ్చు. వీళ్లు తమ పిల్లలకి సొంతంగా ఆలోచించే చాన్స్ ఇవ్వరు. సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వరన్న వాదన ఉంది(లైక్ బొమ్మరిల్లు). అందుకే క్లారా తను అబద్దం చెప్పానని చెప్పినా.. ఆమె పేరెంట్స్ దానికి విలువ ఇవ్వరు.(నిజానికి మొదట్లో క్లారాని పెద్దగా పట్టించుకోనట్టు కనిపించే వీళ్లు.. గొడవ మొదలయ్యాకే ఓవర్ ప్రొటెక్టివ్ అవుతారు.)

ఒంటరి స్త్రీని సమాజం ఎలా చూస్తుందో మెలీనా మూవీలో చూడొచ్చు. అలాగే ఒంటరి మగాడ్ని కూడా సమాజం అంత తేలిగ్గా వదిలిపెట్టదేమో అనిపిస్తుంది హంట్ సినిమా చూశాక. అప్పటివరకూ జింకల వేటలో లూకాస్ నైపుణ్యం, అతని ఫ్రెండ్లీ నేచర్ని చూసినవాళ్లు.. లైంగిక వేధింపుల ప్రస్తావన రాగానే లూకాస్ ఒంటరి తనాన్ని కౌంట్ చేయడం మొదలుపెడతారు.

'ది వాల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఈవిల్. బట్ ఇఫ్ వియ్ హోల్డాన్ ఈచ్ అదర్, ఇట్ గోస్ అవే'
చర్చ్ సీన్ తర్వాత క్లారా తండ్రి రియలైజ్ అవుతూ చెప్పే ఈ డైలాగ్తో.. అబద్దం ఎంత బలమైనదైనా దాన్ని ఎదుర్కొనేందుకు రెమిడీ చూపిస్తాడు వింటెర్స్ బర్గ్. మేకింగ్ విషయానికొస్తే హ్యాండ్ హెల్డ్ కెమెరా వర్క్, నేచురల్ లైట్ కే అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వింటెర్స్ బర్గ్ ఈ సినిమాలో అక్కడక్కడా రెగ్యులర్ మేకింగ్ స్టైల్నికూడా ఫాలో అయ్యాడనిపిస్తుంది. ఒక్కోసారి తప్పదేమో కూడా. ఓవరాల్గా ఈ సినిమా కొన్నాళ్ల పాటు నన్ను వదలదేమో.

Thursday, February 16, 2017

పాము

ఏదైనా చదవాలనుకున్న ప్రతిసారీ..
నేను పామును చూస్తాను. దాని కాటు నుంచి తప్పించుకోలేనెందుకో..? ఎందుకో తెలియదు. అదంటే అంత ప్రేమ నాకు. వాక్యం ఎక్స్ ట్రాలన్నీ విరగ్గొట్టి పద్ధతిగా నడిపిస్తున్నట్టుంది. కొన్నిసార్లు మొండికేసిన పసివాడి వాలకంలా ఉంటుంది వాక్యం. సమ్ టైమ్స్ ఇట్స్ లైక్ ఏన్ ఆర్గాజం. కథంటే ఇదే అని కూడా కాదు. ఆ మాటకొస్తే.. 'మనిషిలోపలి విధ్వంసం' కన్నా ఇదేమంత గొప్పది కాదనిపిస్తుంది. 'భగవంతం కోసం' ముందు పనికిరాదేమో అనిపిస్తుంది. కానీ పాము పామే. దాని విషం నాకు అమృతం. అది నన్ను చీకటిలోకి లాక్కెళ్తుంది. చితికిపోయిన బాల్యంలోకి తీసుకెళ్తుంది. చితిపై సగం కాలిన మనుషుల్లాగుండే మనసుల్ని చూపిస్తుంది. నాలో గుప్పెడు అక్షరాలు పోస్తుంది. 


