Saturday, January 21, 2017

ఏది హింస.. ఏది అహింస..?


చాగంటికీ.. జల్లికట్టుకీ ముడిపెట్టి రాస్తున్నానిది.
బెలూచిస్తాన్ కీ.. లంక తమిళులకీ ముడిపెట్టి రాస్తున్నా ఇది..
కర్నాటక కావేరీ నీళ్లకీ... మెరీనాబీచ్ సాగరఘోషకీ లింక్ కలిపి రాస్తున్నా ఇది..
ఇంతకీ ఏది హింస.. ఏది అహింస..?

తన కులం మాత్రమే పరమపవిత్రమైందనుకునే చాగంటి ప్రవచనాల పేరుతో జనం గొంతులు కోస్తాడు. ఆయన మాంసాహారం ముట్టని బ్రాహ్మణుడు.. కానీ శ్రమజీవుల రక్తాన్ని ప్రవచనాలతోనే పీల్చేస్తాడు. తలకడిగితే మొలకడగరు.. మొలకడిగితే తలకడగరు అంటూ యాదవుల్ని నీచంగా అవమానిస్తాడు. ఇదేంటని అడిగితే ఆ మహానుభావుడ్నే ప్రశ్నిస్తారా అంటూ ఓ బ్యాచ్ దాడి మొదలుపెడుతుంది. అంతా మాటలతోనే. ఎక్కడా రక్తపు చుక్క చిందదు. ఇదీ ఈ దేశంలో అహింసకి అర్ధం.

బెలూచిస్తాన్ లో పాకిస్తాన్ హింసకు పాల్పడుతుంది, బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి.. మీడియా కోడై కూస్తున్న వార్తలివి. లంక తమిళులపై ఘోరాలు జరిగినప్పుడు మాత్రం అది ఎల్టీటీయీకి లంక సైన్యానికి జరుగుతున్న యుద్ధం మాత్రమే అవుతుంది. కాశ్మీరీ పండిట్లని తరిమేసిన దారుణాలపై ఇప్పటికీ చర్చలు జరుగుతుంటాయి. కానీ తమిళ జనానికి మాత్రం బాసటగా నిలబడలేం. దేశవ్యాప్తంగా దళితులు, బలహీనవర్గాలు, మైనారిటీలపై సాగే దాడులకి సమాధానాలు ఉండవు. యాకూబ్ మెమెన్ కి ఉరిశిక్షని వ్యతిరేకిస్తే తంతామంటారు. మాలెగావ్ పేలుళ్ల నిందితురాలు సాధ్వీ అనారోగ్యం గురించి చింతిస్తారు. ఇదీ ఈ దేశంలో అహింసకి అర్ధం. 

ఏది హింస ఏది అహింస.. ఎవరు టెర్రరిస్టులు ఎవరు శాంతికాముకులు.. అనే అంశాల్ని ఈ దేశపు యువతకు అర్ధంకాని బ్రహ్మపదార్ధాలుగా మార్చేశారు. కానీ ఒకటి నిజం అణిచివేత ఎదుర్కొనేవాడే గట్టిగా అరుస్తాడు. అవసరమైతే తెగిస్తాడు. జల్లికట్టుకి మద్దతు పలకడమో.. నిషేధానికి మద్దతు పలకాలన్నదో నా ఉద్దేశం కాదు. నాకు ఏ మాత్రం పరిచయం లేని విషయం అది. టీవీల్లో చూడడం తప్ప జల్లికట్టు గురించి నాకు తెలిసింది శూన్యం. కానీ మెరీనా బీచ్ లో సాగిన ఉద్యమం వెనుక తెగింపు ఉంది. వేల ఏళ్లుగా కొనసాగిన అణచివేతని ఎదిరించే తెగింపు అది. ఈ దేశప్రభుత్వాన్ని, చట్టాల్ని ఖాతరు చేయని తెగింపు అది. 

