సెపరేషన్ మళ్లీ చూశా. ఫర్హాదీ-సేల్స్ మేన్ మూవీ చూసి రాసిన పోస్టుకీ దీనికీ లింకుంది. సెపరేషన్తో పోలిస్తే ఇది కాస్త తేలిపోతుంది అంటూ మెహెర్ కామెంట్ పెట్టాక.. వెంటనే ఐ టూ అగ్రీ అనేశా. తర్వాత కరెక్ట్ కాదేమో అనిపించింది. కరెక్టేనేమో అని కూడా అనిపించింది. అసలు ఈ రెండు సినిమాల్ని ఎందుకు కంపేర్ చేయాలి అనుకుంటూ.. మళ్లీ ఒకసారి సెపరేషన్ చూశా.
ఒక దేశాన్ని రెండు కుటుంబాలుగా కుదించి తీసిన సినిమా సెపరేషన్. పాలన, న్యాయవ్యవస్థలు, మతం.. ప్రజల డేటూడే లైఫ్ ని సమస్య నుంచి సమస్యల్లోకి ఎలా ఈడ్చుకెళ్తుంటాయో సెపరేషన్లో చూపిస్తాడు ఫర్హాదీ. ఇది ఇరాన్ ఒక్కదేశంలోనే కాదు.. అన్ని దేశాలు, అన్ని మతాలు, అన్ని వ్యవస్థల్లో ప్రజలు వాటితో ఇలాగే ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని కొన్ని మినహాయింపులుండొచ్చు. సినిమాలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒకటి, అప్పుల ఊబిలో ఉన్న పేద కుటుంబం ఇంకొకటి. ఇంకా విడగొడితే.. ఇద్దరు భర్తలు, ఇద్దరు భార్యలు, ఇద్దరు కూతుళ్లు. మోడ్రన్ మిడిల్ క్లాస్, స్లమ్స్ లో బతికే పేదలు. విడగొట్టుకుంటూ వెళ్తే ఈ రెండు కుటుంబాల్లో ఇరాన్ మొత్తం కనిపిస్తుంది. ఆ రేంజ్ లో చెక్కాడా కుటుంబాల్ని ఫర్హాదీ.
సినిమా ప్రారంభం కోర్టులో..
నాదిర్, సిమన్ జంట విడాకుల కోసం వచ్చుంటుంది.
మీరు చెప్పే కారణాలతో విడాకులు ఇవ్వలేం. అసలు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు..?
ఆయన మిమ్మల్ని కొడ్తున్నారా..? సరిగా చూసుకోవడం లేదా..?
లేదు. ఆయన చాలా మంచోడు.
మరేం..?
విదేశాలకు వెళ్లాలి. ఏడాదిన్నర కష్టపడితే వీసాలొచ్చాయి. వీసా గడువు 40 రోజులే ఉంది. ఆయనేమో తండ్రినొదిలి రానంటున్నాడు. అందుకే విడాకులు కావాలి.
నీ భార్యతో వెళ్లడానికేం ?
నాన్నని విడిచి వెళ్లలేను. తనని వెళ్లమనండి.
వాళ్ల నాన్నకి అల్జీమర్స్. అసలాయన ఈయన్ని గుర్తు కూడా పట్టలేడు.
కానీ నాకాయన తండ్రి అని తెలుసు కదా..?
తన కూతురి భవిష్యత్తు గురించి పట్టించుకోడా ?
నీ కూతురి భవిష్యత్తుకి ఇక్కడేమైంది ?
ఇక్కడున్న పరిస్థితుల్లో, ఇలాంటి వాతావరణంలో నా కూతురు పెరగకూడదనుకుంటున్నాను. అది నా హక్కు.
ఇక్కడి పరిస్థితులకేమైంది. మీ ఇద్దరూ కలిసుంటేనే తనకి భవిష్యత్తు.
అందుకే కదా తనని నాతో రమ్మంటున్నాను. సరే తను రావడం లేదు. నా కూతుర్నయినా నాతో పంపించమనండి.