యస్ నౌ అయామ్ అలఖ్ నిరంజన్. ఎక్కడ ఉమాడే. తన కోసం ఓ పుస్తకాన్ని దొంగిలించాలనుంది. నా కోసం ఒక వాలిట్ కూడా. దాన్నిండా టూ థౌజండ్ నోట్లుండాలి. లావుగా వానాకాలం కప్పలాగా. ఆ నోట్లతో వారణాసి ట్రిప్ ప్లాన్ చేయాలి. మస్ట్ గా రెండు టికెట్లు బుక్ చేయాలి. ఒకటి నాకు. మరొకటి త్రిపురకి. బెనారస్ లో చోక్రా లస్సీ విత్ భంగ్ తాగాలి. ఉరకలెత్తే గంగానది బురదపై ఫ్లిమ్సీ బోట్స్ చూడాలి. క్షణానికీ క్షణానికీ క్రియకీ క్రియకీ సంబంధం లేకుండా తిరగాలి.


జీవితానికి అసలు అర్ధం ఉందా..? ప్రశ్నే మీనింగ్ లెస్ కదా. నాకైతే బాల్యం లోకే కాదు.. గర్భానికి ముందే.. ఫలదీకరణ జరగకుండానే వెళ్లి.. వీర్యాన్ని, అండాన్ని చితగ్గొట్టేయాలనుంది. కన్నీళ్లతో కళ్లని ఎన్నిసార్లు శుభ్రం చేసుకున్నా.. మనసులోతుల్లోని మసి కడగలేం. ప్రస్తుతానికి తెర దించేద్దాం. రేపు నాకు ఇంకో పేరు. మే బీ సాల్వడార్ డాలీ. 


మళ్లీ ఇంకోసారి పాముని చదవాలి. మరోలాగా అర్ధమవుతుందేమో..?


Tuesday, February 14, 2017

కాస్త మౌనం - కాస్త వెన్నెల

నన్ను నేను అద్దంలో చూసుకుంటుంటే
వెన్నెల పొట్టులా రాలావు నువ్వు
నీలో నన్ను చూసుకుంటుంటే
మౌనంలా మారావు నువ్వు

రాత్రి కురిసిన వర్షంలో
వడగళ్లన్నీ ఎగిరి నింగిపై పడ్డాయి
ఉదయాస్తమయాలకి మధ్య
ఊయలలా నేనిక్కడే మిగిలిపోయా

నాకు నాలా ఉండడమే తెలుసు
నన్ను నేను చంపుకోవడం తెలుసు
నా చితాభస్మంతో నీకు పౌడరద్దడం తెలుసు
వెన్నెలని కప్పే దిగులు మేఘమవడం తెలుసు

నేనంటే మీ ఇద్దరే కాదు
నేనంటే కొన్ని లక్షల అక్షరాలు
నిండు నిశీధిలో పుట్టిన హరివిల్లు నేను
మండు వేసవిలో కురిసే చిరుజల్లు నేను

నేను మరెవరో కాదు నువ్వే
ఇప్పుడు నవ్వు..

Sunday, February 12, 2017

హంబర్ ఫిట్టింగ్ టు నంబర్ ఫిట్టింగ్


న్యూమరాలజీపై ఈ మధ్య ఓ వార్త వచ్చింది. దానికి స్లగ్ కోసం.. పేరు గారడీ, న్యూమగారడీ లాంటివి ఆలోచించాక ఎందుకో సరిపోవడం లేదనిపించింది. సాంబుగారినడిగితే నంబర్ ఫిట్టింగ్ అన్నారు. వెంటనే పెట్టేశాం. అయితే స్లగ్ 'నెం'బర్ ఫిట్టింగ్ అని టెలికాస్ట్ అయింది. స్లోరీ ప్లే అయ్యేటప్పుడు అబ్బాస్ గారు అబ్జెక్ట్ చేశారు. నెంబర్ కంటే నంబర్ అంటే కరెక్ట్ గా ఉండేది అని. అక్కడ్నించి మమ్మల్ని ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్లారు. 

నిజానికి అంబర్ ఫిట్టింగ్ అనే మాట అప్పులఅప్పారావు సినిమా వల్లే నాకు తెలుసు. అదే మాట అబ్బాస్ గారితో చెప్తే.. అది అంబర్ కాదు హంబర్ అన్నారాయన. హంబర్ అనేది సైకిల్ పేరని చెప్పారు. అప్పటివరకూ నాకది తెలియదు. నాకు ర్యాలీ, హెర్క్యులస్, హీరో సైకిల్లే తెలుసు. అందులో నేను చూసింది హీరో సైకిల్లే. ర్యాలీ ఒకట్రెండు సార్లు చూసుంటా. ఇప్పుడు రోజుకో మోడల్లో వస్తున్న సైకిళ్ల గురించి అస్సలు తెలియదనుకోండి.  

