Saturday, December 31, 2016

A పెసిమిస్ట్ గుడ్ బై

కాసేపట్లో జీరో అవర్
చల్లటిరాత్రి నిశ్శబంగా
మరో ఏడాది గొంతునొక్కేస్తుంది

మబ్బులు మెల్లగా మాయమైనట్టు
పాతరోజుల్ని ఏ గాలీ ఎరేజ్ చేయదు

మళ్లీ ఒక క్యాలెండర్ కి
నన్ను నేను వేలాడదీసుకోవాలి

వెనక్కెళ్లాలనే ఉంటుంది
అలారమ్ అంటే తెలియని వయసుకి
న్యూ ఇయర్ అంటే
గ్రీటింగ్ కార్డు మాత్రమేనని తెలిసిన రోజుల్లోకి

ప్చ్.. లాభం లేదు
చాలా దూరం వచ్చేశాం
రేపు మళ్లీ పరిచయం చేసుకోవాలి
నాకు నన్ను కొత్తగా..
(31-12-2016     11.27 PM)

Wednesday, December 28, 2016

అందం అంటే ఆమేనా..?

అందం అంటే అరవింద్ స్వామి.
అందం అంటే అబ్బాస్.
కాసిని కండలు కూడా కావాలంటే.. సల్మాన్ ఖాన్.
కానీ అందరిలోకీ అరవింద్ స్వామి ప్రత్యేకం. అబ్బాస్ లా మరీ యవ్వనం తొణికిసలాడే ఫేస్ కాదు.. సల్మాన్ లా కండలు తిరిగిన ఒళ్లూ కాదు. మరేముంది అతనిలో..?

అతనొక్కడిలోనే కాదు పైన చెప్పుకున్న మరో ఇద్దరిలోనూ ఏదో ఉంది. అసలు అందం అనగానే గుర్తొచ్చే మగమహరాజులు అందరిలోనూ అదే ఉంది. దానిపేరే ఆడతనం. వీళ్లంతా ఫేస్ కు ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకున్నట్టు ఆడతనాన్ని టచప్ చేసుకుంటారు. మయంతి లాంజర్ మగతనాన్ని రాసుకున్నట్టు. అందరిలోకీ ఆడతనం కాస్త ఎక్కువ కనిపించే ముఖం అరవింద్ స్వామి. పరువం.. వానలా కురుస్తున్నట్టుంటాడు. కాశ్మీర్ మంచులా కనిపిస్తాడు. అమ్మాయిల చిన్ని చిన్ని ఆశలు తీర్చేవాడిలా ఉంటాడు.

1991లో దళపతి వచ్చింది. హీరో రజనీకాంత్.. అటు వైపు మమ్ముట్టి. వీళ్లిద్దరితో సమానంగా ఎక్స్ పోజ్ అయ్యాడు అరవింద్ స్వామి తన పాల బుగ్గలతో. అమ్మాయిలు ఫిదా అయిపోయారు. 1992లో తనే హీరోగా రోజా వచ్చింది. రోజాని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అందరి కళ్లూ అతనిపైనే. అమ్మాయిల కళ్లలో సిగ్గు.. మగాళ్ల కళ్లలో అసూయ. అన్ని సినిమాల్లో హీరోయిన్ కోసం హీరో ఫైట్లు చేస్తాడు. కానీ రోజాలో హీరో కోసం హీరోయిన్ యుద్ధం చేస్తుంది. సత్యవంతుడి కోసం సావిత్రి పోరాడినట్టు. కథ ఏదైనా.. హీరో కోసం హీరోయిన్ ఫైట్ చేయడమంటే మాటలు కాదు. అందుకు తగ్గ హీరో అరవింద్ స్వామి మాత్రమేనేమో..

బొంబాయి తర్వాత ఒకటీ అరా సినిమాలొచ్చినా తెలుగువాళ్లకి తెరమరుగైపోయాడు అరవింద్ స్వామి. ఓ యాక్సిడెంట్ కారణంగా దశాబ్దం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యాడు. కానీ అందరికీ గుర్తుండిపోయాడు. మళ్లీ కడలిలో కనిపించాడు. ఎందుకో కాస్త ముసలాడైనట్టు కనిపిస్తాడు. లేటెస్ట్ ధృవతో రోజా నాటి అరవింద్ స్వామి ప్రత్యక్షమయ్యాడు. రోజా సినిమాలో అతడి నుదుటిపై ఓ మచ్చ ఉంటుంది. ధృవలో దానితో పాటు.. ముక్కుపై మరో మొటిమ లాంటిది చేరింది. తనలో అందమనే అమృతం ఇంకా తగ్గలేదని చెప్పే గుర్తులేమో అవి అనిపిస్తాయి. 

ఫైనల్గా.. మగాడంటే మగాడే అని మీసాలు మెలేసేవాళ్లని ఎవడూ ఏం చేయలేడు. అందంగా కనపడాలంటే మాత్రం ఆడతనాన్ని పూసుకోండి. ఎందుకంటే అందం అంటే ఆమే.. తనని టచప్ చేసుకోవాల్సిందే ఎవరైనా..!

Thursday, December 22, 2016

నల్లని గేలం

ఏదో తగులుకుంది ఎదకి
నల్లని గేలం లాంటిది
విడిపించుకోలేను
విడిపించుకోవాలనీ లేదు
కాటుకలో వెన్న కలిసినట్టు
కరిమబ్బులాంటి దేహం 
కాస్త జాలి కురిపిస్తేనా
కానలైనా మొలిపించేయొచ్చు
ఊరంతా చీకటి పరచి
వాన కాస్త చిలకరించు
ఆ బుట్ట దించి 
కనీసం నన్ను పలకరించు


(తమిళ రమ్మీ సినిమాలో కూడమేలే కూడవెచ్చి పాట చూసి సినిమా కూడా చూశా. బలైపోయా. మధ్యలో ఐశ్వర్య రాజేష్ కనిపించే సీన్ల కోసం అయితే రమ్మీ చూడొచ్చు.)

కృష్ణంవందే..

రాత్రి నల్లమందు మింగినట్టుంది
గాలిలో గంజాయి కలిసినట్టుంది
విశ్వమంతా నిషాలో తూగుతుంటే
శరీరం ఎక్కడికో తేలిపోతుంటే
వెలుగులో ఏముంది
శరీరాల్ని కుర్చీలకు కుదువ పెట్టడం తప్ప
చీకటికి స్వాగతం చెప్పండి
కాసేపు మత్తులో మునిగిపోండి
నిషా కోసం సీసా మూత విప్పొద్దు
ఒట్టొట్టి కషాయాలతో సర్దుకుపోవద్దు
నల్లని కురుల్లో ఓపియం ఉంటుంది వెతుక్కోండి
కనుపాపల్లో ఉబికే హెరాయిన్ గుట్టు కనుక్కోండి
జస్ట్ లైట్స్ ఆఫ్.. 
కృష్ణం వందే జగద్గురుం

(14 july 2015, ఫేస్బుక్ లో రాసుకున్నది)

Wednesday, December 21, 2016

నేను శిఖరాన్ని..