మీ అమ్మాయి వయసెంత..?
పదకొండేళ్లు.
ఆ వయసులో ఉన్న అమ్మాయి తండ్రి అనుమతి లేకుండా మీతో రాకూడదు.
నేను నా సమస్యని తీర్చమని మీ దగ్గరకొచ్చాను.
తనకి నేనంటేనే ఇష్టం. తను నీతో రాదు.
తనకి సమస్య అర్ధం కావడం లేదు.
పదకొండేళ్ల అమ్మాయికి ఏది మంచో, ఏది చెడో.. ఆమాత్రం తెలియదా.
మీరొచ్చి ఇక్కడ సంతకం పెట్టండి.
నాకు 40రోజులే గడువుంది. నా సమస్యని ఎందుకు అర్ధం చేసుకోరూ..?
మీరు ప్రతిసారి చిన్న సమస్య పట్టుకొచ్చి విడొకులు ఇమ్మంటున్నారు. దయచేసి కోర్టు సమయాన్ని వృధా చేయొద్దు.
కేసు కొట్టేశాడు జడ్జి. ఈ సీన్లో జడ్జి మనకి కనిపించడు. ఇద్దరూ డైరెక్ట్ గా మనతోనే మాట్లాడుతూ, మనని జడ్జిని చేసి కథలోకి లాక్కెళ్తారు. కేసు కొట్టేయడంతో తన పుట్టింటికి వెళ్లిపోతుంది సిమన్. కూతురు తెర్మియా రానంటుంది. ముసలాడు తన చేయి పట్టుకుని వదలడు. కానీ మొండిగా వెళ్లిపోతుంది సిమన్. తండ్రిని చూసుకోవడం కోసం రజియా అనే పనిమనిషిని మాట్లాడుతాడు నాదిర్. తనతో నాలుగైదేళ్ల కూతురు కూడా వస్తుంది. రజియా ప్రెగ్నెన్సీతో ఉండి భర్తకి తెలియకుండా వీళ్లింట్లో పనికి కుదురుతుంది. ముసలాడ్ని చూసుకోవడం తనవల్ల కాదని.. (ముఖ్యంగా తన బట్టలు కూడా మార్చాల్సి వస్తుండడంతో, అదెక్కడ తనకి పాపంలా అవుతుందేమో అన్న భయంతో) తన బదులు తన భర్తని పనిలోకి తీసుకోవాలని అడుగుతుంది. బ్యాంకులో నాదిర్ని కలుస్తాడు రజియా వాళ్లాయన. నిజానికి ఈ మగ క్యారెక్టర్ల మధ్య సిమిలారిటీ ఉంటుంది. ఒకరు తండ్రిని విడవలేక, భార్యని ఒదులుకోలేక ఫ్రస్టేషన్లో ఉంటే.. మరొకరు ఉద్యోగం పోగొట్టుకుని డిప్రెషన్ అనుభవిస్తున్న మనిషి. సరే.. రజియా వాళ్లాయన్ని మరసటి రోజు నుంచి పన్లోకి రమ్మంటాడు. కానీ తను రాడు. మరుసటిరోజు కూడా రజియానే వస్తుంది.
ఒకరోజు నాదిర్, కూతురితో కల్సి ఇంటికొచ్చేసరికి ముసలాడు బెడ్డుపైనుంచి పడిపోయుంటాడు. తనని మంచానికి కట్టేసి ఎటో వెళ్లిపోయుంటుంది రజియా. తండ్రి చనిపోయాడని అనుకుంటాడు. కొద్దిసేపటి తర్వాత తను మామాలుగా అవుతాడు. ఇంట్లో చూస్తే కొంత సొమ్ము మాయం అయ్యుంటుంది. కోపంలో ఉండగానే రజియా వస్తుంది. తనపై ఒక్కసారిగా సీరియస్ అవుతాడు. తనని ఇంట్లోంచి బైటకి గెంటేసే ప్రయత్నంలో.. రజియా మెట్లపై పడిపోతుంది. మరుసటి రోజు తెలుస్తుంది తనకి అబార్షన్ అయిందని. నాదిర్ పై హత్య కేసు నమోదవుతుంది. అక్కడ్నించి ఆట మొదలవుతుంది. కథ ఇక్కడితో ఆపేస్తున్నా.
