Tuesday, August 15, 2023

మహాకవికి నివాళి

గద్దర్ మరణం, ఆయన ఖననం పూర్తయ్యాక చాలామంది నివాళి వ్యాసాలు రాశారు. రాస్తున్నారు. ఆయనని తమ వాడే అనుకున్నవాళ్లు, తమ దగ్గరే ఆగిపోతే బాగుండు అనుకున్నవాళ్లు బాధపడ్డారు. వాళ్ల బాధకీ అర్ధం ఉండొచ్చు. కానీ జీవితం ఎక్కడో మొదలై ఎక్కడో ముగుస్తుంది. అదిక్కడే ఉండిపోవాలి అనుకోవడం విప్లవం కాదు. ఆయన జీవితంలో ఆయన పాటంత వైరుధ్యం ఉంది. అది జీవితానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. 


ఎందరు కవులు ఈ నేలపై పుట్టారో లెక్కలేదు. కానీ ఇలాంటి అంతిమ సంస్కారం దక్కిన కవులెందరు..? ఏ వాగ్గేయకారుడు ఇలాంటి నివాళి అందుకున్నాడు..? తెలుగు నేల కనీవినీ చూడని అంతిమయాత్ర అది. చనిపోయి వారం దాటినా, ఇంకా ఎక్కడ చూసినా ఆ గానమే. కొన్ని కోట్లమంది ఆ నివాళి గానానికి శృతి కలుపుతున్నారు. ఏ ప్రధాన స్రవంతి మీడియా కూడా ఆయన పాడె పక్కన హడావుడి చేయలేదు. జనం వెల్లువ చూశాకే అంతా వచ్చారు.  కొన్ని లక్షలమంది ప్రజలు ఆయన పాడె మోశారు. అందులో కొందరు రాజ్యం ప్రతినిధులు ఉండొచ్చు. అది వాళ్ల అవసరం.  ఏ రాజ్యం తన గుండెల్లో తూటా దింపిందో, అదే రాజ్యాన్ని భయపెట్టి మరీ అధికార లాంఛనాలు లాక్కున్నవాడు గద్దర్ మాత్రమే.  


విప్లవం అంటే తుపాకీ ఒక్కటే కాదు. విప్లవం అంటే జీవం. అదెప్పటికీ ధ్వంసం కాదు. రూపం మారుతుంది అంతే. ఎప్పుడు సంకెళ్లు బిగిసినా వాటిని తెంచుకుని తీరుతుంది. దానికి ఆయుధం అవసరమైతే పట్టుకుంటుంది. పాట అవసరమైతే పాడుతుంది. పార్టీ అవసరమైతే పెడుతుంది. వనరులన్నీ వాటంతట అవే వచ్చి చేరతాయి. అన్నీ పరస్పర ఆధారాలు. అన్నిటినీ గౌరవించి తీరాల్సిందే. 


తన బిడ్డ ఇంజనీర్ కావాలి అనుకుంది వాళ్లమ్మ. కెనరా బ్యాంకులో క్లర్కుగా ఉండుంటే బాగుణ్ను అనుకున్నవాళ్లూ ఉండుంటారు. అడవిలోనే ఉండిపోతే చాలు అనేవాళ్లూ ఉంటారు. అదే భావజాలంతోనే నిలిచిపోతే బాగుండు అనొచ్చు. కానీ విప్లవమే ఆయన భావజాలం. తిరుగుబాటుతోనే జీవితమంతా బతికాడు. 


తుపాకీ పట్టినవాడే, ఓటేయమని పిలుపునిచ్చాడు. పార్టీ పెట్టాడు. ఎర్రజెండా భుజంపై కప్పుకుని రామానుజ తత్వం అంటూ అద్వైతం పాట పాడాడు. రాహుల్‌ గాంధీకి ముద్దుపెట్టాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో... ఆయనేమీ మోడీని ముద్దుపెట్టుకోలేదు. రాజ్యహింసకి గురవుతున్న బాధితుల తక్షణావసరంగా రాహుల్‌ గాంధీని చూశాడు. ఇక రండిరో రామానుజ జాతరకు పాట మాత్రం కాస్త కలుక్కుమనిపించేదే. అది ఆయన ఏ లక్ష్యంతో పాడినా... అందులో జీవం కనిపించలేదు. ఇంక దానికి భవిష్యత్తేం ఉంటుంది. 


మార్క్స్‌, బుద్ధుడు, అంబేద్కర్ అంటూ ఏవో లెక్కలు చెప్పొచ్చు. విప్లవానికి వాళ్లే మొదలు కాదు, వాళ్లే ఆఖరు కాదు. అది నిరంతర ప్రవాహం. అందరి సారం అందులో జీవనదిలా పారుతూనే ఉంటుంది. 


అందుకే ఏదో ఒక భావజాలం నుంచి పుట్టిన పాట కాదు గద్దర్. మట్టి నుంచి, ఆకలి నుంచి, ఆశల నుంచి పుట్టిన పాట ఆయన. పాటయినా, బతుకైనా... జనంతోనే జీవితాంతం మమేకమై ఉన్నాడు. ఆ తల విసురు, ఓహో అనే ఆ అరుపు, నిర్లక్ష్యం నిండిన ఆ నాట్యపు అడుగులు...  కాలగమనంలో మనుషుల మెదళ్లలోంచి ఎరేజ్ అయిపోవచ్చు. కానీ జీవనదిలాంటి ఆయన పాట మరెంతోమంది వాగ్గేయకారులకి కచ్చితంగా ప్రాణం పోస్తూనే ఉంటుంది.


మనిషి ప్రాణం పోతుందేమో, శిఖరం ఒరిగిపోదు. అది శాశ్వతం. ప్రజల యుద్ధానికి సంగీతమై నిలిచినవాడు గద్దర్. చూపున్న పాటకి చావుండదు. అది మట్టిలో కలిసి... కొన్ని కోట్ల మొక్కలై తిరిగొస్తుంది. జీరబొయిన ఎన్నో గొంతులకి జీవం అందిస్తుంది.

1 comment:

  1. Expressing your's condolences to revolutionary poet (through his songs) is great and amazing

    ReplyDelete