నేను శిఖరాన్ని
శిఖరంపై ఎగిరే పతాకాన్ని

చావైనా బతుకైనా 
శిఖరంతోనే సావాసం
వందకోట్ల మంది ఉన్నా
ఒంటరి పయనం నాది

ఏడు ఖండాల్లో నీ జెండా ఎగరేశా
నాకేమిచ్చావో నీ గుండెల్నడుగు
ఎన్నిపర్వతాలెక్కినా 
నా ఇంటి మట్టిమొత్తలు మారలేదే..

వర్ణంతో కుళ్లిన శ్మశానంలో
నా శవాన్ని చేర్చొచ్చు..
నా ఆత్మ మాత్రం 
ఆండిస్ గుండెలపైనుంచి దిగదు

నేను శిఖరాన్ని
శిఖరంపై ఎగిరే పతాకాన్ని

(06-04-2015, మల్లి మస్తాన్ స్మృతిలో రాసుకున్నది)

Sunday, December 18, 2016

గాయం

కొన్ని గాయాలకి మందుకావాలి
మాన్పే వైద్యుడు కావాలి
కాలం కేవలం జ్ఞాపకాల దొంతర
ఏ దెబ్బా నయంకాదు
మరిచిపోతాం అంతే
మరకో మచ్చో మిగిలే ఉంటుంది
కనీసం జ్ఞాపకంగా అయినా..
గుర్తొచ్చినప్పుడల్లా 
ఎక్కడో మెలితిప్పినట్టు సలుపుతుంది
మళ్లీ కొత్త గాయమై..
అంతా భ్రమలా
నాకు నేనే మందు పూసుకుంటా
ఎక్కడకీ పోలేదు నువ్వు
నాలో మచ్చలా మిగిలిపోయావు

Saturday, December 17, 2016

వరదగూడు

నెమ్మదిగా కళ్లు తెరిచా. చుట్టూ చీకటి. ఎక్కడున్నానో ఓ క్షణం అర్ధం కాలేదు. మంచానికి బదులు చేతికి ఇసుక తగులుతోంది. కాస్తదూరంలో కెరటాల శబ్దం. బీచ్ అనుకుంటా. ఇక్కడికెలా వచ్చానబ్బా..?

దిగ్గున లేచి కూర్చున్నా. ఎక్కడా జనం అలికిడి లేదు. నగ్నంగా నేనొక్కడినే ఇసుకలో. ఎదురుగా మసగ్గా సముద్రం. చేతికి అందేంత దూరంలో బట్టలు. నావే అనుకుంటా. తలవెనక్కి తిప్పి చూస్తే.. చీకటి మరింత చిక్కగా ఉంది. చెట్లు, పొదల ఆకారాలతో అల్లుకుపోయింది. ఎందుకో భయం అనిపించి లేవాలనిపించలేదు. అలాగే పడుకున్నా. మళ్లీ ప్రశ్న. ఎక్కడున్నానబ్బా..?
చల్లటిగాలిని ఆస్వాదిస్తూ కాసేపు ప్రశ్నని పక్కనబెట్టా. తెల్లారితే తెలుస్తుందిగా.

సమయం గడిచేకొద్దీ సముద్రంపై వెలుగు చీకటి తెరలేపుతూ.ఇప్పుడు పరిసరాలు కాస్త స్పష్టంగా తెలుస్తున్నాయి. నాకు కుడివైపు కొంచెం దూరంలో పెద్ద కొండ. వెనుకంతా అడవి. ఎక్కడా మనిషి జాడ మాత్రం లేదు. ఎందుకో బట్టలు వేసుకోవాలనిపించలేదు. ఇంతలో ఎదురుగా దిగంతాల్ని కలిపేచోట ఇనబింబం. సూర్యుడ్ని తొలిసారి చూసినట్టనిపించింది. ఇసుకని దులుపుకుని లేచి నిలబడ్డా. 
వావ్.. సన్ బాత్.

పరిస్థితి ప్రశాంతంగా ఉన్నా.. నాలో ప్రశ్నలు. ఎంత ఆలోచించినా ఇక్కడికెలా వచ్చానన్నది అంతుబట్టడం లేదు. అసలెక్కడున్నానో అర్ధం కావడం లేదు. 

సూర్యరశ్మిలో చాలాసేపు తడిశాక బట్టలు తొడుక్కున్నా. ఇంతలో కొండ దగ్గరగా ఎవరో మనిషి. వేగంగా నడుస్తూ అటెళ్లా. ఎవరో అమ్మాయి. చేతిలో చిన్న బుట్ట. అప్పుడే నన్ను చూసింది. వింత మనిషిలా. నా వెనుకకీ,చుట్టుపక్కలకీ అదేపనిగా చూస్తూ.. ఇంకెవరూ లేరని అనుకున్నట్టుంది. తనూ నా వైపుకి వచ్చింది. దగ్గరకెళ్లి ఇదే ఊరని అడుగుదామనుకున్నా. ఆ పిల్లే మొదలుపెట్టింది. 

ఎవరు నువ్వు. ఎప్పుడూ చూడలేదే.. ఏ ఊరు..?
ఏం చెప్పాలో గుర్తురాక అయోమయగా నిలుచున్నా. 'ఎవరు నేను'..?

నన్ను నేను ప్రశ్నించుకుంటుంటే.. ఆ పిల్లే మళ్లీ. 'ఓయ్ నిన్నే'. ఇప్పుడు తను నాకు మరింత దగ్గరగా వచ్చింది. ఎక్కడో చూసినట్టుందా అమ్మాయిని. మాటలు కూడదీసుకుని.. 'ఏ ఊరిది'..? అన్నా. సమాధానం చెప్పకుండానే.. నీదే ఊరో చెప్పు.. అంటూ కళ్లెగరేసిందా పిల్ల. మౌనీ గుర్తొచ్చింది. ఆ కళ్లు, ముక్కు అన్నీ. తను మౌనీలాగే ఉంది. ఇది మా ఊరేమో అనిపించింది. అయినా మా ఊళ్లో సముద్రం లేదుగా.

నిన్నే.. ఏ ఊరని అడిగితే పిచ్చోడిలా చూస్తావేంటి..?
'----------------------' ఏదో అడిగా.
ఓ.. మెయిన్ రోడ్డుకెళ్లాలా..?
తల అడ్డంగా ఊపబోయి మళ్లీ నిలువుగా ఊపా.. అవునన్నట్టు.