వేల ఏళ్లదాకా ఎందుకు ఇటీవలి పరిణామాల వరకే చూద్దాం. కావేరీ నీళ్లని తమిళనాడుకి వదలాలని కోర్టు స్పష్టంగా చెప్పింది. కానీ కర్నాటక విన్నది లేదు. కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకున్నదీ లేదు. తమిళనాడు కంటే బీజేపీకి కర్నాటక ముఖ్యం అన్నది ఎవరూ కాదనలేని విషయం. అప్పుడు అమలు కాని సుప్రీంకోర్టు తీర్పుని ఇప్పుడెందుకు గౌరవించాలి తమిళ ప్రజలు. అందుకే కావేరి విషయంలో సుప్రీంకోర్టు తీర్పుని ఎందుకు అమలు చేయడం లేదని కర్నాటక ప్రభుత్వాన్ని గట్టిగా అడగలేని కేంద్రం.. జల్లికట్టు లాంటి చిన్నవిషయంలో కూడా నోరు మెదపలేకపోయింది. ఇక్కడ గెలిచింది తమిళుల తెగింపు కాదు.. కేంద్రప్రభుత్వం, చట్టాలు ఓడిపోయాయంటేనే కరెక్ట్ గా ఉంటుంది. మెరీనా బీచ్ లో నిలబడి ఉన్న యువతలో.. జల్లికట్టుని గెలుచుకున్న ఉత్సాహం మాత్రమే కాదు, మా బతుకుల్ని శాసించే హక్కు మీకు లేదన్న ధిక్కారం కూడా కనిపిస్తోంది.

Monday, January 9, 2017

షి మేక్స్ మి వాంట్ టు స్పీక్ స్పానిష్


మేకపిల్ల పాట పాడితే ఎలా ఉంటుంది..?
ఫస్ట్ టైమ్ 2005లో శివగాడి టేప్ రికార్డర్ లో లాండ్రీ సర్వీస్ పాటలు విన్నా. వెన్ ఎవర్.. వేర్ ఎవర్ అంటూ ఒక మేకపిల్ల లాంటి గొంతు.  చాలా రోజులు హాంట్ చేసిన పాట. వినేటప్పుడు బాడీలో ఎక్కడో ఎడ్రినలిన్ సర్రున పారుతున్న చప్పుడు. ఈ పాటని విని అప్పుడు రాసుకున్న నాలుగు లైన్లు..
నా పెదవులకి సిగ్గుతో వణికపోడమే కాదు             
ఫౌంటెన్లా ముద్దులు కురిపించడమూ తెలుసు   
చుట్టూ కొండల్ని చూసి కన్ఫ్యూజ్ కావొద్దు
నా గుండెలు చాలా చిన్నవి చూడు

ఒరిజినల్ లైన్స్ ఇలా ఉంటాయి..
లక్కీ దట్ మై లిప్స్ నాటోన్లీ మంబుల్
దే స్పిల్స్ కిసెస్ లైక్ ఫౌంటెయిన్
లక్కీ దట్స్ మై బ్రెస్ట్స్ ఆర్ స్మాల్ అండ్ హంబుల్
సో యూ డోంట్ కన్ఫ్యూజ్ దెమ్ విత్ మౌంటెయిన్స్

తర్వాత కొన్ని రోజులకి 'హిప్స్ డోంట్ లై' పాట చూశా. షి మేక్స్ మీ వాంట్ టూ స్పీక్ స్పానిష్. పాట పూర్తిగా ఇంగ్లీష్ లో ఉంటుంది. బట్ హర్ హిప్స్ స్పీక్ స్పానిష్. పాటలో వచ్చే స్పానిష్ పదాలు వింటుంటే.. ప్రపంచంలో అందం అంతా ఆ భాషలో ఉందేమో అనిపిస్తుంది. లంబాడా సాంగ్ విన్నప్పుడు పోర్చుగీస్ భాషపైనా ఇదే అభిప్రాయం వస్తుంది. హిప్స్ డోంట్ లై తర్వాత వాకా వాకా, షి వోల్ఫ్, డిడ్ ఇట్ ఎగయిన్.. అన్నింట్లో ఒకటే భాష. హిప్స్ కెన్ స్పీక్ అండ్ దే కెన్ డ్యాన్స్.

గెరార్డ్ పీఖ్ తో పెళ్లి, పిల్లలు తర్వాత షకీరాని జనం కాస్త మరిచిపోయారు. కానీ చంటాయే(CHANTAJE)తో రీ ఎంట్రీ మామూలుగా ఇవ్వలేదు. పూర్తిగా స్పానిష్ లో ఉండే ఈ పాటని ఈ నెలన్నరలో 38కోట్ల మందికి పైగా చూశారు. ఇందులో Qué?(వాట్?).. అంటూ చూసే చూపుతో మనల్ని బ్లాక్ మెయిల్(చంటాయే) చేస్తుంది షకీరా. 