'హంబర్ సైకిల్ అంటే క్వాలిటీ గురూ. దాని ఫిట్టింగ్ అంటే పర్ఫెక్ట్ అన్నమాట. మాటాడితే హంబర్ ఫిటింగ్ అనేవాళ్లు. మీకు దాని గురించి తెలిసి ఉండకపోవచ్చు. మా టైమ్ లోనే హీరో సైకిళ్లు వచ్చేశాయి. వాటి రేట్లు తక్కువ ఉండడంతో హంబర్ కొనడం మానేశారు జనం.' హంబర్ గురించి అబ్బాస్ గారు చెప్పిందిది.

హంబర్ ఫిట్టింగ్ అనేది పక్కా పాజిటివ్ సెన్స్ లో వాడినపదం అప్పట్లో. క్రమంగా అది కామెడీగా మారింది. అదే యాంగిల్లో అప్పులఅప్పారావులో వాడారు. సినిమాలో విని అది అంబర్ అనుకున్నా. అదే పదాన్ని నెగెటివ్ సెన్స్ లో మా స్టోరీకి వాడాం. అలా హంబర్ ఫిట్టింగ్ కాస్తా నంబర్ ఫిట్టింగ్ అయింది. 

Friday, February 10, 2017

మాక్ లైవ్

దేర్ ఈజ్ నో ఎమోషన్స్
ఓన్లీ న్యూస్
కులం, మతం, ప్రాంతం, దేశం
లింగభేదాలేవీ లేని వ్యూస్

నా అక్షరం, నా గొంతు
ప్రపంచానికి వేకప్ కాల్
వార్త లేని క్షణం
మెలకువకి వార్నింగ్ బెల్

మాలో తప్పులు 
నువ్వెత్తి చూపించనక్కర్లేదు
నా నెత్తినుండేవాడిని
నీ చక్షువులు చూడలేవు

పదిమంది ఓ చోట, పాతికమంది మరోచోట
ఏ చావుకు ప్రయారిటీ ఇవ్వాలి
ఈ లెక్కలు ఎప్పుడైనా వేశావా
మరి అదే నరకంలో నేను చిత్రగుప్తుడిని

యుద్ధం నీకు సు'దూరదర్శనం' 
సైనికుడి పక్కనే ఉంటాం మేము
ఉద్యమకారులపై విరిగే లాఠీకి
రౌండ్ మార్క్ వేయందే మనసాగదు మాకు

మనసుపెట్టి కెమెరా కదిలించానో..
నా ప్రశ్నలో పదును పెంచానో..
కలంలో కాస్త నిజాయితీ పోశానో..
లోకం తల్లకిందులే
అంతలా కుళ్లిపోయిందది
కొంతలో కొంత మేమే బెటరేమో

ఎండ్ వాయిస్ విను..
ఆర్నాల్డ్ చావుని ముందేరాసిన
నిర్లక్ష్యాన్ని నేనే
అగ్రరాజ్యాన్ని వణికించిన
వికీలీక్స్ నేనే
రిమోట్ నీ చేతిలో ఉండొచ్చు
శాటిలైట్ అంతరిక్షంలో ఉంది
ఓవర్ టు స్టూడియో

(9-10-15 ఫేస్బుక్ పోస్ట్)

కిటికీ రెక్కల చప్పుడు

నువ్వు లేవు
నిద్ర రాదు
నిశీధికి అర్ధంలేకుండా పోతోంది
నీరవాన్ని ఎంత తాగను
కాలాన్ని కాస్త కత్తిరంచాలనుంది
కనీసం టైమ్ మెషీన్ ఉన్నా
నువ్వుండే క్షణానికి ఎగిరొద్దును
వెనక్కో.. ముందుకో..
నాకదే వర్తమానం
ఏం తోచక వెన్నెళ్లోకెళ్దామంటే..
కృష్ణపక్షం వెక్కిరిస్తోంది 
కిటికీరెక్కలు తెరిచే ఉంచా
గాలితో నీ స్పర్శని పంపిస్తావని

(12-11-2015 ఫేస్బుక్ పోస్ట్)

Saturday, January 21, 2017

ఏది హింస.. ఏది అహింస..?