'ఇందా ఈ బుట్టని పట్టుకుని నాతో రా'. ఠీవీగా నడుచుకుంటూ వెళ్తోంది. బుట్ట తీసుకుని తన వెంటే వెళ్లా. ఎండ కొద్దికొద్దిగా పెరుగుతోంది. నేనిందాక పడుకున్నచోటుని దాటి వెళ్లాం. అక్కడో వాగు ఉంది. అది సముద్రంలో కలిసేచోట భలే ఉంది. బుట్ట భుజానేసుకుని అలాగే చూస్తుంటే.. ఎవరో నన్నే చూస్తున్నట్టనిపించింది. తిరిగి చూస్తే.. నడుంపై రెండు చేతులు పెట్టుకుని.. ఆ పిల్ల. ఏమిటన్నట్టు చూశా. అదోలా చూస్తూ బుట్ట తీసుకుంది. అందులోంచి దారం లాంటిది తీసుకుంది. వాగు పక్కనే ఉన్న సన్నటి పొడవాటి కర్రకి దారం కట్టింది. అప్పుడర్ధమైంది అది గేలం. వాగు నిండా చేపలే. పైకి కనిపిస్తున్నాయి. గేలానికి ఎర కట్టి విసిరింది. అప్పుడే నా కడుపులోకి ఆకలి, నోట్లోకి నీళ్లూ వచ్చాయి. కాసేపటికల్లా ఓ మోస్తరుసైజు చేపలు నాలుగు పడ్డాయి. ఇక చాలన్నట్టు గేలం పక్కనబెట్టి.. బుట్టలోంచి ఇనపముళ్లున్న చెక్కముక్క తీసింది. ఒక్కో చేప పొలుసుల్ని, పేగుల్నీ తీసి శుభ్రం చేస్తుంటే.. వాగునీళ్లలో వాటిని శుభ్రంగా కడిగా. బుట్టలోంచి కారం, ఉప్పు చేపలకి కలుపుతూ.. నావైపు చూసింది ఉమన్ ఆన్ టాప్ లో పెనెలోప్ క్రజ్ లా. ఓ క్షణం తనని అలాగే చూసి.. చుట్టుపక్కల చితుకుల్ని ఏరి మంట రెడీ చేశా. మంటకి అటూ ఇటూ రెండు పంగకొయ్యల్ని పాతింది. రెండు ఇనుప చువ్వల్ని చేపల్లో కూరి కొయ్యలపై పెట్టింది. కాసేపటికల్లా టిఫిన్ రెడీ. పక్కనున్న పొదలోంచి రెండు పెద్ద ఆకులు తెంచి వాటిలో చేపల్ని సర్ది నాకోటి అందించింది. చేతితో చేపముక్కని తుంచబోతుంటే.. ఇదిగో అని నల్లతుమ్మ ముల్లుని చేపకి గుచ్చింది. తనూ ఓ ముల్లుతో ముక్కల్ని గుచ్చుకుని తింటూ నా వైపు చూసి నవ్వింది. ఆ కళ్లలో నన్ను నేను చూసుకుంటుంటే నార్సిసస్ గుర్తొచ్చాడు. 

నార్సిసస్.. పెనెలోప్ క్రజ్.. మౌనీ.. ఎంత గుర్తుకు తెచ్చుకుందామనుకున్నా ఇంకెవరూ గుర్తురారే. రెండే నిమిషాల్లో రెండు చేపలు తినేశా. ఇంకో రెండ్రోజులు తిండి లేకపోయినా ఫర్వాలేదనిపించేంత శక్తి వచ్చినట్టుంది. తినడం పూర్తి చేసి.. ఇందాక చూసిన వాగూ, సముద్రం కలిసే చోటికి బయల్దేరా. 

మెయినో రోడ్డుకి దారడిగావూ..?
తనవైపుకి ఓ క్షణం చూసి.. నామట్టుకి నేను నడుచుకుంటూ వెళ్లా. సంగమాన్ని చూస్తూ కూర్చుంటే.. కాసేపటికి తనూ వచ్చి పక్కన కూర్చుంది. 
నీ పేరేంటి..? కాసేపాగి అడిగా.
'-------------' ఏదో చెప్పింది.
మౌనీ అని పిలిచా. వింతగా తను ఊ అని పలికింది.

మధ్యాహ్నమైనా మబ్బులు పట్టడంతో ఎండగా లేదు. అక్కడే చాలాసేపు కూర్చున్నాక.. ఓయ్ ఇంక పద. అంటూ మౌనీ లేచింది. తన వెంటే నేను కూడా. కొద్దిసేపు నడిచాక ఇద్దరం మొదట కలుసుకున్న చోటుకి వచ్చాం. 
ఎక్కడికి వెళ్తున్నామో అర్ధం కాక అదే విషయం ఆ పిల్లని అడిగా. చెయ్యెత్తి అడవి వైపు చూపించింది. ఇంతకుముందు సరిగా చూళ్లేదు కానీ.. కొండకి దిగవన ఓ గుడిసె కనిపించింది. ఇద్దరం అక్కడికి చేరుకున్నాక. ఇదే మా ఊరు అంది. గుడిసె వెనుకవైపు కొన్ని ఇళ్లు, మరికొన్ని మొండిగోడలు కనిపించాయి. అన్నీ అడవిలో కలిసిపోయినట్టున్నాయి. ఇళ్లల్లో ఏ ఒక్కదాంట్లోనూ మనుషులున్నట్టు కనిపించలేదు. 

గుడిసెలోపలికి వెళ్లా. ఒక్కటే గది. ఒంటరిగా ఉంటోందని చూస్తేనే తెలుస్తోంది. బయటకొచ్చి అక్కడున్న నులకమంచం వాల్చుకుని కూర్చున్నా. తను లోపల ఏదో పనిచేసుకుంటోంది. దూరంగా సముద్రఘోష. పక్కనే ఉన్న కొండ.. ఏదో రహస్యాన్ని తనలో దాచుకున్నట్టు నిలుచుని ఉంది. 

'ఏం చూస్తున్నావు..?' ఎప్పుడొచ్చిందో గానీ, బయట నేలమీదే కూర్చుంటూ అడిగింది. సమాధానం చెప్పకుండా కొండవైపు చూపించా. 
'ఏవుందక్కడ..?' అంటూ నవ్వింది.
కొండవతల ఏముంది..?
'ప్చ్..ఏమో, నాకూ తెలియదు.. ఎప్పుడూ పోలేదటు'. అని ఆగి, బాగా దగ్గరగా వచ్చింది. నేనూ కాస్త వంగాను.
'కొండపైకి వెళ్లకూడదని చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది'. కళ్లలో కళ్లు పెట్టి ఏదో రహస్యంలాగా మాట్లాడింది. 
'ఏ..ఎందుకూ'..? నేనూ తనని అనుకరిస్తూ అడిగా.
కింది పెదవి మరింత కిందకు సాగదీసి, భుజాలు దగ్గరగా లాగి ఎగరేస్తూ.. ఏమో అన్నట్టు సైగ చేసింది.
మళ్లీ కొండవైపే పరిశీలనగా చూశా. కొండ దిగవన చుట్టూ ఏదో కంచెలా ఉంది. దానికి అక్కడక్కడా కాషాయం, ఆకుపచ్చ, తెలుపు, ఎరుపు రంగుల్లో విడివిడిగా జెండాలున్నాయి. 
మౌనీతో మాట్లాడుతుండగానే.. బైట క్రమంగా వెలుగు తగ్గింది.

