Thursday, February 16, 2017

పాము

ఏదైనా చదవాలనుకున్న ప్రతిసారీ..
నేను పామును చూస్తాను. దాని కాటు నుంచి తప్పించుకోలేనెందుకో..? ఎందుకో తెలియదు. అదంటే అంత ప్రేమ నాకు. వాక్యం ఎక్స్ ట్రాలన్నీ విరగ్గొట్టి పద్ధతిగా నడిపిస్తున్నట్టుంది. కొన్నిసార్లు మొండికేసిన పసివాడి వాలకంలా ఉంటుంది వాక్యం. సమ్ టైమ్స్ ఇట్స్ లైక్ ఏన్ ఆర్గాజం. కథంటే ఇదే అని కూడా కాదు. ఆ మాటకొస్తే.. 'మనిషిలోపలి విధ్వంసం' కన్నా ఇదేమంత గొప్పది కాదనిపిస్తుంది. 'భగవంతం కోసం' ముందు పనికిరాదేమో అనిపిస్తుంది. కానీ పాము పామే. దాని విషం నాకు అమృతం. అది నన్ను చీకటిలోకి లాక్కెళ్తుంది. చితికిపోయిన బాల్యంలోకి తీసుకెళ్తుంది. చితిపై సగం కాలిన మనుషుల్లాగుండే మనసుల్ని చూపిస్తుంది. నాలో గుప్పెడు అక్షరాలు పోస్తుంది. 


యస్ నౌ అయామ్ అలఖ్ నిరంజన్. ఎక్కడ ఉమాడే. తన కోసం ఓ పుస్తకాన్ని దొంగిలించాలనుంది. నా కోసం ఒక వాలిట్ కూడా. దాన్నిండా టూ థౌజండ్ నోట్లుండాలి. లావుగా వానాకాలం కప్పలాగా. ఆ నోట్లతో వారణాసి ట్రిప్ ప్లాన్ చేయాలి. మస్ట్ గా రెండు టికెట్లు బుక్ చేయాలి. ఒకటి నాకు. మరొకటి త్రిపురకి. బెనారస్ లో చోక్రా లస్సీ విత్ భంగ్ తాగాలి. ఉరకలెత్తే గంగానది బురదపై ఫ్లిమ్సీ బోట్స్ చూడాలి. క్షణానికీ క్షణానికీ క్రియకీ క్రియకీ సంబంధం లేకుండా తిరగాలి.


జీవితానికి అసలు అర్ధం ఉందా..? ప్రశ్నే మీనింగ్ లెస్ కదా. నాకైతే బాల్యం లోకే కాదు.. గర్భానికి ముందే.. ఫలదీకరణ జరగకుండానే వెళ్లి.. వీర్యాన్ని, అండాన్ని చితగ్గొట్టేయాలనుంది. కన్నీళ్లతో కళ్లని ఎన్నిసార్లు శుభ్రం చేసుకున్నా.. మనసులోతుల్లోని మసి కడగలేం. ప్రస్తుతానికి తెర దించేద్దాం. రేపు నాకు ఇంకో పేరు. మే బీ సాల్వడార్ డాలీ. 


మళ్లీ ఇంకోసారి పాముని చదవాలి. మరోలాగా అర్ధమవుతుందేమో..?


Tuesday, February 14, 2017

కాస్త మౌనం - కాస్త వెన్నెల

నన్ను నేను అద్దంలో చూసుకుంటుంటే
వెన్నెల పొట్టులా రాలావు నువ్వు
నీలో నన్ను చూసుకుంటుంటే
మౌనంలా మారావు నువ్వు

రాత్రి కురిసిన వర్షంలో
వడగళ్లన్నీ ఎగిరి నింగిపై పడ్డాయి
ఉదయాస్తమయాలకి మధ్య
ఊయలలా నేనిక్కడే మిగిలిపోయా

నాకు నాలా ఉండడమే తెలుసు
నన్ను నేను చంపుకోవడం తెలుసు
నా చితాభస్మంతో నీకు పౌడరద్దడం తెలుసు
వెన్నెలని కప్పే దిగులు మేఘమవడం తెలుసు

నేనంటే మీ ఇద్దరే కాదు
నేనంటే కొన్ని లక్షల అక్షరాలు
నిండు నిశీధిలో పుట్టిన హరివిల్లు నేను
మండు వేసవిలో కురిసే చిరుజల్లు నేను

నేను మరెవరో కాదు నువ్వే
ఇప్పుడు నవ్వు..

Sunday, February 12, 2017

హంబర్ ఫిట్టింగ్ టు నంబర్ ఫిట్టింగ్


న్యూమరాలజీపై ఈ మధ్య ఓ వార్త వచ్చింది. దానికి స్లగ్ కోసం.. పేరు గారడీ, న్యూమగారడీ లాంటివి ఆలోచించాక ఎందుకో సరిపోవడం లేదనిపించింది. సాంబుగారినడిగితే నంబర్ ఫిట్టింగ్ అన్నారు. వెంటనే పెట్టేశాం. అయితే స్లగ్ 'నెం'బర్ ఫిట్టింగ్ అని టెలికాస్ట్ అయింది. స్లోరీ ప్లే అయ్యేటప్పుడు అబ్బాస్ గారు అబ్జెక్ట్ చేశారు. నెంబర్ కంటే నంబర్ అంటే కరెక్ట్ గా ఉండేది అని. అక్కడ్నించి మమ్మల్ని ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్లారు. 