చాగంటికీ.. జల్లికట్టుకీ ముడిపెట్టి రాస్తున్నానిది.
బెలూచిస్తాన్ కీ.. లంక తమిళులకీ ముడిపెట్టి రాస్తున్నా ఇది..
కర్నాటక కావేరీ నీళ్లకీ... మెరీనాబీచ్ సాగరఘోషకీ లింక్ కలిపి రాస్తున్నా ఇది..
ఇంతకీ ఏది హింస.. ఏది అహింస..?

తన కులం మాత్రమే పరమపవిత్రమైందనుకునే చాగంటి ప్రవచనాల పేరుతో జనం గొంతులు కోస్తాడు. ఆయన మాంసాహారం ముట్టని బ్రాహ్మణుడు.. కానీ శ్రమజీవుల రక్తాన్ని ప్రవచనాలతోనే పీల్చేస్తాడు. తలకడిగితే మొలకడగరు.. మొలకడిగితే తలకడగరు అంటూ యాదవుల్ని నీచంగా అవమానిస్తాడు. ఇదేంటని అడిగితే ఆ మహానుభావుడ్నే ప్రశ్నిస్తారా అంటూ ఓ బ్యాచ్ దాడి మొదలుపెడుతుంది. అంతా మాటలతోనే. ఎక్కడా రక్తపు చుక్క చిందదు. ఇదీ ఈ దేశంలో అహింసకి అర్ధం.

బెలూచిస్తాన్ లో పాకిస్తాన్ హింసకు పాల్పడుతుంది, బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి.. మీడియా కోడై కూస్తున్న వార్తలివి. లంక తమిళులపై ఘోరాలు జరిగినప్పుడు మాత్రం అది ఎల్టీటీయీకి లంక సైన్యానికి జరుగుతున్న యుద్ధం మాత్రమే అవుతుంది. కాశ్మీరీ పండిట్లని తరిమేసిన దారుణాలపై ఇప్పటికీ చర్చలు జరుగుతుంటాయి. కానీ తమిళ జనానికి మాత్రం బాసటగా నిలబడలేం. దేశవ్యాప్తంగా దళితులు, బలహీనవర్గాలు, మైనారిటీలపై సాగే దాడులకి సమాధానాలు ఉండవు. యాకూబ్ మెమెన్ కి ఉరిశిక్షని వ్యతిరేకిస్తే తంతామంటారు. మాలెగావ్ పేలుళ్ల నిందితురాలు సాధ్వీ అనారోగ్యం గురించి చింతిస్తారు. ఇదీ ఈ దేశంలో అహింసకి అర్ధం. 

ఏది హింస ఏది అహింస.. ఎవరు టెర్రరిస్టులు ఎవరు శాంతికాముకులు.. అనే అంశాల్ని ఈ దేశపు యువతకు అర్ధంకాని బ్రహ్మపదార్ధాలుగా మార్చేశారు. కానీ ఒకటి నిజం అణిచివేత ఎదుర్కొనేవాడే గట్టిగా అరుస్తాడు. అవసరమైతే తెగిస్తాడు. జల్లికట్టుకి మద్దతు పలకడమో.. నిషేధానికి మద్దతు పలకాలన్నదో నా ఉద్దేశం కాదు. నాకు ఏ మాత్రం పరిచయం లేని విషయం అది. టీవీల్లో చూడడం తప్ప జల్లికట్టు గురించి నాకు తెలిసింది శూన్యం. కానీ మెరీనా బీచ్ లో సాగిన ఉద్యమం వెనుక తెగింపు ఉంది. వేల ఏళ్లుగా కొనసాగిన అణచివేతని ఎదిరించే తెగింపు అది. ఈ దేశప్రభుత్వాన్ని, చట్టాల్ని ఖాతరు చేయని తెగింపు అది. 