చీకటిపడ్డంతో దీపం వెలిగించింది. రెండు మూడు రకాల గింజలతో ఏదో కూర చేసింది. దాని పేరు అడుగుదామనుకున్నాగానీ.. ఆకలి హడావుడిలో మర్చిపోయా. తిని నులకమంచంపై పడుకుంటే, చల్లటిగాలికి ఎప్పుడు నిద్రపోయానో కూడా తెలియలేదు. 

కాస్త మసకలోనే మెలకువొచ్చింది. చూస్తే మౌనీ ఇంకా పడుకునే ఉంది గువ్వలా కాళ్లు ముడుచుకుఇ. చప్పుడు చేయకుండా లేచి.. సముద్రం వైపు వెళ్లా. వెలుగు నిండా పరుచుకునే వరకూ అక్కడక్కడా తిరిగి.. తిరిగొచ్చా. అప్పటికి తను రెడీగా ఉంది బుట్టతో..
'ఎక్కడికి..?' అని అడగ్గానే నా చేతికి బుట్టనిచ్చింది. తను నడవబోతుంటే.. కొండపైకి వెళ్దామన్నాను. 
అమ్మో వద్దు.. అంది. 
ఏం.. భయమా అని ఉడికించాను. 
భయమా..నాకా.. ఇన్నాళ్లూ ఎందుకులే అని ఊరుకున్నా. నాగ్గానీ తిక్కరేగితే.. అంటూ విసురుగా కొండవైపు నడిచింది. నేనూ వెంబడించా. కంచెని దాటేముందు కాసేపు ఆగింది. మళ్లీ నావైపు చూసి ముందుకే నడిచింది. ఇద్దరం పోటీలుపడి కొండెక్కాం. మధ్యలో రకరకాల అడవికాయలు కోసుకుని తిన్నాం. కొండ అంచుకు చేరగానే.. ఒక్కసారిగా మతిపోయినట్టనిపించింది. 

అవతలివైపు దూరంగా ఒక మహాపర్వతం. కొండపైనుంచి దాని శిఖరం చూడడానికే.. మేం తలలు పైకెత్తాల్సి వచ్చింది. అంతపెద్ద పర్వతం పైనుంచి ఓ జలపాతం నేలపైకి దూకుతోంది. మామూలు జలపాతాల్లా సన్నటి పాయలా లేదది. పెద్ద నదిలా పైనుంచి కిందకు పడుతోంది. అది నేలను తాకిన చోట చాలాపెద్ద సరస్సు ఉంది. అక్కడి నుంచి నీళ్లన్నీ పారుతూ సముద్రంలో కలుస్తున్నాయి. అక్కడిచెట్లు.. మేమెక్కి వచ్చినంత కొండల్లా ఉన్నాయి. వాటికొమ్మలు నదులపై కట్టే వంతెనల్లా విస్తరించి ఉన్నాయి. ఇదంతా చూస్తూ ఇద్దరం మాటలు మర్చిపోయాం. కిందకు వెగంగా దిగామో తెలియలేదు. నేను నడుస్తుంటే.. మౌనీ జలపాతం దగ్గరకు పరుగు తీసింది. అక్కడికి చేరగానే ఒంటిపై ఉన్న బట్టల్ని తీసేసి ఒక్కసారిగా సరస్సులో దూకుంది. నాకూ నీళ్లలో దిగాలనిపించింది కానీ.. మౌనీని చూస్తూ ఉండిపోయా. సరస్సులో అడుగున ఉన్న రాళ్లు కూడా కనిపించేంత స్పష్టంగా ఉన్నాయి నీళ్లు. ఓపికున్నంత సేపూ ఈతకొట్టి గట్టుపైకి వచ్చింది. ఇప్పుడు నాకు పరిసరాలేవీ స్పష్టంగా కనిపించడం లేదు. ఒక్క మౌనీ తప్ప. నన్ను చూసి అక్కడే నిల్చుండిపోయింది. 

తనని చూస్తుంటే నా రెండు కళ్లకి ఒద్దిక చెడిపోయింది. నడుము దగ్గరకొచ్చేసరికి మాత్రం రెండూ ఒక్కటయ్యాయి. ఎక్కడని వెతకను నడుముని.. నాభిలో అది ఇరుక్కుపోయింది. కృష్ణబిలంలా శరీరం మొత్తాన్ని తనలోకి లాక్కుంటున్నట్టు అనిపించింది. నన్ను కూడా..! దగ్గరకెళ్లా.. తనలో ఏమాత్రం బెరుకు లేదు. నా కళ్లలో కళ్లు పెట్టి చూసింది. తనని పట్టుకోబోయేంతలా.. చిర్నవ్వు నవ్వుతూ నన్ను నీళ్లలోకి నెట్టి.. అలాగే సముద్రం వైపు ఇసుకలోకి పరిగెత్తింది. క్షణాల్లో స్నానం ముగించి.. నేనూ అటెళ్లా. ఇసుకలో కూర్చుని ఉంది. నేనూ వెళ్లి పక్కన కూర్చున్నా. నా ముఖంలో ముఖం పెట్టి ముద్దిచ్చింది. కాసేపటి తర్వాత ఇసుకపై వింతలిపి రాస్తూ శీరీరాలు మాట్లాడుకుంటున్నాయి. 

ఇద్దరం అలసిపోయి ఇసుకలో అలాగే పడుకుండిపోయాం. కాసేపటికి మబ్టులు పట్టి సన్నటిజల్లు మొదలైంది. దూరంగా దిగంతాలకు వంతెనలా వరదగూడు కట్టింది. మాటల్లో వర్ణించలేనంత అందం సముద్రంపై పరుచుకుంది. చిరుజల్లుల్లో తడుస్తూ అలాగే పడుకున్నాం. చాలాసేపటి తర్వాత ఇద్దరం లేచి బయల్దేరాం. ఏడు రంగుల్ని చూస్తూ.. చేయీ చేయీ కలిపి కొండెక్కాం. దారిపొడుగునా వెనక్కి తిరిగి.. ఆ మహాపర్వతాన్ని, జలపాతాన్ని, సరస్సుని, ఇంతసేపూ మేమున్న చోటునీ చూస్తూ ఉన్నాం. 