నిజానికి అంబర్ ఫిట్టింగ్ అనే మాట అప్పులఅప్పారావు సినిమా వల్లే నాకు తెలుసు. అదే మాట అబ్బాస్ గారితో చెప్తే.. అది అంబర్ కాదు హంబర్ అన్నారాయన. హంబర్ అనేది సైకిల్ పేరని చెప్పారు. అప్పటివరకూ నాకది తెలియదు. నాకు ర్యాలీ, హెర్క్యులస్, హీరో సైకిల్లే తెలుసు. అందులో నేను చూసింది హీరో సైకిల్లే. ర్యాలీ ఒకట్రెండు సార్లు చూసుంటా. ఇప్పుడు రోజుకో మోడల్లో వస్తున్న సైకిళ్ల గురించి అస్సలు తెలియదనుకోండి.  

'హంబర్ సైకిల్ అంటే క్వాలిటీ గురూ. దాని ఫిట్టింగ్ అంటే పర్ఫెక్ట్ అన్నమాట. మాటాడితే హంబర్ ఫిటింగ్ అనేవాళ్లు. మీకు దాని గురించి తెలిసి ఉండకపోవచ్చు. మా టైమ్ లోనే హీరో సైకిళ్లు వచ్చేశాయి. వాటి రేట్లు తక్కువ ఉండడంతో హంబర్ కొనడం మానేశారు జనం.' హంబర్ గురించి అబ్బాస్ గారు చెప్పిందిది.

హంబర్ ఫిట్టింగ్ అనేది పక్కా పాజిటివ్ సెన్స్ లో వాడినపదం అప్పట్లో. క్రమంగా అది కామెడీగా మారింది. అదే యాంగిల్లో అప్పులఅప్పారావులో వాడారు. సినిమాలో విని అది అంబర్ అనుకున్నా. అదే పదాన్ని నెగెటివ్ సెన్స్ లో మా స్టోరీకి వాడాం. అలా హంబర్ ఫిట్టింగ్ కాస్తా నంబర్ ఫిట్టింగ్ అయింది. 

Friday, February 10, 2017

మాక్ లైవ్

దేర్ ఈజ్ నో ఎమోషన్స్
ఓన్లీ న్యూస్
కులం, మతం, ప్రాంతం, దేశం
లింగభేదాలేవీ లేని వ్యూస్

నా అక్షరం, నా గొంతు
ప్రపంచానికి వేకప్ కాల్
వార్త లేని క్షణం
మెలకువకి వార్నింగ్ బెల్

మాలో తప్పులు 
నువ్వెత్తి చూపించనక్కర్లేదు
నా నెత్తినుండేవాడిని
నీ చక్షువులు చూడలేవు

పదిమంది ఓ చోట, పాతికమంది మరోచోట
ఏ చావుకు ప్రయారిటీ ఇవ్వాలి
ఈ లెక్కలు ఎప్పుడైనా వేశావా
మరి అదే నరకంలో నేను చిత్రగుప్తుడిని

యుద్ధం నీకు సు'దూరదర్శనం' 
సైనికుడి పక్కనే ఉంటాం మేము
ఉద్యమకారులపై విరిగే లాఠీకి
రౌండ్ మార్క్ వేయందే మనసాగదు మాకు

మనసుపెట్టి కెమెరా కదిలించానో..
నా ప్రశ్నలో పదును పెంచానో..
కలంలో కాస్త నిజాయితీ పోశానో..
లోకం తల్లకిందులే
అంతలా కుళ్లిపోయిందది
కొంతలో కొంత మేమే బెటరేమో

ఎండ్ వాయిస్ విను..
ఆర్నాల్డ్ చావుని ముందేరాసిన
నిర్లక్ష్యాన్ని నేనే
అగ్రరాజ్యాన్ని వణికించిన
వికీలీక్స్ నేనే
రిమోట్ నీ చేతిలో ఉండొచ్చు
శాటిలైట్ అంతరిక్షంలో ఉంది
ఓవర్ టు స్టూడియో

(9-10-15 ఫేస్బుక్ పోస్ట్)

కిటికీ రెక్కల చప్పుడు

నువ్వు లేవు
నిద్ర రాదు
నిశీధికి అర్ధంలేకుండా పోతోంది
నీరవాన్ని ఎంత తాగను
కాలాన్ని కాస్త కత్తిరంచాలనుంది
కనీసం టైమ్ మెషీన్ ఉన్నా
నువ్వుండే క్షణానికి ఎగిరొద్దును
వెనక్కో.. ముందుకో..
నాకదే వర్తమానం
ఏం తోచక వెన్నెళ్లోకెళ్దామంటే..
కృష్ణపక్షం వెక్కిరిస్తోంది 
కిటికీరెక్కలు తెరిచే ఉంచా
గాలితో నీ స్పర్శని పంపిస్తావని

(12-11-2015 ఫేస్బుక్ పోస్ట్)