వేల ఏళ్లదాకా ఎందుకు ఇటీవలి పరిణామాల వరకే చూద్దాం. కావేరీ నీళ్లని తమిళనాడుకి వదలాలని కోర్టు స్పష్టంగా చెప్పింది. కానీ కర్నాటక విన్నది లేదు. కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకున్నదీ లేదు. తమిళనాడు కంటే బీజేపీకి కర్నాటక ముఖ్యం అన్నది ఎవరూ కాదనలేని విషయం. అప్పుడు అమలు కాని సుప్రీంకోర్టు తీర్పుని ఇప్పుడెందుకు గౌరవించాలి తమిళ ప్రజలు. అందుకే కావేరి విషయంలో సుప్రీంకోర్టు తీర్పుని ఎందుకు అమలు చేయడం లేదని కర్నాటక ప్రభుత్వాన్ని గట్టిగా అడగలేని కేంద్రం.. జల్లికట్టు లాంటి చిన్నవిషయంలో కూడా నోరు మెదపలేకపోయింది. ఇక్కడ గెలిచింది తమిళుల తెగింపు కాదు.. కేంద్రప్రభుత్వం, చట్టాలు ఓడిపోయాయంటేనే కరెక్ట్ గా ఉంటుంది. మెరీనా బీచ్ లో నిలబడి ఉన్న యువతలో.. జల్లికట్టుని గెలుచుకున్న ఉత్సాహం మాత్రమే కాదు, మా బతుకుల్ని శాసించే హక్కు మీకు లేదన్న ధిక్కారం కూడా కనిపిస్తోంది.

Monday, January 9, 2017

షి మేక్స్ మి వాంట్ టు స్పీక్ స్పానిష్


మేకపిల్ల పాట పాడితే ఎలా ఉంటుంది..?
ఫస్ట్ టైమ్ 2005లో శివగాడి టేప్ రికార్డర్ లో లాండ్రీ సర్వీస్ పాటలు విన్నా. వెన్ ఎవర్.. వేర్ ఎవర్ అంటూ ఒక మేకపిల్ల లాంటి గొంతు.  చాలా రోజులు హాంట్ చేసిన పాట. వినేటప్పుడు బాడీలో ఎక్కడో ఎడ్రినలిన్ సర్రున పారుతున్న చప్పుడు. ఈ పాటని విని అప్పుడు రాసుకున్న నాలుగు లైన్లు..
నా పెదవులకి సిగ్గుతో వణికపోడమే కాదు             
ఫౌంటెన్లా ముద్దులు కురిపించడమూ తెలుసు   
చుట్టూ కొండల్ని చూసి కన్ఫ్యూజ్ కావొద్దు
నా గుండెలు చాలా చిన్నవి చూడు

ఒరిజినల్ లైన్స్ ఇలా ఉంటాయి..
లక్కీ దట్ మై లిప్స్ నాటోన్లీ మంబుల్
దే స్పిల్స్ కిసెస్ లైక్ ఫౌంటెయిన్
లక్కీ దట్స్ మై బ్రెస్ట్స్ ఆర్ స్మాల్ అండ్ హంబుల్
సో యూ డోంట్ కన్ఫ్యూజ్ దెమ్ విత్ మౌంటెయిన్స్

తర్వాత కొన్ని రోజులకి 'హిప్స్ డోంట్ లై' పాట చూశా. షి మేక్స్ మీ వాంట్ టూ స్పీక్ స్పానిష్. పాట పూర్తిగా ఇంగ్లీష్ లో ఉంటుంది. బట్ హర్ హిప్స్ స్పీక్ స్పానిష్. పాటలో వచ్చే స్పానిష్ పదాలు వింటుంటే.. ప్రపంచంలో అందం అంతా ఆ భాషలో ఉందేమో అనిపిస్తుంది. లంబాడా సాంగ్ విన్నప్పుడు పోర్చుగీస్ భాషపైనా ఇదే అభిప్రాయం వస్తుంది. హిప్స్ డోంట్ లై తర్వాత వాకా వాకా, షి వోల్ఫ్, డిడ్ ఇట్ ఎగయిన్.. అన్నింట్లో ఒకటే భాష. హిప్స్ కెన్ స్పీక్ అండ్ దే కెన్ డ్యాన్స్.

గెరార్డ్ పీఖ్ తో పెళ్లి, పిల్లలు తర్వాత షకీరాని జనం కాస్త మరిచిపోయారు. కానీ చంటాయే(CHANTAJE)తో రీ ఎంట్రీ మామూలుగా ఇవ్వలేదు. పూర్తిగా స్పానిష్ లో ఉండే ఈ పాటని ఈ నెలన్నరలో 38కోట్ల మందికి పైగా చూశారు. ఇందులో Qué?(వాట్?).. అంటూ చూసే చూపుతో మనల్ని బ్లాక్ మెయిల్(చంటాయే) చేస్తుంది షకీరా. 