ఒన్స్ ఎగయిన్ షీ మేక్స్ మి వాంట్ టు స్పీక్ స్పానిష్. 

Wednesday, January 4, 2017

హూ ఈజ్ గాడ్గే..?

వేదం వ్యభిచారం లాంటిదన్నాడు వేమన. చరిత్రకీ ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయి. వేమన బైటకి రావడానికే వందల ఏళ్లు పట్టింది మరి. కాకపోతే వెనకో, ముందో వచ్చాడు. స్వాతంత్ర్యయుద్ధాలు చేశామని చరిత్రలో ఫోజులు కొట్టిన రాణుల అసలు బాగోతాలూ ఇలాగే బైటకొస్తున్నాయి. అదే చరిత్రలో ఉన్న వెసులుబాటు. అయితే పాలకుల చరిత్ర పాడడానికి వీధికో భట్రాజు దొరుకుతాడు. పీడితుడి చరిత్ర మాత్రం పీడితుడే రాసుకోవాలి. అంబేద్కర్ లాగా.. 

మనం లేని చరిత్ర మహాభారతమైనా మనకొద్దు అంటున్నాడు సాంబు. మనం లేని చరిత్ర, మనం లేని కవిత్వం, కథలు గాథలు అన్నీ మనకు సెకండ్ హ్యాండ్ సరుకే కావాలి. మన తాతలు, తండ్రులు, తల్లుల కథలకే ఫస్ట్ ప్రయారిటీ ఇద్దాం. మహరాజులు, మహారాణుల పురాణాల్ని పిట్టకథలుగా మాత్రమే చెప్పుకుందామంటున్నాడు.

ఇంతకీ.. హూ ఈజ్ సంత్ గాడ్గే బాబా.?
అతను మనోడు. మనుషుల మురికి వదిల్చిన చాకలి. ఎవడి గుడ్డ వాడు ఉతుక్కోడానికి సిగ్గుపడే నిష్టదరిద్రపు మనుషుల ముఖాలపై.. చీపురుతో చాచిపెట్టి కొట్టినవాడు. పరిశుభ్రతే జీవిత ప్రమాణంగా బతికిన సాధువు. స్వచ్ఛభారత్ కి అచ్చమైన బ్రాండ్ అంబాసిడర్. కానీ కాషాయం కళ్లకి ఈ బీసీ ఆనలేదు. మోడీ మీడియా పిచ్చ తప్ప మరేమీలేని చచ్చుభారత్ కి.. గాడ్గేని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోకపోవడమే మంచిదయిందిలే..

ఇక పుస్తకం కేవలం సంత్ గాడ్గే బాబా జీవితాన్నే చూపించదు. మహారాష్ట్రతో పాటు దక్షిణాదిన సాగిన వైదిక మత వ్యతిరేక తిరుగుబాట్ల అన్నింటినీ తాకుతూ వెళ్తుంది. ఎరుకల గండెమ్మ నుంచి ఎంతోమంది సామాన్యులు, మహాత్ముల జీవితాల్ని టచ్ చేస్తుంది. రాత విషయానికొస్తే సాంబు గారి శీర్షికల్లాగే.. ప్రతి అక్షరం వెనుక మన కళ్లు పరుగులు తీస్తాయి. గాడ్గే బాబా జీవితం ఎలా మొదలయిందీ, ఏంటన్నది చెప్పేటప్పుడు మాత్రం కొన్ని పేజీలు బోర్ కొడతాయి. ఇందులో వీరుల కథల్లో మాదిరి యుద్ధాలుండవు. మహరాజుల కథల్లోని చీకటి బాగోతాలుండవు. చీపురు పట్టి ఊరిని చిమ్మమంటే కాస్త బోర్ గానే ఉంటుంది. ఇదేమైనా మోడీ చచ్చు భారత్ యాడ్ కాదుగా.. కాస్త స్లో గానే ఉంటుంది. అది కూడా కాసిని పేజీలే. తర్వాత క్లైమాక్స్ దగ్గరే ఆగుతాం. గాడ్గే మనవాడనుకుని చదివితే మనసుకు హత్తుకుంటుంది. మన కళ్లు తెరిపిస్తుంది. కొన్ని రంగుల కళ్లద్దాలకి మాత్రం కష్టంగానే అనిపిస్తుంది.