కొండ దిగుతూ ఉండగా వాన పెరిగిది. ఒక్కసారిగా పెనుగాలి మొదలైంది. ప్రళయం వచ్చినట్టు చెట్లు ఊగిపోతున్నాయి. దూరంగా వరదగూడు కరిగిపోయింది. చూస్తుండగానే గాలివేగం, వర్షం జోరు మహోధృతంగా పెరిగింది. చెట్లు కూకటివేళ్లతో సహా ఎగిరిపోతున్నాయి. ఇద్దరం ఎంత జాగ్రత్తగా నడుద్దామన్నా కుదరడం లేదు. ఒకర్నొకరం పట్టుకుని చిన్నగా పాక్కుంటూ కొండ దిగుతున్నాం. ఇంతలో ఓ బలమైన జల్లు ఇద్దర్నీ ఉక్కిరిబిక్కిరి చేసింది. కళ్లు మూసి తెరిచేంతలో ఇద్దరం విడిపోయాం. ఆ వేగంలో కొండవాలులోకి కొట్టుకుపోయింది మౌనీ. తన చేయి అందుకునేందుకు ప్రయత్నించినా కుదర్లేదు. కళ్లముందే చెట్ల మధ్య నుంచి కిందికి జారిపోయింది. మరుక్షణంలోనే మంత్రం వేసినట్టు గాలీ, వాన ఆగిపోయాయి. వేగంగా కొండదిగాను. దారంతా తను కనిపిస్తుందేమో అని చూశా. ఎంత వెదికినా తన జాడ కనబడలేదు. కన్నీళ్లు ఉబికి వస్తుంటే.. ఏం చేయాలో అర్ధంకాక చాలాసేపు నిలుచుండి పోయా. కాసేపటికి కొండచుట్టూ ఉన్న కంచెపై నా దృష్టి పడింది. కోపంతో ఊగిపోతూ కంచెని ధ్వంసం చేశా. రంగురంగుల జెండాలన్నింటినీ పీకిపారేశా. అప్పటికీ బాధ చల్లారడం లేదు. గుడిసె దగ్గరికి వెళ్దామనుకునేంతంలో.. ఎక్కడో ఆనకట్ట తెగినట్టు వరద ముంచుకొచ్చింది. ఈ కొండ అంచునుంచి అటు వైపున్న వాగువరకూ ఉంది ప్రవాహం. అక్కడే ఉన్న పెద్ద బండరాయిపైకెక్కి పడుకున్నా. పదేపదే గుర్తొస్తున్న మౌనీని తల్చుకుంటూ అలాగే ఉండిపోయాం.

మళ్లీ కళ్లు తెరిచేసరికి.. ఆకాశాన్ని నరుక్కుంటూ వస్తున్నాడు సూర్యడు. వరద లేదిప్పుడు. ఊరు కూడా. విషాదం ముగిసిపోయినట్టు.. శ్మశానాన్ని నిశ్శబ్దం పరుచుకుంది. ఒక్కడ్నే మిగిలిపోయా. అక్కడ నిలబడలేక సముద్రం దగ్గరకి నడిచా. అలా నీళ్లలోకి నడుచుకుంటూ వెళ్తుంటే.. నోరూ, ముక్కు, చెవులూ అన్నింటిలోకి నీరు దూరుతోంది. ఈత మర్చిపోయి, ఊపిరందక కొట్టుకుంటున్నా...

'మళ్లీ జన్మిస్తానా.. తనని కలుస్తానా..?'

కలవరిస్తూ కళ్లు నెమ్మదిగా తెరిచా. కల ధ్వంసమైంది. గదినిండా ఒకటే పొగ. రాత్రి చల్లటిగాలి కోసం తెరిచిన కిటికీలోంచి వస్తున్న పొగ గదినిండా కమ్మేసింది. ఊపిరాడనంత పొగ. లేచి లైట్ వేసి కిటికీ దగ్గరకొచ్చా. ఎవరో చెత్తకి నిప్పంటించి వెళ్లిపోయారు. కిటికీ మూసి ఫ్యాన్ ఆఫ్ చేసి బెడ్ పై కూర్చున్నా. టేబుల్ పై రాత్రి సగం తిని వదిలేసిన మెక్ ఎగ్ కోసం రెండు ఈగలు, కొన్ని దోమలు కొట్టుకుంటున్నాయి. 

'ఒకటే ఉక్కపోత.. జ్ఞాపకాల కలబోతలా..'
బాత్రూమ్ లో కెళ్లి.. షార్ట్ తీసేసి షవర్ ఆన్ చేశా. తలపైనుంచి జారుతున్న నీళ్లలో కంటిధార కల్సిపోయింది. ఏడుపుని షవర్ కింద దాచుకోవడం అలవాటైపోయింది. 
బాధ తగ్గిందనిపించాక షవర్ ఆఫ్ చేసి బైటకొచ్చా. గదిలో పొగ పూర్తిగా మాయమైంది. ఫ్యాన్ వేసుకుని అలాగే బెడ్ పై వాలిపోయా. 
నిద్రొస్తుందా..?
ఏమో.. 'నాలో సగం లేదు.. మరో సగం జీవచ్ఛవం..'
కళ్లు మూసుకున్నా.. మళ్లీ కలొస్తే బాగుండు.

(వంగూరి ఫౌండేషన్ ఉగాది(2015) కథల పోటీల్లో.. మొట్టమొదటి కథ విభాగంలో బహుమతి వచ్చిన కథ.) 

