Wednesday, December 28, 2016

అందం అంటే ఆమేనా..?

అందం అంటే అరవింద్ స్వామి.
అందం అంటే అబ్బాస్.
కాసిని కండలు కూడా కావాలంటే.. సల్మాన్ ఖాన్.
కానీ అందరిలోకీ అరవింద్ స్వామి ప్రత్యేకం. అబ్బాస్ లా మరీ యవ్వనం తొణికిసలాడే ఫేస్ కాదు.. సల్మాన్ లా కండలు తిరిగిన ఒళ్లూ కాదు. మరేముంది అతనిలో..?

అతనొక్కడిలోనే కాదు పైన చెప్పుకున్న మరో ఇద్దరిలోనూ ఏదో ఉంది. అసలు అందం అనగానే గుర్తొచ్చే మగమహరాజులు అందరిలోనూ అదే ఉంది. దానిపేరే ఆడతనం. వీళ్లంతా ఫేస్ కు ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకున్నట్టు ఆడతనాన్ని టచప్ చేసుకుంటారు. మయంతి లాంజర్ మగతనాన్ని రాసుకున్నట్టు. అందరిలోకీ ఆడతనం కాస్త ఎక్కువ కనిపించే ముఖం అరవింద్ స్వామి. పరువం.. వానలా కురుస్తున్నట్టుంటాడు. కాశ్మీర్ మంచులా కనిపిస్తాడు. అమ్మాయిల చిన్ని చిన్ని ఆశలు తీర్చేవాడిలా ఉంటాడు.

1991లో దళపతి వచ్చింది. హీరో రజనీకాంత్.. అటు వైపు మమ్ముట్టి. వీళ్లిద్దరితో సమానంగా ఎక్స్ పోజ్ అయ్యాడు అరవింద్ స్వామి తన పాల బుగ్గలతో. అమ్మాయిలు ఫిదా అయిపోయారు. 1992లో తనే హీరోగా రోజా వచ్చింది. రోజాని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అందరి కళ్లూ అతనిపైనే. అమ్మాయిల కళ్లలో సిగ్గు.. మగాళ్ల కళ్లలో అసూయ. అన్ని సినిమాల్లో హీరోయిన్ కోసం హీరో ఫైట్లు చేస్తాడు. కానీ రోజాలో హీరో కోసం హీరోయిన్ యుద్ధం చేస్తుంది. సత్యవంతుడి కోసం సావిత్రి పోరాడినట్టు. కథ ఏదైనా.. హీరో కోసం హీరోయిన్ ఫైట్ చేయడమంటే మాటలు కాదు. అందుకు తగ్గ హీరో అరవింద్ స్వామి మాత్రమేనేమో..

బొంబాయి తర్వాత ఒకటీ అరా సినిమాలొచ్చినా తెలుగువాళ్లకి తెరమరుగైపోయాడు అరవింద్ స్వామి. ఓ యాక్సిడెంట్ కారణంగా దశాబ్దం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యాడు. కానీ అందరికీ గుర్తుండిపోయాడు. మళ్లీ కడలిలో కనిపించాడు. ఎందుకో కాస్త ముసలాడైనట్టు కనిపిస్తాడు. లేటెస్ట్ ధృవతో రోజా నాటి అరవింద్ స్వామి ప్రత్యక్షమయ్యాడు. రోజా సినిమాలో అతడి నుదుటిపై ఓ మచ్చ ఉంటుంది. ధృవలో దానితో పాటు.. ముక్కుపై మరో మొటిమ లాంటిది చేరింది. తనలో అందమనే అమృతం ఇంకా తగ్గలేదని చెప్పే గుర్తులేమో అవి అనిపిస్తాయి. 

ఫైనల్గా.. మగాడంటే మగాడే అని మీసాలు మెలేసేవాళ్లని ఎవడూ ఏం చేయలేడు. అందంగా కనపడాలంటే మాత్రం ఆడతనాన్ని పూసుకోండి. ఎందుకంటే అందం అంటే ఆమే.. తనని టచప్ చేసుకోవాల్సిందే ఎవరైనా..!

No comments:

Post a Comment