Tuesday, August 29, 2017

వాన‌


రాలే ప్ర‌తి చినుకూ
నీ జ్ఞాప‌కంలా తాకుతోంది
నువు నా ప‌క్క‌నే ఉన్న‌ట్టు

ఈ మూడు నెల‌లు
నీ మూడు రోజుల్లాంటివ‌నుకున్నా
ఎక్క‌డో ముల్లు గుచ్చుకుంటున్నట్టు..

ఈ వాన జ‌ల్లు మాత్రం క‌చ్చితంగా నువ్వే
ఇంత చ‌ల్ల‌ద‌నం ఇంకెవరు పంచ‌గ‌ల‌రు
ఎదురుగా ఉన్న సముద్రం త‌ప్ప‌

Sunday, August 27, 2017

ల్యాండ్ ఆఫ్ మైన్‌

యుద్ధం ఎంత విషాద‌మో
స‌రిహ‌ద్దు న‌డిగి చూడు
సైనికుడి క‌ళ్ల‌లో చూడు

యుద్ధం ఎంత విషాద‌మో
అది ముగిశాక చూడు


ముంబ‌యి వ‌చ్చిన నెల‌రోజుల్లో ఇప్ప‌టిదాకా ఒక్క సినిమా చూడ‌లేదు. నిన్న రాత్రి నిద్ర రాక నెట్‌లో సెర్చ్ చేస్తుంటే త‌గిలిందీ సినిమా. ల్యాండ్ ఆఫ్ మైన్‌. డ్యానిష్ ఫిల్మ్‌. ఎందుకో ఆ టైమ్‌లో, అప్పుడున్న మూడ్‌లో మూవీ పోస్ట‌ర్ న‌చ్చింది. పైగా ఆస్కార్ నామినేటెడ్‌. ఐఎమ్‌డీబీ రేటింగ్ కూడా ఓకే క‌నుక సినిమా చూశా. 

రెండో ప్ర‌పంచ‌యుద్ధం త‌ర్వాత డెన్మార్క్‌లోని కోస్ట‌ల్ ఏరియాల్లో జ‌ర్మ‌న్ సైన్యాలు పాతిన‌ కొన్ని ల‌క్ష‌ల కొద్దీ ల్యాండ్‌మైన్స్ మిగిలిపోయి ఉంటాయి. యుద్ధంలో జ‌ర్మ‌నీ ఓడిపోయాక త‌మ‌కు ప‌ట్టుబ‌డిన జ‌ర్మ‌న్ సైనికుల‌తోనే ఆ ల్యాండ్‌మైన్స్‌ని నిర్వీర్యం చేయించాల‌నుకోవ‌డం, కుర్ర‌ సైనికుల క‌ష్టాలు, కొంత‌మంది ప్రాణాలు పోగొట్టుకోవ‌డం ఈ సినిమా. 

సినిమాలో అన్నింటికంటే బాగా న‌చ్చిన పాత్ర డెన్మార్ సైనిక అధికారి లియోపోల్డ్‌ది. స్టార్టింగ్ సీన్‌లో లొంగిపోయిన జ‌ర్మ‌న్ సైనికులు న‌డిచివెళ్తుంటారు. వాళ్ల‌లో ఒక‌రి చేతిలో డెన్మార్క్ జాతీయ జెండా ఉంటుంది. ఆ కార‌ణం చూపి సైనికుడ్ని చావ‌గొడ‌తాడు లియోపోల్డ్‌. జ‌ర్మ‌న్ సైనికులంటే త‌న‌కి ఎంత క‌సి ఉందో క‌నిపిస్తుంది. అదే లియోపోల్డ్‌కి 14మంది జ‌ర్మ‌న్ సైనికఖైదీల్ని అప్ప‌గిస్తారు. వాళ్ల‌తో ల్యాండ్‌మైన్స్ నిర్వీర్యం చేయించాల‌న్న‌ది టార్గెట్‌. అదికూడా ఎలాంటి సేఫ్టీ లేకుండా ఒట్టి చేతుల‌తో ల్యాండ్‌మైన్స్‌ని తొల‌గించాలి. 3 నెల‌ల్లో ఆ ఏరియాలో ఉన్న మైన్స్ అన్నింటినీ తొల‌గిస్తే జ‌ర్మ‌నీ పంపిస్తానంటాడు లియో.  

క‌ర‌డుగ‌ట్టిన సైనిక అధికారి ఒక వైపు.. అప్పుడ‌ప్పుడే బాల్యాన్ని దాటుతున్న కుర్ర సైనికులు ఇంకో వైపు. నిండా చావుని దాచుకున్న స‌ముద్రం ఒడ్డు మ‌రోవైపు. గంట‌న్న‌ర‌లో యుద్ధం మిగిల్చిన విషాదాన్ని బాగానే చూపించాడు డైరెక్ట‌ర్ మార్టిన్.