స్టార్టింగ్ నుంచి చివరివరకూ.. ఇంట్లో , కోర్టులో, హాస్పిటల్లో, స్కూళ్లో, కారులో.. దాదాపు ఎక్కడా వైడ్ యాంగిల్లో సినిమా కనిపించదు. మనని అందులోంచి బైటకు రాకుండా పాత్రల వెంట తిప్పుతాడు. ఏ ఒక్క షాట్ కానీ, డైలాగ్ కానీ, పాత్రల్ని కానీ అనవసరంగా వాడడు.
ముఖ్యపాత్రల్ని చూస్తే.. ఫ్రస్టేషన్లో ఉన్న ఇద్దరు భర్తలు. ఇద్దరిది దాదాపు ఒకే రకమైన మానసిక స్థితి. కాకపోతే ఒకరు సెక్యులర్ అయినా, తనకున్న స్టేటస్‌తో, అబద్దాలతో తన సమస్య నుంచి బైటపడేందుకు ప్రయత్నించే మనిషి. తన తప్పు లేదని నిరూపించుకునే ప్రయత్నమే అది. మరొకరు ఉద్యోగం పోగొట్టుకుని, మోడ్రన్ మిడిల్ క్లాస్ అర్బన్ సొసైటీతో పోరాడేందుకు తన స్థాయి సరిపోక మరింత నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయే మనిషి. వారికోసం పోరాడే ఇద్దరు భార్యలు. నిజాన్ని రెండుగా విడగొడితే వీళ్లిద్దరూ. మోడ్రన్ అండ్ రెలీజియస్. కుటుంబం కోసం ఎలాంటి నిర్ణయాన్నైనా స్వతహాగా తీసుకోగలిగిన స్త్రీ ఒకరు. మరొకరు మతానికి కట్టుబడిన స్త్రీ. భర్త అనుమతి లేకుండా బైటకి అడుగుపెట్టడానికి భయపడే మనిషి.
రెండు కుటుంబాల నుంచి, రెండు వేర్వేరు ప్రపంచాలకి రేపటి ప్రతినిధులైన ఇద్దరు కూతుళ్లు. వీళ్లిద్దరిలో తెర్మియాకి అక్కడక్కడా డైలాగులుంటాయి. రజియా కూతురికి మాత్రం ఒకట్రెండు మాటలు తప్ప మరేం ఉండదు. కానీ వీళ్ల చూపుల నుంచే సినిమాకి కావల్సింది రాబట్టుకున్నాడు ఫర్హాదీ. కోర్టు అవరణలోని ఒక సీన్లో తెర్మియా తన అమ్మమ్మ సాయంతో ఎగ్జామ్‌కి ప్రిపేరవుతూ ఉంటుంది. రజియా కూతురు మాత్రం ఒంటరిగా దిక్కులు చూస్తూ నిలబడి ఉంటుంది. క్లైమాక్స్ కు ముందు సీన్లో.. రజియా ఖురాన్ పై ప్రమాణం చేయడానికి ఒప్పుకోకపోవడంతో, తన భర్త తనని తానే కొట్టుకుంటూ వెళ్లిపోతాడు. ఆ క్షణంలో తెర్మియా, చిన్నమ్మాయి వైపు చూస్తుంది. పేదరికంలోని సమస్త నరకమంతా ఆ చిన్న పిల్ల కళ్లలో కనిపిస్తుంది.
అయిపోవచ్చింది సినిమా.
క్లైమాక్స్ కోర్టులో..