Friday, December 16, 2016

చూపున్న అక్షరాలు

అక్ష‌రాలంటేనే చూపునిచ్చేవి అనొచ్చు. కానీ అన్ని అక్ష‌రాల‌కీ అంత శ‌క్తుంటుందా అన్న ప్ర‌శ్న వెంట‌నే వ‌స్తుంది. పొయొటిగ్గా మాట్లాడుకోవ‌డం ప‌క్క‌న‌బెడితే అక్ష‌రానికి ప్ర‌త్యేక విలువ ఏమీ ఉండదు. అక్ష‌రాల‌కి అంత విలువే ఉంటే.. చ‌దువుకున్న ప్ర‌తోడు మ‌హాజ్ఞాని అయి ఉండాలి. ఇక‌ విష‌యానికొస్తే స‌రిగ్గా ఏడాది కింద‌ట హైద‌రాబాద్ బుక్ ఫెయిర్‌లో ప‌తంజ‌లి ర‌చ‌న‌ల సంపుటి-1,2 కొన్నాను. కేశ‌వ‌రెడ్డి భ‌గ‌వానువాచ‌, ఇన్‌క్రెడిబుల్ గాడెస్ కూడా కొన్నాను. అప్ప‌టికే మునెమ్మ‌, చివ‌రిగుడిసె, అత‌డు అడ‌విని జ‌యించాడు, మూగ‌వాని పిల్ల‌నగ్రోవి చ‌దివుండ‌టం వ‌ల్ల‌(ప్రత్యేకమైన కొత్త ఇంట్రస్ట్ లేకపోవడం వల్ల).. కేశ‌వ‌రెడ్డి పుస్తకాల్ని ఇప్ప‌టికీ తెర‌వ‌లేదు. ఎప్ప‌టినుంచో చ‌ద‌వాల‌ని ఉండ‌డం వ‌ల్ల‌.. ప్ర‌త్యేకించి కొనుక్కొచ్చినందు వ‌ల్ల ప‌తంజ‌లిని చ‌ద‌వ‌డం మొద‌లెట్టా. అప్ప‌టికే ముక్కామ‌ల చ‌క్ర‌ధ‌ర్ గారి వ‌ల్ల‌.. గెలుపు స‌రే బ‌త‌క‌డం ఎలా చ‌దివి ఉన్నా. నిజానికి అప్ప‌టినుంచే ప‌తంజ‌లిని చ‌ద‌వాల‌ని ఉన్నా.. లాస్ట్ ఇయ‌ర్ డిసెంబ‌ర్‌కి కానీ కుద‌ర్లేదు. బుక్ తెచ్చినంత ఈజీగా చ‌ద‌వ‌డం మొద‌లుపెట్ట‌లేం. చివరికి ఓ ఫ్రెండ్ స‌ల‌హాతో రాజుగోరు ద‌గ్గ‌ర నుంచి మొదలుపెట్టా. అక్క‌డ్నించి ఒక దెయ్యం ఆత్మ‌క‌థ వ‌ర‌కూ ఏక‌బిగిన చ‌దివా. అంటే రోజుల్లో కాద‌నుకోండి. ఒక‌ట్రెండు నెల‌ల్లో..

హైద‌రాబాద్‌కి వ‌చ్చిన కొత్త‌ల్లో యూసుఫ్‌గూడ‌లో ఉన్న ఓ లైబ్ర‌రీ నుంచి యండ‌మూరి, య‌ద్ద‌న‌పూడి, మ‌ల్లాది ల న‌వ‌ల‌లు రోజుకొక‌టి తీసుకెళ్లి చ‌దివి ఇచ్చేసేవాడ్ని. సైజు ఎంత పెద్ద‌వైనా ఐదారు గంట‌ల్లో చ‌దివేసేవాడ్ని. కానీ కేశ‌వ‌రెడ్డి చివ‌రిగుడిసె అనే 90 చిన్న‌పేజీల పుస్త‌కం చ‌ద‌వడానికి ఒక రాత్రంతా(12గంట‌ల‌కు మించే) ప‌ట్టింది. కానీ చివ‌రిగుడిసె ఏడిపించినంతగా, ఆలోచింప‌జేసినంత‌గా యూసుఫ్ గూడ లైబ్రరీ పుస్తకాలేవీ చేయలేదు. అలాగ‌ని అవి నాకు మ‌రే అనుభూతినీ ఇవ్వ‌లేద‌ని కాదు. కాకపోతే దానికీ దీనికీ స్వ‌ప్న స్ఖ‌ల‌నానికీ.. రియ‌ల్ ఆర్గాజ‌మ్‌కి ఉన్నంత తేడా ఉంది. చూపున్న అక్ష‌రాలు అని అందుకే అంటున్నా. ప‌తంజ‌లి రాజుగోరు చ‌దవ‌డం మొద‌లయ్యాక.. ప‌డీప‌డీ న‌వ్వ‌డం, కాసేపు ఏదో ఆలోచించ‌డం.. తెలిసిన మనుషులెవరో కనిపించినట్టు అనిపించడం.. అదో చిత్ర‌మైన అనుభవం. కొన్నిసార్లు ఏళ్లుగా చ‌దువుకున్న‌దంతా త‌ప్ప‌యిన‌ట్టు.. భూమి బ‌ల్ల‌ప‌రుపుగా ఉంద‌న్న నిర్ధార‌ణ‌కు వ‌చ్చేస్తాం. భూమి బ‌ల‌వంతుడికి న‌చ్చిన ఆకారంలో ఉంటుంద‌న్న నిర్ధార‌ణ‌కు వ‌చ్చేస్తాం. ముఖ్య‌మంత్రుల్లో అప్ప‌న్న‌స‌ర్దార్‌ల‌ని చూస్తాం. మ‌హామేధావుల్లో లెక్కల తాబేళ్ల‌ని చూస్తాం. అక్ష‌రాల‌తో అదో స‌ర‌దా స‌మ‌రం. 

కానీ మిత్రుడి స‌ల‌హాతో రాజుగోరు ద‌గ్గ‌ర్నుంచి మొద‌లుపెట్టిన నాకు.. ఒక దెయ్యం ఆత్మకథ తర్వాత, వెనక్కొచ్చి ఖాకీవ‌నం చ‌ద‌వ‌డానికి భ‌య‌మేసింది. మ‌ళ్లీ పుస్త‌కాన్ని మూల‌న‌పెట్టేశా. ఎందుకో ఒక‌రోజు పేజీలు తిర‌గేస్తుంటే.. 'పెంకుల నుంచి గదిలోకి కారుతూ మసక చీకటి' అన్న లైన్ కనిపించింది. పేజీ చేతిలోంచి జారిపోయి తర్వాత పేజీ తిరిగింది. 'అడవిలో అమాయకంగా బతికే జింకలకు వాడి కొమ్ములుండాలి. తోటలో తెల్లగా బతికే వెర్రిముండా పావురాలకైనా ఉక్కు ముక్కులుండాలి. పెరట్లో గంతులేసే కుందేళ్లకైనా విషపు కోరలుండాలి. స్త్రీలందరి దగ్గరా మిషన్ గన్స్ ఉండాలి'. కమలి చెప్తున్న ఈ వాక్యాలు చదివాక వెంటనే ఖాకీవనం తొలి పేజీ తీశాను. మరుసటి రోజు ఉదయానికి చివరి పేజీ తిప్పేశాను. మళ్లీ ఒక రాత్రిని పతంజలికి అంకితమిచ్చాను. ఖాకీవనంలో కమలిలా కాసేపు, భాస్కర్లా, ప్రభాకర్ లా కాసేపు,  లక్ష్మణరావులా ఇంకాసేపు తిరిగాను. చివరకు 'అవే చూపులు.. అందులో అవే కత్తులు' అంటూ ముగించాను. 
ఈ చూపున్న అక్షరాల తోటలో ఇంకా కొన్ని పేజీలున్నాయి. చదవాలి. 