ఒన్స్ ఎగయిన్ షీ మేక్స్ మి వాంట్ టు స్పీక్ స్పానిష్. 

Wednesday, January 4, 2017

హూ ఈజ్ గాడ్గే..?

వేదం వ్యభిచారం లాంటిదన్నాడు వేమన. చరిత్రకీ ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయి. వేమన బైటకి రావడానికే వందల ఏళ్లు పట్టింది మరి. కాకపోతే వెనకో, ముందో వచ్చాడు. స్వాతంత్ర్యయుద్ధాలు చేశామని చరిత్రలో ఫోజులు కొట్టిన రాణుల అసలు బాగోతాలూ ఇలాగే బైటకొస్తున్నాయి. అదే చరిత్రలో ఉన్న వెసులుబాటు. అయితే పాలకుల చరిత్ర పాడడానికి వీధికో భట్రాజు దొరుకుతాడు. పీడితుడి చరిత్ర మాత్రం పీడితుడే రాసుకోవాలి. అంబేద్కర్ లాగా.. 

మనం లేని చరిత్ర మహాభారతమైనా మనకొద్దు అంటున్నాడు సాంబు. మనం లేని చరిత్ర, మనం లేని కవిత్వం, కథలు గాథలు అన్నీ మనకు సెకండ్ హ్యాండ్ సరుకే కావాలి. మన తాతలు, తండ్రులు, తల్లుల కథలకే ఫస్ట్ ప్రయారిటీ ఇద్దాం. మహరాజులు, మహారాణుల పురాణాల్ని పిట్టకథలుగా మాత్రమే చెప్పుకుందామంటున్నాడు.

ఇంతకీ.. హూ ఈజ్ సంత్ గాడ్గే బాబా.?
అతను మనోడు. మనుషుల మురికి వదిల్చిన చాకలి. ఎవడి గుడ్డ వాడు ఉతుక్కోడానికి సిగ్గుపడే నిష్టదరిద్రపు మనుషుల ముఖాలపై.. చీపురుతో చాచిపెట్టి కొట్టినవాడు. పరిశుభ్రతే జీవిత ప్రమాణంగా బతికిన సాధువు. స్వచ్ఛభారత్ కి అచ్చమైన బ్రాండ్ అంబాసిడర్. కానీ కాషాయం కళ్లకి ఈ బీసీ ఆనలేదు. మోడీ మీడియా పిచ్చ తప్ప మరేమీలేని చచ్చుభారత్ కి.. గాడ్గేని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోకపోవడమే మంచిదయిందిలే..

ఇక పుస్తకం కేవలం సంత్ గాడ్గే బాబా జీవితాన్నే చూపించదు. మహారాష్ట్రతో పాటు దక్షిణాదిన సాగిన వైదిక మత వ్యతిరేక తిరుగుబాట్ల అన్నింటినీ తాకుతూ వెళ్తుంది. ఎరుకల గండెమ్మ నుంచి ఎంతోమంది సామాన్యులు, మహాత్ముల జీవితాల్ని టచ్ చేస్తుంది. రాత విషయానికొస్తే సాంబు గారి శీర్షికల్లాగే.. ప్రతి అక్షరం వెనుక మన కళ్లు పరుగులు తీస్తాయి. గాడ్గే బాబా జీవితం ఎలా మొదలయిందీ, ఏంటన్నది చెప్పేటప్పుడు మాత్రం కొన్ని పేజీలు బోర్ కొడతాయి. ఇందులో వీరుల కథల్లో మాదిరి యుద్ధాలుండవు. మహరాజుల కథల్లోని చీకటి బాగోతాలుండవు. చీపురు పట్టి ఊరిని చిమ్మమంటే కాస్త బోర్ గానే ఉంటుంది. ఇదేమైనా మోడీ చచ్చు భారత్ యాడ్ కాదుగా.. కాస్త స్లో గానే ఉంటుంది. అది కూడా కాసిని పేజీలే. తర్వాత క్లైమాక్స్ దగ్గరే ఆగుతాం. గాడ్గే మనవాడనుకుని చదివితే మనసుకు హత్తుకుంటుంది. మన కళ్లు తెరిపిస్తుంది. కొన్ని రంగుల కళ్లద్దాలకి మాత్రం కష్టంగానే అనిపిస్తుంది.