తెర్మియాని లోపలికి తీసుకెళ్తాడు నాదిర్.
మీ అమ్మానాన్ననిర్ణయాన్ని నీకొదిలేశారు. వాళ్లలో ఎవరితో నువ్వుండాలో నువ్వే నిర్ణయించుకోవచ్చు.
చెప్పు. అమ్మ కావాలా.. నాన్నా కావాలా..? ఎవరితో ఉండాలో నిర్ణయించుకున్నావా ?
నిర్ణయించుకున్నా. (కళ్లలోంచి నీళ్లు)
ఎవరితో ఉండాలనుకుంటున్నావు ?
ఇప్పుడే చెప్పాలా ?
నిర్ణయించుకోలేదా ఇంకా ?
నిర్ణయించుకున్నా.
మరి చెప్పు.
-------------------
మీ అమ్మానాన్నల్ని బైటకి పంపించనా ?
ఆ అవకాశముందా ?
మీరిద్దరూ ఓ నిమిషం బైటకెళ్తారా ?
ఇద్దరూ బైటకొస్తారు.
లోపల తెర్మియా ఏం చెప్తుంది....................................
ఎవరితో ఉంటానంటుంది.......................................
ఎండ్ క్రెడిట్స్ మొదలైపోతాయి.
అయిపోయింది సినిమా.
మొదటి సీన్లో జడ్జ్ కనిపించడు. చివరి సీన్లో జడ్జి కనిపిస్తాడు. సినిమా మొత్తం కోర్టుల చుట్టూ తిరుగుతుంది. కానీ తుది తీర్పు రాదు. తీర్పు వ్యవస్థల చేతిలో లేదు. తెర్మియా చేతుల్లో ఉందది. రేపటి చరిత్రలో ఎవరుండబోతున్నారో వారి చేతుల్లో ఉందది. సినిమా కేవలం ఇరాన్ ప్రభుత్వం, ఇరాన్ ప్రజల మధ్య సెపరేషన్ గురించి మాత్రమే కాదు.. బీయింగ్ ఏ ముస్లిం, బీయింగ్ పర్షియన్ మధ్య తేడాని వెస్ట్రన్ ప్రపంచానికి చూపించడానికీ కూడా ఫర్హాదీ ప్రయత్నించాడేమో.?
ఇక సెపరేషన్ vs సేల్స్ మేన్ గురించి. ఇలా అనడం తప్పేమో. సెపరేషన్ మహాద్భుతమే. కానీ సేల్స్ మేన్‌ని తక్కువ చేయగలమా ? ఒక ప్రఖ్యాత నాటకాన్ని సైమల్టేనియస్‌గా నడుపుతూ అందులోని పాత్రల్ని మనముందుకు మళ్లీ తీసుకొచ్చే ప్రయత్నాన్ని తక్కువ చేయలేమేమో. సేల్స్ మేన్ లో హీరో.. వ్యాన్ ఓనర్ కోసం వేసిన ట్రాప్‌లో, తను అనుకున్న మనిషికి బదులు వేరొకరు వస్తుంటే షాక్ అవుతాడు. తను అనుకున్నవాడు కాకుండా ఇంకెవరో పెద్దాయన వస్తున్నాడని. అదే సమయంలో ప్రేక్షకుడిగా మనం తినే షాక్ చాలా పెద్దది. సినిమా ఎక్కడ్నుంచి ఎక్కడికి వచ్చిందని. అది గుర్తొచ్చినప్పుడల్లా.. అరే, అనుకోకుండా ఉండలేం. ఫర్హాదీ వర్క్స్ లో సెపరేషన్, పాస్ట్, ఎబౌట్ ఎల్లీ, సేల్స్ మేన్.. దేన్నీ ఒకదానితో మరోదాన్ని పోల్చలేను. ఒక్కోసారి అన్నీ ఒకే సినిమాగా.. ఒకదానికొకటి సీక్వెల్‌గా కూడా అనిపిస్తాయి.
No comments:
Post a Comment