Thursday, December 15, 2016

సెల్ఫీ విత్ మిర్రర్

నేనే 
నథింగ్ న్యూ
కుడి ఎడమయిందంతే
జీవితమేం తల్లకిందులు కాలే
ఫ్రంట్ కెమెరాతో తీస్తేనే సెల్ఫీనా
ట్రై విత్ రియర్ 
కాసిని మరకలున్నా
కాస్త అస్సష్టత ఉన్నా
అది నేనే
ఆకారం అదే
అద్దంలో అంతకుమించి కనిపించదు
అయినా లోపలి యుద్ధాలెవడిక్కావాలి
అద్దం అద్దమే
అదంతా నిజం కాదు

నీ మరణం క్షణికం... నా మరణం క్షణక్షణం

లవ్‌స్టోరీ... చూడ్డానికి సినిమా స్క్రిప్ట్‌లా ఫాస్ట్‌గా సాగే ఈ పుస్తకం.. చివరికొచ్చేసరికి గొంతుకేదో అడ్డం పడ్డట్టుగా, గుండె బరువెక్కినట్టుగా చేస్తుంది. డబ్బున్న కుర్రాడు పేదింటి అమ్మాయిని పెళ్లిచేసుకుంటాడు. రొటీన్ లవ్‌స్టోరీ... అనుకున్నా... సీగల్ సిరాలో భిన్నంగా సాగుతుంది. ఒలివర్, జెన్నీ క్యారెక్టర్ల సృష్టి... యువకుడిగా ఒలివర్ మానసిక అస్తిత్వంకోసం పోరాడటం... వావ్ బాగా చదివించాడు. చివర్లో ఏడిపించాడు. నిజానికిది సినిమా స్క్రిప్ట్. సినిమా షూటింగ్ పూర్తై... రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న టైమ్‌లో నిర్మాత సలహాతో ఎరిక్ దీన్ని నవలగా అచ్చువేయించాడు. బుక్ సూపర్‌హిట్టైంది... సినిమా కూడా హిట్. ప్రతీ ప్రేమకథా పెళ్లితో ముగుస్తుంది. ఇక్కడ పెళ్ళితో సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. ఒలివర్, జెన్నీ కష్టాలు పంచుకుంటారు. జీవితంలో ఒక్కోసారి బాధలు కూడా మరిచిపోలేని అనుభూతులవుతాయి కదా... చివర్లో జెన్నీ.. 
నీ మరణం క్షణికం.. నా మరణం క్ష‌ణ‌క్ష‌ణం అంటూ సీగలే ఓ కవితలో చెప్తాడు. దాన్ని ఎన్లార్జ్ చేసి ఈ నవల రాసినట్టనిపిస్తుంది.
మొత్తానికి నాకైతే నచ్చింది.
(డిసెంబర్ 8, 2010 గరమ్ ఛాయ్ లో రాసుకున్నది)

Wednesday, December 14, 2016

ఒక గతం.. కొన్నిమాటలు

కొన్ని మాటలుంటాయి
అర్ధం కావు
కొన్ని భావాలుంటాయి
మాటల్లో ఇమడలేవు..

గతమెప్పుడూ అస్పష్టమే
ఎంతతవ్వినా ఏదీ దొరకదు
దొరికింది సంతృప్తినివ్వదు
నిజం నీకు తెలిసేసరికి
జీవితం చిక్కుముళ్ళు పడుతుంది

ఫర్గెట్ ద పాస్ట్
వర్తమానంలో సొల్యూషనుంది
మళ్లీ కొత్తగా మాటలు కలపండి
కనీసం స్పర్శతో అయినా సంభాషించండి
మౌనం ఎప్పుడూ సమాధానం కాదు
గతం లాగే....

(ది పాస్ట్(2013) మూవీ చూశాక)(16-09-2015 ఫేస్బుక్ టైమ్ లైన్ నుంచి)

నథింగ్ పర్సనల్

ఏకాంతంలో ఏముంటుంది....?
వెన్నెల్లో ఒంటరిగా ఎప్పుడైనా నడిచారా..?
కొండలపై ఒక్కరే రాత్రో పగలో గడిపారా.?
మొదటి రెండూ ఓకే.. మూడోది కాస్త డేంజర్ అనిపిస్తుంది కదా..! కానీ ఇవేమీ పట్టని మనుషులు కొందరుంటారు. ఇంతకీ ఏకాంతంలో ఏముంటుంది..? 
చాలా సింపుల్... ప్రశాంతత.! అందరికీ తెలిసిందే కానీ అందరూ అనుభవించలేంది. ఏకాంతంలో ప్రశాంతతే కాదు పక్కనే భయం కూడా పొంచి ఉంటుంది. రెండో దాన్ని గురించి ఆలోచిస్తే మొదటిదాన్ని ఆస్వాదించలేం.

Nothing personal చూసి నాలుగైదు రోజులైంది. కాని ఆ ఏకాంతం నన్నింకా వదల్లేదు. ఒకమ్మాయి ప్రపంచంపై విరక్తి చెంది(కారణం చెప్పడు కానీ... ఒక అనుబంధం తెగినట్టు తెలుస్తుంది) తన నివాసాన్ని వదిలేసి బయలుదేరుతుంది. ఎవర్నో లిఫ్టడిగి ఏదో ఊళ్లో దిగుతుంది. ఎవర్నీ నమ్మదు. మనిషి సంచారమే లేని ఓ కొండపై గుడారం వేసుకుంటుంది. తర్వాత అక్కడికి దూరంగా ఓ ఇళ్లు చూస్తుంది. ఆకలేసి అక్కడికి వెళ్తుంది. ఇంట్లో ఎవరూ ఉండరు. కానీ ఇళ్లంతా తిరిగి, పడకపై నగ్నంగా పడుకుని ఎంజాయ్ చేస్తుంది. మరుసటి రోజు మళ్లీ వెళ్తుంది. ఓ నడి వయసు మనిషి బైటకొస్తాడు. అతన్నడిగి తోటలో పనిచేసి తిండి పెట్టించుకుంటుంది. రోజూ పని చేస్తే రోజూ భోజనం పెడతానంటాడు. అయితే తన గురించి ఏమీ అడగకపోతే ఉంటానంటుంది. డీల్ ఓకే.

మొదట్లో బైటే ఉంటుంది. అతను రమ్మన్నా ఇంట్లోకి వెళ్లదు. క్రమంగా ఇంట్లోకి వెళ్తుంది. ఇద్దరూ ఒకరి గురించి మరొకరు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఎవరి ఏకాంతంలో వారు ఉంటూనే..! 
Ursula antoniak తీశాడీ ఐరిష్ సినిమా. సినిమా మొత్తంలో 90శాతం రెండే పాత్రలు. కానీ ఆ ఏకాంతం ఏమాత్రం బోర్ కొట్టదు.

(22-09-2014 ఫేస్బుక్ టైమ్ లైన్ నుంచి)

ఇడా - బ్లాక్ అండ్ వైట్ లైఫ్

విశ్వంలో ఎన్నో రంగులు.. ఒక్కో వర్ణానిది ఒక్కో అందం. ఎన్ని రంగులున్నా శాశ్వతమైనవి రెండే.. బ్లాక్ అండ్ వైట్. పగలు-రేయి. స్వేచ్ఛ(వెలుగు)-చీకటి. సవాలక్ష రంగులతో నిండిన జీవితాలు కొన్ని. బ్లాక్ అండ్ వైట్ బతుకులు ఇంకొన్ని.

యుద్ధం రంగుల్ని మింగేస్తుంది. మనుషుల్ని జీవచ్ఛవాలుగా మార్చేస్తుంది. యుద్ధంలో చస్తే స్వర్గానికెళ్తారంటారు.. ఇది నిజమే. ఎందుకంటే బతికినవాడిది నరకం కాబట్టి. రెండో ప్రపంచయుద్ధం పోలండ్ ను ఇలాగే మార్చింది. ముఖ్యంగా యూదుల బతుకుల్ని. నాటి పోలండ్ గురించి ఈ ఇంట్రో సరిపోదేమో. అందుకే సినిమా తీశాడు పాలికోవ్ స్కీ. బ్లాక్ అండ్ వైట్ లో.. యుద్ధం తర్వాత పోలండ్ ఏంటన్నది 80నిమిషాల్లో చెప్పాడు. రెండు రంగులు.. రెండున్నర పాత్రలు(ఇంకా కొన్ని ఉన్నాయి కానీ లెక్కలోకి రావు. ఇడా లవర్ కొద్ది సేపే ఉంటాడు, అందుకే సగం కింద లేక్కేశా).

ఈ సినిమాలో అద్భుతంగా అనిపించే సీన్. వాండా(ఇడాకు ఆంటీ) ఆత్మహత్య. 
ఉదయాన్నే లేచి.. మంచిగా ఫ్రెషప్ అయి, కిటికీలన్నీ తెరచి, గ్రామ్ ఫోన్ రికార్డ్ ఆన్ చేసి.. పాటలు వింటూ తెరచిన కిటికీలోంచి కిందకు దూకేస్తుంది. సింపుల్గా అనిపించినా దీన్ని పిక్చరైజ్ చేసిన విధానం మాత్రం సూపర్బ్.
నచ్చిన రెండో సీన్..
వాండా ఆత్మహత్య తర్వాత కాన్వెంట్ నుంచి తిరిగొచ్చే ఇడా.. నన్ క్యాప్ తీసేసి, ఫుల్లుగా మందుకొట్టి, లవర్ తో గడిపాక.. తనని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. తర్వాత ఏంచేద్దామని అడిగితే... బీచ్ కెళ్దామంటాడు... తర్వాత పెళ్లి.. పిల్లలు అంటాడు. చివరకు చెప్పడానికేమీ లేక యాజ్ యూజువల్ లైఫ్ అని ముగిస్తాడు..
కాసేపటి తర్వాత ఇడా లేచి సన్యాసి డ్రస్ వేసుకుని కాన్వెంట్ కు బైల్దేరుతుంది. తను నడుస్తూ ఉండగా ఎండ్ క్రెడిట్స్ మొదలవుతాయి. 

ఇంకా బాగా నచ్చినవి.. బ్లాక్ అండ్ వైట్ లో తీసిన ప్రతీ లాంగ్ షాట్. 
ఈసినిమాకి ఆస్కార్ రావడానికి యూదు బ్యాగ్రౌండ్ కారణమనుకున్నా.. ఇంతకన్నా బెస్ట్ గా మరోదాన్ని కూడా చూడలేం.

(27-02-2015 ఫేస్బుక్ లో రాసుకున్నది)

Tuesday, December 13, 2016

బిగ్ బ్యాంగ్

విశృంఖలత్వమే విశ్వసృష్టికి నాంది
బిగ్ బ్యాంగ్ మహాస్ఖలనంలో
విరగపండిన వినువలయమిది
సంకెళ్లేసి భంగపడతావెందుకు..
భూమిని గుండ్రని బంతిగా చేసి
ఆడుకునే ఆటలు నావి
బల్లపరుపు ఆలోచనపై
బజ్జోమనడం నీ నైజం
నింగికి నమస్కారం 
నీకు తన్మయత్వం
అంతరిక్షపు అంచుల్లో
నాట్యం నా నిత్యకృత్యం
అవనిపై జీవం పెరిగితే
అది పాపభారం నీకు
అంగారకుడిలోనూ ఆక్షిజన్ వెతకడం
ఆనందం నాకు
విలువల్లో వికాసం చూస్తావు నువ్వు
వలువల్ని కూడా ఎడంకాలితో తంతాన్నేను
కుత్తుకలు కత్తిరించే కుట్రలు నీవి
శృంఖలాలు తెంచే గండ్రగొడ్డలి నేను
నువ్వు సనాతనం
నేను నిత్య నూతనం

(ఏడాది కిందెప్పుడో ఫేస్బుక్ లో రాసుకున్నది)

మాయానది

నేను నదిని
కదిలే కాలప్రవాహాన్ని
నాలో నీరే కాదు
నీరై పారే రహస్యాలెన్నో
నా గర్భంలో మొసళ్లు
తీరంలో మీరు
నీరంతా ద్రవీభవించిన పాపాలే
కాలం గడిచేకొద్దీ
నాకు నేనే భారమై..
మీ పేర్లు పేవ్మెంట్ల పైనే కాదు
నాలోనూ ఉన్నాయి
నేను నదిని
కదిలే కల్మషాన్ని

(MYSTIC RIVER మూవీ చూశాక.. ఫేస్బుక్ లో రాసుకున్నది)

టాప్ యాంగిల్

అందం ఎక్కడుంటుంది..?
జస్ట్ టిల్టప్ యువర్ కెమెరా
మనసుకున్న మసి తుడిచి
తల కిందికొంచి చూడు
ఈగిల్ వ్యూలో..
కనుచూపు మేరంతా
మేటవేసిన అందమే
మనకి కావాల్సిందల్లా
కాస్త ప్రేమ
కాళ్ళకిందున్న నేలమీద...
జస్ట్ టిల్టప్ యువర్ కెమెరా

(కెమెరామెన్ సుకుమార్కి ప్రేమతో..
తమిళ సినిమా ధర్మదురైలో ఆండిపట్టి పాట చూసి.. సినిమా కూడా ఓపిగ్గా చూశా. మూవీ నిండా టాప్ యాంగిల్లో తీసిన సీన్లే. కొంచెం ఓవర్ డోస్ అయినా అద్భుతమైన సీన్ కంపోజింగ్)